పరిచయం  (Author: దారల విజయ కుమారి)

"పెళ్లై వారం పదిరోజులైయింది మంచి ముహుర్తాలు లేకపోయ. ఈ లోగా నీ నెలసరి. రేపు మంచి రోజంట కార్యం ఏర్పాటు చేయమన్నారు మీ అత్తగారు"

"ఎందుకమ్మా ఇవన్నీ నాకసలు ఇష్టమే లేదు"

"నీ వరస చూస్తూనే ఉన్నా. వాళ్ళింట్లో పట్టుమని వారమన్నా ఉండకపోతివి. ఈకాలం పిల్లలు కార్యం అంటే ఎంత తొందరపడతారు.. నువ్వేమో ఈవిధంగా ఉన్నావు"

"అమ్మా అర్థం చేసుకో, అప్పుడే అవన్నీ ఏంటి,

 ఆ అబ్బాయి ఏంటో నాకు అర్థం కావాలి కదా"

"పెళ్లి అయిపోయింది ఇప్పుడు అర్థం అవడమేమిటే..

అబ్బాయి బుద్ధి మంతుడు. అందరికీ నచ్చిన సంబంధం, నిన్ను చూడగానే ఇష్టపడ్డాడు. తీరా పెళ్ళంతా అయిపోయాక ఇప్పుడిలా అంటున్నావు.

నీకేమైందే అసలు"

"అతనితో పాటు ఆ ఇంట్లో ఉన్నానా.. ఆ రాత్రి అత్తగారితో పడుకున్నాను. అతను మామూలుగానే ఉన్నాడు"

"అత్తగారితో పడుకుంటే ఇక మామూలు గా ఉండక ఇంక ఎలా ఉంటాడు"

"కొత్త పెళ్లి కూతురిని కద కనీసం మాట్లాడిద్దాం అని కానీ.. నా పట్ల అతనిలో ఆతృత కానీ, ఆసక్తి కానీ కనిపించలేదు"

"పాపం ఆ అబ్బాయి కి నువ్వు కొత్తకదా"

"మరి నాకూ అతను కొత్తే కదా. నన్ను చూడగానే కళ్ళల్లో మెరుపులు మెరవాలని నేనేం కోరుకోను, నన్ను ఎత్తుకుని తిప్పాలని అనుకోను. నన్ను చూడగానే పలకరింపుగా ఒక నవ్వు కూడా లేకుంటే ఎలా"

"కొంతమందికి పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది. అలా పెద్దవాళ్ళందరూ ఉన్నప్పుడు భార్యల వైపు చూడరు, కనీసం మాట కూడా మాట్లాడరు"

"వాళ్ళ అమ్మకు నాన్నకు కాఫీ ఇచ్చినప్పుడు,

టిఫిన్ పెట్టినప్పుడు, తన కోసం ఏదైనా చేసినపుడు కానీ కృతజ్ఞతగా ఒక మాట, కనీసం నువ్వు తిన్నావా అనే ఒక చిన్న పరామర్శ అంతే, ఇంతకంటే ఎక్కువగా ఏదీ కోరుకోలేదు నేను. అతను అది కూడా చేయలేదు"

"అబ్బాయికి చాలా మొహమాటం ఉన్నట్టుంది. సర్దుకుని పోవాలి"

"ఇదిగో ఇక్కడే నాకు నచ్చదు. అసలు సర్దుకోవాలా లేదా, ఏ విషయం లో సర్దుకోవాలి, ఎంత సర్దుకోవాలి అని నాకు తెలుసు"

"సరే సరే అవన్నీ ఇప్పుడు అవసరమా.. ముందు ముందు అన్నీ అవంతట అవే జరిగిపోతాయి"

"అవన్నీ అవసరమా అంటే అవసరమే, అవంతట అవే ఎలా జరుగుతాయి. రోజంతా కలిగిన అనుభూతులే రాత్రి అనుభవాలకు పునాది. మంచి అనుభూతి రాహిత్యమే రాత్రులు అయిష్టంగా మారడానికి కారణం"

"ఏం మాట్లాడుతున్నావే? ఏదైనా అర్థం అవుతోందా ఎవరికైనా.."

