తప్పెవరిది...  (Author: ఉప్పల పద్మ)

       రత్న తన ఆఫీసు బయట నిలబడి అటూ ఇటూ చూస్తుంది. వచ్చీపోయే వాహనాల రణగొణ ధ్వనులు ఒక వైపు, 'ఎవరికి వారు యమునా తీరే' అన్నట్లుగా పరుగులు పెడుతున్న జనాలు మరో వైపు. మధ్య మధ్యలో చల్లగా తన తల వెంట్రుకలను తాకి వెళుతున్న చిరుగాలి. ఊగిసలాడుతున్న ముంగురులను సరిచేసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాల్సిన వస్తువుల జాబితాను గుర్తు చేసుకుంటుండగా

"రత్నా! కమ్!" అంటూ పిలుపు వినబడింది.

"అబ్బా! ఇంతసేపా! ఎప్పుడూ ఇంతే వెయిట్ చేయిస్తవేమిటి శ్రీకాంత్" అన్నది రత్న తన భర్తతో.

"ట్రాఫిక్ జామ్ అలా ఉంది నేనేం చేయను?" అన్నాడు భర్త శ్రీకాంత్.

"సరే! సరే! పద.. ఇప్పటికే ఆలస్యమైంది. సూపర్ మార్కెట్ కి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకొని కార్తీ స్కూల్ దగ్గరకు వెళ్లాలి" అని రత్న, శ్రీకాంత్ బైక్ ఎక్కి కూర్చుంది.

రత్న, శ్రీకాంత్ ఇద్దరూ మార్కెట్లో కావలసినవి తీసుకుని కార్తీ స్కూలుకు చేరుకున్నారు. స్కూలు గేటు దగ్గరే నిలబడ్డ కార్తీని చూసి రత్న

"కార్తీ! కార్తీ! నిన్నేరా పిలిచేది! ఒక పట్టాన వీడు పలకడు. రారా త్వరగా బైక్ ఎక్కి కూర్చో!" అన్నది.

"ఊ" అంటూ వచ్చి బైక్ ఎక్కాడు కార్తీ.

"డాడీని పట్టుకోరా కదలకు" అన్నది రత్న.

రత్న, శ్రీకాంత్ లకు కార్తీ ఒక్కగానొక్క కొడుకు. కార్తీకి ఆరేండ్ల వయసు. కిండర్ గార్డెన్ చదువుతున్నాడు.

కాసేపటికి ముగ్గురూ ఇల్లు చేరుకున్నారు.

ఇంట్లోకి వచ్చీ రాగానే కార్తీ రూమ్ లోకి దూరాడు. రత్న వంటింట్లోకి, శ్రీకాంత్ బెడ్ రూమ్ లోకి వెళ్ళారు.  

              * * *

కొంచెం సేపటి తర్వాత

"కార్తీ! పద, స్నానం చేయిస్తాను". కార్తీ నుండి ఎటువంటి సమాధానం లేదు.

"అబ్బా! వీడితో పడలేక చస్తున్నాను. ఉలకవు పలకవు.. ఏంట్రా నీతో ఎలా వేగేది?" అంటూ చేయి పట్టుకొని కార్తీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ పక్కకు పెట్టి బాత్రూంలోకి తీసుకెళ్ళింది రత్న. స్నానం పూర్తవగానే రత్న పాలు తెచ్చి తాగమని కార్తీ చేతికిచ్చింది. కార్తీ చేతిలోకి మళ్లీ చేరింది సెల్లు.

"కర్మ! కర్మ! ఏంట్రా కార్తీ నువ్వు? సెల్ ఫోన్ తప్ప మరో లోకమే లేకుండా అయిపోయావు. ఇటివ్వు సెల్లు" అని రత్న గుంజుకుంటుంటే కార్తీ ఏడవడం మొదలుపెట్టాడు.  

"ఏడవకురా" ఇదిగో! సెల్లు. నేనే తాగిస్తానులే, అంటూ పాలు తానే తాగించింది రత్న.

కార్తీ మాత్రం సెల్లును వదల్లేదు.

"తనకు, శ్రీకాంత్ కు కాఫీ కలుపుకొని శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి నాకు భయమేస్తుంది, రాను రాను వీడు మరీ మొండిగా తయారవుతున్నాడు. సెల్ తప్ప మరో ధ్యాస లేకుండా అయిపోతుంది" అన్నది రత్న.

