శిశిరంలో వసంతం
శిశిరంలో వసంతం (Author: నామని సుజనాదేవి)
“ఏయ్ పూర్ణా! ఉన్నావా? సమయం ఎంత అయిందో చూసావా? పొద్దుననగా ఇన్ని కాఫీ నీళ్ళు నా ముఖాన పడేసావ్! టిఫిన్ పెట్టేది ఉందా? లేదా?” గట్టిగా అరిచాను.
“అంత కోపమైతే ఎలా? నేనేం ఖాళీగా ఉన్నానా? ఒకటి వెనకాల ఒకటి చేసుకుంటూ వస్తున్నాను కదా! మీకు టిఫిన్ తయారు చేసే లోపల, అత్తమ్మ అవసరానికి వెళ్లాల్సి వచ్చింది. అది మనం అనుకున్నంత త్వరగా అయిపోతుందా? ఆమె సేవ చేసి వచ్చేసరికి, మామయ్య పిలిచాడు. ఆయనకు మందులిచ్చి, పిల్లలకు వారికి కావలసిన జ్యూసులు ఇచ్చి, ఇదిగో! చపాతి ప్రిపేర్ చేస్తూనే ఉన్నా. మధ్యలో అమ్మాయి దగ్గర నుండి ఫోను. ఎంత పొద్దున లేచినా ఇలా సమయం ఆలస్యం అయిపోతుంది. ప్రతిరోజు అలా అవుతుందా? ఏదో ఒక రోజు ఇలా అయితే అలా అరుస్తారేంటి? అయినా ఇప్పుడు మీరేమన్నా సమయానికి ఆఫీస్ కి వెళ్ళాలా ఏంటి? పొద్దస్తమానం ఖాళీనే కదా!”
అంతే! ఆ మాటలు నాకు ఎక్కడో సూటిగా తగిలాయి. నా పదవీ విరమణ తర్వాత ఈ పదం వినడం ఇది మొదటిసారి కాదు. దాదాపు ఇంట్లో అందరి నుండి ఏదో రూపేణా ఎప్పుడో ఒకప్పుడు నేరుగానో, వెనకనో ఈ మాట వింటూనే ఉన్నాడు. ‘ఖాళీ’ అనే పదము ఆ వ్యక్తిని ఎంతగా బాధిస్తుందో కేవలం అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు.
ఆఫీసులో నా ఛాంబర్లో నేను కూర్చుంటే ఎటువంటి వారికైనా సింహ స్వప్నంగా ఉండేది. ఎవరైనా ముందు అపాయింట్మెంట్ తీసుకునే వచ్చేవారు. అంత పెద్ద హోదాలో రిటైర్ అయిన నాకు, ఇంట్లో ఇటువంటి ధిక్కారమా? ఏదో అప్పటి పాతకాలం చదువు, నాలుగు అక్షరాలు మాత్రమే నేర్చుకున్న తనకు, నన్ను కట్టుకున్నందుకే ఇంత పెద్ద ఇల్లు, బంగారం, నగలూ, సంఘంలో ఇంత గౌరవము, హోదా, పరువు అన్ని వచ్చాయి. అలాంటిది నన్ను ఇంత మాట అంటుందా?
ఊపిరి సలపని మీటింగ్ లు, కాన్ఫరెన్స్ లు, పనులతో, అప్పాయింట్ మెంట్ తీసుకున్నవారితో కనీసం మాట్లాడడానికి తీరిక లేని హోదాలో ఉన్నప్పుడు ఈ బిజీ లైఫ్ నుండి ఎప్పుడు విముక్తి పొందుతానా? అని ఎదురుచూసేవాడిని. కాని ఒకేసారి అనంతంగా లభించిన ఈ సమయం నాలో రోజు రోజుకూ శూన్యం నింపుతుందని నేను అస్సలు ఊహించలేదు. పాటలు, సినిమాలు ఎప్పటికీ చూస్తూ ఉండలేం కనుక కొన్ని రోజులకే బోర్ కొట్టాయి. ఇష్టమైన సాహిత్యం చదవడానికి , కళ్ళు కష్టపెడుతున్నానని మొరాయించడంతో ఆపేసాను. అందుకే నాకెందుకో వీరందరి నుండి దూరంగా స్వేచ్ఛావిహంగంలా పారిపోవాలని ఉంది.