"అమ్మా నీకు సమస్య అర్ధం కావడం లేదు. నా మాటలు అర్థం కాకపోవచ్చు కానీ ఒక స్త్రీగా నా సమస్యేమిటో నీకు అర్ధం అవుతుంది. దయచేసి మేం అందరం కాపురం చేసిన వాళ్ళమే.. అన్నీ అవంతకు అవే జరిగిపోతాయి.. అందరూ అలా అన్నోళ్ళే, వాళ్ళు మొగునితో కాపురం చేయలేదా, పిల్లల్ని కనలేదా.. అని మాత్రం అనకు"

"అంటాను.. నువ్వేం కొత్తగా నేర్పించకు. అందరూ నన్ను మీ నాన్నను అంటారు ఏదీ నేర్పలేదని"

"అమ్మా నేనూ మనిషినే.. శరీరం సహకరించాలంటే మనసు మన్నించాలి దానికి చాలా ప్రశాంతత, సంతోషం కావాలి"

"ఏదీ అడగకుండానే ఇంటికే తెప్పించి ఇచ్చాడు అని నువ్వే అన్నావు. అతనితో సహా అందరూ అంత బాగా చూసుకుంటుంటే సంతోషానికేం లోటు నీకు"

"సంతోషం అనేది ఎవరికి వాళ్ళకు తెలుస్తుంది. అందరూ అన్నింటితో సంతోషంగా ఉండలేరు. రోజులో కనీసం ఒక్కసారైనా సరదాగా మాట్లాడింది లేదు, పలకరించింది లేదు. వెంటనే ఆ పరిచయంలేని వ్యక్తితో ఒకే గదిలో ఉండాలంటేనే ఎలాగో ఉంది. నాకూ మనసుంది కదా"

"నాశనమైన పుస్తకాలు చదివి చదివి ఇలా మాట్లాడటం నేర్చుకున్నావు. ఆ కార్యం కాస్తా అయిపోతే మాకు కాస్త నెమ్మది కలుగుతుంది. బయట పనులకు పోయి వచ్చే మగవాళ్ళకు నువ్వు చెప్పినవన్నీ చేసే తీరిక ఉండొద్దూ"

"అమ్మా ప్లీజ్. మొదట కార్యం అనే పదం పదే పదే అనకు, వినడానికే చాలా చిరాగ్గా ఉంది"

"అసలు పదం అదే. ఈకాలం పోకడలతో ఏవేవో కొత్తకొత్త పేర్లు"

"అమ్మా నేనేమీ వింత కోరికలు కోరలేదు. మనసులే పరిచయం కాకపోతే ఇక శరీరాలకు పరిచయం ఎలా అవుతుంది"

"పెళ్ళే అయిపోయింది ఇంకా పరిచయం ఏంటి. ఆ కాస్తా అయిపోతే  పరిచయం అదే అవుతుంది" ఈ సారి కార్యం అనే మాట రాకుండా జాగ్రత్త పడుతూ అంది సరోజమ్మ

"అయ్యో అమ్మా నీకెలా చెప్పేది"

"ఆ పరిచయం ఎట్లవుతుందో నువ్వే చెప్పు"

"మాట్లాడుకోవాలి.. మనసేంటో తెలుసుకోవాలి"

"నిన్ను చదివిచ్చి తప్పుచేసామే. మా కర్మ ఇంకా ఎందరితో అనిపించుకోవాలో" అనేసి కోపంగా వంట గదిలోకి వెళ్ళిపోయింది సరోజమ్మ.

వసుద తన గదిలోకి వచ్చేసింది. మంచం పైన పడుకుని మళ్ళీ ఒక సారి తనని తాను చెక్ చేసుకోవడం మొదలుపెట్టింది.

'అడగకుండానే సాంతం అంగీకరించకుండానే

దేహాకాశాన్నా అపరిచిత మేఘం ఎలా కమ్ముకుంటుంది. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. ఈ దేహ సామ్రాజ్యం పైన దురాక్రమణకు ఎంత మాత్రమూ సహించదు కాక సహించదు. రాయబారాలు, స్నేహ హస్తాలు ఎన్నో దారులున్నాయి. దేహానికేనా.. మనసుకూ పలకరింపులు కావాలి. పరామర్శలు ఉండాలి.