"ఏం చేస్తాం రత్న! సంవత్సరం వయసున్నప్పటి నుండే వాడికి సెల్లునివ్వడం మొదలు పెట్టాం. వాడికి అదొక ఆట వస్తువు అయిపోయింది. అది సర్లే కానీ ఇంతకీ మీ మేనేజర్ తో మాట్లాడావా?"అని అడిగాడు శ్రీకాంత్.

"ఆ చెప్పడం మర్చిపోయాను. రేపటినుంచి కార్తీ స్కూల్ కి సెలవులు వర్క్ ఫ్రం హోం చేస్తానని చెప్పాను. ఆయన సరేనన్నారు."

"హమ్మయ్య! హ్యాపీ అన్నమాట. మన సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఈ వర్క్ ఫ్రం హోం ఒక వెసులుబాటు అయిపోయింది. రేపటినుండి నువ్వు ఇంట్లో నుండి వర్క్ చేస్తూ కార్తీని చూసుకోవచ్చు" అని శ్రీకాంత్ అనగానే అవునని తలూపుతూ రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేస్తానంటూ రత్న వంటింట్లోకి వెళ్ళింది.

"కార్తీ! మనిద్దరం కాసేపు ఆడుకుందాం రా నాన్నా!" అన్నాడు కార్తీ దగ్గరికి వెళ్లి శ్రీకాంత్.

"ఊ నేను రాను, నేను సెల్ ఫోన్ తోనే ఆడుకుంటాను" అన్నాడు కార్తీ.

చేసేది లేక శ్రీకాంత్ కూడా తన సెల్ ఫోన్ చాట్స్ చూడడంలో మునిగిపోయాడు.

కాసేపటి తర్వాత రత్న "కార్తీ! అన్నం తిందువు రా! నాన్నా!" అని ఎంత పిలిచినప్పటికీ కార్తీ హాల్లోకి రాలేదు. ప్రతిరోజులాగే అన్నం తినిపించడం తప్పలేదు రత్నకి. కార్తీ కి తినిపించి, బలవంతంగా సెల్ ఫోన్ పక్కకు పెట్టించి రత్న, శ్రీకాంత్ లు కూడా భోజనం చేసి పడుకున్నారు.

                  * * *

అర్ధరాత్రి ఒంటిగంట అవుతోంది.  

"గన్ నాదే! గన్ నాదే! నేనే విన్నర్! నేనే విన్నర్!" అన్న అరుపుల శబ్దానికి రత్న, శ్రీకాంత్ ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు. కార్తీ గొంతులో నుంచి వస్తున్న ఆ అరుపులు ఇంకా ఆగలేదు.

కార్తీ కళ్ళు తెరిచినట్టే తెరిచి మళ్లీ మూసాడు. మరి కాసేపటికి మళ్ళీ అరుపులు "నువ్వు చెప్పినట్టే చేస్తాను! నువ్వు చెప్పినట్టే చేస్తాను!" కార్తీ పలవరింతలకు రత్న, శ్రీకాంత్ లకు జాగారం తప్పలేదు.

తెల్లవారింది. రోజువారీ దినచర్యలో భాగంగా శ్రీకాంత్ టిఫిన్ చేసి ఆఫీసుకు వెళ్లిపోయాడు. రత్న, కార్తీకి టిఫిన్ తినిపించి ఆఫీస్ పనిలో భాగంగా కంప్యూటర్ ముందు కూర్చుంది. ఇక ఎప్పటిలాగే కార్తీకి సెల్ ఫోన్ తోడయ్యింది. రోజులు గడుస్తున్నాయి..

"శ్రీకాంత్! కార్తీ కళ్ళు ఎరుపుగా కనిపిస్తున్నాయి. వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం. అప్పుడప్పుడు కళ్ళు బాగా నలుస్తున్నాడు. అసలేంటో ఈమధ్య నాలుగు సార్లు పిలిచినా ఒకసారి పలకటం లేదు. ఒక్కసారి ఈ. ఎన్. టీ స్పెషలిస్టుకు చూపిద్దాం ఏమంటావు" అన్నది.

"అవును రత్న. నాక్కుడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకుంటాను" అన్నాడు శ్రీకాంత్.

డాక్టర్ దగ్గరకు కార్తీని తీసుకెళ్లారు.  

