చెల్లీ...నన్ను క్షమించూ...!  (Author: బొందల నాగేశ్వరరావు)

అనారోగ్యం కారణంగా భార్య భాగ్యాన్ని ఆసుపత్రిలో చేర్పించాడు భరత్. ఆమెను చూసుకోవ టానికి పని మనిషిని వుంచాడు. ఆమె తన్ను సరిగ్గా చూసుకోవటం లేదని, చీటికి మాటికి పరోక్షంగా తిడుతూ విసుక్కుంటుందని భర్తతో చెప్పగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించి హైదరాబాదులో వుంటున్న మరదలు గీతకు ఫోన్ చేసి అక్కను చూసుకోవటానికి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు భరత్.

ఆ రోజు ఆదివారం. మూడు, నాలుగు తరగతులు చదువుకొంటున్న కొడుకులను తీసుకొని ఆసుపత్రికి వచ్చాడు భరత్. పిల్లలు కాస్సేపు తల్లితో గడిపిన తరువాత ఆడుకోవటానికి అక్కడే వున్న లాన్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు....

" డాక్టరుగారు ఏమన్నారు భాగ్యం?" భార్యను అడిగాడు భరత్.

"స్కానింగ్ రిపోర్టులో యూట్రస్ లో ట్యూమర్ వున్నట్టు గుర్తించారు. ఆఫరేషన్ చేసి దాన్ని తొలగించాలన్నారండీ! తరువాత ఓ నెల రోజులు రెస్టులో వుండాలన్నారు. నేను రెస్టులో వుంటే మీకూ పిల్లలకు భోజనం ఎవరు చేసి పెడతారు? పిల్లలను తయారు చేసి బడికి ఎవరు పంపు తారు? అదే ఆలోచిస్తున్నాను" నీరసంతో అంది భార్య భాగ్యం.

"అందుకే వీటన్నిటినీ మనసులో వుంచుకొని హైదరాబాదులో వున్న మీ చెల్లిని రమ్మని ఫోన్ చేశాను. మరో రెండు రోజుల్లో దిగిపోతోంది. అన్నీ తనే చూసుకుంటుంది. నువ్వు నిశ్చింతగా వుండొచ్చు" అన్నాడు భరత్ . ఆ మాటలు విన్న భాగ్యం భర్త ముఖంలోకి కొరకొరా చూసి అటు తిరిగి పడుకొంది.

"నీ ముఖ విరుపులకు అర్థం ఏమిటో నాకు తెలుసు భాగ్యం! నీకు నీ చెల్లెలంటే ఇష్టం లేదు. ఎందుకంటే తను ఇక్కడికి వస్తే ఏదో తప్పు జరిగిపోతోందన్న భయం. రానివ్వు. ఓ నెలనాళ్ళు నీకు పిల్లలకు తోడుగా వుంటుంది. నాల్రోజులు చూడు. నీకు నచ్చక పోతే పంపించేద్దాం" "నాకు నచ్చుతుందో లేదో కాని మీకు ఆనందంగా వుంటుంది. రానివ్వండి!" భాగ్యం భర్త కళ్ళలోకి చూస్తూ అంది. భరత్ మెల్లగా నవ్వాడు.

భాగ్యం పెళ్ళినాటికి చెల్లెలు గీతకు ఇరవై ఏళ్ళు. హైదరాబాదులో డిగ్రీ పూర్తి చేసుకున్న తను అక్కడే ఓ కంపినీలో పని చేస్తోంది.

గీత చాలా అందగత్తె. ఎప్పుడూ పెదాలపై చిరు నవ్వులతో సహజంగా వుంటూ అందరితో మంచిగా ప్రవర్తిస్తుంది. నిష్కల్మషంతో వుండే తనకు మొదటి నుంచి బావయ్య భరత్ అంటే చాలా ఇష్టం. ఆయనతో సరదాగా, చనువుగా వుంటుంది. అది అక్క భాగ్యానికి నచ్చదు.

