లక్ష్యం
లక్ష్యం (Author: కోరుకొండ వెంకటేశ్వర రావు)
నా ఈ జీవన చరమాంకపు సంధ్యా సమయంలో...
సన్నగిల్లిన కను చూపుతో, సహకరించని దేహంతో,
జోరీగల్లా వెన్నాడి వేధిస్తున్న భూత కాలపు జ్ఞాపకాలతో
తడబడుతూ ఊరి శివారు ఏటి ఒడ్డున కూలబడ్డాను;
కళ్ళ ముందు కదలాడింది గడచిన జీవన యానం!
హాయిగా సాగిన బాల్యం, మెరుపులా మెరిసిన యవ్వనం...
పెద్దల పోరుతో పెళ్లి... వరుసగా పుట్టుకొచ్చిన పిల్లలు...
అయోమయంలో ఎదురీదక తప్పని సంసార సాగరం!
కోడళ్ల కలహాలతో ముక్కలైన ఉమ్మడి కుటుంబం...
అందరూ ఉన్నా, అనాధలుగా మిగిలిన మేమిద్దరం!
ఎవరి కోసమూ ఆగక పరుగులు తీసిన కాలచక్రం...
పదవీ విరమణ… వెనువెంటనే భార్యా వియోగం!
బీటలు వారిన ఒకనాటి ఆ ఆనంద నిలయంలో
నాకంటూ మిగిలిన ఒంటరితనం, ఏకాకి జీవితం...!
సూర్యుడు పడమటి కొండల్లోకి జారుకునే ఈ వేళ...
దైవ సన్నిధికి చేరాలని నే తీసుకున్న తుది నిర్ణయం!
స్వాగతం పలుకుతూ ఎదురుగా పాడుబడ్డ బావి…
మృత్యువు ఒడిని చేరబోయే ఆ చిట్ట చివరి క్షణాల్లో...
దూరంగా మోగుతూ ఆగిన గుడిగంటల సవ్వడి...!
దరిదాపుల్లో కేర్ కేర్ మంటూ ఏదో అలికిడి...
పొదలలో దోగాడుతున్న ఓ చిన్నారి ఆక్రందన…!
చెమర్చిన నా మసక కళ్ళలో మెరిసిన ఓ వింత కాంతి...
ఏదో నవ జీవన రాగం నాలో చిగురించిన భావన…!
బోసి నవ్వుల ఆ పాపని ఆత్రంగా గుండెలకు హత్తుకొని
నా ఆనంద నిలయం వైపు వడిగా అడుగులు వేసాను!