కార్తీని పరీక్షించిన డాక్టర్ "ఈ బాబుకు సెల్ ఫోన్ చూసే అలవాటుందా? ఉంటే ఎప్పటి నుండి?" అన్నాడు.

"అంటే అదీ... డాక్టర్... ఆ.. అలవాటు.. ఉంది. అంటే చిన్నప్పుడు బాగా సతాయించినప్పుడల్లా సెల్ ఫోనులో కార్టూన్ షోలు పెట్టి చేతికి ఇచ్చేవాళ్ళం" అన్నది రత్న.

"అదే చిన్నప్పుడు అంటే ఏ వయసు నుండి?"అన్నాడు డాక్టర్.

"అంటే సుమారుగా సంవత్సరం నుండి సెల్ ఫోను కార్తీకి పరిచయం డాక్టర్. ఆ అలవాటు ఇప్పుడు బాగా పెరిగిపోయింది. మాకు ఎలా తగ్గించాలో అర్థం కావట్లేదు" అన్నాడు శ్రీకాంత్.

"ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లలను ఎలా ఆడించాలో తెలియటం లేదు. అమ్మమ్మలు నాయనమ్మలు, తాతల ఆలనాపాలనకు పిల్లలు నోచుకోవడం లేదు. సెల్ ఫోన్ పిల్లల చేతికిచ్చి వారి వారి పనులు చూసుకుంటున్నారు ఇప్పటి తల్లిదండ్రులు. దీని పర్యవసానం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుతం కార్తీ పరిస్థితి ఇబ్బందిగా ఉందనే చెప్పాలి. ఆరేళ్ల వయసుకే కంటికి అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి అతడిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాగే సెల్ ఫోన్ వాడుతూ పోతే కనుక ఆ పిల్లవాడి కంటి నరాలు మొత్తం దెబ్బతిని చూపు పూర్తిగా మందగిస్తుంది. అంతే కాదు, ఇప్పటికి అతడికి ఏర్పడిన వినికిడి లోపానికి హియరింగ్ మిషన్ అవసరం లేదు. మందులు రెగ్యులర్గా వాడితే సరిపోతుంది. కానీ పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో తప్పనిసరి మిషన్ అవసరమవుతుంది. కొన్ని మందులు రాసిస్తున్నాను ఇవి కచ్చితంగా క్రమం తప్పకుండా వాడండి" అని ప్రిస్క్రిప్షన్ శ్రీకాంత్ చేతికిచ్చాడు డాక్టర్.

ఇంటికి చేరుకున్నారు రత్న, శ్రీకాంత్ లు.

ఇంటికి రావడమే ఆలస్యం కార్తీ రూమ్ లోకి వెళ్లి సెల్ ఫోన్ పట్టుకున్నాడు.

"కార్తీ! డాక్టర్ చెప్పాడు కదా! సెల్ ఫోన్ తో ఆడొద్దని, నీకస్సలు అర్థం కావడం లేదేమిట్రా!" అని రత్న, కార్తీ చేతిలోని సెల్ ఫోన్ లాక్కుంది.

కార్తీ కింద పడి కాళ్లు, చేతులు నేలకేసి కొట్టడం మొదలుపెట్టాడు.

"కార్తీ! ఆగురా! ఇంత మొండోడివి ఏమిట్రా నువ్వు" అంటూ శ్రీకాంత్ కార్తీ వీపు మీద రెండు చరిచాడు.

"ఆగు శ్రీకాంత్! పిల్లాడిని ఆడించటం చేతకాదు కానీ కొడుతున్నవ్" అని గట్టిగా అరిచింది రత్న.

"ఆ అవునులే నువ్వు తెగ ఆడిస్తావ్ మరి. ఇదంతా నీ వల్లే. పిల్లాడికి సంవత్సరం ఉన్నప్పటి నుంచే సెల్ ఫోన్ ఇవ్వడం మొదలుపెట్టినవ్. వాన్ని నవ్వించడానికి రైమ్స్, వాడు ఏడిస్తే ఊరుకోబెడతానికి రకరకాల కార్టూన్ షో లు చూపించబట్టే ఇప్పుడు వాడు ఇలా తయారయ్యాడు" అని శ్రీకాంత్ రత్నమీదికి ఎగబడ్డాడు.

