ఊరవతలి మేఘం
ఊరవతలి మేఘం (Author: లింగా అనర్ఘ్య గౌతం)
నా పేరు మేఘ, మాది సత్యనారాయణపురం అనే చిన్న పల్లెటూరు. మాకు నాలుగు వైపులా దారులే అందుకే ఊరికి ఏది మొదలో ఏది చివరో చెప్పడం కష్టం. ఆకాశం మధ్యలో మెరుస్తున్న నక్షత్రంలా ఊరు. దాన్ని కడగడానికి ఆలింగనం చేసుకున్న అలిగేరు. మా ఇల్లు ఊరికి ఒక దారిలో ఉంటుంది. నాలుగు మొత్తలున్న పెద్ద ఇల్లు మా ఊరు. అందరిదీ కలిసి ఒకటే పెద్ద కుటుంబం. నేను ఇక్కడే పుట్టాను పెరిగాను. నాతోపాటే ఊరిమీద ప్రేమకూడా పెరిగింది. అందరూ అందరికీ తెలిసినప్పుడు అందరి కష్టాలు, ఇష్టాలు, జీవితాలు దాదాపు ఒకేలా ఉన్నప్పుడు ఒకళ్లమీద మరొకళ్ళకి గౌరవం పెరుగుతుంది. మా ఊరిమీద ఎండలూ వానలూ కురవడమే చూశాను కానీ కులాలు మతాలు ఎప్పుడూ కురవలేదు. మా నాన్న బ్యాంకు ఉద్యోగి. పక్కనే పది కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేస్తూ సాయంత్రానికి ఇంటికొచ్చి నాతో ఆడుకుంటాడు. ఇప్పుడు ఈ కథ చెప్పడానికి కారణం సూర్య.
సూర్యది మా ఊరే. చిన్నప్పటినుంచీ ఒకే స్కూల్లో చదివాము. మా ఊరి నుంచి స్కూల్ కి మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. మేమిద్దరమే కొంతకాలం నడుచుకుంటూ, కొంచెం పెద్దయ్యాక సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు మొదలైందో తెలియదు. నాకు సూర్య అంటే చాలా అభిమానం. ఇద్దరమే ప్రతీరోజు మాట్లాడుకుంటూ వెళ్లడం వల్లనో, నాకు ఏదైనా సమస్య వస్తే మా ఊరి నుంచి ఉన్న ఒకే ఒక్క స్నేహితుడు అవ్వడంవల్లనో అన్నీ సూర్యకే చెప్పుకునే దాన్ని.
అందుకేనేమో తెలియదు కానీ ఒక్కరోజు సూర్య స్కూల్ కి రాకపోయినా ఎలానో అనిపించేది. నేను చెప్పేది వింటాడో వినడో తెలియదు కానీ అతను చెప్పే ప్రతీ మాటా వినేదాన్ని. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, క్రికెట్ గురించి దారిపొడవునా మాటల్ని పారబోస్తుంటే జాగ్రత్తగా ఏరుకొని నెమలీకల్లాగా దాచుకునే దాన్ని. ఎందుకో సూర్య పక్కనుంటే దైర్యంగా, ఇష్టంగా అనిపించేది. మేము ఒక్కో తరగతీ దాటుతుంటే నా బంధం బలంగా తయారైంది. స్కూల్ కి వెళ్లాలంటే వాళ్ళ ఇంటిముందు నుంచే వెళ్ళాలి. నేను ముందు వస్తే వాళ్ళఇంటి అరుగులమీద కూర్చొనే దాన్ని. సూర్య ముందు తయారైతే అక్కడే నాకోసం ఎదురుచూసే వాడు. నేనెప్పుడైనా స్కూల్ కి వెళ్లకపోతే నాకోసం ఎదురుచూస్తున్నాడేమోనని ఆందోళనగా అనిపించేది. అలా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక అనారోగ్యంతో కూడా ఒక్కోసారి ఓపిక చేసుకొని స్కూల్ కి వెళ్లేదాన్ని. కనీసం వాళ్ళింటిదాకానైనా నా సైకిలేసుకొనెళ్ళి రావట్లేదని చెప్పి వచ్చేదాన్ని. సూర్యని కలవడం మాట్లాడడం కన్నా ఆనందం మరొకటి నాకు కనిపించలేదు.
