జాలరి  (Author: పొత్తూరి సీతారామరాజు)

ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. అక్కడ జాలర్లకు అది అన్నం దొరికే చోటు. ఆకలి తీర్చే ఆ తీరం వాళ్లకి అమ్మ. అక్కడి నుంచి ఎవరూ కదలరు. ఎన్ని తుఫాన్లు చివరికి సునామీ వచ్చినా.

ప్రభుత్వం వారు వచ్చి, తుఫాన్ సురక్షిత కేంద్రాలకు పంపినా. ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు.

సముద్రపు ఒడ్డున నివాసమున్న వాళ్ళ శరీరాలు ఉప్పుగాలి తగిలి ఉక్కు పిడుగుల్లా మారిపోయాయి.

ఎండా, వాన, గాలి, చలి వాళ్లని ఎప్పుడూ బాధించవు. అందుకే వారు దేనిని చూసినా భయపడరు. అసలు మరణ భీతి లేని ఏకైక మానవుడు మత్స్యకారుడే. నీటి మీద కాకుల్లా వారు నిత్యం జీవనం సాగిస్తారు. సముద్రపు వేటలో కొన్ని రోజులు, కొన్ని నెలలు పట్టొచ్చు తిరిగి రావడానికి, సముద్రం మధ్య లోకి వేటకు వెళ్లిన పెద్దపెద్ద బోట్ల లోని చేపలు చిన్న చిన్న మరపడవల్లోకి దిగుమతి చేసుకొని, తీరంలో వేలం పాట పాడే కొనుగోలుదారులకు అమ్ముతారు, వాళ్లు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వాహనాల ద్వారా పట్టణాలకు విదేశాలకు రవాణా చేస్తారు.

వేల నుండి లక్ష రూపాయలు ధర పలికే చేపలు, సముద్రం నుండి ప్రతి యేటా దిగుమతి అవుతూనే ఉంటాయి. ప్రతిరోజు కోట్లలో వ్యాపారం జరిగినా, ఇక్కడ వీరంతా సామాన్య జీవితమే గడుపుతారు.. మధ్యలో దళారీ వ్యాపారం రాష్ట్రం దాటి, విదేశీ మార్కెట్లో అత్యధిక ధరకు మారకం జరుగుతుంది మృత్య సంపద. గాలివాటు జీవితాలు. ఒకసారి వేటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవచ్చు. తుఫాన్ లో చిక్కుకున్న బోట్లు, మరపడవలు మునిగిపోయి, మనుషులతో సహా జాడ కనిపించక పోవచ్చు. ప్రభుత్వం పంపించిన ప్రత్యేక సహాయక బృందాలు, హెలికాప్టర్లలో వెతకడానికి వస్తాయి. కొన్నిసార్లు వీళ్ళ ఆచూకీ తెలిసినా, మరికొన్ని సందర్భాలలో తెలీదు.

ఇంటిదగ్గర భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు కళ్లలో ఒత్తు లేసుకొని వేటకు వెళ్లిన తమ వాళ్లకోసం ఎదురుచూస్తుంటారు.

తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఒడ్డునే గంగమ్మ తల్లి గుడి. ప్రతిరోజు అమ్మోరికి నైవేద్యం పెట్టనిదే, ఎవరూ సముద్రం మీదకు వెళ్లరు. ఎన్నో ఏళ్ల నాటి పురాతన నల్లరాతి విగ్రహం. గుడి ముందు ఓ పెద్ద గంట. వందేళ్ళ క్రితం, అప్పటి ఊరి పెద్ద అంకయ్య... గుడి కట్టి అమ్మోరుని ప్రతిష్టించి, గుడి ముఖ ద్వారంలో గంట కట్టాడు. వేటకు వెళ్లే ముందు జాలర్లు అమ్మోరికి దండం పెట్టుకొని కానీ సముద్రం మీదకు వెళ్లరు.

సాయంకాలం చీకటి పడిన తర్వాత చిన్నా పెద్ద, ముసలి ముతక అక్కడే గుమికూడి ఉంటారు. చిన్న పిల్లగాళ్ళు గోచీలు ధరించి, ఇసుకలో గెంతులు వేస్తూ ఆటలు ఆడుకుంటారు. వయసులో ఉన్న మరి కొంతమంది యువకులు, సముద్ర కెరటాలకు ఎదురెళ్లి ఈత నేర్చుకుంటారు. మరి కొంత దూరంలో ఎండు పుల్లలు పోగేసి, మంటేసి చలి కాగుతుంటారు. ప్రతిరోజు లెక్కలు వేసుకుని బ్రతికే జీవితాలు. సముద్రం మీద లెక్క తప్పితే కనుమరుగయ్యే గంగ పుత్రులు. వలల నిండా చేపలు పడ్డ రోజే వాళ్ళ ఇంట్లో కడుపులు నిండినట్లు.

