వెలుతురు పంట  (Author: కొమురవెల్లి అంజయ్య)

ఆకాశం రాల్చిన చెమట

చినుకులు చినుకులుగా, ధారలు ధారలుగా

చెమట ఎప్పుడూ సృజనకారి

మట్టి పాలైనా ఊరికే ఉండదు

తడిపి తనువును తల్లిని చేస్తది

పచ్చని వెలుతురు పంటలను ఖాయం చేస్తది 

ఆకాశం శూన్యమంటారు, నమ్మ బుద్ధేయదు

గ్రహ నక్షత్రాదులన్నీ సంచరిస్తున్నవి శూన్యంలోనే

మనకక్కడ గాలాడదు కానీ

లెక్క కట్టలేనంత కాలం నుంచి అవక్కడే

గ్రహ పీడల మాటేమో కానీ

సూర్యచంద్రాదులన్నీ భూమి తోబుట్టువులే

చీకటి, వెలుతురు పంటలు పండించేవవే 

పండించే వాడిదే పంట అన్నదిక్కడా వర్తించదు

పంచభూతాలు, గ్రహాలన్నీ దానకర్ణులే

మనుషులకు తప్ప జీవులకు లేదు అత్యాశ

వాటి సుగుణాలు మనకబ్బితే

పెత్తనం పోకడలు విడనాడితే

సృష్టిలోనివన్నీ జీవిస్తాయి సుఖ సంతోషాలతో

0 Reacties