ఒకసారి ఎనిమిదో తరగతి దసరా సెలవల్లో వాళ్ళ స్నేహితులతో కలిసి ఈతకెళ్లి చెరువులో మునిగి హాస్పిటల్లో తేలాడు. ఆ వార్తతో నా గుండె చేరువైంది. ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడోనని తపించిపోయాను. మళ్ళీ సెలవలు ముగిసి తనని చూసేదాకా నాకళ్ళు అలుగులు పోస్తూనే ఉండేవి. ఏదో తెలియని ఆత్మీయత. తాను వందమాటలతో శతకం పూర్తిచేసేసరికి నేను ఒకటో రెండో మాటల్ని అటు పంపేదాన్ని. నాకు సూర్య మాట్లాడుతుంటే వినడమే నచ్చేది. స్వతహాగా నేను తక్కువ మాట్లాడడం వల్లనేమో అందరి మాటలూ చక్కగా వినిపించేవి. ఎప్పుడైనా బడికెళ్లకపోతే వాళ్ళింటికెళ్లి నోట్సులు తెచ్చుకునేదాన్ని. ఎప్పుడైనా అరుగులుదాటి వాళ్ళింటికెళ్లే దైర్యం చేసినా వాళ్ళ ఆమ్మో నాన్నో సూర్యని గట్టిగా అరచి పిలిచేవారు. తానే బయటకొచ్చి మాట్లాడేవాడు. చాలాసార్లు కంగారుగా మాట్లాడి పంపించేవాడు. సిగ్గువల్లనేమో? అతనెప్పుడూ మా ఇంటికి రాలేదు. మా ఇంట్లో ఏదైనా వంటలు చేస్తే తప్పకుండా సూర్యకి తీసుకెళ్ళేదాన్ని. తాను బ్యాగులో పెట్టుకొని సాయంత్రానికి కాళీ బాక్స్ ఇచ్చేసేవాడు.
సూర్య నాతో తప్ప మా క్లాసులో ఇంకెవరితో అంతలా మాట్లాడడం నేను చూడలేదు. కానీ ఒక్కసారి బడికెళ్ళాక నాతో కూడా ఎప్పుడూ మాట్లాడడు. మా మాటల్ని రోజుకు రెండుసార్లు వినేవి ఆ దారెమ్మడి చెట్లే. సైకిల్ పోటీపెట్టుకొని ఓడినా గెలిచినా నవ్వు బహుమతుల్ని పంచుకునే వాళ్ళం. మేమెప్పుడూ గొడవలు పెట్టుకోలేదు. ఒక్కసారికూడా ఒకళ్లమీద ఒకళ్ళం అలగలేదు. అందుకే నాకు సూర్య అంటే గౌరవం, ఇష్టం.