మనసును నిర్లక్ష్యం చేస్తే దేహం తో బంధం ఎలా కలుస్తుంది. తపన పడేది ఏదో దేహం కంటే‌ ముందు మనసుకోసం పడాలి. మనసు మన్నించే దాకా, స్నేహం చిగురించే దాకా, అనురాగపు విత్తనాన్ని నాటి.. అభిమానాన్ని చిలకరిస్తూ నిరీక్షించాలి.

అమ్మ అమాయకురాలు చెప్పినా ఆమెకు అర్ధం కాదు. తన కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను కాస్త పక్కగా ఆపి అతని కోసమే నడచి వచ్చిన స్త్రీకి ఎంత హార్దిక ఆహ్యానం పలికినా తక్కువే కదా. అసలు చెప్పాలంటే ఆ కుటుంబమే ఆమెను ఆదరంగా చేర్చుకుంటూ నమ్మకాన్ని కలిగించాలి. పుట్టింటిని వదిలిన బెంగను పోగొట్టి, ఖాలీని పూడ్చగలగాలి.

ఆడపిల్ల అత్తవారింటికి వచ్చేసి అమాంతంగా తనను తాను పరిచేసుకుని.. వాళ్ళ వంశాభివృద్ధి కోసం సంసిద్ధతను అంత సులువుగా ఎలా వ్యక్తం చేయగలదు. తాను వికసించింది, పరిమళించాల్సింది సంసారం కోసం మాత్రమే కాదు.. తనవేవీ ఆగిపోవడానికి కుంటుపడడానికి సాంతం మారిపోవడానికి వీల్లేదు. తనను అతను అచ్చంగా అలాగే స్వీకరించాలి.

"వసూ వసూ" తలుపు తట్టి పిలుస్తుంటే ఆలోచనలను పక్కకు నిలిపి తలుపు తీసింది.

"మీ అత్తగారు ఫోన్ చేసిందట. నువ్వు ఫోన్ తీయడం లేదని నాకు చేసింది. చేసి మాట్లాడు" చెప్పేసి వెళ్ళింది సరోజమ్మ

అత్తగారు కాల్ చేయడమేంటి. అతను కాల్ చేయొచ్చు కదా. అసలు అతనేమనుకుంటున్నాడు. పెళ్లి అయిపోగానే అన్నీ గ్రాంటెడ్ ఫర్ యూస్ అని అనేసుకుంటున్నాడా..

అత్తగారికి కాల్ చేస్తే'డేట్స్ అయిపోయాయి కదా హెల్త్ బాగుందా' లాంటివి అడిగింది.

వసుదలో ఏదో తెలియని ఉద్వేగం. తనకు ఎంతో సన్నిహితమైన స్నేహితురాలు ఉమ కంపెనీ పనిమీద వేరే కంట్రీలో ఉండటంతో పెళ్ళికి రాలేక పోయింది. అది ఉంటే ఏదైనా గైడ్ చేసేది. అనుకుంటుంటే సరిగ్గా అప్పుడే కాల్ చేసింది ఉమ

"ఏంటే పెళ్ళి కూతురా ఎలా ఉన్నావు"

"ఏం బాగలేను.. ఈ ఫస్ట్ నైట్ చేస్తాం అని చంపేస్తున్నారు"

"హ్యాపీ గా ఒప్పేసుకోక ఏంటే నీ గోల"

"అతని ఆలోచనా విధానం ఏంటో తెలుసుకోవడం నాకు చాలా అవసరం.. కాస్తైనా స్నేహం కలవకనే దగ్గరికి ఎలా వెళ్ళగలనే"

"పెద్దలు మాట్లాడి పెళ్లి చేసినపుడు ప్రతి అమ్మాయికీ ఇలాంటి ఆలోచనలే ఉంటాయి.. కానీ నీలా బయటపడేది కొందరే. నీ తల్లి దండ్రులు ఈ స్వేచ్ఛను ఇచ్చారు. ఈ విషయం లో నువ్వు అదృష్టవంతురాలివే"

"నిజమే అందరికీ ఈ అవకాశం ఉండక పోవచ్చు. సంప్రదాయాలంటే నాకూ గౌరవమే కానీ అదే

సంప్రదాయాల కింద పడి నలిగి పోవడానికి నేను సంసిద్ధంగా లేను"