"ఆ అవును మరి... అను నన్నే. మీ అమ్మని పిలిపించు పిల్లాడిని చూసుకుంటుంది అంటే ఊళ్ళో గొడ్డుగోదా ఏం కావాలి? అంటివి కదా! నేను అప్పటికే సెలవుల మీద సెలవులు పెడుతూ కార్తీని చూసుకున్నాను. నువ్వసలు ఏ రోజైనా కార్తీతో నాలుగు ముచ్చట్లు చెప్పావా? ఎక్కడికైనా తీసుకెళ్ళావా?" అని రత్న, శ్రీకాంత్ ప్రవర్తన పట్ల అసంతృప్తిని వెళ్లగక్కింది.  

"రత్నా! నీకెప్పుడో చెప్పాను ఉద్యోగం మానేయమని. విన్నావా?"అన్నాడు శ్రీకాంత్.

"నేను ఎన్నో రోజులు సెలవు పెట్టాను. కనీసం నువ్వు సెలవు పెట్టలేదు సరి కదా! నన్నంటున్నావు. అసలు నువ్వే ఉద్యోగం మానేసి చూసుకోవచ్చు కదా! నేను మాత్రమే చూసుకోవాలా?"

ఇద్దరి మధ్య కాసేపు యుద్ధ వాతావరణం. కొడుకు మీద ప్రేమ, ఏమవుతుందోనన్న ఆందోళనలో ఒకరి తప్పులు ఇంకొకరెంచుకొని కాసేపటికి అలసిపోయారు. వాదన సద్దుమణిగింది. తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతుంటే కార్తీ మాత్రం సడి, చప్పుడు లేకుండా రూం లోకి వెళ్లి సెల్ ఫోన్ ఆటలో నిమగ్నమయ్యాడు.

               * * *

శ్రీకాంత్, రత్న ఇద్దరూ బాగా ఆలోచించి ఇక కార్తీని చూసుకోవడానికి అమ్మమ్మ తులసమ్మని ఊరి నుండి రప్పించాలని తీర్మానించుకున్నారు. రత్న నుండి పిలుపు రావడంతోనే తులసమ్మ ఆగమేఘాలమీద పట్నం వచ్చింది. పరిస్థితి తెలుసుకొని బాధపడింది. కార్తీని భద్రంగా చూసుకోవాలని నిర్ణయించుకుంది.

"రత్నా! నీ చెల్లిని, తమ్ముడిని నాన్న చూసుకుంటా అన్నాడు. నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉండి కార్తీని చూసుకుంటాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇట్ల పిల్లగాడు మంకయితడనుకోలేదే!" అన్నది తులసమ్మ.

"నేను కూడా ఇట్లయితడనుకోలేదమ్మా" అన్నది రత్న.  

"నువ్వు ఇంట్లో ఉండే ఆఫీస్ పని చేస్తున్నావు కదే! మొన్న మొన్నే ఆఫీసుకు వెళ్లడం మొదలు పెట్టావు కదా! నేను కూడా ఇంట్లోనే ఉంటున్నావు కదా! పిల్లగాడిని బాగానే చూసుకుంటావు అనుకున్నాను. అయినా ఇంట్లో ఉన్నా కంప్యూటర్ కాడనే కదనే నువ్వుండేది. ఈ సంగతి మర్చిపోయిన నేను".

"కార్తీ! రారా నాన్నా! మా అయ్యకదూ! నువ్వు నేను మంచిగా ఆడుకుందాం రారా!" అని తులసమ్మ కార్తీకి దగ్గర కావాలని ఎంత ప్రయత్నం చేసినా కార్తీ మాత్రం తులసమ్మ వంక కూడా చూడకపోవడంతో పిల్లవాణ్ణి ఎలా మార్చాలో అంతుపట్టని స్థితి ఏర్పడింది. రాను రాను కార్తీ పరిస్థితి దారుణంగా తయారైంది. కొత్త కొత్త యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం, మరెన్నో కొత్త కొత్త గేమ్ లతో కార్తీ లోకమే కొత్తగా మారిపోయింది. ఒంటరిగా ఉండడం, సెల్ ఫోన్ గేమ్ లో హీరో చెప్పినట్టు చేయడం, అర్ధరాత్రి వింత వింత అరుపులతో అతడి పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. ఇక తప్పని పరిస్థితుల్లో స్నేహితుల సూచన మేరకు శ్రీకాంత్, రత్న కార్తీని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు.

