అభీష్టం  (Author: తాతా కామేశ్వరి)

డాక్టర్ రాజశేఖర్ పేరుగాంచిన కార్డియో సర్జన్. ఆయనను సంప్రదించడానికి ఆ ఊరి వారేకాక చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా రోగులు వస్తుంటారు. కొంతమంది ఆయన వద్ద  అపాయింట్‌మెంట్ కోసం రోజుల తరబడి కూడా వేచి ఉంటారు, ఇంకొంతమంది అయితే ఇంకొక డాక్టర్ని సంప్రదించినా సెకండ్ ఒపీనియన్ కోసం డాక్టర్ రాజశేఖర్ వద్దకి వస్తారు. ఎంత గంభీర పరిస్థితిలో ఉన్న పేషెంట్ అయినా ఆయన చెయి తగిలితే బాగైపోతారని జనాల నమ్మకం.

         రాజశేఖర్ ది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వము, మంచి డాక్టరే కాక మంచి మనసున్న మనిషి కుడా. ఎంతోమంది బీదవారికి ఒక పైసా అయినా తీసుకోకుండా ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి ఆయన. ఆయన చిన్నప్పటినుండి తండ్రి కోరిక నెరవేర్చడానికి డాక్టర్ అయి సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదువుకొని ఇంత స్థాయికి చేరిన విషయాన్ని ఏనాడు విస్మరించలేదు.

         రాజశేఖర్ ఏడవ తరగతిలో ఉండగా హఠాత్తుగా తండ్రి మరణించడంతో, తల్లి రుక్మిణి ఓ స్కూల్లో టీచర్ గా చేరి ముగ్గురు పిల్లలను చాలా కష్టపడి పెంచి పెద్ద చదువులు చదివించింది. పెద్దకొడుకు సూర్యం గ్రాడ్యుయేషన్ చేసిన వెంటనే తల్లి కష్టం చూసి తగిన ఉద్యోగంలో చేరి ఆమెకు సాయపడ్డాడు. అందరి కన్నా చిన్నవాడైన రాజశేఖర్ బాగా తెలివైనవాడు అవడంతో, తండ్రికి ఆయనను పెద్ద డాక్టర్ ని చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరికని తల్లి, అన్న కలిసి ఖర్చుకు వెనుకాడక ఆయనను మెడిసిన్ చదివించి, పీ. జీ. కుడా చేయించి కార్డియో సర్జన్ చేశారు. వారు ఇరువురు పడిన కష్టం, త్యాగం ఆయన ఎన్నటికీ విస్మరించలేనిది.

         ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న రాజశేఖర్ కి ఆయన ఇద్దరు పిల్లలలో ఒకరైనా డాక్టర్ అయి, ఆయన తరువాత ఈ సమాజానికి సేవ చేయాలనేది ఒకే ఒక కోరిక. కొడుకు విమల్ కోచింగ్ తీసుకుని ఎంట్రన్స్ అయితే రాశాడు, కానీ వాడికి చదువుపట్ల పెద్ద శ్రద్ధలేక సీట్ రాలేదు. రాజశేఖర్ ఎంత బతిమాలినా అతను ఇంక మెడిసిన్ కి ఎంట్రన్స్ రాయకుండా గ్రాడ్యుయేషన్ లో చేరిపోయాడు.

         కూతురు కావ్య ఇప్పుడు 11 వ తరగతిలో ఉంది. రాజశేఖర్ కి ఆమెనైనా మెడిసిన్ చదివించి ఒక మంచి డాక్టర్ ని చేద్దాం అని ఉంది కానీ ఆమెది కుడా అదే పరిస్థితి. కోచింగ్ అయితే తీసుకుంటుంది కానీ చదువుపట్ల ఇష్టం కానీ, అంకితభావం కానీ ఏవీ లేవు. ఎప్పుడు చూసినా మొబైల్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్, పార్టీలకి వెళ్ళడం, సినిమాలకి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం. రాజశేఖర్ ఆమెకు చాలాసార్లు చెప్పి చూశాడు కానీ ఆమెలో ఏ మార్పు రాలేదు. బలవంతాన చదువుతుందే కానీ ఆమెకు హాయిగా అన్నలాగే కాలేజీలో చేరి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనేదే ఆమె కోరిక. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం మరియు కోరికే లేదు.