అక్కకు పెళ్ళయిన రెండేళ్ళకు గీతకి కూడా సాంప్రదాయ సిద్దంగా ఓ సాప్టువేర్ ఇంజినీర్తో పెళ్ళి జరిగి హైదరాబాదులో అత్తగారింట్లోనే స్థిరపడిపోయింది. తనకు అన్ని విధాల అనుకూలమైన మంచి భర్త దొరకటం అదృష్టం అనుకొని సంతోషించినా కడుపు పండలేదన్న దిగులు తనకు. అందుకే అక్క పిల్లలను తన పిల్లలుగా భావించుకొని వాళ్ళని చూడ్డానికి భర్తతో పాటు అప్పు డప్పుడు విజయవాడకు వెళుతుంది. అలా పిల్లల వద్దకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఇష్టమైన బొమ్మలను, తినుబండారాలను కొనుక్కొని వెళుతోంది. వాటిని పిల్లలకిచ్చి వాళ్ళతో కలసి రెండు మూడు రోజులు గడిపి తిరిగి హైదరాబాదుకు వచ్చేస్తుంది. పిల్లలు కూడా హైదరాబాదు నుంచి పిన్ని వస్తుందని తెలిస్తే సంతోషంతో ఎదురు చూస్తూ వుంటారు. అలా పిల్లలకు వూహ తెలిసినప్పటినుంచి జరుగుతోంది. కాని గత రెండేళ్ళ నుంచి అలా జరగడం ఆగిపోయింది. అందుకు కారణం తన అక్కే!.

అవును. చెల్లెలు గీత తనింటికి రావటం భాగ్యానికి ఇష్టం లేదు. ఆమె వస్తే తన భర్తతో చనువుగా వుంటుందని, అలా వుండడం ద్వారా ఏదైనా జరగకూడనిది జరుగుతుందని ఆమె భయం.

తను భయపడుతున్నట్టే ఒకసారి హైదరాబాదు నుంచి తనింటికి వచ్చిన చెల్లెలు పడగ్గదిలో తన భర్త ప్రక్కన కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు వాళ్ళ మధ్య హాస్యంతో కూడికొన్న సంఘటన ఏదో చోటు చేసుకోగా ఇద్దరూ పక పక మని పెద్దగా నవ్వుకొంటున్నారు. ఆ నవ్వు లకు హాల్లో వున్న అక్క భాగ్యం పరిగెత్తుకొంటూ గదిలోకి వెళ్ళి చూసింది. అప్పుడు చెల్లెలు గీత ఆమె యెద మీద పమిట జారిపోయింది కూడా చూసుకోకుండా నవ్వుతూ వుంది. ఆ సన్నివేశం భాగ్యానికి ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఉగ్రురాలై మండిపోతూ చెల్లిని బయటికి లాక్కొచ్చి చెంపమీద ఒక్కటిచ్చి 'దరిద్రపుదానా! నీ అందాలన్నీ ఆరబోసి నా మొగుడ్ని వల్లో వేసుకోవా లని చూస్తున్నావా! ఇక ఒక్క క్షణం కూడా నువ్విక్కడ వుండకూడదు. వెళ్ళిపో నీ ఇంటికి!" అంటూ నానా మాటలని ఆ సాయంత్రమే రైలెక్కించింది చెల్లెల్ని. అప్పటినుంచి దాదాపు రెండేళ్ళు పిల్లలను చూడ్డానికి అక్క ఇంటికి రాలేదు గీత. అయితే తనకు బావకు అక్రమ సంబంధం అంటగట్టటానికి ప్రయత్నించి, అవమానించి గెంటేసిన అక్కను, నాటి సంఘటన్నూ అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ వుంటుంది.

ఆమె తనలోని బాధను మరొకరికి చెప్పుకుంటే కొంతవరకు భారం తగ్గుతుందన్నమాటను గట్టిగా నమ్మే మనస్థత్వం కలది కనుక ఏ విషయమైనా సరే తను తండ్రిగా భావించుకునే బావయ్యకు ఫోన్లో చెప్పుకొని మనసును తేలిక చేసుకొంటోంది.

ఇవాళ ఆ బావయ్యే అక్కకు అపరేషన్ జరుగుతుందని, జరిగితే తను ఎలాంటి కష్ట తరమైన పనులు చేసుకోలేదు కనుక సహాయంగా వుండటానికి తన్ను వెంటనే రమ్మని ఫోన్ చేయ టంతో గీత సంతోషానికి అవధుల్లేవు. విషయాన్ని భర్తకు చెప్పింది. పనుల వొత్తిడి వల్ల తను తోడు రాలేడని చెప్పి ఒక్కర్తెనే విజయవాడ ట్రెయిన్ ఎక్కించాడు భర్త.