కార్తీని చూసిన సైకాలజిస్ట్ కు ఆశ్చర్యమైంది. "ఏమిటి బాబు చేతిలో? అరే సెల్ ఫోన్. భలే బాగుంది"అంటూ కార్తీని పలకరిస్తూ అతడు ఆడే గేమ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు సైకాలజిస్ట్.

శ్రీకాంత్, రత్నలను పక్కకు తీసుకెళ్లి "మీ బాబు నుండి సెల్ ఫోన్ దూరం చేయకపోతే అతడు మీకు దక్కడం చాలా కష్టం. అయినా ఇంతలా పిల్లవాడికి సెల్ ఫోన్ అలవాటు చేసారేమిటండి? మీరిద్దరూ రోజులో కాసేపైనా ఆ అబ్బాయితో గడిపారా? అసలు సెల్ ఫోన్ వల్ల కలిగే రేడియేషన్ గురించి కాస్తయినా మీకు ఆలోచన ఉందా? పైగా చిన్న పిల్లవాడు. మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మల సహకారమైనా తీసుకోవాలి కదా! పిల్లలను పెంచడం ఎంతో సులభమని అనుకుంటున్నారు నేటి జనరేషన్. పిల్లల పెంపకం సాధారణమైన విషయం కాదు" అన్నాడు.

"అయ్యో! డాక్టర్! ఇంతలా సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అవుతాడనుకోలేదు. మా పనులు మేం చేసుకోవచ్చని వాడి చేతికి సెల్ ఇవ్వడం మొదలుపెట్టాం. వాడి ప్రాణం మీదికే వస్తుందని అనుకోలేదు. మా కార్తీ మాకు దక్కాలంటే మేం ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పినట్లు చేస్తాం. దయచేసి మా బాబుకు సెల్ ఫోన్ పిచ్చి వదిలించండి" అని రత్న, శ్రీకాంత్ ఇద్దరూ సైకాలజిస్ట్ చేతులు పట్టుకున్నారు.

అప్పుడు సైకాలజిస్ట్ "నా ప్రయత్నం నేను చేస్తాను. మీరిద్దరూ మీ మీ పనుల కంటే మీ బాబుతో గడిపే సమయానికే ప్రాధాన్యతనివ్వాలి. నేను చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటిస్తేనే మీ బాబుకు నయమవుతుంది. మీరు అందుకు సిద్ధమేనా?" అనడంతో

"సరే డాక్టర్! యాంత్రిక జీవితంలో పడి మేం కోల్పోయింది చాలు. మా కార్తీ కంటే మాకేది ఎక్కువ కాదు. ఎలా అయినా మా బాబును మాకు దక్కించండి" అని రత్న, శ్రీకాంత్ లు ప్రాధేయపడడంతో డాక్టర్ "రేపటినుండి ట్రీట్మెంట్ మొదలుపెడదాం. ప్రస్తుతానికి కార్తీని ఇంటికి తీసుకెళ్లండి" అని వారికి చెప్పి, కార్తీ దగ్గరకు వెళ్లి

"కార్తీ! నా దగ్గర ఒక కొత్త గేమ్ ఉంది. అది రేపు నేను నీకు చూపిస్తాను. రేపు తప్పకుండా వస్తావు కదూ" అని డాక్టర్ అనగానే కార్తీ" ఓ..." అంటూ సంతోషంగా లేచి రత్న దగ్గరకు వెళ్ళాడు.  

రత్న, శ్రీకాంత్ తమ కార్తీ తమకు దక్కుతాడన్న నమ్మకంతో ముందుకు కదిలారు.

0 Reacties

2025 సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)


ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)


స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)


యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)


పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)


అమ్మ నాకంటే చిన్నది (బాలలు)


సారంగి (కథలు)


అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)


తప్పెవరిది... (కథలు)


ఒంటరి విజయం (కవితలు)


వసుధైక కుటుంబం (కవితలు)


పచ్చని కన్నీళ్లు (కవితలు)


మనసు తలుపు గడియ పడితే ... (కథలు)


మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)


తీరని ఋణం (కథలు)


వేకువ స్వప్నం (కవితలు)


రెప్ప చాటు స్వప్నం (కథలు)


గెలుపు (కవితలు)


ప్రణయేంద్రజాలం (కవితలు)


నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)


ఆత్మ సమీక్ష (కవితలు)