మానవతా పరిమళం  (Author: ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి)

అమ్మవారి గుడిముందు టాక్సీ ఆగింది. అపూర్వ, పిల్లలు టాక్సీ దిగారు. తల ఎత్తి గుడి శిఖరం చూసి నమస్కరించింది అపూర్వ. పదిహేను సంవత్సరాల క్రితం డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ గుడికి వచ్చింది. అప్పటికీ, ఇప్పటికీ గుడి చాలా మారింది. పాత సత్రవ స్థానే, పెద్దది కొత్త సత్రవ కట్టారు. అన్నదానం బోర్డు కనిపించింది అప్పుడు ఒక కాఫీ హోటల్ ఉండేది. మధ్యాహ్నం లీజర్ లో ఇక్కడికి వచ్చి దోసె తినేది. తనతో కాత్యాయిని కూడా వచ్చేది. చాలా అల్లరిపిల్ల. ‘దోసె సరిగా కాలలేదని, చట్నీ లో ఉప్పు తక్కువ అయ్యిందని’ గొడవ చేసేది. హోటల్ అతను ఏమీ అనీ వాడు కాదు. కాలేజీ పిల్లలతో గొడవ ఎందుకని.

                 ఇప్పుడు ఆ హోటల్ లేదు. దాని పక్కనే గోశాల కట్టారు. చెట్లు అన్నీ కొట్టేసి ప్రాంగణం విశాలం చేసారు. మార్పు మంచిదే అనిపించింది. తానూ మారిందిగా. అప్పటిలా సన్నగా లేదు. బొద్దుగా తయారు అయ్యింది. డాక్టర్ ‘కొంచెం బరువు తగ్గాలి మీరు’ అంటున్నాడు. అదే కుదరటం లేదు. చిన్నగా నిట్టూర్చింది అపూర్వ. నెమ్మదిగా కొబ్బరికాయలు, పళ్ళు అమ్మే దుకాణం దగ్గరకు వెళ్ళింది.

         “రండి మేడం. పూజా సామగ్రి సెట్టు ఇమ్మంటారా?” అడిగాడు అతను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, కుంకుమ పాకెట్, జాకెట్ గుడ్డ, పువ్వులు, అగరవత్తులు, కర్పూరం, ఎర్ర గాజులు అన్నీ వెదురుబుట్టలో సర్ది ఉన్నాయి.

         “ఎంత?” అడిగింది అపూర్వ.

         “నూట ఏభై మేడం” అన్నాడు అతను.

                 అయిదువందల నోటు తీసి ఇచ్చింది అతనికి. గల్లాపెట్టెలోంచి చిల్లర తీసి ఇస్తూండగా అతన్ని పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయింది అపూర్వ. పూజా సామగ్రి బుట్ట, చిల్లర అపూర్వకిచ్చి“థాంక్స్ మేడం” అన్నాడు అతను. తల పంకించి ముందుకు నడిచి, రాజగోపురం దాటగానే కళ్ళకున్న నల్ల అద్దాలు తీసి హ్యాండ్ బాగ్ లో పెట్టుకుంది అపూర్వ.

                 ప్రదక్షిణం చేస్తూ ఉపాలయాలలో కూడా వచ్చిన మార్పు చూసింది అపూర్వ. కళ్యాణమండపం అలాగే ఉంది మారలేదు. రంగులు వేసారు. ప్రదక్షిణ పూర్తీ చేసి గుడి లోపలకు వెళ్ళింది. పిల్లలు ఇద్దరూ ఆమె వెనకే వచ్చారు. నూట రెండు స్తంభాల మండపం చూసి పిల్లలు అబ్బురపడ్డారు.“మమ్మీ, చాలా బాగుంది మండపం” అన్నారు ఇద్దరూ. చిన్నగా నవ్వింది అపూర్వ. శివ దర్శనం అయ్యాకా, మహిషాసురమర్ధిని గుడికి వచ్చింది. పూజారి రామశర్మ ఆమెని చూసి గుర్తుపట్టి పలకరింపుగా నవ్వాడు.