..........................

"అట్ట ముక్కు మూసుకుని వత్తారేటి బాబూ! ఉప్పునీటిలో పుట్టిన చాప వాసన కంటే.. మురికి నీటిలో పుట్టిన మనిషికే నీచు వాసన ఎక్కువ బాబూ..!"

"ఏంట్రో వీరిగా! వేదాంతం వల్ల బోత్తన్నావ్! ఏటీ ఇసయం? ఇయాల ఎన్ని వలలు ఒడ్డుకొచ్చాయేటి?" అడిగాడు జెట్టీల మేస్త్రి మంగులు.

"ఫుల్లుగా పడ్డాయటండి. నేను ఇయ్యాల ఏటకెళ్లలేదండి. మావోళ్లంతా వచ్చేఏల అయిందండి" అంటూ దూరంగా ఉన్న కుర్చీ తెచ్చి వేశాడు సంగాడి వీరన్న.

"ఒరేయ్ వీరిగా! కుర్చీ ఓ పక్కగా ఒరిగిపో నాది, దీని కోడు కింద చెక్క ముక్కొటి తెచ్చి పెట్టరా" అన్నాడు మంగులు.

"అట్టనే బాబు!" అంటూ కుర్చీ కదలకుండా, కోడు కింద దాపెట్టాడు వీరన్న.

"నా వంక అలా ఎగా దిగా చూస్తావ్ ఏంటిరా! కానా గంతలమ్మే కాటమ్మ వచ్చినాదేంట్రా?".

"నేదు బాబు ఇంకా రానేదు. ఈ పాటి కి వచ్చేయాలే! మనకు పోటీగా మనతోపాటు రోజూ చేపల పాట పాడుతుంది దాని ధైర్యం ఏంట్రా? దాని వెనకాల ఎవరు ఉన్నార్రా?" అన్నాడు మీసం మెలేస్తూ మంగులు.

"చెట్టు అంత కొడుకు చెంచులు ఉన్నాడుగా బాబూ! ఆడే ఆమె ధైర్యం. ఆడు సంద్రం మధ్యలోకి వెళ్లి వల విసిరితే, చేపలన్నీ మంత్రం వేసినట్లు వలలోకొచ్చి కూసుంటాయట" అంటూ మాసిపోయిన పంచె లోంచి, సగం కాల్చి ఆరిపోయిన చుట్ట ఒకటి బయటికి తీయబోయాడు ఎలిగించడానికి.

వీరి గాడి వైపు కోపంగా చూస్తూ "ఎదవ నాయాల! నా ఎదరే చుట్ట కాలుత్తావా!" అన్నాడు మంగులు.

"తప్పైపోనాది బాబూ. నాలుక లాగేత్తేను.! అందుకే ఆగలేక తీసినాను బాబు. ఇంకెప్పుడు ఆట్ట చేయను బాబూ" బ్రతిమాలుతూ అన్నాడు వీరిగాడు.

"సర్లే గాని, పడవలు వచ్చేఏలైనాది చుక్కమ్మ టీ కొట్టుకుపోయి, ప్లాస్కు నిండా టీ పట్రా. అట్టాగే గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ పెట్టె కూడా మర్చిపోమాకు."

.................

కాటమ్మ భర్త కట్టె బోయిన సాంబయ్య చనిపోయిన తర్వాత, కొడుకు చెంచుల్ని, కూతురు కొర్లమ్మను గారాబంగా పెంచి, పెద్ద చేసింది. కొర్లమ్మను ఉప్పాడ పక్కనే ఉన్న, మూలపేటలో సందాడి గంగన్న కొడుకు మారెన్నకి ఇచ్చి పెళ్లి చేసింది. మారెన్నకు రెండు బోట్లు ఉన్నాయి. ప్రతి ఏటా జరిగే మూలపేట మొండి జగ్గప్ప తీర్థంలో, కొర్లమ్మని ఏడిపించారని ఒక సంవత్సరం ఉగంపేట కుర్రాళ్లను చితకబాదాడు చెంచులు. అప్పటినుండి ఆ ఊరి నుండి మూలపేట మీదగా కాకినాడ వెళ్లాలంటే... అందరికీ భయమే.