దానికి నాలుగురోజుల్లో అవకాశం దొరికింది.
టిఫిన్ చేసి ఇంట్లో ఉండబుద్ది కాక పార్క్ కి వెళ్ళి కూర్చున్నప్పుడు, నా ఫోన్ మోగింది. అది నా బెస్ట్ ఫ్రెండ్, నాతో పాటే రిటైర్ అయిన రమణ నుంచి.
“అరేయ్! ఈరోజు మా పెళ్ళి రోజు. మర్చిపోయావా? ప్రతి ఏడు అందరికన్నా ముందు నువ్వే గ్రీటింగ్స్ చెప్పేవాడివి. చాలారోజులవుతుంది చూసి. ఈరోజు రాకూడదూ!” అనగానే నాకెందుకో ఫోన్లోనే ఏడ్చేయాలన్నంత బాధనిపించింది.
“పెళ్లిరోజు శుభాకాంక్షలు రా!”
“ఏంట్రా! ఆరోగ్యం బాలేదా? గొంతు ఎప్పుడు సింహగర్జనలా ఉండేది. ఇప్పుడు అలా పీలగా వస్తుందేమిటి? కొంపదీసి మా చెల్లెలి పక్క ఏమైనా ఉన్నావా ఏంటి?” వాడు జోక్ వేశాడు.
మామూలుప్పుడైతే ఇద్దరం నవ్వుకునే వాళ్ళం.
రిటైర్ అయినా నాకు ఆరంకెల పైనే పెన్షన్ వస్తుంది. ఇంకా నేను ఎవరికి భయపడాలి? ఎందుకు తగ్గి ఉండాలి? ఒక్కరోజు నేను లేకపోతే, వీళ్ళకి నా విలువ తెలిసి వస్తుంది. అందరూ ఏదో నన్ను అల్లాటప్ప అనుకుంటున్నారు, అనిపించి, వాడు, “వచ్చేయరా’ అనగానే, “వచ్చేస్తున్నారా! ఉన్న పళాన ఇలాగే బయలుదేరుతాను” అన్నాను.
ఎందుకంటే వాడి ఇల్లు ఒక రెండు గంటల ప్రయాణంలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే వాడే రిసీవ్ చేసుకుంటాడు. నాకు కొంచెం స్థల మార్పిడితో మనసు ఊరటగా ఉంటుంది. ఇంట్లో వాళ్లకు చెప్పాపెట్టకుండా పోవడంతో, నాకోసం వెతికితే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఒక్క రోజుకే ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వనైతే ఇవ్వరు కదా! అనుకుని, అప్పటికే స్నానం చేసి వచ్చిన వాడిని, అక్కడే ఒక హోటల్లో టిఫిన్ తినేసి, డైరెక్ట్ గా బస్సు ఎక్కేసాను. వాడికి ఫోన్ చేసి చెప్పాను, నేను వస్తున్నాను అని.
వాడు బస్టాండ్ కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. నాలాగే వాడు కూడా నీరసంగా పదేళ్లు పై పడ్డట్టుగా ఉంటాడనుకున్నాను. కానీ అందుకు భిన్నంగా ఉన్నాడు. కళ్ళకి మంచి రిచ్ ఫ్రేమ్ లెస్ కళ్లద్దాలు, చేతిలో కార్ కీస్ ఊపుతూ, చైతన్యానికి ప్రతిరూపంలా ఉన్నాడు.
నేనైతే, రిటైర్ అయి ఏడాది కాలేదు, అప్పుడే పదేళ్లు పై పడ్డట్లు అయిపోయాను.
ఇక దిగగానే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు రమణ.