ఆటోలో ఇంటికి చేరుకొంది గీత. ఆ రోజు ఆదివారం కావటంతో ఇంట్లోనే వున్న పిల్లలిద్దరూ 'పిన్నీ' అని పరుగెత్తుకొంటూ గేటు వరకు వచ్చి ఆమెను వాటేసుకున్నారు. వాళ్ళను అక్కున చేర్చుకొని ముద్దులతో ముంచెత్తి హాల్లోకి నడిచిందామె .

"బాగున్నారా బావయ్యా?" చిరు నవ్వుతో అడిగింది గీత.

మరదలిని ఎగా దిగ చూసిన భరత్ " నేను బాగున్నాను గీతా! నువ్వేమిటిలా జబ్బున పడిన దానిలా బాగా చిక్కిపోయావ్ ?" ప్రశ్నించాడు.

"ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు. హార్టులో ఏదో ప్రాబ్లం వుందని డాక్టరు మందులు రాశాడు. వాడుతున్నాను. బహుశా అందువల్ల చిక్కిపోయానేమో! అక్క ఆసుపత్రిలో వుందా లేక.." మాట దాట వేసింది గీత.                   

"పడగ్గదిలోవుంది. వెళ్ళి చూడు. గీతా! తన వద్దకు వెళ్ళే ముందు ఒక్కమాట. తను కోపంతో నిన్ను కించపరచినట్టు మాట్లాడితే నాకోసం సర్దుకొని వూరకుండి పో !" అన్నాడు భరత్ .

"అలాగే బావయ్యా!"అంటూ అక్క పడగ్గదిలోకి దారి తీసింది గీత.

గదిలోకి ప్రవేశించిన గీత మెల్లగా దగ్గింది. ఆ దగ్గు శబ్దానికి తిరిగి చూసింది భాగ్యం. ఎదరే చెల్లెలు. కోపం వచ్చిందామెకు.

"ఈ గదిలోకి నిన్నెవరు రమ్మన్నారు. ఇదిగో! ఇంటి చాకిరి చేయటానికి నిన్ను పిలిపించుకుంది నీ బావయ్య. వున్నన్నాళ్ళు పిచ్చి వేషాలు వేయకుండా ఒళ్ళు దగ్గరపెట్టుకొని పనిమనిషిలాగా పనులు చేసుకొని వెళ్ళిపో!" అంది అక్క.

"అలాగేనక్కా! అయినా నీ ఆరోగ్యాన్ని గూర్చి తెలుసుకొని అలాగే నీకో శుభవార్తను కూడా చెప్పాలని గదిలోకి వచ్చాను. నేనిప్పుడు ఒఠ్ఠి మనిషిని కాను. నాకిప్పుడు మూడవ నెల!" అంది గీత ఆ మాటకు అక్క సంతోషిస్తుందన్న భావనతో.

"ఉష్! నీ గూర్చి నాకేమీ చెప్పకు. నాకు వినాలని లేదు. వెళ్ళి పని చూసుకో!".

"సరే! అక్కా...అంటున్నాననికాదు. నీకు ఆపరేషనప్పుడే నన్నుపిలిపించుకొని వుంటే బాగుండేదేమో!" మెల్లగా అంది.

"అంతా అయిపోయిందిగా! అసలు నా సంగతి నీకెందుకూ? వెళ్ళి పని చూసుకో!"

"అలాగే! వెళ్ళే ముందు ఒక్క మాట. నేను నీకు ఎంత దగ్గర కావాలనుకున్నా నువ్వు నన్ను దూరంగానే వుంచుతున్నావ్! ఇక నా గూర్చి నేనెవరితో చెప్పు కోనూ? వస్తాను"అంటూ బయట పడింది గీత బావయ్య మాటలకు కట్టుపడి.