"కార్యాలకు ముహుర్తాలను నిర్ణయించి ఏర్పాటు చేసే పెద్దలు.. ఇద్దరు మనుషులు వారి మనసులు కలిసేందుకు అనువైన వాతావరణం పరిస్థితులు ఉన్నాయా లేదా అని ఒక్కసారైనా ఆలోచించరెందుకో. ఒక్కసారైనా అమ్మాయి వైపునుంచి కూడా ఆలోచించే ఆలోచన వారికి రావడం లేదెందుకనో"

"మనసును ముడుచుకుని శరీరాన్ని ఎలా విప్పార్చగలదు? దేహంతో ఈ ప్రయాణం లో మనసు కూడా జతగా నడవాలనే నేను కోరుకుంటున్నా. కేవలం దేహాలతో బతికేస్తూ జీవితాంతం మానసికంగా అపరిచితులు గా బ్రతికి రాలిపోయిన వాళ్ళది ఎంత విషాదకరమైన ముగింపులో కదా"

"నీ విషయంలో అలా జరగరాదు. అయినా అత్తారింటిలో అందలాలను సిరి సంపదలను మరేదో మరేవో కోరుకోదు స్త్రీ, ఒక అపరితురాలుగా వచ్చిన కోడలు శాంతిగా నెమ్మదిగా ఆహ్లాద కరంగా ఉన్న వాతావరణంలో భర్తతో కలిసి జీవించగలగే అవకాశం కల్పించమనే కదా అడుగుతుంది"

"అవును ఉమా నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు"

"నాన్నతో చెప్పావా"

"ఎందుకో ఈ విషయం గూర్చి మాట్లాడలేక పోయాను.

నాన్నతో ఎన్నో విషయాలు చర్చించే నేను ఈ విషయం లో చర్చించేందుకు కొంత బిడియం అడ్డొస్తోందే ఉమా"

"పర్వాలేదు అమ్మ ద్వారా తెలిసుంటుంది. నాన్నకు అర్థం అవుతుంది. నువ్వేమీ అప్ సెట్ కావద్దు"

"కొంత అంటే కొంత సమయం కావాలి. ఈలోగా అతనితో కాస్త పరిచయం.. స్నేహం పెరిగే పరిస్థితులుంటే నన్ను నేనే ఇచ్చేసుకుంటాను. దానికి బలవంతం ఎందుకనే నేను అంటోంది"

"ఇందులో నువ్వు అడుగుతోంది బలవంతంగా గదిలోకి నెట్ట వద్దు అని. ఇది అతనికి కన్వే అయితే చాలు. అసలు ఇవన్నీ కాదు వసూ నువ్వు నేరుగా అతనితోనే మాట్లాడితే మేలు. ఆ అవకాశం కోసం ప్రయత్నం చేయ్" అని ధైర్యం చెప్పి కాల్ కట్ చేసింది ఉమ.

ఉమతో మాట్లాడాక తెలియని భరోసా దొరికిన ఫీల్ తో

నిద్ర లోకి జారుకుంది వసుద.

******************

"ఇక నా వల్ల కాదు మీ కూతురు తో"

"ఏమయింది"

"ఆడపిల్ల అత్తవారింటికి పోవాల్సిందే ఏదో ఒక రోజు ఆ పెద్ద పెద్ద చదువులు ఎందుకు అంటే విన్నారా. అది ఆడించినట్లు ఆడారు. ఇప్పుడు అది మాటే వినకుండా తయారయింది"

"ఏమయిందంటే చెప్పవు పాత దండకమంతా చదువుతావు"

"కార్యానికి సిద్దం చేయమని వియ్యంకులు కబురు పెట్టారు. మూడు ముహుర్తాలు గూర్చి చెప్పి ఏది వీలుగా ఉంటే అది ఎంచుకోమని మనకే చెప్పారు"

"మంచిదే కదా"

"అది దాని డేట్సు అన్నీ అయ్యాక సిద్దం చేద్దామంటే ఒకటే వాదన.. నాకు ఇష్టం లేదు అని"

"అల్లుడంటే ఇష్టం లేదందా"

"అలా ఏం అనలేదు. నాకిష్టం లేకుండా కార్యం సిద్దం చేయకండి అని అంటోంది"