“అదేంట్రా? రిటైర్ అయ్యి ఏడాదేగా గడిచింది. అప్పుడే ఇలా అయిపోయావేంటి?” అన్నాడు. వాడిని చూశాను. నల్లని పాయింట్ పై, మంచి మడతనలగని తెల్లటి టీషర్టులో గోరింటాకు పెట్టినందుకేమో అక్కడక్కడున్న తెల్ల వెంట్రుకలు ఎరుపు రంగులోకి మారి, మొత్తం నల్లగానే కనబడుతున్నాయి.
నా వైపు చూసుకున్నాను. మామూలుగా వేసుకునే టీ షర్టు, అక్కడక్కడ నెరిసిన జుట్టు. ఇటీవల బాధలతో నేను ఆలోచించడం వాళ్ళనేమో, కళ్ళ కింద నల్లటి చారికలు, మొహం కొంచెం ముడతలు పడి, ఇప్పుడు ఎవరైనా నేను రిటైర్ అయ్యాను అంటే నమ్మేసేలా ఉన్నాను.
“రిటైర్ అయ్యాక కూడా ఇలా ఉండక ఎలా ఉండమంటావురా?” అన్నాను, ఎంత వద్దనుకున్నా శుష్కదరహాసం నా పెదాలపై లాస్యం చేసింది.
“అసలు వీడు నా ఒకప్పటి ఫ్రెండ్, సింహ స్వప్నంలా ఉండే ద గ్రేట్ మల్లికార్జునేనా? ఏమిటో చాలా తేడా కనపడుతుంది రా నీలో” అంటూ, కారు స్వయంగా తనే డ్రైవ్ చేస్తూ, కార్లో కూర్చున్నాక క్షేమసమాచారాలన్నీ అడిగాడు.
“ఏమోయ్ రాజ్యం! ఎవరొచ్చారో చూడు. మీ అన్నయ్య! ఏడాదిగా వాడిని పట్టించుకోకుండా నీ సేవలోనే ఉన్నాను కదా! దానికి నాతో పోట్లాడ్డానికి వచ్చాడు” వేళాకోళంగా అన్నాడు, కాళ్లకు నీళ్ళందిస్తూ.
“అరేయ్! అలా ఆ టీవీ చూస్తూ ఉండు. నేను నీకు పది నిమిషాల్లో వేడివేడి టిఫిన్ తీసుకొస్తా” అంటూ లోనికి వెళ్ళాడు.
వాడి హోదా ఏమిటి? వాడు ఇక్కడ ఆప్రాన్ వేసుకొని వంటగదిలో దూరడం ఏంటి? నాకేం అర్థం కాలేదు.
‘అదేంటి? చెల్లెమ్మ లేదా?’ నేను అనుకునే లోగా, నుదుట ఎర్రటి కుంకుమ బొట్టుతో, మహాలక్ష్మికి ప్రతిరూపంగా, ఎర్ర అంచు ఉన్న, ఆకుపచ్చ కలరు చీర కట్టుకొని వచ్చింది రాజ్యలక్ష్మి.
“అన్నయ్యగారు బావున్నారా? చాలా కాలమైంది, మిమ్మల్ని చూసి. ఇప్పుడెలా ఉన్నారు? వదిన గారు బాగున్నారా?” అంటూ వివరాలడుగుతూ కూర్చుంది.
ఈ లోపల వాడన్నట్లుగానే 10 నిమిషాల్లో లోపల నుండి ప్లేట్లో రెండు వేడి వేడి దోసెలు, వెన్నపూస, కారంపొడి, చట్నీ వేసి తీసుకొచ్చాడు.
“ఇదేంటి రా నువ్వు?” అన్నాను.
“ అవునురా! ఇంతకాలం మీ చెల్లెలి వంట చూసావు. ఇప్పుడు నా చేతి వంట రుచి చూడు. ఇవ్వాళ నువ్వు నా చేతిలో అయిపోయావ్.” అన్నాడు.
“నువ్వు చేయడమేంటి?” అన్నాను, ఎదురుగుండా చెల్లి ఉన్న సంగతి, ఆమేమైనా అనుకుంటది అన్నది మర్చిపోయి.