         రాజశేఖర్ ఒకనాడు ఇక చూడలేక కావ్యను పిలిచి“అమ్మా కావ్యా, కాలం వృధా చేయకుండా చదువు మీద శ్రద్ధ పెట్టు. ఒకమారు కాలం గడిచిపోతే మళ్ళా తిరిగిరాదు. ఈ రెండేళ్ళు కష్టపడి చదివిన చదువు నీ రేపటి ఉజ్వలమైన భవిష్యత్తుకి పునాది” అనడంతో ఆమె, "నాన్నా, మీకు తెలియదు, యిప్పుడు నీట్ ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టం, అంత సులువు కాదు. చాలా ప్రెషర్ ఉంటుంది. మీ రోజులలో అయితే సీట్లు సులువుగా దొరికేవి, ఇప్పుడు అలా కాదు కదా, కాంపిటీషన్ పెరిగిపోయింది. నావల్ల అంత ఒత్తిడికి తట్టుకుని చదవడం కావటం లేదు" అన్నది విసుగ్గా.

         అమె మాటలు విన్న రాజశేఖర్ బదులు చెప్పలేక మౌనముగా ఉండిపోయారు. ఆయన రోజులలో కావ్య అనుకున్నట్టు ఏదీ అంత సులువుగా లభించేది కాదు. చదువుకోవడానికి పెన్, పుస్తకాలకు ఆఖరికి కాలేజి ఫీజ్ కట్టడానికి కూడా అర్థిక పరిస్థితుల వల్ల చాలా కష్టం అయ్యేది, కానీ ఇప్పట్టి తరానికి అన్నీ సులువుగా లభించడంతో కష్టం అంటే ఏమిటో తెలియటంలేదు. దీనికి కొంత వరుకు తల్లిదండ్రులమైన మేము భాద్యులమేమో అనుకున్నారు రాజశేఖర్.

         ఆనాటి నుండి రాజశేఖర్ మనసు కావ్య భవిష్యత్తు గురించి చాలా ఆందోళనగా ఉండేది, ఆమెలో మార్పు ఎలా తేవాలో అర్థం కాలేదు ఆయనకు. ఆనాడు కూడా హాస్పిటల్లో పరధ్యానముగా లంచ్ చేస్తూ ఉండగా రాజశేఖర్ తోపాటు అదే హాస్పిటల్లో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న ఆయన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ భాస్కర్ అలా ఉన్న ఆయనను చూసి "ఏమిటి శేఖర్ అంత దీర్ఘాంగా అలోచిస్తున్నావు? నేను రావడం కూడా గమనించలేదు?" అనడంతో రాజశేఖర్ బాధగా నిట్టూర్చి కావ్య విషయం చెప్పాడు.

         అప్పుడు భాస్కర్ "ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు శేఖర్? నన్ను ఒక్కసారి సంప్రదించవలసింది కదా. పోనీలే ఇప్పుడైనా చెప్పావు" అన్నాడు ఉక్రోషం నటిస్తూ.

         దానికి రాజశేఖర్ "అదేమీ లేదు భాస్కర్, పోనీ ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారము చెప్పి పుణ్యం కట్టుకోరా బాబూ" అన్నాడు అనునయంగా.