"కారణం ఏమైనా చెప్పిందా"

"అదేదో అల్లునితో పరిచయం కావాలట నిదానంగా చెప్తాను అంటోంది"

"అదేదో చెప్పిందిగా ఇందులో గొడవేముంది. అదే చెప్దాం వాళ్ళతో"

"మీ వళ్ళే అది అంత గట్టిగా మొండిగా అయింది"

"అది తెలివైంది. ఈ కాలం అమ్మాయిలకి ప్రతినిధి. ఈ తతంగాలన్నీ లేకుండా కొన్ని రోజులు వాళ్ళను ఏకాంతంగా ఉండనిద్దాం.. ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు"

"ఇప్పటికే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారట ఏమైందో ఇంకా కార్యం జరిపించ లేదు అని"

"ఎవరు చెప్పారు"

"ఎవరు చెప్తే ఏమి ఉన్నదే అంటారు"

"వాళ్ళకంటే ముందు నువ్వే అనేట్టుగా ఉన్నావు"

"మరి వాళ్ళ అత్తగారికి ఏం చెబుదాం"

"నేనే ఏదో చెబుతాలే. నువ్వు కంగారు పడి దాన్ని ఏమీ అనకు" భర్త రంగనాథయ్య మాటలతో కాస్త నెమ్మదించింది సరోజమ్మ.

*************

వసుద పెళ్ళయ్యాక మొదటి సారి పుట్టింటికి వచ్చిందని తెలిసి వసుద స్నేహితులు బంధువులు వచ్చి పలకరించి వెల్తున్నారు.

వసుద చిన్ననాటి స్నేహితురాలు సుమన వచ్చింది సాయంత్రం. సమయం చూసి సుమనకు విషయం చెప్పి ఎలాగైనా వసుదను ఒప్పించాలని అనుకుంది సరోజమ్మ.

టీ తీసుకుని వాళ్ళున్న రూం కొచ్చింది. వాళ్ళ మాటలు విని ఆగిపోయింది.

"మన మనీషా ఏం చేసిందో తెలుసా వాళ్ళ ఫస్ట్ నైట్ హాటల్ లో అరేంజ్ చేసారట. తనకు కావాల్సినవి బట్టలు అన్నీ బ్యాగ్ లో సర్దుకుని తనే హోటల్ కు వెళ్ళిపోయిందట. అబ్బ ఎంత ఫాస్ట్ ఈ పిళ్ళ అని చాలా ఆశ్చర్యపోయారు" సుమన అంటోంది

"ఇందులో ఆశ్చర్యం ఏముంది. అది తన అవగాహన. ఈ బంధువులు.. ఇంట్లో వాళ్ళు.. అందరి మధ్య నేను నా భర్తతో ఫ్రీగా ఎలా ఉండగలను అంది. హోటల్ కావాలని తనే అడిగిందట నాతో చెప్పింది"

"అవునా.. మరి నీ సంగతేంటి"

"నాకు కాస్త టైం కావాలని అడిగాను. అమ్మ ఒకటే గోల"

"పాపం ఆంటీ అమాయకురాలు మీ అత్త గారు వాళ్ళంతా ఏమంటారో అని ఆమె భయం"

"అందుకే నేనే మా చరణ్ తో మాట్లాడాలని అనుకుంటున్నా"

"ఆ పని చేయ్. తనూ బాగా చదివాడు కదా అర్థం చేసుకోవచ్చు"

సరోజమ్మ కు కాస్త రిలీఫ్ గా అనిపించింది. ఏమీ తెలియనట్లుగానే లోపలికొచ్చి సుమనను పలకరించి, ఇద్దరికీ టీ ఇచ్చేసి బయటకొచ్చేసింది.

**************

ఈ విషయం మధ్య వర్తి ద్వారా చెప్పించారు. వాళ్ళు ఏవేవో అన్నారు. సంగతి తెలిసి బంధువులు కొందరు చాలా వెటకారంగా విమర్శలు చేసారు.