“ అవును నేనే చేశాను. ఏం బాలేదా? మీ చెల్లెలి చేతి వంటలా లేదా? ఎప్పటికీ ఆమె చేతి వంటే తింటే బోర్ గా ఉండదూ! ఒక్కోసారి మనం కూడా మన తడాఖా చూపించాలి కదా! మనకి ఇది రాదు అనుకుంటున్నారు. నలభీమ పాకం అన్నారుగానీ, దమయంతి పాకం అన్నారా? ఆ విషయం వీళ్లకు తెలియజేయాలి కదా! ఇదిగో రాజ్యం! మనం కూడా కంపనీ ఇద్దాం” అంటూ ఆమెకు ఒక ప్లేట్ ఇచ్చి, తను కూడా తీసుకొచ్చుకున్నాడు. నేను అలా మ్రాన్పడిపోయి చూస్తూనే ఉన్నాను. అయితే నిజంగానే వాడు అన్నట్లు టిఫిన్ అదిరిపోయింది. “మరొకటి వేయమంటావా” అన్నాడు.
“వద్దు. ఇంతకన్నా ఎక్కువైతే మధ్యాహ్నం మళ్ళీ భోజనం కష్టం అవుతుంది” అన్నాను.
“మధ్యాహ్నం కూడా మంచి బిర్యానీ చేస్తా నీకోసం! నీకు వెజిటబుల్ బిర్యాని బాగా ఇష్టం కదా! మా పెళ్ళిరోజు సందర్భంగా మీ చెల్లెలు అదే చేస్తానందిలే. నీకు తెలుసా? నువ్వు ఎప్పుడూ నా వంట రుచి చూడలేదు కదా! ఈవేళ నీకు నా పన్నీర్ బటర్ మసాలా రుచి చూపిస్తా!”
“అయ్య బాబోయ్! నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి రా! నన్ను వదిలేయ్” అన్నాను.
అప్పటికే రెండు సార్లు ఇంటి నుండి ఫోన్లు వచ్చాయి. ఆలోచించి సాయంత్రం వస్తానంటూ మెస్సేజ్ పెట్టాను, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.
హాస్యంగా “నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. తిన్నాక నువ్వే అంటావు, ‘ఏ ఫైవ్ స్టార్ హోటల్ పనికిరాదని’ అలా ఉంటుంది చూడు”అన్నాడు వాడు. మాటల్లో దోబీ రావడంతో, ఆమెకు బట్టలు వేయడానికి రాజ్యలక్ష్మి లోనికి వెళ్ళిపోయింది.
“అదేంట్రా! రిటైర్ అయ్యాక కూడా ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు? అప్పటికన్నా వయసు తగ్గినట్లుగా ఎలా ఉన్నావు?” అన్నాను, ఉండబట్టలేక.
“అలా మన పెరట్లోకి వెళ్లి పచ్చటి చెట్ల మధ్య కూర్చుని మాట్లాడుకుందాం. అక్కడ చల్లగాలి వస్తుంది” అంటూ తోటలోకి దారి తీశాడు.
ఇంటి బయట వైపు పెట్టిన వేప చెట్టు గాలి చల్లగా వీస్తుంది. అక్కడ పెట్టిన జామ, మామిడి, కరివేపాకు, నిమ్మ, మారేడు, పూల చెట్లు అన్నీ కూడా మంచిగా, ఆరోగ్యంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా చక్కగా ఉన్నాయి. ఆ ప్రదేశానికి వెళ్తే లేవాలనిపించదు. అక్కడే రెండు చైర్లు కూడా వేసి ఉన్నాయి. ఒక దాంట్లో కూర్చుంటూ కూర్చోమన్నాడు. కూర్చుంటూ, “ఇప్పుడు చెప్పరా!” అన్నాను మళ్ళీ.