కొర్లమ్మ చూడడానికి నల్లగా ఉన్నా అప్పుడే పడ్డ కూనాం చేపలా మిలమల మెరిసిపోతాది. తీర్థాలలో ఇటువంటి అల్లర్లు మామూలేనని అందరూ సరిపెట్టుకున్నా, మంగులు తల్లి వంకా ఆదెమ్మమాత్రం ఊరుకోలేదు.

ఆడు ఒకడే అంతమందిని చితకబాదాడు.

"అడు వీరుడుర్రా!" అంటూ చెంచుల్ని పొగిడింది ఆదెమ్మ.

కాటమ్మకు, ఆదెమ్మకు దూరపు బంధుత్వం ఉంది. ఏదైనా పై ఊరివాళ్లు మాత్రం గొడవకు వస్తే వీరంతా ఒకటే. ఆడాళ్లు సైతం కచ్చాలు బిగించి, పులుల్లా మీదకురికి, అవతల మనుషులను పరిగెత్తిస్తారు. చెంచులు పెళ్ళాం సూరితల్లి, సముద్రం ఒడ్డు నుండి చేపల గంపలు ఆటోలో తెచ్చి, ఉప్పాడ మెయిన్ బజార్లో అందరికీ సప్లై చేసి, ఇంటికి పోతుంది. సూరితల్లి ఇద్దరి పిల్లల చదువు, ఆ ఊరి బడిలోనే సాగుతుంది.

ఉప్పాడ తీరంలో ఒక నెల రోజులు, అధికంగా చేపలు పడ్డాయి. అవి కూడా మామూలువి కాదు. విదేశాలకు ఎగుమతి అయ్యే చేపలు. వాటి పేరు చించెలు. ఇక్కడ సామాన్యులు ఎవరూ కొనలేనివి. ఆనందంతో గంతులేశారు కాటమ్మ, ఆదెమ్మ. ఈ రెండు కుటుంబాలు ఆర్ధికంగా నిలదొక్కుకున్నాయి.

........................

సన్నని నీటి తుంపర తో వర్షం పడుతుంది. బోటు భైరవపాలెం మీదుగా సముద్రంలో వేగంగా దూసుకుపోతుంది.

 "ఓ మంగులు మామా! తడిసి పోతావ్ లోనికి వచ్చేయ్" అన్నాడు కాటమ్మ కొడుకు చెంచులు.

"లేదు లేరా... ఈడనే బోటు చివర చెక్క మీద కూర్చుంటే, సముద్రం మొత్తం కనిపిస్తుంది.. ఒరేయ్ చెంచులు! మనం భైరవపాలెం దాటి, బలుసుతిప్ప రేవు కి వచ్చేసాం రోయ్! దాదాపు పది మైళ్ళు దాటుంటావురా! ఒడ్డు నుండి చాలా లోతు రోయ్ ఈ రేవు. ఇక్కడ బాగా రేటు ఉన్న చేపలు పడతాయని మీ నాన్న సాంబయ్య చెప్పేవాడు". అంటూ సిగరెట్టు ముట్టించాడు.

ఈసారి ఇరవైమంది జట్టు ఏటకు బయలుదేరారు.

"ఈ పాలి నేను వస్తాను రోయ్!" అంటూ కూడా వద్దన్నా, బోట్ ఎక్కేసాడు మంగులు. సాంబయ్య కుటుంబానికి, మంగులు కుటుంబానికి పూర్వం తగాదాలు ఉన్నాయి. అది ఎప్పటి మాటో. ఆనాటి గొడవలు మంగులు మనసులో మెదులుతున్నా, మర్చిపోయినట్టు ఉంటాడు కానీ మర్చిపోలేదు. అంటే ఇష్టం లేకపోయినా మాట్లాడుతూనే ఉంటాడు.

సిగరెట్ కాలుస్తూనే, మధ్య మధ్యలో చేతిలో బ్రాందీ బుడ్డితో నోరు తడుపుకుంటున్నాడు మంగులు. మత్తుతో తూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న చెంచులుకి భయమేసింది మంగులు మామ జారిపోతాడేమోనని.