         “పూజ చేయించుకుంటావా? మామూలు దర్శనమేనా?” అడిగాడు రామశర్మ.

         “కుంకుమపూజ చెయ్యి. చాలా కాలమయ్యిందిగా వచ్చి” అంది అపూర్వ.

                 రామశర్మ జవాన్ని పిలిచి, చాపలు వెయ్యమని చెప్పాడు. జవాను మూడుచిన్న ప్లాస్టిక్ చాపలు తెచ్చి వేసాడు. అపూర్వ, పిల్లలు వాటిమీద కూర్చున్నారు. పూజ అయ్యేసరికి అరగంట పట్టింది. పూజ చేసిన కుంకుమ, ప్రసాదం ఇచ్చాడు రామశర్మ. అమ్మవారి పాదాల వద్ద పెట్టిన గాజులు అపూర్వకి ఇచ్చాడు. వాటిని కళ్ళకు అడ్డుకుని చేతులకి వేసుకుంది అపూర్వ.

         “ఎక్కడ ఉంటున్నావు, బెంగుళూరేనా?” అడిగాడు రామశర్మ.

         “ఆ.. ప్రస్తుతం అక్కడే” అంది నవ్వుతూ అపూర్వ. పిల్లలు ఇద్దరూ తల్లి కేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి ఈయన మమ్మీతో ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు అని.“శర్మా, నీతో మాట్లాడాలి” అంది అపూర్వ.

         “ అలాగే. ఒక్క ఐదు నిముషాలు కళ్యాణమండపం దగ్గర కూర్చో. నా అసిస్టెంట్ ఆఫీస్ లోకి వెళ్ళాడు.

         అతను రాగానే ‘డ్యూటీ’ అతనికి అప్పగించి వస్తాను” అన్నాడు రామశర్మ. అమ్మవారికి మరోసారి నమస్కారం పెట్టుకుని, బయటకు వచ్చి కళ్యాణమండపం మెట్ల మీద కూర్చుంది అపూర్వ. అప్పుడు అడిగారు పిల్లలు“ఆయన నీకు బాగా తెలుసా?” అని.

         “ఆయన డిగ్రీ లో నా క్లాస్ మేటు” అని చెప్పింది అపూర్వ వాళ్ళతో. తర్వాతపిల్లలు రాజగోపురం మీద ఉన్న రంగు రంగుల శిల్పాల్ని ఆసక్తిగా చూస్తూ, ఫోనులో ఫోటోలు తీస్తున్నారు.

                  ఇందాకా పూజా సామగ్రి ఇచ్చిన వ్యక్తి ఆమె కళ్ళముందు కదిలాడు. ఆవేశంతో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. గుండె దడ దడా కొట్టుకుంది.

                  ఆమెకి గతం ఒక్కసారి గుర్తుకు వచ్చింది.

          ****

                 అపూర్వది జగన్నాధపురం. హై స్కూల్ చదువు, ఇంటర్మీడియట్ మార్టేరులో పూర్తీ చేసింది. శివపురం లోని డిగ్రీ కళాశాలలో బి. ఎస్. సి. లో చేరింది. జగన్నాధపురం నుండి శివపురం అయిదు కిలోమీటర్ల దూరం. జగన్నాధపురానికి, శివపురంకి మధ్యలో ఉంది మార్టేరు. రోజూ ఇంటి దగ్గర నుండి శివపురం సైకిల్ మీద వచ్చేది అపూర్వ. మార్టేరు నుండి కూడా కొంతమంది ఆడపిల్లలు సైకిళ్ళమీద శివపురం వచ్చి చదువుకునేవారు.

                 డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది అపూర్వకి. శ్రీకాంత్ నాన్నగారు సోమసుందర్ గారు మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్త. బాపట్ల నుండి బదిలీ మీదమార్తేరు వచ్చారు.