"ఈపాటికి అన్నీ అయిపోయి ఉంటాయి"

"ఈ కాలం పిల్లలకు చాలా బరితెగింపు, సిగ్గూ ఎగ్గు లేవు"

"కాలేజీ చదువులు చదవే వాళ్ళకు బయట ఉద్యోగాలు చేసే అమ్మాయిలకు శీలం మానం ఎక్కడుంటుంది" ఈరకమైన మాటలు కొందరు బాహాటంగానే అనేసారు.

"ఇన్నేళ్ళుగా బాగా చదువుతుంది చక్కగా ఉంది అని మిడిసిపోయారు అది బాగ బుద్ది చెప్పింది" అన్నారు. కొన్ని మాటలు తనే స్వయంగా విన్న వసుద వెక్కి వెక్కి ఏడ్చింది. వసుద అత్తగారింట్లో ఏవేవో వాదనలు వినిపిస్తున్నాయి. వసుద తల్లిదండ్రులను అందరూ కలిసి దులిపేసారు. అసలు ఈ సంబంధం నిలుస్తుందా లేదా అని అనిపించింది.

ఒక రోజు పెళ్లి కొడుకు వసుదకు స్వయంగా ఫోన్ చేసి అత్తగారింటికి వస్తున్నట్టు గా చెప్పాడు. దాంతో అందరూ తేలికపడ్డారు.

***************

"నాతో మాట్లాడాలి అన్నావట" వసుదనే సూటిగా చూస్తూ అన్నాడు చరణ్

వసుద కూడా చరణ్ కళ్ళల్లోకి చూస్తూ

"అవును" అంది

మాట గంబీరంగా ఉంది. మనిషి మంచిగానే ఉన్నాడు అని అనుకుంది వసుద.

"వెరీ స్ట్రేంజ్.. పెళ్ళయ్యాక భర్తతో మాట్లాడాలి అని అడగటం"

"అలాగే అనుకుంటారని నాకు తెలుసు.. అయినా సరే మాట్లాడటం నాకు చాలా అవసరం"

"పెళ్ళంటే భయమా"

"లేదు. ఇన్ఫాక్ట్ చాలా ఇష్టం. నా కాబోయే భర్త కోసం ఎంతో ఎదురు చూసాను"

"అందరమ్మాయిలూ అలానే ఎదురు చూస్తారు కద"

"మనం టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందామా"

"ఓకే" అనగానే ముందుగా వసుద మెట్లపైకి దారితీసింది.

అక్కడ ఒక టేబుల్ మూడు కుర్చీలు ఉన్నాయి. గోడకు కాస్త దగ్గరగా ఒక మంచం ఉంది.

"ఓ.. ఇక్కడ ముందే రెడీ చేసారా" అన్నాడు అవన్నీ చూస్తూ

"ఇవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. నేనూ నా ఫ్రెండ్ కంబైన్డ్ స్టడీ చేసుకునే వాళ్ళం. ఒక్కోసారి నాన్న నేను మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు మంచం పైన పడుకుని ఆకాశం చూస్తూ టైం పాస్ చేస్తుంటాను"

చరణ్ వసుదనే చూస్తుంటే తనకేం అర్థం అయిందో కానీ మళ్ళీ వసుదే అంది

"మీరు నా హస్బెండ్ కదా అందుకే ఫ్రీగా మాట్లాడుతున్నాను"

వసుద అలా అనగానే చరణ్ చిరునవ్వు నవ్వుతూ

"అవును నీకు సర్వహక్కులు ఉన్నాయి. ఏదైనా మాట్లాడొచ్చు" అన్నాడు మనస్పూర్తిగా

"మీరేమీ అనుకోనంటే ఒకే ఒక్క ఐదు నిమిషాల పాటూ అలా ఏదీ మాట్లాడుకోకుండా కూర్చుందాం" అనగానే చరణ్ ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడగకుండానే చిరునవ్వు తో తల ఊపి సమ్మతి తెలియజేశాడు.

ఐదు నిమిషాలు గడిచాక

"ఈ ఐదు నిమిషాలు మీరు ఏం ఆలోచించారో సిన్సియర్ గా చెప్పండి. నేనూ చెబుతాను" అంది

"ఈ ప్రపోజల్ నీదే కద మొదట నువ్వే చెప్పు"

"డిగ్రీ లోకి వచ్చాక చదువుకోవడం అయిపోగానే ఆ మంచం పైన పడుకుని చందమామ తో మనిషికి ఆత్మీయ అనుబంధం ఎలా ఏర్పడింది అని ఆలోచిస్తూ చుక్కలను లెక్కబెట్టే దాన్ని. తర్వాతర్వాత.. అరచేతుల్లో ఎర్రగా..