ఇంతలో అనుకోని సంఘటన జరగనే జరిగింది. మంగులు ముందుకు తూలి సముద్రంలోకి జారిపోయాడు. కొంచెం దూరం నుండి ఇదంతా చూస్తున్న చెంచులు గభాలున లేచి, బోటు అంచుని వేలాడుతున్న, టైర్లకు కట్టిన పగ్గాన్ని తీసుకుని... తన మొలకు చుట్టుకుని, సముద్రంలో ఉరికేశాడు. బోటు నడుపుతున్న డ్రైవరు కృపగాడు, ఇంజిన్ ఆపేసాడు. పగ్గం కట్టుకుని సముద్రంలోకి దూకేసిన చెంచులు, మంగులుకోసం వెతుకుతున్నాడు. బోట్లో మిగతావాళ్లంతా బోటు పైకి వచ్చి చూడ సాగారు. మంగులు జాడ కనిపించడం లేదు. మంగులు జారిపోయినప్పుడు బోటుకున్న మేకు గుచ్చుకుని, రక్తం కారుతుంది. మంగులు కాలిని చీల్చిన చర్మం మేకుకు అంటుకునే ఉంది.

ఇంతలో ఏదో పెద్ద శబ్దం బోటును గుద్దినట్లుగా.

ఉప్పునీటి సంద్రంలో సొరచేప నోటికి రక్తం తగిలింది.

అడవిలో పులి మాదిరిగా రెచ్చిపోయి బోటును గుద్దింది. ఇక దానిని ఆపడం ఎవరివల్లా కాదు. దొరికిన మనిషినీ, ఏ చిన్న జలచరాన్ని అయినా చంపేస్తుంది. దానితో అంత ప్రమాదకరం. చెంచులు దానిని పసిగట్టాడు. సొర తల పైకెత్తి, మీద మీదకు వస్తుంది.

దాని నుండి తప్పించుకుని, పక్కగా ఈదుతూ... దూరంగా కనిపిస్తున్న మంగులుని చూసి, నడుముకున్న పగ్గాన్ని విప్పి, మంగులు నడుముకు కట్టి, బోటు మీద ఉన్న మిగతా వాళ్లకు సైగ చేశాడు. వెంటనే వాళ్లంతా పగ్గం సహాయంతో మంగులును బోటు పైకి లాగి రక్షించారు.

తన నోటికి దొరికిన ఆహారాన్ని దూరం చేసిన చెంచుల్ని, సొరచేప వదలలేదు.

సముద్రపు అలలు ముఖానికి వేసి కొడుతున్నా లెక్కచేయకుండా, బోటు కేసి ఈదుతున్నాడు. వెనుక సొర చేప నోరు చాపి, తోకతో కొట్టడానికి ఎగిరి ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన బోటు మీద ఉన్న పాలెపు అబ్బులు, పగ్గాలు కోసే పెద్ద కత్తిని చెంచులు వైపు విసిరాడు గాలిలోనే దానిని అందుకున్న చెంచులు, సొరచేపకే ఎదురు తిరిగి, నరకడం మొదలుపెట్టాడు. తెల్లని సముద్రపు కెరటాలు ఎరుపు రంగు పూసుకున్నాయి.

ఎంతసేపు జరిగిందో ఆ ఎదురు దాడి తెలియదు కానీ పైనుండి చూసే వాళ్లకు మాత్రం రక్తమే కనిపిస్తుంది. చెంచులు గాని సొర చేప గాని ఎక్కడా జాడలేదు. ఇంతలో బోటు మీద ఉన్న బంధన బాబులు, చెంచులను రక్షించడానికి ముందుకు ఉరక బోయాడు.

వద్దని వారించాడు అందరిలోకి పెద్దయిన వాడపేట చిన్నారావు. "ఇప్పుడు చాలా ప్రమాదం. ఆడు సొరను చంపి, తిరిగి వస్తాడో రాడో కానీ, వాడిని మింగేసిన తర్వాత మన పని పడతాది. అంత ప్రమాదం మనిషి రక్తాన్ని రుచి మరిగిన సొర చేప. సంద్రంలో మిగతా చేపలను తిని తిని, మనిషి మాంసానికి అలవాటు పడితే... మన మీ చుట్టుపక్కలకి ఇకపై రానక్కర్లేదు. దీనితో చాలా ప్రమాదం. ఇది మాటేసే పులిలాంటిది. నీటిలో నుండి మన జాడను కనిపెట్టగలదు. దానిని కనిపెట్టలేము సరి కదా.. మనం ఏమీ చేయలేం" అంటూ బాధపడుతూ అలాగే కూర్చుండి పోయాడు.

