రెప్ప చాటు స్వప్నం  (Author: నామని సుజనాదేవి)

పట్టించుకునేవారు లేక వెలవెల బోయే అనాధ పిల్లల మొహాల్లా, రంగు వెలసి, దుమ్ము కొట్టుకుని పోయిన “అమ్మ అనాథ శరణాలయం” అని పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డ్ ఆ ఇనుప గేటుకు వేలాడుతోంది.

అక్కడ అనాథలైన పిల్లలలో కొందరు వికలాంగులు కూడా ఉన్నారు. ఆ అనాథాశ్రమం స్థాపించిన రాఘవయ్య అంత ఉన్నవాడేమీ కాదు. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కావడమే కాక, అప్పుడు వందేమాతరం పిలుపు అందుకుని ఆస్తి అంతా ధారాదత్తం చేసాడు. తండ్రి లక్షణాలే పుణికి పుచ్చుకున్న రాఘవయ్య, పుట్టినందుకు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే అభిలాష ఉన్నవాడు. ఒకసారి చినిగిన బట్టలతో, వీపు కంటిన కడుపుతో మురికిగా ఉన్న బిచ్చమడుక్కునే పిల్లగాడు, దీనంగా, ‘ఆకలవుతుంది బాబూ! కొంచెం అన్నం పెట్టండి’ అంటూ ఇంటి ముందు అర్థిస్తే, లోనికి పిలిచి బావిదగ్గర నీళ్ళు చేది పోసి, స్నానం చేయించి, తమ పిల్లల బట్టలు ఇచ్చి, కడుపు నిండా భోజనం పెట్టాడు.

“అయ్యా ఏదైనా పనిచేస్తాను. ఇక్కడే ఉంటాను” అనడంతో, సరే నంటూ, చదువుకూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసో లేక, ఎవరైనా చెప్పారో గానీ తర్వాత మరో ఇద్దరు పిల్లలు వచ్చారు. అలా అలా పరోపకారం అంటూ సహాయం చేసే మంచితనం వల్ల, కొంతమంది వికలాంగులు, పెద్దలు కూడా జమ అయ్యారు. పెద్దల సలహాతో ఆ అనాథాశ్రమాన్ని రిజిస్టర్ చేయించాడు. చంటి బిడ్డలను కూడా అప్పుడప్పుడు ఆ గుమ్మం ముందు వదిలి వెళ్ళేవారు.

అయితే, మంచి చేసేవారికి ఆ దేవుడు కూడా సహాయం చేస్తారన్నట్లు అతని మంచితనం, అంకిత భావం చూసి చాలామంది దాతలు ముందుకు రావడంతో ఆ ఆశ్రమాన్ని విస్తరించి, ఆయాలను, టీచర్లను, వికలాంగులకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఇద్దరు టీచర్లను పెట్టి శాయాశక్తులా ప్రయత్నలోపం లేకుండా నడుపుతున్నాడు రాఘవయ్య. పిల్లలకు చదువులు చెప్పించి ప్రయోజకులను చేసి వారి కాళ్ళపై వారు నిలబడి మరికొంతమందికి బాసట అయ్యేలా చేయాలనే ఆలోచన అతనిది.

ఎలా తెలిసిందో ఒకరిద్దరు దంపతులు పిల్లలు లేరని, చిన్నగా ఉన్న పిల్లలను పెంచుకుంటామని అడిగారు. బయట మోసగాళ్ళు ఉన్న నేపథ్యంలో అలా ఇవ్వడం గురించి భయపడి నిరాకరించినా, ‘దానివల్ల కొంత భారం తగ్గడమే కాక, తల్లితండ్రులకు ఆనందాన్ని, పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వవచ్చు’ అన్న ఆలోచనతో, న్యాయవాదుల ద్వారా దత్తత ఇచ్చే పద్ధతి కనుక్కుని వివరాలు తదితరాలన్నీ సేకరించి దత్తత ఇవ్వడానికి సంసిద్ధుడయ్యాడు. అయితే తనకు వారిపై నమ్మకం కలగడం కోసం, ఒక వారందత్తత తీసుకునే వారిలో ఎవరైనా ఒకరిని ప్రతిరోజూ కనీసం రెండు గంటలైనా ఉండి, వారు దత్తత తీసుకోవాలనుకున్న బిడ్డతో గడపమనే షరతు విధించేవాడు.

