వృద్ధాప్యం ఎంత దయలేని దండనో  (Author: పిళ్ళా వెంకట రమణమూర్తి)

ఆ కనులు చీకటి వెలుగుల జీవయాత్ర లో అలసిపోయాక..

నిరంతర ఆశ్రు వర్షాలతో ఆ సరోవరం ఎప్పుడో నిండి పొర్లుపోయింది..

ఆ చెవుల్లో నిశ్శబ్దం గువ్వపిట్టలా గూడు కట్టాక.. గుండె లోతుల్లో తీయని ఊసుల్ని ప్రతిధ్వనులుగా ధ్వనిస్తోంది!

బోసినోటి చిగుళ్ళ మధ్య చిక్కుకొన్నాక..

మాటల్ని మూటగట్టి మౌనాన్ని రుచిచూసుకుంటోన్న ఆ నాలుక..

ఆకలి చీకటితో పోరాడి  వెలుగుల వాసన పసిగట్టిన ఆ నాసిక..

నీరసాలు రాలుస్తున్న కాంతిలోకి నిరాశ పడిన అచేతన కదలిక!

ఆ నడుము బతుకు బరువుకు నిలువునా వంగిన చంద్రవంకైనాక..

దేహపు గుడిసెకు నిబ్బరాన్ని యవనికలా నిట్టాడిగా నిలుపుకుని..

అనేకానేక హేమంతాలు విసిరిన చలికత్తుల వేటుకు తట్టుకుని..

శూన్యానికి శూన్యానికి నడుమ చిన్న ప్రపంచాన్ని పరుచుకుని!

ఏడాదికి

ఒకసారైనా చేరువయ్యే వలసపోయిన పక్షుల్ని చూసి..

మూర్తీభవించిన పసితనంలా అమాయకంగా, ఆపేక్షగా..

చేతులు చాచి అక్కున చేర్చుకుంటూ..

వాటి గాఢ పరిష్వంగనలో సుషుప్తి లోతుల్లోంచి ఇంకిపోతున్న కన్నీటి నయాగరా అవుతున్నారు!

వారు త్యాగధనులు, వారి జీవితం తమ పిల్లలకు పరిచిన రత్నకంబళులు..

వారు యోగులు,

సుఖదుఃఖాలు ఆసాంతం వారికే పరిమితి లేని పరిధులు  ..

వారి చేతికర్రలు దారిచూపే కళ్ళున్న గంగా ఝరులు!

కోరుకున్న జీవితాన్ని గడిపారో లేదో కానీ..

ఇకపై ఆకలని అర్ధించకుండానే ఆ గంజి కూడా పిల్లల నోట్లోనే ఒంపుకోమన్నారు..

మూసిన తలుపుల అంతరంగం వాకిట నిన్నటి జ్ఞాపకంలా..

మాటల్ని మూటగట్టి మౌనమునులుగా మారిపోయారు..

నిజంగా మనిషి జీవితంలో వృద్ధాప్యం ఎంత దయలేని దండనో కదా!

コメントの追加