సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్ (ప్రధాన సంపాదకులు))

గత పది రోజులూ మేము Switzerland లో కొన్ని ఊళ్ళు తిరిగాము. అది ఎంతో సుందరమైన దేశం, అందుకే మన సినిమాల్లో చాలా మటుకు అక్కడి దృశ్యాలుంటాయి అన్నది అందఱికీ తెలిసిన విషయమే. ఐతే అక్కడి అందాలన్నీ ఒక ఎత్తూ, అక్కడి శుచీ శుభ్రతా ఒక ఎత్తు. ఎక్కడికి వెళ్ళినా, ఎంత చిన్నఊరైనా, రోడ్డు మీద ఒక్క కాయితం ముక్క గానీ, చెత్త చెదారం కానీ కనిపించదు.

వెంటనే మనకొచ్చే సందేహం, మన దేశం ఎందుకంత అశుభ్రంగా ఉంటుందీ అని. ఆ సందేహానికీ, ప్రశ్నకీ వెంటనే వచ్చే సమాధానం, మన జనాభా, ఇన్ని వందల ఏళ్ళ పరాయి పరిపాలన, మన నిరంతర ఆర్ధిక సమస్యలు, ......మరోటీ, మరోటీ, మరోటీ. అంతే కాని మనకి బుధ్ధి లేదు, మనం దేశాన్ని శుభ్రంగా ఉంచడానికి ఏ విధమైన శ్రమా పడమూ అని ఒప్పుకోము.

ఉదాహరణ కింద: 1994 లో గుజరాత్ లోని సూరత్ లో ఓ మహా మారి (ప్లేగ్, Plague) వచ్చి వందలాది మంది చనిపోయారు. ఆ ప్లేగ్ రావడానికి వారాల పాటు తగ్గకపోవడానికీ ఊళ్ళోని అశుభ్రత కారణం అని తేల్చారు శాస్త్రజ్ఞులు. అప్పుడు అక్కడ ఉన్న కలెక్టరు వెంటనే ఊరంతా తిరిగి దండోరా వేసి ఒక పోటీ పెట్టాడు, ఏ ప్రాంతం, ఏ రోడ్డు, ఏ ఇలాకా వాళ్ళు వాళ్ళ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుతారో. వాళ్ళకి ఒక బహుమానమని చెప్పాడు. ఆ బహుమానం పదైనా పాతికైనా పెద్ద లెక్కలోకొచ్చేది కాదు. మా వీధి గొప్పదంటే మా వీధి శుభ్రమైనదీ అని చెప్పుకోవాలన్న పోటీతో, పౌరుషం తో ఊరంతా శుభ్రమైపోయిందట, ప్లేగ్ తగ్గిందట. ఇప్పుడా ఊరెలా ఉందో తెలియదు కానీ, చెప్పవచ్చేదేమిటంటే, ఓ మహా మారి లాంటి నెత్తి మీద తన్నే కారణం ఉంటే మనం కూడా శుచీ శుభ్రం గుఱించి పట్టించుకోగలమూ, మనం కూడా మన దేశాన్ని శుభ్రంగా ఉంచుకోగలము - లేకపొతే పట్టించుకోము అన్నది చెప్పక పోయినా అర్ధం చేసుకోవాలన్నమాట. కాబట్టి మన జనాభా కాదు, మన ఆర్ధిక స్థోమతా కాదు, మన పన్నులూ కాదు, మనమే కారణం అని ఒప్పుకోవాల్సొస్తుంది. దానికి పరిష్కారం ఎలా జఱుగుతుందో, ఏ ఉత్పాతమొస్తే జఱుగుతుందో దేవుడికెరుక.

దీనికొక కారణం మన (అర్ధంలేని) ఆధ్యాత్మికత అనిపిస్తుది. గుళ్ళోకెళ్ళి ఓ కొబ్బరికాయ కొట్టేస్తే సరి, ఎన్ని పాపాలు చేసినా, ఎంత అశుభ్రంగా ఉన్నా అవన్నీ కడుక్కుపోతాయీ అని. ఇది ఆధ్యాత్మికత కాదూ, ఏమీ కాదూ కేవలం పలాయనవాదం (escapism) అని చెప్ప గల వాళ్ళు దొరకరు. మోడీ గారి స్వఛ్ఛ భారత్ ఉద్యమం ఏమైందో మఱి.

ఆగష్ట్ పదిహేను భారత దేశ స్వాతంత్ర దినం సందర్భంగా ఈ సంచిక చదువరులందఱికీ అభివందనలు. ఈ సందర్భంగా 'స్వ్సర్ణిం భారత్ యాత్ర ' (Swarnim Bharat Yatra) పేరుతో ఢిల్లీ సఫ్దర్ జంగ్ స్టేషన్ నుంచి ఒక ప్రత్యేక యాత్రా రైలు బయలుదేర్తుందట. ఆ రైలు దేశం లోని కొన్ని చారిత్రిక ప్రదేశాలు పర్యటిస్తుందట. ఢిల్లీ నుంచి మద్రాసుకి రెండే రెండు రైళ్ళుండే పరిస్థితి (అరవై ప్రాంతాలలో) నుంచి మన రైళ్ళ పరిస్థితి ఎంతో మెఱుగైంది.

ఆ సువార్తతో 'శెలవు'.

0 Reacties