         "చాలా సులువైన పరిష్కారము, అది నీ చేతిలోనే ఉంది శేఖర్. సామాన్యంగా అందరి ఇళ్ళలో చిన్నపిల్లలు వారికన్నా పెద్ద అయిన అన్న లేదా అక్కని రోల్ మోడల్ గా తీసుకుంటారు. విమల్ కి మెడికల్ ఎంట్రన్స్ లో రాకపోవడంతో కావ్యలో ఒక రకమైన నిరుత్సాహం, నిస్పృహ చోటు చేసుకున్నాయి. ఇంత కష్టపడి చదివిన అన్నకే సీట్ రాకపోతే తనకి ఎలా వస్తుంది అనే భావన అమె మనసులో గూడుకట్టుకుంది. ఇప్పుడు అమెలో ఉత్సాహం, చదువుపట్ల శ్రద్ధ కలిగించడానికి అమెలో కాంపిటీషన్ స్పిరిట్ ని పెంపొందించాలి అది నీవల్లే సాధ్యం. నువ్వు అమెకు ఒక లక్ష్యం చూపించి దానిని సాధించమని ఛాలెంజ్ చేయి, కావ్యలో తప్పక మార్పు వస్తుంది" అన్న భాస్కర్ మాటలకు రాజశేఖర్ మనసు స్థిమితపడి కావ్యకి ఇవ్వాల్సిన ఛాలెంజ్ నిర్ణయించుకున్నాడు.

         ఆలస్యం చెయ్యకుండా ఆ రోజే త్వరగా ఇంటికి చేరి అంతా కలిసి డిన్నర్ చేస్తూ కొంతసేపు ఇతర విషయాలు మాట్లాడుకుని కావ్య చదువు విషయం గురించి చర్చ రావడంతో, "కావ్యా, మొన్న నువ్వు నాతో మా రోజులలో చదువు గురించి అన్న విషయం గురించి నేను చాలా అలోచించాను. నువ్వు అన్నది నిజమే అనిపించింది. మీలా మేము ఇంత కాంపిటిషన్ ఎదుర్కోలేదు. నాకు అందుకే ఒక వినూత్నమైన అలోచన వచ్చింది. నేనూ నీతో పాటు మెడిసిన్ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవుదాము అనుకుంటున్నాను. ఎలా ఉంది నా అలోచన? చూద్దాం ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో ఛాలెంజ్ ఒప్పుకుంటావా?" అన్న రాజశేఖర్ మాటలకి అందరూ భోజనం ఆపి అయన వేపు ‘ఏమి మాట్లాడుతున్నారు? ’ అన్నట్టు కళ్ళు ఆర్పకుండా చూడడంతో అయన "నిజంగానే, కావ్యతో నేను ఈ ఏడాది ప్రిపేర్ అయి ఎంట్రన్స్ రాస్తాను. ఇద్దరం కలిసి చదువుకుంకుంటాం" అన్నారు.

         ఇంతసేపు అవిశ్వాసముగా తండ్రి వైపు చూస్తున్న కావ్య ఒక్కసారి మెల్లగా నవ్వి "సరే నాన్నా, నేను రెడీ ఈ చాలేంజ్ కి. నేను మిమల్ని తప్పక బీట్ చేస్తాను" అంటూ అయనతో ఛాలెంజ్ ఒప్పుకుంటూ షేక్ హేండ్ ఇచ్చింది. ఛాలెంజ్ ఇంత సులువుగా ఒప్పుకుంటుదని ఊహించని రాజశేఖర్ కి ఈ స్వల్ప విజయమే చాలా సంతోషం కలిగించింది.

         మరుసటి రోజే రాజశేఖర్ చదువుకోవడానికి కోర్స్ బుక్స్, మంచి రెఫరెన్స్ బుక్స్ తోపాటు అయన జాగ్రత్తగా దాచుకున్న పాత బుక్స్ తీసి, ఒక టైం టెబల్ తేయారుచేసి, కావ్యతోపాటు తెల్లవారు ఝాము నాలుగు గంటలకే లేచి, ఏడు వరుకు కలిసి చదువుకుని, కావ్య జునియర్ కాలేజ్ కి, రాజశేఖర్ ఆసుపత్రికి వెళ్లి, మళ్లీ రాత్రి కుడా చదువుకోవడం మొదలుపెట్టారు.