పదోతరగతి పరీక్షలకి ముందు కొన్ని నెలలు రాత్రి దాకా స్కూల్లోనే ఉండి చదువుకోవాల్సొచ్చేది. నేనొక్కదాన్నీ అంతదూరం నుంచీ ఆసమయంలో ఇంటికి రావడం చాలాకష్టం. ఎందుకో సాయంత్రానికి చాలా అలసటగా కూడా అనిపించేది. ఆసమయంలో సూర్య తోడుగా లేకపోతే ఇంకా కష్టమయ్యేది. పరీక్షలప్పుడు కూడా ఇద్దరం ఉదయాన్నే కలిసి వెళ్లి పరీక్షరాసి వచ్చేవాళ్ళం. దాదాపు నా స్కూల్ జీవితమంతా సూర్యనే ఉన్నాడు. సూర్యోదయం నుంచీ సూర్య పక్కనో, ఎదురుగానో, నా ఆలోచనల్లోనో నాతోనే ఉండేవాడు. నా సైకిల్ ఎన్ని సార్లు దారి మధ్యలో ఇబ్బంది పెట్టినా తాను ఓపికగా సమాధానమయ్యేవాడు. మనుషులంటే నాకున్న ఇష్టాన్ని సూర్య రెట్టింపుచేసాడు. పదవతరగతి అయ్యే సమయానికి ఒక్క సూర్యని మళ్ళీ చూడనేమో అనే బాధ కనీసం ఇన్నాళ్ళలాగా కలిసి వెళ్లలేమనే ఆలోచనే నన్ను ఎక్కువగా బాధపెట్టింది. ఆ బాధ ఎక్కువ రోజులు లేదు. కాలేజీ చదువు కూడా సూర్యతోనే మొదలైంది. ఇద్దరం ఒకే కాలేజీలో చేరాము.
చిన్నప్పటినుంచీ ఇప్పటిదాకా సూర్యలో నాకు అర్థంకాని విషయం ఊర్లో కలిసినప్పుడు అస్సలు మాట్లాడని వాడు, కాలేజీ బస్సెక్కాక మాత్రం బాగా మాట్లాడేవాడు. నేను కూడా అతనికి నచ్చినట్టే ఉండేదాన్ని. ఊర్లో ఏ ఫంక్షన్లోనో ఏ పెళ్లిలోనో కలిస్తే అసలు తెలిసిన వాళ్లలాగా కూడా ఉండము. ఒక్కసారి కాలేజీ మెట్లెక్కితే మాత్రం అక్కడి గాలినిండా మా మాటల్నే నింపేవాళ్ళం. నేను కూడా నా మౌనం విడిచి పెట్టి సూర్యతో బాగానే మాట్లాడేదాన్ని. మేఘ అని సరిగ్గా 'ఘ' కి ఒత్తుపెట్టి పిలిచే అతికొద్దిమందిలో సూర్య ఒకడు. ఆ పిలుపు వల్లనే నా పేరు నాకు మరింత నచ్చేది.
స్కూల్ కంటే కాలేజీకొచ్చాక మేము మరింత దగ్గరయ్యామనిపించింది. సూర్యకి చాలా మంది స్నేహితులు దొరికారు. నాకు మాత్రం సూర్యనే స్నేహితుడు. ఒక్కోరోజు నాతో సరిగ్గా మాట్లాడడక పోయినా ఎందుకో కోపంగా కానీ బాధగా కానీ ఉండేది కాదు. కనీసం కాలేజీకి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు నాతో మాట్లాడకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు కదా అనుకునేదాన్ని. నా ఇష్టం ఎప్పుడో ప్రేమగా మారింది. ఎప్పుడో నాకు కూడా తెలియలేదు. అది ఒక్కరోజులోనో ఒక్క మాటలోనో కాకపోవచ్చు. కొన్నేళ్లుగా పక్క పక్కగా బ్రతుకుతున్న వాళ్ళకి చాలా సాధారణంగా ప్రకృతి కలిగించిన ప్రేమ కావచ్చు. నాకెందుకో నా మటుకు నాది స్వచ్ఛమైన ప్రేమ అనిపించింది. ఎందుకంటే నా పసితనమే నాకు సూర్యని పరిచయం చేసింది. ఏమీ తెలియని తనం నుంచీ ఇప్పటిదాకా ఎన్నో గంటల, రోజుల, సంవత్సరాల పరిచయం మాది. నాది ఆకర్షణ కాదు అని నా నమ్మకం. ఇది ప్రేమగా మారి మరింత బలంగా తయారైయ్యే రోజు కోసం నేను ఎదురుచూశాను.