*****

“రాఘవయ్య గారూ! మీ షరతుల ప్రకారం ఈ రోజుతో వారం రోజులు పూర్తయిపోయాయి. కాబట్టి రేపు మంచి రోజు ఉంది కాబట్టి మేము రేపు వచ్చి చట్టబద్ధంగా మిగతా తతంగం పూర్తి చేసి ఈ బిడ్డను మేము దత్తత తీసుకోవడానికి అర్హులమే కదా!” ఆశగా అడిగాడు సురేష్.

“అవునండీ! మీ దంపతులు రోజూ వచ్చి ఆ పాపతో వారం రోజులు గడిపి పాపకు మాలిమి అయ్యారు. పైగా పాపను చూసుకోవడం కూడా మీకు తెలిసింది. బయట అనేక రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో నేను మీరు వారం రోజులు తప్పని సరిగా వచ్చి పాపను చూసుకోవాలని, మీకు సంబంధించిన ఆధార్ లాంటి వివరాలన్నీ ఇవ్వాలని, చట్ట బద్ధంగానే దత్తత కార్యక్రమం జరగాలనే షరతులన్నీ పెట్టాను. ఇదంతా మున్ముందు మీకు, మాకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరగ కూడదని మాత్రమే! మీకు సంబంధించిన వివరాలతో నేను సంతృప్తి చెందినందున రేపు లాయర్ ముందు మిగతా కార్యక్రమం జరగడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు”

“అనాథలైనా పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకుంటూ, వారి భవిష్యత్తు కోసం ఇంత శ్రమ, శ్రద్ధ తీసుకుంటున్న మీకు శత కోటి వందనాలు. రేపు తప్పక అలాగే అన్ని ఏర్పాట్లతో వస్తాం. రేపు ఇక్కడ అందరికీ భోజనాల ఖర్చు కూడా నేను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి. మీ ఆశ్రమానికి రెండు లక్షల విరాళాన్ని కూడా ఫిక్స్ డు డిపాజిట్ రూపంలో ప్రతీ నెల ఆ వచ్చే వడ్డీ ని మీరు వాడుకునేట్లుగా కూడా ఏర్పాట్లు చేస్తాను” అంటూ నమస్కరించాడు పిల్లలు లేని నగల వ్యాపారి సురేష్.

రాఘవయ్య సంతోషంతో చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపగానే, ఆ దంపతులు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.

*****

“అక్కా! ఇప్పటిదాకా ఓ పది మంది గిట్ల దత్తతని పోయిండ్రు గదా! ఆల్లు ఆడ బాగుంటారా?” శ్రీను అడిగాడు.

“ఓ! ఎందుకుండరు? ఇక్కడ అందరిలో మనం ఒకరం అంతే! తాత ఎంత మంచిగా చూసినా, ఒక్కొక్కరిని పాణం లెక్క సూడలేడు గదా!”

“అంటే?”

“ఈడ మన గుడ్డోళ్ళకు టీచరే లేదు. ఇద్దరికే టీచర్ను పెట్టడు గదా”

“మనకి వేరే సదువుంటదా”

“ఔ గదా! ఏరే ఉంటదని ఆయాలు, టీచరమ్మలు అనుకుంటాంటే ఇన్నలే! ఇంకా గిట్ల దీస్కపోతే వాళ్ళను గార్వం జేసి మంచి బట్టలేస్తరు. యూనిఫాం తోని బూట్లేసి, టై గట్టి, పుస్తకాల సంచి తోని స్కూళ్ళ దోలిస్తరు. ఆయిమన్న బట్టలేత్తరు. ఐస్క్రీం, బిస్కెట్లు, చాక్లెట్లు ఆల్లెం గావాలంటే గవి గోనిత్తరు. మనం ఈడ తిన్నా, తినకపోయినా ఒకటే. తానం చేసినా చేయకపోయినా ఒకటే..”