         శ్రీకాంత్ కూడా రోజూ సైకిల్ మీద మార్టేరు నుండి శివపురం వచ్చేవాడు. శ్రీకాంత్ మంచి చిత్రకారుడు. అబ్దుల్ కలాం గారి పెయింటింగ్ వేసి ప్రిన్సిపాల్ సంజీవరావు గారికి ఇచ్చాడు. ఆయన దానిని తన ఆఫీస్ రూమ్ లో పెట్టుకున్నారు.

                 శ్రీకాంత రోజూ మార్టేరు వంతెనమీద అపూర్వ కోసం ఆగిఉండేవాడు. జగన్నాధపురం నుండి అపూర్వ వచ్చాకా ఇద్దరూ సైకిళ్ళ మీద వస్తూ కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ కి వచ్చేవారు.

                  పేరుకి తగినట్టుగా అపూర్వ చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ క్లాసులోనే రామశర్మ, శేషగిరి కూడా ఉన్నారు. ఒక రోజు కాలేజీ అయ్యాకా, సైకిల్ తీసుకుని బయల్దేరుతుండగా శేషగిరి, అపూర్వ దగ్గరకు వచ్చి

         “నువ్వంటే నాకు చాలా ఇష్టం” అని అన్నాడు. అతని చేతిలో ఎర్రని గులాబీ ఉంది. అపూర్వకు చాలా చిరాకు వేసింది.

         “చూడు గిరీ, మనం ఇక్కడకు చదువుకోవడానికి వచ్చాం. అంతేగానీ ఇటువంటి వెకిలి వేషాలకు కాదు. నాకు ఇటువంటివి నచ్చవు” అని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయింది. శేషగిరి నిరాశతో వెనుదిరిగాడు. అయినా తన ప్రయత్నం మానలేదు. ఒక ప్రేమలేఖ రాసి లంచ్ టైం లో, అపూర్వ లేడీస్ వెయిటింగ్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆమె నోట్స్ బుక్ లో పెట్టాడు. శేషగిరి నాలుగురోజులు కష్టపడి, అందమైన పదాలు సేకరించి ఆ ప్రేమలేఖ తయారు చేసాడు. ఆరోజు ఇంటికి వెళ్ళాకా చూసింది ఆ లేఖని అపూర్వ.

                 ‘ఇదేమిటి, ఇతను ఇక్లా తయారవుతున్నాడు? రెండు నెలల్లో పరీక్షలు ఉన్నాయి. కష్టపడి చదువుతుంటే ఈ తలనొప్పి ఏమిటి? ’ అని తీవ్రంగా ఆలోచించి, మర్నాడు ప్రిన్సిపాల్ సంజీవరావు గారిని కలిసి, శేషగిరి రాసిన ప్రేమలేఖ ఇచ్చి, అతను తనని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది.

                 ఆయన వెంటనే శేషగిరిని, తన రూమ్ కి పిలిచి గట్టిగా చివాట్లు పెట్టారు. ‘” అపూర్వకి ‘సారీ’ చెప్పు.

         లేకపోతే టి. సి. ఇచ్చి కాలేజీ నుండి పంపించేస్తానని’ వార్నింగ్ ఇచ్చారు. తప్పని పరిస్థితులలో అపూర్వకి

         ‘సారీ’ చెప్పి, అవమానభారంతో బయటకు వచ్చాడు శేషగిరి.

                  అప్పటినుండీ అపూర్వ మీద కక్ష తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ‘ఆమె మొహం మీద ఆసిడ్ పోసి, ఆమె అందాన్ని నాశనం చేయాలనుకున్నాడు’. కానీ తను రెడ్ హెన్దేడ్ గా దొరికిపోతాడు. తను సీన్ లోకి రాకుండా, ఆమె మీద పగ తీర్చుకుని, ఆమె జీవితాంతం కుమిలిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతనికొక ఆలోచన్ స్ఫురించింది.