“రిటైర్ కాగానే అందరూ మొత్తం జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ మనము కలలు కన్న జీవితం మనకు ఇష్టమైనట్లుగా మనం గడుపుకోవడానికి ఇంతకాలం మనసులో ఉండి చెయ్యలేకపోయిన ఎన్నో పనులను, ఇప్పుడు చేయడానికి ఆ అవకాశం దొరికిన అమృతమైన సమయమని ఎవరు ఊహించరు.”
“అసలు నువ్వు ఏమంటున్నావో నీకర్థం అవుతుందా? ఆఫీస్ లో మన హోదా ఏంటి? ఇక్కడ నువ్వు చేసే పనేంటి?” నాలో అసహనం.
“మనం ఉన్నతాధికారులుగా పెద్ద హోదాలో అందరి మన్ననలను గౌరవాన్ని అందుకొని ఉండవచ్చు గాక! కానీ అప్పటివరకు మనం అలా మన కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి మనకు వెన్నుదన్నుగా నిలబడి, ఉరుకుల పరుగులతో మనకు అన్ని అందించిన అర్ధాంగికి, అప్పుడున్న సమయాభావం వల్ల మనం ఏమి చేయలేకపోవచ్చు! కానీ ఇప్పుడు మనకు ఆ సమయం ఉంది. అప్పుడు వాళ్లకు తీర్చలేని కోరికలన్నీ, ఇప్పుడు మనం యధేచ్చగా తీర్చుకోవచ్చు”
“అంటే ఆడంగిలా వంట చేయాలా?”దాచుకున్నా దాగని వెటకారం నా గొంతులో.
“అది ఆడవాళ్ళ పని అని రాసి ఉందా? ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం లేదా? ఎప్పుడు వాళ్లే వంట చేయాలని రూల్ ఉందా? మనం ఉద్యోగానికి ఉద్వాసన చెప్పేశాము, ఇప్పుడు స్వేచ్చా పక్షులం . కానీ ఇన్ని సంవత్సరాలుగా అదే వంటింట్లో మగ్గిపోతూ, అందరికి సేవలందిస్తూ, పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కాళ్లకు బలపం కట్టుకొని తిరిగినట్లుగా అందరికీ అన్ని అందిస్తూ, వాళ్లు ఎన్ని కోల్పోతున్నారో తెలుసా?”
“ఏంటి, ఆడవాళ్ళ పక్క వకాల్తా తీసుకుని బాగానే మాట్లాడుతున్నావ్?”
“నన్ను చెప్పనివ్వు. మనకు రిటైర్మెంట్ ఉంది గాని, అదే సేవలు అన్ని సంవత్సరాలు చేస్తున్న వారికి రిటైర్మెంట్ లేదా? ఇప్పుడు ఎవరి పిల్లలు వారి ఉద్యోగాల రీత్యా దూరంగానే ఉంటున్నారు. మరి వారికి కొంచెం రిలాక్స్ కావాలని ఉంటుంది కదా! అదేదో ఒక నాలుగు రోజులు మనం వాళ్ళకి చూపిస్తే, వాళ్లకి మనమీద ప్రేమ పెరుగుతుంది. మనకు వాళ్ళ కష్టం అర్థమవుతుంది. అలాగే ఇంట్లో ఇప్పుడు కలిసి పని చేస్తూ ఉంటే, వాళ్ళ భావాలన్నీ మనతో పంచుకోవడానికి సమయం దొరుకుతుంది. దగ్గరితనం దొరుకుతుంది. ‘జీవితంలో నిజమైన జీవితం ఇప్పుడే మొదలవుతుంది’ అంటాను నేను. ఇంకా బ్రతికేది ఎంతకాలమైనా, ఆ కాస్త సమయంలో ఒక్కక్షణం కూడా వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వారితో పాటు నేను కూడా ఇన్ని రోజులు ఆమె నా ద్వారా ఊహించిన సేవల్ని అందించడం ద్వారా నేను తీర్చుకుంటున్నాను. దీంట్లో నా స్వార్థం కూడా ఉందిరా!”
“చాకిరా? నీ స్వార్థమా?” తెల్లబోయాను.