“గివన్నీ నీకెట్ల దెలుసక్కా”

“అయాలున్నరు గదా! ఆళ్ళను నేను గిట్లనే అడిగితె జెప్పిండ్రు”

“గట్లయితే నన్ను గూడా ఎవురన్నా దీస్కబోతే బాగుండక్కా!”

“నీ కేమన్నా పిచ్చేందిరా! అన్ని సక్కగుంటే తీస్కపోవుడే కట్టం. పుట్టు గుడ్దోల్లం. మనల్నెవలు దీసుకుంటర్రా?”

“అంతేనా అక్కా! మనల్నెవలు దీస్కపోరా?”

“అస్సలు దీస్కబోరు. అవ్వా నాయనలే వద్దనుకుని ఈడ పారేసి పోయిండ్రు. ఎవరో ఎందుకు తీస్కపోతర్రా?”

“మనం ఏం పాపం జేసినమక్కా! మనకు దేవుడు కళ్ళు ఎందుకియ్యలె! కళ్ళు లేకపోవుడు మన తప్పు కాదు గదక్కా. సిచ్చ మనమెందుకు భరించాలే!”

“మనల్ని గన్నోళ్ళు ఏం తప్పు జేసిండ్రో. ఆళ్ళ తప్పుకు మనం బాధ పడుతన్నం. మన కర్మ గిది. గదంతేరా...” అంది ఆరిందాలా సరోజ.

వాళ్ళ మాటలు విన్న ఆయా, ’పాపం’ అనుకుంటూ నిట్టూర్చింది. అయితే అప్పుడు వారికి తెలియదు. అలాంటి కళ్ళు లేని వారిని కూడా దత్తత తీసుకోవడానికి ఒకరు వస్తున్నారని.

*****

“రాఘవయ్య గారు అంటే మీరేనా?” ఆఫీసులో కూర్చుని రిజిస్టర్ లు చూస్తున్న రాఘవయ్య తలెత్తి, తలాడిస్తూ చూసాడు.

తెల్లటి సాదా బట్టల్లో ఉన్న ఒక యాభై ఏళ్ల వ్యక్తి కనిపించాడు. కూర్చోమని కుర్చీ చూపుతూ, సంగతి చెప్పమన్నట్లు చూసాడు.

“మా సారు ఇక్కడున్న ఒక అబ్బాయిని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు” కూర్చుంటూ చెప్పాడతను.

“మీ సారు ఎవరు? ఆయన్నే రమ్మను”

“మా సారూ ఈ జిల్లా కలెక్టర్!” ఆ మాట వింటూనే, వినయంగా,” అవునా! నాకు కబురంపితే నేనే వచ్చేవాడిని కదా!” అన్నాడు రాఘవయ్య.

“మా సారుకలా ఇష్టం ఉండదు. రేపు ఆయనను తీసుకుని నేనే వస్తాను. ఏమైనా ఇక్కడి ఫార్మాలిటీలు ఉంటె చెప్పండి. రేపు పది గంటలకు వస్తాం” చెప్పి వెళ్ళి పోయాడతను.

కలెక్టర్ విశిష్టతను గూర్చి విని ఉన్నాడు కనుక, అంత మంచి వ్యక్తి దృష్టిలో పడడం నిజంగా అదృష్టం అనుకున్నాడు.

తెల్లవారి సరిగ్గా చెప్పిన సమయానికి వచ్చారు కలెక్టర్. ఆయనతో పాటు మరో నలుగురు. అందరికీ స్వీట్ పాకెట్లు, పళ్ళు తీసుకుని వచ్చారు. అందరికీ నమస్కారం చేసి, వారి ముందరే పంపిణీ చేసాడు రాఘవయ్య.