                  దేగ్రే ఫైనల్ ఇయర్ పరీక్షలు పదిరోజులుండగా కాలేజీకి వెళ్ళిన అపూర్వ, శ్రీకాంత్ లు కాలేజీ గేటు దగ్గర విద్యార్ధులు గుమిగూడి ఉండడం చూసి సైకిళ్ళు దిగి అటు వెళ్ళారు. కాలేజీ గోడ మీద, ఒక అమ్మాయి, అబ్బాయి బొమ్మలు వాటి కింద, శ్రీకాంత్, అపూర్వల పేర్లు ఉన్నాయి. బొమ్మలకి పైన ‘ప్రేమ పక్షులు’ అని రాసి ఉంది. దాని పక్కనే మరొక బొమ్మ ఉంది, రెండు సైకిళ్ళు మీద ఇద్దరు వెళ్తున్నట్టుగా. బొమ్మల కింద

         శ్రీకాంత్, అపూర్వ అని ఉంది. పైన ‘జోరుగా హుషారుగా సాగిపోదామా’ అని రాసి ఉంది. శ్రీకాంత్, అపూర్వలని

         చూడగానే పిల్లలు అందరూ ఘోల్లున నవ్వారు.

                  కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి అపూర్వకి. వెంటనే సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చేసింది. శ్రీకాంత్ తల వంచుకుని క్లాసుకి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపాల్ కి ఈ విషయం తెలిసి, జవానుని తీసుకువచ్చి, గోడ అంతా శుభ్రం చేయించారు. ఈ వికృత చేష్టలు శేషగిరి చేయించాడని ఆయన గ్రహించారు. సాక్ష్యం కోసం ప్రయత్నాలు

         మొదలుపెట్టారు ఇంటికెళ్ళిన అపూర్వ ఆరోజల్లా బాధపడుతూనే ఉంది. ఇది శేషగిరి పనే, అని ఆమెకి అర్ధం అయ్యింది. రాత్రల్లా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మర్నాడు ఒక్కతే సైకిల్ మీద కాలేజీ కి వచ్చింది.

         శేషగిరి కూడా వచ్చాడు, ఏమీ ఎరగనట్టు. తర్వాత పరీక్షల మీద దృష్టిపెట్టింది. పరీక్షలు బాగా రాసింది.

                 ఒకరోజు రామశర్మ అపూర్వ వాళ్ళ ఇంటికి వచ్చాడు.“ అపూర్వా, ఆ గోడ మీద రాతలు శేషగిరే

         రాయించాడట. తణుకు నుండి పెయింటర్లను తీసుకువచ్చి రాయిన్చాడని, శేషగిరి ఫ్రెండ్ వెంకటేష్ నిన్ననే నాకు చెప్పాడు” అన్నాడు రామశర్మ.“ఇది అతని పనే అని నేను ఊహించాను. భగవంతుడు వాడికి సరి అయిన శిక్ష వేస్తాడు” అంది అపూర్వ.

                 తర్వాత అపూర్వ ఎం. సి. ఏ. చదవడానికి వైజాగ్ వెళ్ళడం, ఆతర్వాత బెంగుళూర్ లో ఉద్యోగం రావడం, కొంతకాలానికి కొలీగ్ రాజేష్ తో పెళ్లి జరగడం చాలా వేగంగా జరిగిపోయాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత శేషగిరి గుడి ముందు షాపులో కనిపించాడు. అపూర్వ రూపు రేఖలు మారిపోవడం, నల్ల కళ్ళఅద్దాలు ఉండడం వలన ఆమెని గుర్తించలేకపోయాడు. రామశర్మ రెండు మూడు సార్లు అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వలన ఆమెని తేలికగా గుర్తు పట్టాడు.