“అవును. వాళ్ళు పదికాలాలపాటు మంచిగా ఉంటేనే మన జీవితం మంచిగా ఉంటుంది. వాళ్ల ఆరోగ్యం పాడైతే మనల్ని మన భార్యలు చూసుకున్నంతగా, భార్య, భర్తను చూసుకున్నంతగా ఎవరు ఏ కొడుకు, ఏ కూతురు కూడా చూసుకోరన్నది జగమెరిగిన సత్యం. ఎవరి బాధ్యతలు వారికే ఉంటాయి. ఒకరికి భారంగా కావడం మనకు ఇష్టం ఉండదు. ఒకరికి మనం భారం కాకుండా మన ఆరోగ్యాన్ని, ఈ జీవితం కొండెక్కేవరకు శారీరకంగా, మానసికంగా మంచిగా ఉండేలా చూసుకోవాలి. మనకు వీలైనంతలో ఒకరిని విమర్శ చేయకుండా, ఉన్నంతలో ఉల్లాసంగా, ఆనందంగా ఉంటే ఆ మానసిక ఉల్లాసంతో మన ఆయుషు మరో పదేళ్లు పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఒకరితో మనము సేవలు చేయించుకోకుండా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని మనము పరిరక్షించుకోవాల్సిందే! దానికి సరైన పోషకాహారం కూడా తీసుకోవాలంటే మనల్ని మన భార్యలు ఎలా చూసుకుంటున్నారు, అలాగే వాళ్ళ ఆరోగ్యాన్ని, వారిని కూడా మనమే చూసుకోవాలి”
సాలోచనగా చూసాను. ఏదో అర్థం అవుతున్నట్లు మబ్బులు వీడుతున్నట్లుంది.
“చూసావా? మనతోపాటు రిటైర్ అయిన రామబ్రహ్మం ఇప్పుడెలా ఉన్నాడు?”
“వాడేం బాలేడు. ఉద్యోగంలో ఉన్నంతకాలం ఎలా ఉండేవాడు. భార్య చనిపోగానే పిచ్చివాడిలా అయ్యాడు”
“కదా! ఆ హోదా మర్చిపోలేక, రిటైర్ అయ్యాక కూడా అదే చెలాయించాడు. అప్పటికే ఆరోగ్యం చాలా క్షీణించి ఉన్న భార్య, క్యాన్సర్ తో ఆరు నెలల్లో చనిపోయింది. అప్పుడు కానీ, వాడికి ఆమె లేని లోటు తెలిసి రాలేదు. ‘ఆమె ఉండగా సరిగ్గా కాపాడుకోలేక పోయానంటూ’ ఎంత బాధపడుతున్నాడు. సగానికి సగం అయిపోయాడు. నిజం చెప్పాలంటే భర్త లేకపోయినా భార్య ఉండ గలదురా! ఎందుకంటే ఒకేసారి రకరకాల పనులు చేయడం, ఒకే సమయంలో అందరిని సంతృప్తి పరచడం లాంటి మల్టీ టాస్కింగ్ ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఆ బాధల్లో ఆ పనుల్లో వాళ్ళు తమ బాధను కొంచమైనా మర్చిపోతారేమో. దానివల్ల ఆ ధైర్యం వారికి ఉంటుంది. కానీ అదే మగవాడు భార్య లేకపోతే మాత్రం ఎక్కువ కాలం బ్రతకలేడు. ఆమెను మర్చిపోలేడు. భార్య ఉన్నప్పటిలా, కోడలైనా, కూతురైన సులువుగా ఆకలవుతున్న సంగతి చెప్పలేడు. చొరవగా వంటింట్లోకెళ్లి, తనంతట తానే టిఫిన్ పెట్టుకుని తినలేడు. నోరు విడిచి రెండుసార్లు అడగలేడు. అవునా కాదా?”
“అది మాత్రం అక్షరాలా నిజం!”