నాకు సూర్య ఎలా ఆలోచిస్తాడో తెలుసు, ఏం ఇష్టంగా తింటాడో తెలుసు, ఏ సందర్భంలో ఎలా ఉంటాడో తెలుసు, ఎవ్వరితో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు. నాకు సూర్య తెలుసు. మొత్తంగా ఇష్టంగా అన్నీ అంతా తెలుసు. ఇది చాలుగా నేను ప్రేమించడానికి. సూర్యకి కూడా ఇలాంటి ప్రేమనే నా మీద కూడా ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే నాకు సూర్య తెలుసు.
ఒకరోజు నా ధైరాన్నంతా కూడగట్టుకొని ఇద్దరం కాలేజీ బస్సులో తిరిగొచ్చేటప్పుడు నా ప్రేమని చెప్పడానికి ప్రయత్నించాను. కానీ నాకు మాటలు రాలేదు. ఎంతో సునాయాసంగా చెబుదామనుకున్నా నా మాటలు నన్ను బయటపడనివ్వలేదు. కానీ ఒకసారి చెప్పాక నా జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు. ఎప్పుడూ ఎవ్వరికీ లేని ఆనందం, ప్రేమ నాకు మాత్రమే సొంతమవుతాయని నాకు తెలుసు. నేను చెప్పే మాటలు కేవలం ఒకళ్ళకి ఒక్కళ్ళం కొత్తగా పరిచయమవ్వడానికే. ఆ మాటల్ని దాటాక ఉండేదంతా మా ప్రేమనే. ఇదంతా నాకు తెలుసు కానీ ఆ రోజుకి నన్ను చేర్చే మాటలే ఆరోజు పెదవి దాటలేదు.
మరోరోజు పొద్దున మళ్ళీ దైర్యం చేసి నా ప్రేమనంతా ఒక కాగితం మీద పెట్టి దాన్ని సూర్యకిచ్చాను. ఆ రోజంతా ఏదోలా గడిచింది. సాయంత్రం అతను చెప్పే మాటకోసం నా ఎదురుచూపులు రోజుని గడవనివ్వకుండా పట్టుకున్నాయి. కొంచెం భయం, ఆందోళన చాలా ప్రేమతో చాలా బద్దకంగా సాయంత్రమైంది. నేనే తనకెదురుగా నిల్చొని సమాధానం చెప్పమన్నాను.
"మాదిగోళ్ల అమ్మాయిని ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా కనీసం చనువుగా మాట్లాడినా మా ఇంట్లో ఒప్పుకోరు" అన్నాడు. ఒక్కసారి నా కాళ్ళకింద నేల కూలిపోయింది. మా ఊర్లో కులముందా? సూర్యలో కూడా? వాళ్ళింట్లో కూడా కులముందా? నాకెందుకు ఎప్పుడూ కనబడలేదు. నేను కూడా అదే ఊర్లో పుట్టాను, పెరిగాను. నా కులం ఒకళ్ళు గుర్తు చేసేదాకా నాకే తెలియలేదు. మా ఇల్లు ఓ మూలన ఉండడమా కులమంటే? వాళ్ళింటి అరుగులదగ్గరే నన్ను ఆపెయ్యడమేనా కులమంటే? నాకెప్పుడూ అర్దమవ్వలేదు. ఆ క్షణమే తెలిసింది. మా ఊరికి నాలుగు మొత్తలు లేవు ఉన్నది ఒకటే. అది వాళ్ళ ఇంటివైపే. అటువైపే సూర్యోదయమవుతుంది. మా ఇళ్లలో కురిసేవన్నీ నల్లని మేఘాలే. నాకప్పుడే అర్థమైంది వర్షాలకన్నా ముందే, ఎండలకన్నా ముందే మా ఊరి మీద కులం కురిసింది. కానీ అవసరమైనప్పుడే అది బయటకొస్తుంది.
ఆరోజు సూర్యుడు అస్తమించాక, చీకట్లో, ఒక్కదాన్నే కరిగిన మేఘంలా వర్షించాను.
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)