పిల్లలు, బావతో పాటు అక్కకూ సేవలు చేసుకొంటూ ఇరవై రోజులు గడిపింది గీత. మరో వారం లో హైదరాబాదు వెళ్ళిపోతుందనగా ఓ రోజు తనకున్న జబ్బు తీవ్రత వల్లనేమో విపరీతమైన దగ్గుతో పెరట్లోకి వెళ్ళి గాండ్రించి వుమ్మింది. వుమ్మిలో రక్తం కనబడింది. అది అక్కడే ముఖం కడుక్కొంటున్న బావయ్య భరత్ గమనించాడు. గబగబ మరదలి దగ్గరికొచ్చి "ఏమిటమ్మా అది రక్తంలా వుందే!" సందేహంగా అడిగాడు.

"అబ్బే...అదేం లేదు. ఒంట్లో వున్న వేడివల్ల దగ్గు రావటంతో అలా రక్తం పడిండి. పదండి భోజనం వడ్డిస్తాను" అంటూ వాష్ బేసిన్ వద్దకు వెళ్ళింది గీత.

ఆమెను గూర్చి ఆలోచిస్తూ డైనింగ్ వద్దకు నడిచాడు భరత్ .

పిల్లలకు, బావయ్యకు వడ్డించి పళ్ళెంలో భోజనం తీసుకొని అక్క గదిలోకి వెళ్ళింది. అది గమ నించిన అక్క "భోజనం ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళు" అంది కోపంగానే. మారు మాట లేకుండా భోజనం టేబుల్ మీదుంచి బయటికి వచ్చింది గీత.

 ఆ రాత్రి భార్య భర్తల మధ్య ఏం వాగ్వాదం చోటు చేసుకుందో మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటలకు మరదలిని ట్రెయిన్ ఎక్కించాడు భరత్.

అయితే అంత దూరం అక్క వద్దకంటూ వెళ్ళిన చెల్లెలు గీత ఆమె మనసులోని బాధని, ఆరోగ్య సమస్యలను, భవిష్యత్తులో తనకు జరగబోయే ఏ విషయాన్ని కూడా అక్కకు చెప్పుకోలేక వేదనతో హైదరాబాదు స్టేషన్లో దిగింది. ఆటోలో ఇంటికి వెళ్ళింది.

అక్క భాగ్యం ఆ మరుసటి రోజునుంచి వంట, ఇంటి పనులను తనే చేసుకొంటూ భర్త, పిల్లలను చూసుకొంటూ సంతోషంగా కాపురాన్ని గడుపుకొంటోంది. ఇప్పుడు చెల్లెలు గీత వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదనుకొంది.          

రెండు నెల్ల తరువాత గీత వద్దనుంచి ఓ సుదీర్ఘమైన ఉత్తరం వచ్చింది అక్కకు. ఆ వుత్తరం చెల్లెలు దస్తూరితో వుండటంతో దాన్ని చదవటం కూడా ఇష్ట పడని అక్క అక్కడే టేబుల్ మీదున్న ఓ పుస్తకంలో పెట్టేసింది.                 

మరో నెల తరువాత గీత భర్త వద్దనుంచి భరత్ పేరా ఓ వుత్తరం వచ్చింది. దాన్ని విప్పి చదవు తున్నాడు భరత్. అప్పుడు ఆయన కళ్ళు చమర్చాయి. ఆ సమయాన లోనికొచ్చిన భార్య భాగ్యం భర్తను చూసి షాక్ అయ్యింది.

"ఏమైందండీ! మీ కళ్ళమ్మటి ఆ కన్నీలేమిటి? ఏముందా వుత్తరంలో! అసలెవరు రాశారు?" ప్రశ్నల వర్షం కురిపించింది.

"దీని సంగతి అటుంచు. ఈ మధ్య మీ చెల్లెలు నీకేమైనా వుత్తరం రాసిందా?"

"ఆఁ. రాసింది. దాన్నిచదవటం నాకు ఇష్టం లేక ఆ టేబుల్ మీదున్న పుస్తకంలో పెట్టాను.ఏం?"

"మొదట వెళ్ళి ఆ వుత్తరాన్ని తీసుకురా?"

"ఎందుకూ?"

"వెళ్ళి తీసుకురా చెపుతాను" భర్త నోటినుంచి కోపంగా వాచ్చాయా మాటలు. ఇక మారు మాట్లాడకుండా వెళ్ళి పుస్తకంలోవుంచిన వుత్తరాన్ని తెచ్చి"ఇదిగో" అంటూ ఇవ్వబోయింది.