"బోట్ స్టార్ట్ చేయండి మనోడ్ని వెతుకుదాం. దొరికితే చెంచులను దరికి తీసుకెళ్దాం. దొరకకపోతే! దిగాలుగా ఈ వార్త చేర వేద్దాం."

ఈలోపుగా కడుపునిండా సముద్రం నీళ్లు తాగేసిన మంగులు చేత నీళ్లు కక్కించాడు గడ్డిపేట నుండి వేటకు వచ్చిన అమ్ములు. పాపం ప్రాణం కాపాడిన చెంచులు కనిపించకుండా పోయాడు. ప్రాణం నిలిచిన మంగులు ఎక్కిన బోటు మాత్రం, చక్కర్లు కొడుతూ.. దరి వైపుకి సాగుతుంది.

..........................

ఉప్పాడ తీరం అంచున కెరటాలు ఎగసి పడుతున్నాయి. జాలర్లంతా ఒకటే గగ్గోలు పెడుతున్నారు. సముద్రం మీద ఏట కెళ్ళిన ఇరవై మందిలో చెంచులు చనిపోయాడు. తీరానికి దూరంగా పోలీస్ సిబ్బంది తిరుగుతున్నారు. మూడు రోజుల నుండి ఇదే తంతు. అసలు చెంచులు ఎలా చనిపోయాడు అన్నది, అక్కడ ఎవరిని అడిగినా చెప్పడం లేదు. సీఐ మరియదాసు కూడా వేటకెళ్ళిన వాళ్ళను విచారిస్తున్నాడు. ముఖ్యంగా మంగులును దూరంగా తీసుకెళ్లి రహస్య విచారణ చేపట్టాడు.

"మంగులూ! నీకూ చెంచులకూ పాత గొడవలు ఏమన్నా ఉన్నాయా?"

"లేవయ్యా..!"

"మరి చెంచుల్ని ఎందుకు చంపావు?"

"నేను చంపలేదు బాబయ్యా..!"

"ఇక్కడ మీ వాళ్ళు అంతా నువ్వే చంపావ్ అంటున్నారే!"

"లేదయ్యా! ఆడు నన్ను కాపాడి, సొరచేపకు ఆహారం అయిపోయాడు."

"కథ బాగా చెప్తున్నావే!"

"కథ కాదు బాబు.. నిజం చెప్తున్నాను. నాకు చెంచులు గాడి మీద కోపం ఉన్న మాట నిజమే కానీ, ఆడిని చంపేసే అంత కక్ష లేదయ్యా."

"మరి చనిపోయిన చెంచులు కనిపించకుండా పోయాడు! శవం కనపడితే కానీ మేము పంచనామా చేయలేం. నువ్వు ఎంత అడిగినా చంపలేదు అంటున్నావ్!"

"లేదు బాబు! నన్ను బోటు మీదికి రక్షించి ఇసిరేసాక, మరి నాకే కాదు బోట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికీ అగు పించలేదు పోలీస్ బాబూ..!!"

విచారణ జరిగే చోటుకి కాటమ్మ, కొర్లమ్మ, చెంచులు భార్య సూరితల్లి వచ్చారు. వాళ్ళ కళ్ళలో మూడురోజులుగా ఏడ్చిన కన్నీటి చారికలు ఇంకా ముఖాల మీద కనిపిస్తూనే ఉన్నాయి. సీఐ మరియదాసు దగ్గరికి వచ్చి దండం పెట్టారు.

"ఎలాగైనా మా వోడిశవాన్ని

మాకు అప్పగించండి అయ్యా!"అంటూ వేడుకుంది కాటమ్మ.

"చూడు కాటమ్మ! మూడు రోజులుగా వెతికిస్తూనే ఉన్నాం. అయినా జాడ కనపడలేదు. గజఈత గాళ్లను కూడా పిలిపించాము. అయినా ప్రయోజనం లేదు. చివరికి అందరినీ విచారించాం. ఇదిగో ఇప్పుడు ఈ మంగులును కూడా అసలు ఏం జరిగిందని అడిగితే! మీవోడ్ని

చేప మింగేసింది అంటున్నాడు. నాకు మంగులు మాటలు విని ఆశ్చర్యం వేసింది. చేప మనిషిని మింగటం ఏంటి అన్నదే ఇక్కడ ఆశ్చర్యం! మింగిన చేపను పట్టుకొంటే కానీ అసలు నిజం తెలియదు."

"ఇదిగో సూరితల్లి! నీకు ఓ మాట చెబుతున్నా విను.

