అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి)
అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (Author: దొండపాటి నాగజ్యోతిశేఖర్)
అతడికి ఆకలితో అనాది పరిచయం
ఖాళీ పేగులు రాసే కవితలతో
అంతులేని అనుబంధం
చీకట్లను దున్ని వెలుగుల్ని పండించడం అతనికి మట్టితో పెట్టిన విద్య
లోకమంత విస్తరి కుట్టాలని
వేళ్ళను బొబ్బలెక్కిస్తాడు
ప్రపంచమంతా పచ్చగా చేయాలని కాళ్ళను వేళ్ళను చేసి బురదలో మొలిచే చెట్టు అవుతాడు
పొలం గట్లను దీపావళి చేసి
అప్పుల అమావాస్యను తను మిగుల్చుకుంటాడు
దిగుడు బావిలో నీటిని పైరు పిల్లల నోటి కందించి
దాహం తీరని ధరల చినుకులతో
గొంతు తడుపుకుంటాడు
ఎందరికో కథా వస్తువు తనైనా
తన కన్నీటి కథలన్నీ ఒంటరి పొలంలో విత్తుల్లా చల్లుతాడు
తన కష్టాన్ని తనే నూర్చుకొని
రోట్లో నలిగే వడ్ల గింజవుతాడు
అన్ని ఋతువులూ అతనికి శ్రమలనే కానుకిస్తాయి
పండుగలన్నీ అతనికి అకాల వర్షాలు
ఒక్క
సంక్రాంతి కోసం మాత్రం అతడు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు.
ధాన్య లక్ష్మిని ఇంటికి తరలించి
కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రిలా సంబర పడతాడు.
అతనికి సంక్రాంతి అంటే మహా ఇష్టం
అందరి నోట్లో అన్నమవ్వడమే అతనికి యుగాలుగా పరిచయమున్న సంక్రాంతి!
ఆకలికి అనాది ప్రేమికుడతడు!
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)