"నో...నువ్వే ఓపన్ చేసి చదువు" అన్నాడు భరత్.

"నేనా..!"అంటూ కవరులోని వుత్తరాన్ని తీసి చదవను ప్రారంభించింది.అందులో...

ప్రియమైన అక్కకు!                           

అక్కా!మనమిద్దరం ఒక తల్లి పిల్లలం. నీదీ నాదీ ఒకటే రక్తం. అయినా మనిద్దరి మనసులు, అభిప్రాయాలు, జీవన విధానాల్లో బోలెడు తేడాలున్నాయి. నీకు చిన్నతనం నుంచి కోపం ఎక్కువ. సందేహమన్నది నీ వెంటే వుంటుంది. అక్కా! బావయ్య నీకు భర్త. నాకో తండ్రిలాంటి వాడు, అందుకే ఆయన్ను ఎప్పుడూ తండ్రి స్థానంలో వుంచుకొని చూసుకొంటూ కాస్త చనువు గా వుంటాను. ఆ చనువే బహుశా నీకు నాకు దూరాన్ని పెంచిందేమో!.

అక్కా! నీకు పెళ్ళై పన్నెండేళ్ళు. ఇద్దరు కొడుకులకు తల్లివి. నాకు పెళ్ళయి పదేళ్ళు. ఇంత వరకూ నేను తల్లిని కాలేదు. అందుకే నీతో, పిల్లలతో సంతోషంగా గడపటానికి అప్పుడప్పుడూ విజయవాడకు వస్తుంటాను. అలా వచ్చినప్పుడు బావయ్యతో కాస్త చనువుగా వుంటాను. ఆ చనువే నీకు నామీద లేని పోని సందేహాలకు దారి తీసింది. ఆ చనువే తండ్రిలాంటి బావయ్యతో నాకు అక్రమ సంబంధమున్నట్టు నిన్ను వూహించుకునేలా చేసింది. ఆ చనువే నిన్ను సందేహాల వూబిలోకి నెట్టి నాపై చెడు అభిప్రాయాన్ని కలిగించి నన్ను నీ ఇంటి వేపుకు రాకుండా చేసింది.

అక్కా! నీకు ఆరోగ్యం బాగోలేదని, గర్భసంచిలో ట్యూమరుందని, ఆపరేషన్ జరిగితే నెల రోజులు నీకు సహాయంగా నేను వుండాలని బావయ్య రమ్మంటే విజయవాడకు వచ్చాను.ఇక్కడో ముఖ్య విషయం చెప్పాలి. నీకు సహాయ పడ్డానికి నేను విజయవాడకు వచ్చినప్పుడు నాకూ ఆరోగ్యం బాగోలేదు. గుండెజబ్బు వ్యాధితో వున్నాను. ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు. అయితే ఆ సమయంలోనే ఏ దేవుడు కరుణించాడో నేనూ గర్భవతినైయ్యాను. నీ వద్దకు వచ్చినప్పుడు నాకు మూడవ నెల. ఆ శుభ వార్తను నీతో చెప్పు కోవాలని ఎంతో ఆశ పడ్డాను. కానీ ఆ సంతోషాన్ని నీతో పంచుకోనివ్వకుండా ఏదో చెడు అభిప్రాయాన్ని మనసులో వుంచుకొని అందుకు బావయ్యను కారణంగా చూపి నన్ను రైలెక్కించావు. సరే! ఇప్పుడు వాటిని తిరగతోడడమెందుకు? గతం గతః. ఆ విషయాలను నేను మరచి పోయాను. నువ్వూ మరచి పోయి ఈ చెల్లిని దగ్గరకు తీసుకుంటావని భావిస్తాను.

ఇక అసలు విషయమేమిటంటే ఇప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రమే! అసలు నా కడుపు లో వున్న బిడ్డకు జన్మనిస్తానో లేదో! ఒకవేళ ఆ బిడ్డకు జన్మనిస్తే నేను బ్రతుకుతానో లేదో కూడా నాకు తెలియదు. నన్నుచూస్తున్న డాక్టర్లకూ ఆ సందేహం వుంది. కనుక అలా నాకు జరగరానిది ఏదైనా జరిగితే నా బిడ్డకు తల్లివి నువ్వే కావాలి! నీ చెల్లిగా నేనదే కోరుకొంటాను. నీ జవాబుకోసం ఎదురు చూస్తూ...  నీ గీత.