                  రామశర్మ రావడంతో ఆమె ఆలోచనలు ఆగాయి. గుడి జవాన్ ని పిలిచి, అపూర్వ పిల్లలు ఇద్దరినీ గాలి గోపురం ఎక్కించి తీసుకురమ్మనమని చెప్పాడు. ఏడు అంతస్తులు ఉన్న ఆ గాలి గోపురంలో లోపల మెట్లు ఉన్నాయి, పైకి వెళ్ళడానికి.

         “బాగున్నావా అపూర్వా, మీ వారిని తీసుకురాలేదేం?” అడిగాడు రామశర్మ.

         “ఆయన వాళ్ళ బంధువుల్ని చూడటానికి అమలాపురం వెళ్ళారు. అవునూ, బయట షాపులో ఉన్నది శేషగిరేనా?” అడిగింది అపూర్వ. ఆమె ప్రశ్నకి దీర్ఘంగా నిట్టూర్చాడు రామశర్మ.

         “ అవును వాడే. నీ పట్ల ప్రవర్తించిన అమానుషచర్యకి దేవుడు వాడికి సరైన శిక్షే వేసాడు. డిగ్రీ అత్తెసరు మార్కులతో పాస్ అయ్యాడు. వాళ్ళ నాన్న ఇక్కడే రైస్ మిల్లు లో గుమాస్తాగా పనిచేసేవారు. అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కుటుంబబాధ్యత వీడిమీద పడింది. ఒక కాన్వెంట్లో గుమాస్తాగా చేరాడు. అతికష్టం మీద చెల్లెలు పెళ్లి చేసాడు. తర్వాత తనూ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు.

         కరోనా సమయంలో వాళ్ళ కాన్వెంట్ యజమాని చనిపోయాడు. కన్వెంట్ మూతపడింది. గత్యంతరం లేక భార్యా, తనూ ఇంటి దగ్గరే ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచింది. ట్యూషన్ కి పిల్లలు రావడం తగ్గిపోయింది. ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి దుహ్ఖించాడు. ’శర్మా, నేను అపూర్వ జీవితాన్ని అపహాస్యం పాలు చేయాలని చాలా దుర్మార్గంగా, నీచంగా ప్రవర్తించాను. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఒక్క పూటే తింటున్నాము. నా పిల్లల్ని చూస్తె చాలా బాధ కలుగుతోంది. నువ్వే, నాకు ఏదో దారి చూపించాలి” అని వేడుకున్నాడు. నేను జాలిపడి, మా గుడి ఈ. వో. గారికి చెప్పి ఆ షాపు ఇప్పించాను. షాపు చూసుకుంటూ జాగ్రత్తగా బతుకుతూ ఉంటే, మరో పెద్ద కష్టం వాడి మెడకు చుట్టుకుంది” బాధగా అన్నాడు రామశర్మ.

         “ఏమయ్యింది?” అడిగింది అపూర్వ.

         “ ఆర్నెల్లక్రితం పిల్లల గురించి శేషగిరి, భార్యా వాదులాడుకున్నారు. ఇద్దరూ ఆడపిల్లలేగా, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఇప్పటినుండీ పొదుపు చేయమని ఆవిడా, తర్వాత చూద్దాం, అని వాడూ కేకలేసుకున్నారుట.

         ఆమెకి బి. పి. పెరిగిపోయి ‘పక్షవాతం’ వచ్చింది. ఆమె బి. పి. పేషెంట్. నాలుగురోజుల నుండి టాబ్లెట్లు వేసుకోలేదుట. ఎదో వైద్యం చేయించాడు. కానీ తగ్గలేదు. ఆమె ఎడమకాలు, ఎడమచెయ్యి పనిచెయ్యడం లేదు. రోజూ శేషగిరి, వాళ్ళ ఆవిడ అవసరాల్ని చూసి, వంట చేసి, పిల్లలని స్కూల్ కి పంపి, అప్పుడు షాపుకి వస్తున్నాడు. కేరళ మూలికా వైద్యం చేయిస్తే, తగ్గుతుంది అని సలహా చెబుతున్నారు. కనీసం రెండు నెలలు అక్కడ ఉండాలి. వైద్యానికి, కుటుంబం గడవడానికి చాలా డబ్బు కావాలి. శ్లేష్మంలో పడ్డ ఈగలా, కొట్టుకుంటున్నాడు” అన్నాడు రామశర్మ. అప్పటికి పిల్లలు ఇద్దరూ గోపురం చూసి వచ్చారు.