పూచిన గోరింటను చూసి మంచి మొగుడు వస్తాడా అని గుసగుసగా గుంభనంగా అడుగుతూ నవ్వుకునేదాన్ని. నాకు కాబోయే వాడు ఎక్కడున్నాడో అన్న ఊహలు మొదలయ్యాయి. ఈ విషయం గూర్చి స్నేహితులతో చర్చించాలన్నా చాలా బిడియంగా అనిపించేది. పీజీకి వచ్చాక కొంచెం మెచ్యూర్ గా ఆలోచించడం అలవాటైంది.

ఇపుడు ఈ సమయంలో ఇలా నా జీవిత సహచరునికి దగ్గరగా కూర్చిని మాట్లాడే అవకాశం ఇచ్చిన కాలమా నీకు వందనం అని అనుకున్నాను" చెప్పడం ఆపి చరణ్ వైపు చూసింది అతను నవ్వుతూ వింటున్నాడు

"ఇప్పుడు మీరు చెప్పండి" అని అనగానే

"నేను చాలా ప్రాక్టికల్ మాన్ ను వసుదా. ఎప్పుడూ మెరిట్ లోనే ఉండాలని  పేరెంట్స్ టీచర్స్ నుంచీ ప్రెజర్ ఉండేది. చిన్న ఏజ్ నుంచే చదువుపైనే దృష్టి. అందువల్లనో ఏమో ఎమోషన్స్ ను యాజిటీస్ గా ఎక్స్ప్రెస్ చేయలేను. భార్యగా ఈమె నా లైఫ్ లోకి వచ్చించి ఈ విషయం లో నాకేమీ తెలియదు. మంచి అమ్మాయి లా ఉంది తనను బాగ చూసుకోవాలి" అని అనుకున్నాను అని చెప్పగానే. వసుద తన

అరచేతిని నుదురుకు ఆనించుకుని

"నా గూర్చి ఏమీ తెలియకుండానే మంచి అమ్మాయి అనే మొదటి కాంప్లిమెంట్ కు షుక్రియా" అంది నవ్వుతూ

"ఈ విషయం లో నీకు నాకంటే నీకే ఎక్కువగా క్లారిటీ ఉందని నాకు అర్ధం అయ్యింది. అందుకే కొన్ని నా డౌట్లు అడగనా"

"బలే వారే. అడగండి నాకు తెలిసింది చెబుతాను"

"ఒక భర్త నుంచీ ఒక కొత్త పెళ్ళి కూతురు ఏం ఆశిస్తుంది..?"

"కొన్ని ప్రేమ భావనలను వ్యక్త పరచాలి.. కొన్ని క్రియల్లో చూపించాలి. రెండు మనసుల మధ్య మరులు ముసిముసిగా నవ్వాలి. కన్న కలలు బేరీజు వేసుకోవాలి. కాలమెలాగైనా.. కదిలిపోతుంది, ఆ వెంట జ్ఞాపకాలూ.. తరలిపోతాయి కానీ, ఎంతో కొంత కాలం తర్వాత వెనుదిరిగి చూసుకుంటే మరపు రాని బాధలా కాకుండా కొన్ని చెక్కు చెదరని కమ్మటి జ్ఞాపకాలు నా కోసం ఉండాలని ఆశ పడుతుంది. ఎందుకంటే నా ఆశ కూడా అలాంటిదే"

"కాపురానికి ఏం కావాలని స్త్రీ కోరుకుంటుంది..?"

"నిశ్శబ్దం గా నా పని నేను చేసుకుంటూ.. కాలంలో నడుస్తున్నప్పుడు అతనితో కలబోసుకున్నవి కూని రాగాలు తీయాలి.. కితకితలు పెట్టాలి.. ఎవరికీ తెలియనివి.. కొన్ని దేహానికి మనసుకు సంబంధించిన రహస్యాలు మా జంటకే

ప్రత్యేకమైనవి కొన్ని ఉండాలని నాలాగే చాలా మంది కోరుకుంటారు"

"ఏవేవి ఉంటే సంతృప్తి కలుగుతుంది..?"

