తెలుగుతనం  (Author: తాతా వేంకట సత్య ప్రభాకర మూర్తి)

దిష్టి చుక్క

కాటుక రేఖా

నలుగు రుద్ది ఇక

సాంభ్రాణి పొగ

***

జడకుచ్చులూ

వడ్డాణాలు

పట్టు పావడాలు

మరి ఆడ పిల్ల కంటే

*** 

లంగా వోణీలు

పూల జడలు

పల్లెటూళ్ళల్లో,

బాపూ బొమ్మల్లోనే

*** 

సొంత భాషలొ

స్కూళ్ళుండవు

ఊరు భాషల

ఉత్త గొప్పలు

చదువుల్లో పోటీ

వందకి తక్కువ నాటీ

దేశ విదేశాల్లో

మన వాళ్ళదే ధాటి

*** 

పునుగులూ

పూత రేకులు

తాపేస్వరం లడ్లు

మడత కాజాలు

 ***

గుత్తొంకాయలు

గోంగూర పచ్చళ్ళు

ఆవ పట్టిన మావి

అరవై ఊరగాయలు

*** 

గుమ్మడొడియాలు

పెసరప్పడాలు

నవనాడులూ

కదిలించే నాదస్వరాలు  

బట్టలంటే పిచ్చి

బంగారమంటే ప్రీతి

పండగ పబ్బాలలో మరి

దుకాణాలన్నీ రద్దీ

*** 

గుళ్ళే మూలున్నా,

బాబాలూ, దేవుళ్ళెవరైనా,

బస్సులూ రైల్లళ్ళో

పరిగెట్టే జనం మనం

*** 

గోడ చాటున

వీధి ముఖ్యాంశాలు

అమ్మలక్కల నోట

రోజువారీ ప్రసారాలు

***

తిండి కంటే

సినీమాయే ముందు

కొట్లాటలకైనా రెడీ

హీరో ఫానుల పొంగు  

ఎప్పటికీ ఆగని

నాయికల విలనిజాల

టీవీ సీరియల్స్

ఆడవాళ్ళ మాంచి పల్స్

*** 

అవధానాలూ

ప్రవచనాలు

తీరుబడిని

మంచి కాలక్షేపాలు

*** 

సంక్రాంతికి

రంగుల ముగ్గులు

అట్లతద్దికి ఆరట్లు

దసరాకింక మామూలే !

*** 

ఆంధ్ర నాట్య నట్టువ

కూచిపూడి సత్తువ

అన్నమయ్య పదశోభల

అభినయాన మక్కువ  

కష్టమే కందం

ఆటవెలది ఆనందం

ప్రౌఢ ఛందస్సుల మధ్య

వచన కవిత మరీ సుఖం

 ***

పెంకితనం

మంకుతనం

మంచి తనం

వెరసి ..

*******

 

 

添加评论