         “వస్తాం శర్మా, రాత్రే మా ప్రయాణం. నువ్వూ, మీ ఆవిడా ఒకసారి బెంగుళూరు రండి” అని చెప్పి గుడి బయటకు వచ్చి, పిల్లలతో టాక్సీ ఎక్కి జగన్నాధపురం వెళ్ళిపోయింది అపూర్వ. రాత్రి భర్తా, పిల్లలతో తణుకు వెళ్లి శేషాద్రి ఎక్సుప్రెస్సు ఎక్కింది అపూర్వ.

                 రైలులో రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉంది అపూర్వ. ‘శేషగిరి తనని ఎంత హింసించాడు? తన జీవితాన్ని మరకలతో నింపాలని నీచంగా ప్రవర్తించాడు. తను అప్పుడు ధైర్యంగా నిలబడింది. లేకుంటే తన జీవితం ఏమైపోయేది? అతని దుర్మార్గానికి తగిన ఫలితం అనుభవిస్తున్నాడు’ అని తలపోసింది.

                  కానీ శేషగిరి భార్యా, పిల్లలూ దీనంగా ఆమె కళ్ళ ముందు కదలాడారు. వాళ్ళ తప్పు లేకపోయినా,

         వాళ్ళు కష్టాలుపడుతున్నారు. శేషగిరి దుర్మార్గానికి వాళ్ళు బాధ్యులు కాదుకదా? అన్న భావన ఆమెలో కదలాడింది. అపూర్వ అలా ఆలోచిస్తూ, తెల్లవారు ఝామున నిద్రపోయింది.

                  ఒక వారం గడిచింది. రామశర్మ గుడి కట్టేసి వెళ్ళేటప్పుడు, శేషగిరిని కలిసాడు.

         “గిరీ, నీకో శుభవార్త. మా బంధువులు అమెరికాలో ఉన్నారు. వారికి నీ పరిస్థితి గురించి చెప్పాను. నీకు సహాయం చెయ్యమని, వాళ్ళు నా పేరుమీద ఒక లక్ష రూపాయలు పంపారు. రేపు బ్యాంకుకి వెళ్లి ఆ డబ్బులు పట్టుకువచ్చి నీకు ఇస్తాను. నువ్వునీ భార్యని, కేరళ తీసుకువెళ్ళు. అక్కడ మూలికా వైద్యం చేయించు. నీ పిల్లలని మా ఇంటిలో ఉంచు. నేనూ, మా ఆవిడా వాళ్ళని జాగ్రత్తగా చూస్తాం. షాపు కూడా చూడమని ఒక కుర్రాడికి పురమాయించాను. వాడు జాగ్రత్తగా నీ షాపు చూస్తాడు. నువ్వుకేరళ నుండి వచ్చాకా, నీ షాపు నువ్వే నడుపుకుందువు గాని. ధైర్యంగా ఉండు” అన్నాడు రామశర్మ.

                 ఆ మాటలకి, శేషగిరి మొహం ఆనందంతో నిండి పోయింది.“మీ బంధువులకి నేను జీవితాంతం ఋణపడి ఉంటాను. వారికి నా నమస్కారాలు చెప్పు. నీలాంటి మిత్రుడు ఉండడం నా అదృష్టం” అన్నాడు రెండు చేతులూ జోడించి.

                  ‘అపూర్వే నీకు సాయం చేస్తోంది’ అని చెప్పలేదు రామశర్మ. తన పేరు చెప్పవద్దని అపూర్వ, రామశర్మ దగ్గర మాట తీసుకుంది.

          *****

0 Reacties