         రాజశేఖర్ కి ఆసుపత్రి తోపాటు యిలా చదువుకోవడం కష్టం అయినప్పటికి అయన ఏమి పట్టించుకోకుండా ప్రతి అడుగులో కావ్యను ప్రోతహిస్తూ కలిసి మాక్ టెస్ట్స్ కి ప్రెపర్ అయి, సాధ్యమైనంత వరకు కావ్యతోనే గడిపేవారు. రిలాక్స్ అవ్వడానికి సండే నాడు తప్పకుండా అందరూ కలిసి కొంతసేపు బయటకు తిరగడానికి వెళ్ళేవారు.

          ఈ విషయం తెలుసుకున్న చాలామంది స్నేహితులు, బంధువులు 'ఇంత పెద్ద డాక్టర్ అయివుండి మళ్లీ ఎంట్రన్స్ రాయడం ఏమిటీ’ అంటూ విమర్శిస్తున్నా రాజశేఖర్ ఏమి పట్టించుకోకుండా ఇద్దరు చాలా కష్టపడి, ఒకరితో ఒకరు పొటీపడి చదివారు. కావ్యలో కుడా రాజశేఖర్ అనుకున్న మార్పు వచ్చి ఆమెలో చదువుపట్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరగడం తోపాటు, ఫ్రెండ్స్ తో అనవసరమైన చాటింగ్, పార్టీలు కుడా తగ్గాయి. ఆమెలో లక్ష్యాని సాధించాలనే తపన పెరిగింది.

         ఎంట్రన్స్ ఎగ్జామ్ కి మూడు రోజుల ముందు హాల్ టికెట్స్ వచ్చాయి కానీ ఇద్దరిదీ వేరే వేరే సెంటర్ లో సిట్ పడ్డాయి. తండ్రి, కూతురు ఒకరికి ఒకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకుని పరిక్ష రాసి సాఫల్యం పొందారు.

         రాజశేఖర్ కన్నా కావ్య మూడు శాతం ఎక్కువ, 92 పర్సెంట్ మార్క్స్ తో పరిక్ష పాస్ అయింది. ఫలితాలు తెలుస్తూనే ఆందరికన్నా ముందు భాస్కర్ కి ఫోన్ చేసి "నేను, కావ్య ఇద్దరం ఎంట్రన్స్ లో విజయం సాధించాము అంటే అంతా నీ చలవే రా. ఆనాడు నువ్వు నాకు సలహా ఇవ్వకపొతే కావ్యలో ఈ మార్పు తేలేకపోయేవాడిని. నా పిల్లల్లో ఒకరైనా డాక్టర్ అయి, నాలాగే సమాజానికి సేవ చెయ్యాలన్న నా అభీష్టం నీ వల్లనే సిద్ధించింది" అనడంతో భాస్కర్ "నాది ఏమి ఉందిరా. అంతా మీ ఇద్దరు పడిన కష్టం వల్లనే సాధ్యం అయింది. నువ్వు పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమ, వారి భవిష్యతు కోసం పడే తపనకి పరాకాష్ఠగా నిలిచి, ఒక ఉత్తమైన ఆదర్శం స్థాపించావు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతటి కష్టము అయినా పడగలరు అని నిరూపించావు. కోరిక అనే బలవైన విత్తుని శ్రద్ధ, ఏకగ్రత మరియు విశ్వాసం అనే మూడు గుణాలతో పెంచితే అది తప్పక నెరవేరుతుంది” భాస్కర్ అంటూండగా రాజశేఖర్ కి అక్కడే చాలా సంతోషంగా తల్లితో ఏదో మాట్లాడుతున్న కావ్యలో ప్రస్ఫుటంగా కనబడతున్న ఆత్మవిశ్వాసం, మనోధైర్యం చూసిన అయనకు రాబోయే రోజులలో ఒక మంచి డాక్టర్ కనబడింది.

         ***

0 Reacties

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)