“మన కడుపులో ఆకలికి గంట కొడితే, భార్య మనసుకు మన ఆకలి తెలుస్తుంది. సమయానికి మనకు ఇష్టమైనవి తెలుసుకుని మరీ అందించే నేర్పు, ఓర్పు వారిలో ఉంటుంది. కానీ అది మనము టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకుంటాం. కానీ వాళ్ల సేవల్ని ఏనాడు గుర్తించం. అది మన జన్మ హక్కుగా భావిస్తాం. కానీ వాళ్లు మనుషులే! వాళ్లకి కోరికలు ఉంటాయి. మనకు వేడివేడిగా పెనం మీద నుండి తీసుకొచ్చి వడ్డించేవారు, అందరి కడుపులు నింపిన తర్వాత వారు తినడంలో ఏ ఒక్కసారి కూడా కనీసం వేడి వేడిది తినాలనే తమ కనీస కోరికను కూడా తీర్చుకోలేక పోతారు. ఎందుకంటే అక్కడ ఉన్న బాధ్యతలు, పనులు, వాళ్లకి ఆ కోర్కె తీరకుండా చేస్తాయి“
“ఏముంది? హోటల్ కెళ్తే సరి”
“నేను చెప్పింది చాలా చిన్న ఉదాహరణ. సరే ఏ హోటల్కో తీసుకెళ్తే తీరుతుందేమో కానీ మలి వయసు దాటి సీనియర్ సిటిజన్ హోదా తగిలించుకున్న తర్వాత అది ఏ మాత్రం క్షేమకరం కాదు. కరోనా కాలం మర్చిపోయావా? అడపాదడపా ఓకే! కానీ ఎప్పటికీ అలా చేయలేం కదా! కానీ ఇన్ని సంవత్సరాలుగా వారు పెట్టిన వేడివేడి వంటకాలను ఆస్వాదిస్తూ ఏనాడైనా కనీసం ‘బావుంది’ అని కితాబు కూడా ఇవ్వని మనం, ఆ శ్రమ ఒక్కసారి చేస్తే అందులోని విలువ తెలిసి వస్తుంది. అందుకే తను చేసిన పనిని మెచ్చుకుంటాను. నేను చేసిన పనిని కూడా తనకు నచ్చితే మెచ్చుకుంటుంది. దీనివల్ల మనకు వరిగేదేమీ లేదు. కానీ అది మనసులో ఉల్లాసాన్ని కలగజేస్తుంది. అదే ఆ ప్రశంస నలుగురి మధ్యలో ఇవ్వు, అప్పుడు వాళ్ళ మొహం వెలిగిపోతుంది. ఈ మానసిక ఆనందమే ఆరోగ్యానికి ముఖ్యమైనదని గుర్తుపెట్టుకో! దానికి మనము డబ్బులు పెట్టడం లేదు. కొనుక్కోవడం లేదు. కేవలం ఒక చిన్నమాట అంతే చాలు”
“ఇవన్నీ నేనెన్నడూ ఆలోచించలేదు రా!”
“మనకు పెన్షన్ తగినంతగా వస్తుంది. ఆ పెన్షన్ లో ప్రతి నెల కొంత డబ్బు గుళ్లో నిత్య పూజకి ఇచ్చినట్లుగానే, ఏ అనాధ శరణాలయానికో, ఏ వృద్ధాశ్రమానికో ఇస్తే వాళ్ళందరూ చూపించే ప్రేమ మనం మర్చిపోలేము. ఎవరు ఆదరించినా, ఆదరించకపోయినా వాళ్లు మాత్రం గుర్తుపెట్టుకుని, పండగలకు పబ్బాలకు మనల్ని గ్రీట్ చేస్తారు. సమాజంలో కూడా మనం అంటే గౌరవం పెరుగుతుంది. ఇవన్నీంటికన్నా ఎక్కువగా మన మనసుకు ఉల్లాసం కలుగుతుంది. సంతోషం కలుగుతుంది. కొన్ని కోట్లు పెట్టిన దొరకనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. అందుకని ఎప్పటికీ ఆఫీస్ లోనా, ఇంట్లో కూడా ఆర్డర్స్ వేసే మనం, ఒక్కోసారి కాయిన్ కి ఆటువైపు ఉండి కూడా ఆలోచించగలగాలి. అప్పుడే శ్రమ విలువ తెలుస్తుంది. మన వ్యక్తిత్వం మనకు అర్థం అవుతుంది. నా ఆరోగ్యరహస్యం ఇదే!” అన్నాడు.