అంతే వుత్తరాన్ని చదివిన భాగ్యం తనలో పెల్లుబికి వస్తున్న దఃఖాన్ని అణచుకోలేక "ఏమండీ! నేను తప్పు చేశానండీ. నా చెల్లెల్ని సందేహించి అనరాని మాటలతో అవమానించి ఇంటినుంచి గెంటి పెద్ద తప్పు చేశానండి. పదేళ్ళ తరువాత గర్భవతి అయిన నా చెల్లెలు ఆ సంతోషాన్ని నాతో పంచుకోవాలని వచ్చి నెల రోజులు ఇక్కడున్నా ఆమెతో నేను ఒక్క మాటైనా మాట్లాడ కుండా క్షోభకు గురి చేసి ఇంటినుంచి పంపించేశానండి. పదండి. నేను నా చెల్లెల్ని క్షమాపణ కోరాలి. ఆమెను,ఆమెబిడ్డని మనం ఇప్పుడే చూడాలి. పదండీ!" అంటూ భర్తను పట్టుకొని పెద్దగా ఏడ్చింది భాగ్యం.             

ఒక వేడి నిట్టూర్పుతో "ఇప్పుడెళ్ళి ఏం చూద్దాం భాగ్యం! బిడ్డనా లేక మీ చెల్లెలి సమాధినా?" తన కొచ్చిన ఉత్తరంలోని సారాంశాన్ని ఒక్క మాటలో బయట పెట్టాడు భరత్ .ఆ మాటకు షాకయ్యింది భాగ్యం.

"ఏమిటండీ మీరంటుంది! నా చెల్లెలు...."

"ఓ పాపకు జన్మనిచ్చి తను చనిపోయింది. తను చనిపోయి ఇవాల్టికి పన్నెండు రోజులు. ఈ వుత్తరంలో మీ మరిది రాసింది అదే! తనకు ఎవ్వరూ లేని కారణంతో, వున్న ఒక్కగానొక్క అక్కవు నువ్వూ ఆమెను తూలనాడి ఇంటికి రావద్దని చీవాట్లు పెట్టి పంపించినందున విషయా న్ని నీకు కూడా చెప్పను ఇష్టపడలేదు తను. ఇప్పుడు పాపను వాళ్ళ పని మనిషి చూసు కొంటోంది. చూడు భాగ్యం! నీ చెల్లి నీకు చివరిగా రాసిన ఆ వుత్తరాన్ని నువ్వు చదివి పశ్చాత్తా పడి ప్రేమతో ఆమెను నీ అక్కున చేర్చుకుని వుంటే ఆమెకు ఆ మరణం తప్పేదేమో! నీ చెల్లెలి మరణానికి ఆ జబ్బు మాత్రం కారణం కాదు భాగ్యం! ఓ రకంగా ఆమె పట్ల నీ ప్రవర్తన. తద్వారా తను అనుభవించిన క్షోభ. సరే... సాయంత్రమే మనం హైదరాబాదు బయలుదేరు తున్నాం. నీ చెల్లి సిక్స్టీంథ్ డే సెరిమోనిలో పాల్గొని తిరిగి వస్తున్నాం" అన్నాడు.

"మరి నా చెల్లెలి పాపండీ! మరిదిగారిని అడిగి ఆ పాపను నేను తెచ్చుకుంటానండీ! పాపకు అమ్మగా మారిపోయి నా పిల్లలతో పాటు ఆమెనూ ప్రాణపదంగా చూసుకుంటానండీ !" బ్రతిమాలినట్టు అడిగింది భాగ్యం.

"అలాగే! నిజంగా నువ్వు పాపకు తల్లిగామారిపోతే అంతకన్నా భాగ్యమేముంటుంది భాగ్యం ! నీ చెల్లి ఆత్మ కూడా శాంతిస్తుంది. పద" అన్నాడు భరత్.

添加评论