"ఇంతకు ముందే తనని కలిసుంటే ఎంత బాగుండేది అనో.. ఇక ఈ జీవితానికి ఈమెతో కలుసున్న అనుభూతులు ఇవి చాలు అనో.. తానే లేకుంటే ఏమైపోయేవాడిని అనో.. ఏదో ఒకటి భర్తతో అనిపించగలిగితే.. ఆ స్త్రీ కి అంతకంటే ఇంకేం అవసరం లేదని అనుకుంటారు"

"నీకేం కావాలి నానుంచి..?"

"మనం మాట్లాడుకుంటే‌ పక్కనే వయోలిన్ లో సంగీతం వినబడాలి.. నా గూర్చి కవిత అలవోకగా రాసేయాలి.. అనేలా.. నేను మరీ అలాంటి ఊహల్లో ఉండను. నా కోసం సమయం కేటాయించేందుకు ఏ కారణమో వెతుక్కునే పరిస్థితి రాకూడదు. నిజాన్ని మరి దేంతోనూ సబ్స్టిట్యూట్ చేయకూడదు"

"కళ్లు మూసుకుంటే ముగిసిపోయే రాత్రి కాదు ఇది కమ్మని కాపురానికి ప్రారంభం. నేను డిస్సప్పాయింట్ అవలేదని అబద్దం చెప్పలేను.. కానీ నీ కోరిక చాలా సమంజసమే" చరణ్ అలా నిజాయితీగా అనగానే

"ఇలాంటి ఏవేవో ఆలోచనలన్నీ పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా"

"నో నో అలాంటిదేమీ లేదు. పెళ్లి గూర్చి కాపురం గూర్చి తెలుసుకోవాలని గూగుల్ లో ఏదేదో సెర్చ్ చేసాను. ఓపెన్ గా చెప్పాలంటే నాకూ కాస్త నెర్వస్ గానే ఉంది. నువ్వన్నది నిజమే మన మధ్య స్నేహం మొదలవ్వాలి మొదట"

"థాంక్యూ చరణ్. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎంత మాట్లాడుకున్నా.. బయట కలిసి తిరిగినా మనం కపుల్ కాబట్టి ఎలరూ అభ్యంతర పెట్టరు. హస్బెండే బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది"

"నీకు సంబంధించిన ఏ చిన్న ఆశను ఆలోచననైనా

సరే ఛిన్నాభిన్నం కానీయను. భార్యాభర్తలు ఇద్దరూ కలవడం అనేది అద్బుతమైన అనుభవం కావాలి అంతే కానీ నైట్ మేర్ లా మారకూడదు. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను" అని అన్న చరణ్ కోసం

అసంకల్పితంగా చేయి ముందుకు చాచింది వసుద. ఆమె కళ్ళల్లో కురుస్తున్న నవ్వుల పువ్వులను ఏరుకుంటూనే తనూ చేయి కలిపాడు చరణ్.

ఎద కాగితం పైనే ఎవరైనా మరుల గీతమెందుకు రాస్తారో.. ఇంకా పూర్తిగా మౌనం వీడని ఈ మనసులు తెలుసుకోవాలి. అనురాగమనే ఆత్మీయ భాషను

అనర్గళంగా మాట్లాడటమెలాగో అవుపోసన పట్టాలి

తోడునడిచే జత అడుగుల కోసం పరితపించిన వీళ్ళు.. విప్పి చెప్పలేనివి చెప్పకనే తెలిసుకుంటూ.. బాల్యం లో బీజారుకున్నవి.. యవ్వనం లో మూటగట్టుకున్నవి..

ఒకరికొకరు పంచుకుంటూ.. ఒకరికి మరొకర్ని సాంతం ఇచ్చేసుకోవాలని ఎంతగానో అనుకునేలా.. ఆరాట పడేలా.. వీళ్ళకు కాలం కలిసిరావాలి.

వాళ మధ్య స్నేహం ఇప్పుడే మొదలైంది. ఆలుమగలు స్నేహితులైతే ఇక జీవితం మహా నదే.


コメントの追加