నాకు గీతోపదేశం చేసిన కృష్ణుడు గుర్తొచ్చాడు. పూర్ణ గుర్తొచ్చింది. ఆమె వేదనను అర్థం చేసుకోలేదు నేను. ‘ఇప్పుడు ఖాళీయే కదా’ అన్నందుకే తప్పు తీసుకున్నాను. తను అన్నదాంట్లో తప్పేముంది? ఉద్యోగంలో ఉన్నప్పుడు పరిగెత్తి, పరిగెత్తి మిగతా వాళ్ళని పక్కకు పెట్టి నాకు సేవలు చేసింది. ఇప్పుడు నిజంగా ఖాళీగా ఉన్నప్పుడు కూడా, ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అదే తను ఖాళీగా ఉన్నాడు కదా! తన ఒంట్లో శక్తి ఉంది కదా! నేను రిటైర్ అయినట్టు తనకు కూడా ఆ వయసైనా రిటైర్ కాలేదు కదా! తను ఒక చేయి వేసి సహాయం చేస్తే, అందరికీ పెట్టి 11 గంటలకి టిఫిన్ తినడానికి బదులు. తను కూడా సమయానికి నాతో పాటే కూర్చుని తింటుంది కదా!
కాళ్లు లాగుతున్నాయంటూ మూలిగే మూలుగులు తను వింటూనే ఉన్నాడు. అయినా అది జస్ట్ లైక్ దట్ అన్నట్టు క్యాజువల్ గా తీసుకున్నాడే గాని సీరియస్ గా ఆమెకి ఏమి బాధ అన్నది ఎప్పుడు గ్రహించలేదు. తనను సంతోషపెట్టడానికి, సుఖపెట్టడానికి పూర్ణ శ్రమించినట్లుగా ఏనాడైనా ఆమెను సంతోషపెట్టడానికి ఎన్నడు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అయినా తనకి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలా కొన్ని బాధ్యతలు, కొన్ని పనులలో సహాయం చేస్తే నిజంగా ఎంత సంతోషించేదో కదా! ఇంకా అవన్నీ విన్న తర్వాత అక్కడ క్షణం ఉండాలనిపించలేదు.
ఎప్పుడెప్పుడు అక్కడ వాలిపోయి నా పూర్ణకి ఇన్ని రోజుల నా బాసిజానికి క్షమాపణలు అడుగుదామా అని, ఆమెకు తెలియకుండా ఆమెకు నచ్చిన చీర కొని ఆమెను సర్ప్రైజ్ చేసి ఆనందపరుద్దామా, అని నా మనసు తహతలాడుతుంటే “నేను వెళతాను రా” అన్నాను లేచి నిలబడుతూ.
“అదేంటిరా! ఇంకా భోజనం చేయకుండానే! ఇవాళ స్పెషల్ చేస్తానని చెప్పాను కదా! ఎంత పది నిమిషాల్లో చేస్తాను. కూర్చో” అన్నాడు.
“లేదురా! నా కళ్ళు తెరుచుకున్నాయి. మీ చెల్లిని తీసుకుని మళ్ళీ వస్తాను. అందరం ఎటైనా సరదాగా వెళ్ళే ప్రోగ్రాం వేద్దాం. ఇప్పటివరకు మనం కల్సి ఆఫీస్ టూర్లు బోలెడు తిరిగాం. కానీ పూర్ణను తీసుకుని వెళ్ళలేదు.” అంటూ అడుగులు వేస్తుంటే, వాడు భుజంపై చేయి వేసి దింపడానికి కారు దగ్గరికి తీసుకెళ్లాడు, వాడికి అప్పటికే అర్థమయిపోయింది నాకు జ్ఞానోదయం అయిందని.
**********************