ఆశ్రమం లో ఉండే వారి వివరాలు, వచ్చే నిధుల వివరాలు, సాధక బాధకాలు అన్నీ ఆత్మీయునిలా అడిగిన అతన్ని చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది రాఘవయ్యకు.

అందరిని చూపించి ఎవరిని దత్తత తీసుకోవాలను కుంటున్నారో అడిగాడు రాఘవయ్య.

అతను చెప్పిన వివరాలు విని అవాక్కయ్యాడు రాఘవయ్య. ఇప్పటివరకు పది మందిని దత్తతకు ఇచ్చేసిన రాఘవయ్యకు ఇప్పుడు వచ్చిన కేసే విచిత్రమయినది. ఎవరైనా అన్ని ఆవయవాలు చక్కగా ఉన్న వారినే తీసుకుంటారు గానీ, ఇలా పుట్టు గుడ్దోల్లను తీసుకుంటానన్నవాళ్ళే లేరు. మరొకరెవరైనా అడిగితే, వారు, వారితో మరే చట్ట వ్యతిరేక దందా లేమన్నా చేయిస్తారేమోనని అనుమానపడేవాడు. కాని అడుగుతున్నది జిల్లా కలెక్టర్. గుడ్డిపిల్లలు ఉన్నదే ఇద్దరు. ఇద్దరినీ తీసుకుంటానంటున్నాడు.

నోటిమాట రాని అతనితో,“మీకు ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి. నేను జిల్లా కలెక్టర్ ని అని నాకు మీ నియమాలు సడలించకండి. నేను సాధారణ పౌరుణ్ణి అనుకుని చెప్పండి”

“అంటే మీకు కూడా అవి ఎలా వర్తిస్తాయి సర్! మీరు పెద్దవారు. మీకు అవన్నీ ఎలా కుదురుతాయి?”

“ఫర్వాలేదు. చెప్పండి”

“ఎవరు దత్తత తీసుకోవాలనుకున్నా చిన్నపిల్లలు వారికి మాలిమి అయ్యేలాగ వారం రోజులు, ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి వారితో కనీసం రెండు గంటలయినా గడపాలి. వారిద్దరి మధ్య సయోధ్య కుదిరి సంతోషంగా ఉన్నట్లు నాకనిపిస్తే వారం తర్వాత చట్ట బద్దంగా దత్తతకి ఇస్తాను సర్”

“అలాగే! నాకేం అభ్యంతరం లేదు. అయితే నాకు వీలయిన సమయంలో మాత్రమే రాగలను. అందుకు మీరు అనుమతించాలి.”

“ఎంతమాట! మహాభాగ్యం సర్! మీ గురించి వినడమే కానీ ఇప్పుడే ప్రత్యక్షంగా చూడడం. మీలాంటి మహానుభావులు కోటిలో ఒకరుంటారు.” నవ్వి లేచాడు కలెక్టర్. వెంట సిబ్బంది రాగా బయటకు నడిచాడు కలెక్టర్.

*****

ఆయా ద్వారా విషయం వినగానే సరోజ, శ్రీను ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వారి ఆనందానికి అంతు లేదు. కాని మరునిమిషం లోనే వారిని విచారం కమ్మేసింది.

