సాహిత్యం జనక గణం, సంగీతం జనని నైజం
ఆ సంగమ మధురఫలం ‘పాట' జననం
పాట మనిషి హితమైతే! పాట మనిషి నేస్తమైతే!
చీకటి కన్నులలో కూడా 'వెన్నెల' విహారం.
సిరులొలికే ‘పసిపాపకు రెప్పల' ఉయ్యాల ఊపుతూ
తల్లిలాలి పాట సుధల, మధుర, నిదుర వరమొసగు
మనిషికి సేవ చేసి! చేసి! అలసిన ప్రకృతిమాతను
పిల్లగాలి 'ఈలపాట' జోలపాడి నిదురపుచ్చు.
కళ్ళ 'కలువ పువ్వు'లలో పాట పల్లవిస్తుంది
చిరు నగవుల 'సరసు' లో పాట 'అల’లా కదులుతుంది
‘ఎల కోయిల 'ఆమని'లో! తడిసి పరవశించినపుడు
పాట తనలో పుడుతుంది! 'తనే' పాటై బ్రతుకుతుంది.
జ్ఞాపకాల 'వరుసల'లో పాట 'కథ'లా కదిలింది
గుండె ‘కడలి'లో పాట'కెరటమై’ ఎగిసింది.
'కష్టజీవి'చెమట బొట్టు'లో పాట సిరులై పారింది
జగతి కంతా! కడుపు నింపే తల్లి పుడమి అయింది.
ఆటవిక మానవుని 'ఆకలి' కేకలలోన
పులి, ఏనుగు, గాండ్రింపు, ఘీంకారపు ధ్వనులలోన
ఉరుముల అరుపులలోన, కురిసే మేఘాలలోన
'మెరుపు' తళుకులలోన 'విశ్వమంతా చూపింది.
జానపదుల 'జావళీల్లో'ప్రేమ గీత మయింది
'ఏరువాక' సాగినపుడు ‘యాల పదం'మయింది
కొండలు, కోనలలోన 'చినుకు' కులుకులాడినపుడు
చినుకులోన 'తడిసి' పాట 'ఇసుక'లో ‘బుస’కొట్టింది.
ఎద్దుల 'గలగంట'తోనూ, ఊరబావి 'గిలక'తోనూ
'కోడిపుంజు'కూతతోనూ, 'లేగదూడ పరుగుతోనూ
జతగట్టిన 'తెలుగుపాట' రాగ సుధలు’ చిలికింది
'ఎద' పాల సంద్రమై పొంగి 'నింగి’'ని తాకింది.
తకధిమితక, ధిమిధిమితక 'అక్షరాలే తాళాలై
తేట 'తెలుగు' వేదికపై పాట నాట్యమాడింది
'కలకూజిత' శబ్దాలతో! సుస్వరాల ఊపిరిలై
పాటలోన 'ప్రకృతి'ని 'జలకము'లాడించింది.
అన్యాయం, అక్రమాల, అవినీతి గుండెలలో
'పిడిబాకై' గుచ్చుకుంది!. ' అగ్నికీలలెగజిమ్మింది
పాట 'గుడ్లు ఉరిమి' చూస్తే! 'పుడమే' వేడెక్కుతుంది
దోపిడీల, దుర్మార్గుల 'కోటలను’ కూల్చిపడేస్తుంది.
జనజీవన చైతన్యపు గీతాలకు 'గొంతుకై'
'వెతల' బతుకులో మనిషికి తోడు నీడై ఉంటుంది.
'చిక్కని చీకట్లను' పాట తరిమి తరిమి కొట్టింది
'కాంతి పుంజమై వచ్చి'బ్రతుకు బాట’ చూపింది
'పగలు, రేయి' కదలికలు పాటకు 'స్వర, శృతి, లయలు
'రసరంజిత''సౌరభాలు పాటకు'ఆభరణాలు
'చిగురించే రవికరణం' పాట జీవన చైతన్యం
వికసించే 'చంద్రహాసం' పాట 'హృదయ' సందేశం.