సంపాదకీయం  (Author: సంపాదకులు)

ఇటీవలనే మరణించిన రతన్ టాటా ఫార్సీ మతస్థుడు. కానీ ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచనా’ అన్న గీతా వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించిన మహనీయుడు. నిజమో కాదో తెలియదు కానీ, ‘నీకూ అంబానీ కి తేడా ఏమిటీ’ అని ఎవరో అడిగితే, నేను ‘పారిశ్రామిక వేత్తని, ఆయన వ్యాపారస్తుడు’ అన్నాడట.

ధనవంతులు, తాము సంపాదించిన ధనానికి తాము ధర్మకర్తలం మాత్రమే, ఈ ధనం సమాజానిది అనుకోవాలీ అన్నారు గాంధీజీ. టాటా సన్స్ కంపెనీ ఆ ఉద్దేశ్యం తోనే స్థాపించారు, అలానే నడుస్తున్నది కూడా.

అందమైన ముఖ చిత్రం వేసిన పెద్ది ఉమాకాంత్ గారికి ధన్యవాదాలు.

***

చాలా మలుపులు, హంగూ, హంగామాలతో, ఉత్తేజంతోనూ, ఉత్కంఠతోనూ నడచిన 2024 US ఎన్నికలు ముగిశాయి; ఫలితాలు ఎటువంటి గందరగోళాలూ, గోడవలూ లేకుండా వెంటనే వచ్చేశాయి.  ఈ ఆధునిక యుగంలో ఇంత పెద్ద ఎత్తున అమెరికా ప్రజల్లో ఉన్న అభిప్రాయ బేధాలు, ప్రాంతీయ, సాంస్కృతిక, జాతులకు సంబంధించిన విబేధాలూ బయటపడ్డాయి.    క్రొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో, ప్రతి పక్షం దాన్ని విజ్ఞతతో ఎలా దారిలో ఉంచుతోందో, ప్రజావిబేధాలు ఎలా తగ్గుముఖం పడతాయో వచ్చే నెలలూ, సంవత్సరాలే   చెప్పాలి.  God Bless America and God Bless American Democracy!

***

ఇక ఈ సంచికలోని కొన్ని కబుర్లు...

భారతంలో గాంధారి పాత్ర వ్యాసంలో కాశీనాధుని రాధ గారు ఆ పాత్ర ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులు బాగా వర్ణించారు.  సాయం చేయలేను కథలో ఓట్ర ప్రకాష్ రావు గారు శీతల పానీయాల ముప్పు ఎలుక ద్వారా చెప్పించారు.  కుంతి గారు భగవద్గీత! కవితద్వారా గీతా వైశిష్ట్యాన్ని సరళంగా మనకందించారు.

ఊతకర్ర కథలో విధివంచితురాలై జీవితాంతం పోరాడిన తల్లి, ఆవిటిరాలుగా పుట్టిన కూతురికి తన జీవిత పరమార్థం ఏమిటో ఎలా నేర్పిందో చాలా నేర్పుతో చిత్రీకరించారు డా|| జడా సుబ్బారావు గారు.   అలాగే, కోరుకొండ వెంకటేశ్వర రావు గారి కవిత, లక్ష్యం, జీవన చరమాంకపు సంధ్యా సమయంలో కూడా నవజీవన స్పందన ఎలా ఏర్పడగలదో చూపిస్తోంది.  ప్రేమ రసాయనం కథలో డాక్టర్ సుగుణా రావు గారు, ఈ కాలంలో ప్రేమకీ, పెళ్ళికీ సంబంధం ఏమిటో పరిశీలించారు.  బంధమా బంధనమా అన్న కవితలో వివాహ బంధం బంధనం కాకూడదాన్నారు

వాణీ శ్రీనివాస్ గారు అకారణంగా ఎవరినైనా ద్వేషించడం, వెంటనే ఒక అభిప్రాయానికి రావడం రెండూ తప్పే అని నీలి కెరటాలు కథలో చెప్తారు.  శానాపతి (ఏడిద) ప్రసన్నలక్ష్మి గారి నవ్వు పూలనే కవిత, నిరుత్సాహానికి గురైన ఒంటరి వ్యక్తి యొక్క భావాలను వర్ణిస్తుంది.  మార్పు మొదలయింది కథలో శింగరాజు శ్రీనివాస రావు గారు, ప్లాస్టిక్ సంచుల మీద ధ్వజమెత్తారు.  నీ గమనంలో నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసే చేసే ప్రయాణమే అసలైన జీవితమనే ఒక సత్యాన్ని తెలియజేసే కవిత డా. దారల విజయ కుమారి గారి మొలచి చూడు.  దారి చూపిన నేత్రాలు కథలో పొత్తూరు రాజేంద్రప్రసాద్ గారు నేత్ర దానం గురించి రాశారు

మతిమరుపు మనిషి కథలో శరత్ చంద్ర గారు ఆర్ధిక స్వాతంత్ర్యం కోల్పోయిన పెద్దల సమస్యలు వర్ణించారు

తన్మయత్వపు జోహార్లు కవితలో శాంతి కృష్ణ గారు తెలంగాణాలో బతుకమ్మకీ ఆంధ్రాలో గొబ్బెమ్మకీ జోహార్లర్పించారు.  సున్నితత్వపు పొరలు కవితతో మన కర్మలు మనని మనోన్తరగతాల్లో ఎలా వెంటాడతాయో చూపించారు అవ్వారు శ్రీధర్ బాబు గారు.  కొంపెల్ల కామేశ్వరరావు గారు ఆ నిశానీ వెనుక కవితలో ఇప్పటి నిరక్షరాస్యత గురించి వాపోయారు!

         పాఠకులకందరికీ ఒక్క ప్రార్థన.. దయచేసి పత్రిక పైనా, పత్రికలోని ప్రచురణల పైనా మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. 

మళ్ళీ కలుద్దాం సంక్రాంతి సంచికలో...

添加评论