అక్క చెప్పినట్లు ఎవరైనా అన్ని అవయవాలు ఉన్నవారినే దత్తత తీసుకుంటారు, కానీ తమలాంటి వారి నెవరైనా తీసుకుంటారా? మరి ఆయనెందుకు కావాలని కళ్ళు లేనివారినే తీసుకుంటానన్నాడు? ఇందులో ఏదో మోసం ఉంది. ఇక్కడ తమకు చదువు చెప్పక పోయినా మిగతా అందరు చదివేదే నోటికి చదువుతున్నారు. అందరితో కలో గంజో తాగుతున్నారు. ఏ ప్రత్యేకత, బరువూ లేని ఈ జీవితమే బావుంది. ఎంత సేపైనా ఆడుకోవచ్చు. ఇక్కడి నుండి కొత్త చోటుకు పోతే అక్కడ ఎవరెవరు ఉంటారో? వాళ్ళు ఎలా చూసుకుంటారో? ఆడ ఆళ్ళ మాటలే వినాలి. ఇక్కడున్న స్వేఛ్ఛ అక్కడ ఉండదేమో! ఎన్ని కష్టాలు పడాలో, చదువుకోమని చంపుకు తింటారేమో? ఇదంతా ఎందుకు ఇక్కడే ఉంటె పోలా? ఇది వాళ్ళ ఆలోచన.

తెల్లవారి వచ్చిన కలెక్టర్ శ్రీను, సరోజాతో ఎంత మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించినా ఇద్దరూ ముందుగానే కూడబలుక్కున్నట్లు ముభావంగా ఉండిపోయారు. వారికి తెలుసు ఆశ్రమ నియమాల ప్రకారం పిల్లలు వెళ్ళే వారితో ఆనందంగా లేకపోతే వారి ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకెళ్లడం కుదరదని. ఒకవేళ అయినా ఆయన తీసుకెళతానని అంటే అప్పుడు అందరి ముందు గట్టిగా ఏడ్చి వెళ్ళమంటూ మొండి కేస్తే సరి అనుకున్నారిద్దరూ. తను కలెక్టర్ ని అని భయంతో అలా బిగుసుకు పోతున్నారా అనుకున్నాడు కలెక్టర్. సరే మరో రెండు రోజులు గడిపితే మాలిమి అవుతారు కదా అనుకున్నాడు. కాని ఆరు రోజులు గడిచినా అదే వరస.

         ఆ రోజు చివరి రోజు.  “ఈరోజు చివరి రోజు. మీకు నాతో రావడం ఇష్టం లేకపోతే చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అంతే కాని ఇలా కావాలని మాట్లాడకుండా ఉండకండి. నాకు తెలుసు మీరు కావాలనే నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారని” అన్నాడు ఆయన. ఇద్దరూ మాట్లాడలేదు.

“సరే! మీరు మాట్లాడకపోతే నేను వెళ్ళిపోతాను. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. అప్పుడు సద్వినియోగ పరుచుకునేవాడే తెలివైనవాడు.”

“మాకు తెలుసు గానీ ఎవరైనా మంచోళ్ళనే (అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారినే) దత్తత తీసుకుంటారు. కానీ ఎవలూ (రూ మీలా) మాలాంటి గుడ్దోల్లని తీసుకోరు. మా బతుకింతే, ఎవలు దీస్కబోయినా గీ జన్మల గింతే. మా కె ప్పటికీ ఒకరి తోడు గావాలె! ఎంత కష్టపడ్డా పైకి పోలేం” సరోజంది.

“అనెవరన్నారు? దృష్టిలోపం ఉన్న ఒక చిన్న విద్యార్ధి ఏమన్నాడో తెలుసా? ‘నేను అంధుడిని. నా చుట్టూ ఏమి జరుగుతుందో నేను చూడలేను. అయితే డీ ఈవో, సబ్ కలెక్టర్ అంధుడా? (ఒడిశా) ప్రభుత్వానికి కళ్ళు మూసుకు పోయాయా? మా పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేరని వారు చూడలేదా?” అంటూ జశోబంత్ ఛత్రియా అనే విద్యార్ధి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.

