అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప  (Author: చొక్కర తాతారావు)

ఏవీ అర్థం కావు

అర్థమయ్యేలోపు

మాట మూగబోతుంది

అంతా చూస్తున్నట్టే ఉంటుంది

ఏదీ కనబడదు

చూపు విస్తరించేలోపు

రెప్పకీ రెటీనాకి మధ్య

దూరం చెరిగిపోతుంది

మాట్లాడుతూనే ఉంటావు

ఏవీ వినబడవు

మాటకీ మనిషికి మధ్య

భావం చెదిరిపోతుంది

కళ్ళముందే అంతా జరిగిపోతుంది

గుడ్లప్పగించి చూస్తుంటావు

ఏదో చేయాలనే తపన

ఏమీ చేయలేని నిస్సహాయత

పాట పాడుతుంటావు

గొంతు వినిపించదు

పాటకీ పల్లవికి మధ్య

రాగం బయటకు రాదు

నడుస్తూనే ఉంటావు

నీడ నీనుండి దూరమవుతుంది

వెనక్కి తిరిగి చూస్తే అదృశ్యహస్తమేదో

నిన్ను వెంటాడుతుంటుంది

అన్నీ తెలిసినట్టే ఉంటాయి

ఏవీ తెలియవు

నువు పెంచిన పాశం

ప్రేమించిన నేస్తం

అంతా నీవెంటే ఉంటారు

నువ్వుండవు

0 Reacties