అస్తిత్వ సంగీతం  (Author: రేపాక రఘునందన్)

ఆ వేలు పట్టి నడిపిన

నా తొలి అడుగు.

తన గుండెలే

నా తొలి అడుగుల నేల.

నా ఊయల జోల.

శిలువైనా.. బాధ్యతల విలువగానే..

కొలిచే ప్రేమమయుడు.

స్వార్థమెరుగని దయా సంపన్నుడు.

కరుణా హృదయుడు.

నా రోల్ మోడల్.

నా వ్యక్తిత్వ గోల్డ్ మెడల్......

నా దారి దీపం.

నిత్య నూతన

శ్రమ సౌందర్యపు చైతన్య రూపం.

బాధలు పంచని

సంతోషాల పూల తోట.

యువతరాల నవీనబాట.

నా ఊపిరి ప్రదాత.

అనంత భావాల నిశ్శబ్ద కావ్యం.

తనకంటూ ఏమి మిగుల్చుకోని

తన నిరాడంబర ప్రేమ

నవ్యాతి నవ్యం.....

ఆర్థిక సంబంధాలే 

మానవ సంబంధాలైన చోట

మానవ సంబంధాల

చిలక్కొయ్యకు వేలాడుతున్న

చిరుగుల చొక్కా!?

నాన్నా! ఓ నాన్నా !!

ఏమిచ్చినీ రుణం తీర్చుకోగలను?

ఏ డాలర్ కలలతో

నీ త్యాగం కొలవగలను ?

  నీ బంగారు కొండ కోసం

కనపడని కన్నీటి కొండవైనావు.

బాధ్యతల బరువులు మోసి మోసి

అనుబంధాల పరువు కోసం

ఎన్ని అవమానాలను 

దిగమింగావో కదా!

నాన్నా ! ఓ నాన్నా !

నా బాల్యపు ఆనవాలా !

నా గుండె గుడిలో 

దివ్య రూపం నీవు.

నా ప్రతి కదలికలో

చైతన్య రూపం నీవు.

నీవే లేకుంటే

ఆ ఉనికికి అర్థమేది?

నీ ఉనికే  లేకుంటే

నా బ్రతుక్కి పరమార్ధమేది?

నా అస్తిత్వ సంగీతమా!

నా అనుబంధాల సంతకమా!!

నాన్నా ! ఓ నాన్నా !!

నీ మమకారమే 

నిలువెత్తు మానవత్వం.

నీ బాధ్యతల ప్రేమానురాగమే

నన్ను నిలబెట్టు చలన సూత్రం.

添加评论