కర్నూల్ కలెక్టరేట్ లో పనిచేస్తున్న మధు అనే గుమాస్తా కూడా పుట్టు గుడ్డి. కానీ ఏ ఫైల్ అడిగినా క్షణాల్లో తీసి ఇస్తాడు. అంధుడైన డాన్ పార్కర్ అత్యంత వేగంగా కారు నడిపి గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కాడు. ఇలా ఎందరో ఉన్నారు. అంటే అంధత్వం ఉన్నంత మాత్రాన ప్రశ్నించే హక్కుగానీ, చదువుకునే హక్కుగానీ ఏదీ కోల్పోము. కానీ కావాల్సింది సంకల్పం. దీక్ష, శ్రమ, పట్టుదల”

“అన్ని సక్కగుంటే గట్లనే అంటరు. మాలెక్క కళ్ళు లేకపోతె ఎంత కట్టమో తెలుస్తది”

“అరేయ్! నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెల్సా?” రాఘవయ్య గట్టిగా అన్నాడు.

“తెల్సు. జిల్లా కలెక్టర్ తోని.”

“ఆయన పేరేంటో తెల్సా? సూర్యసింహగారు. పుట్టుకతోనే గుడ్డివారు”

“ఆ... గుడ్డివారా?”

“అంతేకాదు. పేద కుటుంబం. అందరికన్నా చిన్నవాడు. చదివించే స్థోమత తండ్రికి లేదు. అన్ని ఇబ్బందులు ఎదుర్కుంటూ ఆంధ్రా బ్రెయిలీ స్కూల్లో చదువుకుని, డిగ్రీ, బీ ఈ డీ చదివి ఎవరిపైనా ఆధార పడకుండా సమాజానికి ఏదైనా చేయాలనే తపన, కోరిక తో డాక్టర్ కావాలనే కోరికను అణచుకుని కలెక్టర్ కోసం చదివారు. మొదట రాకపోయినా నిరుత్సాహ పడలేదు. టీచర్ గా ఉద్యోగం చేస్తూనే చదువుకున్నారు. సమాజ సేవ చేయాలనే ఆయన సంకల్పం గొప్పది కనుక కలెక్టర్ పదవి వరించింది. సమాజ సేవ చేస్తూ కూడా తను పడిన కష్టాలు గుర్తు పెట్టుకుని, తన ప్రయత్నాలు, తన అనుభవాలు కొందరికి పాఠాలుగా ఉపయోగపడతాయని నీ లాంటి వారిని మెరికల్లా తీర్చి దిద్ది అంధులలో స్పూర్తి నింపడానికి వచ్చిన మహానుభావుడు రా ఆయన... అసలు నీలాంటి వారికి ఆయన దగ్గర ఉండే అర్హత లేదు. పో ఇక్కడి నుండి” అంటూ రాఘవయ్య కేకలేస్తుంటే చేష్టలుడిగి నిల్చున్న శ్రీను, సరోజ లలో చలనం వచ్చి చేతులు జోడించి క్షమించమంటూ ఉన్న చోటే కూలబడి, నేలను మొక్కుతూ ఏడవసాగారు.

నల్ల కళ్ళద్దాలను సవరించుకుంటూ వారిని దగ్గరకు తీసుకున్నారు కలెక్టర్.

మరో ఇద్దరు రేపటి నుండి వెలుగులు ప్రసరింపబోతారని ఆశీర్వదిస్తున్నట్లు ఆ ప్రాంగణం లోని చిన్నగూటిలోని దేవుడు అభయముద్రతో సాక్షీ భూతమై నిలిచాడు.

 **********************

コメントの追加

2025 సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)


ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)


స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)


యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)


పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)


అమ్మ నాకంటే చిన్నది (బాలలు)


సారంగి (కథలు)


అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)


తప్పెవరిది... (కథలు)


ఒంటరి విజయం (కవితలు)


వసుధైక కుటుంబం (కవితలు)


పచ్చని కన్నీళ్లు (కవితలు)


మనసు తలుపు గడియ పడితే ... (కథలు)


మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)


తీరని ఋణం (కథలు)


వేకువ స్వప్నం (కవితలు)


రెప్ప చాటు స్వప్నం (కథలు)


గెలుపు (కవితలు)


ప్రణయేంద్రజాలం (కవితలు)


నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)


ఆత్మ సమీక్ష (కవితలు)