మేము సాక్ష్యం దొరికితే కానీ ఏమీ చేయలేం. చట్టం అయినా కోర్ట్ అయినా సాక్షాన్ని నమ్ముతుంది. ఇక్కడ సాక్ష్యం చెప్పటానికి చేప రావాలి. ఇంతటి మహాసముద్రంలో ఏ చేప మీవోడిని మింగేసిందో మాకు తెలియదు. కాబట్టి మరి కొన్ని రోజులు ఆగి చూద్దాం. శవం తాలూకు ఆనవాళ్ళైనా కనీసం కనిపిస్తాయి ఏమో?"

"బాబూ! అయితే మా అన్నయ్య జాడ ఇంక తెలియనట్లేనా!" అమాయకంగా అడిగింది కొర్లమ్మ.

"లేదు మేము శతవిధాల చివరిదాకా ప్రయత్నిస్తాం.

చెంచులు ఇంకా చనిపోయాడు అన్నది నిర్ధారణ కాలేదు.

అతడు తిరిగి వస్తే అప్పుడు అది పెద్ద నేరం అవుతుంది.

కాబట్టి దీనికి సంబంధించిన మత్స్యకార అధికారులు,

పంచాయితీ సిబ్బంది, అందరూ పర్యవేక్షిస్తున్నారు. వీరందరూ సాక్ష్యాలు సేకరించి పంపిస్తే కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు" అంటూ సీఐ మరియదాసు కాటమ్మ కేసి తిరిగి చూసి..

"మీరంతా బాధపడకండి. మీకు ఏం సమాచారం తెలిసినా చెప్పండి. నేను తక్షణమే ఇక్కడికి బయలుదేరి వస్తాను. మీకు ఏ చిన్న ఆధారం దొరికినా తెలియజేయండి. నేను అన్ని విధాల మీకు సహాయ పడగలను" అంటూ జీపు వైపు నడిచాడు బాధతో సిఐ మరియదాసు.

***************

 మరియదాసు వెళ్ళగానే,

మంగులు, మోకాళ్ళ మీద ఇసుకలో కూలబడిపోయి,

ఓరి దేవుడా ఏంటిది! అన్నట్టుగా రెండు చేతులతో తల పట్టుకుని కూర్చుండిపోయాడు. చుట్టూ చేరిన జనాలు అంతా చిన్నగా అక్కడ నుంచి జారుకున్నారు. కాటమ్మ ఒక్కతే మిగిలిపోయింది. ఆమె మంగులు దగ్గరగా వచ్చి,

"ఏందిరా మంగులు ఇది! నిజం చెప్పు! చెంచుల్ని నువ్వు ఏటైనా చేసినావా?" అంది ఏడుపు మొహంతో.

"నాకు ఆడి మీద కోపం ఉన్నమాట నిజమే కానీ ఆడిని చంపేసే అంత కోపం లేదు కాటమ్మ"

"అయితే నిజంగానే చేప తినేసింది అంటావా మంగులు?"

తల కిందకు దించుకొని, తల గోక్కుంటూ, బెదురుగా కాటమ్మ వైపు చూస్తూ.. "మరే.. అసలు.. ఏటైనాదంటే? నేను తాగిన మత్తులో పడవలోంచి పడిపోయాను. ఎంటనే చెంచులు సముద్రంలోకి దూకి, నన్ను కాపాడేసాడు.

నేను బోటేక్కేశాను. కానీ ఆడు చాలా సేపు సొరతో పోరాడి పోరాడి, ఎట్ట కేలకు బోటేక్కేసాడు. "

ఆ మాటతో కాటమ్మ మొహం, దుఃఖపు మబ్బులు తొలగిన చంద్రుడిలా వెలిగిపోయింది. ఎంతో ఆత్రంగా తల ముందుకు చాపి, మంగులు చెప్పేది వింటుంది.

" చెంచులు పైకి వచ్చేసాక, సొర కోపంతో బోటుని తోకతో చాలాసేపు కొడుతూనే ఉంది. ఎలాగోలాగా వేగంగా అక్కడి నుంచి ముందుకి వచ్చేసాం. కొద్ది దూరం వచ్చాక,

"అరే! బోటుఏమన్నా డ్యామేజ్ అయినాదేమో సూడండి!"అన్నాడు చిన్నారావు.

"ఓనర్ కి సమాధానం చెప్పద్దు మరి!"అంటూ బోట్ పైకి వచ్చాడు. అంతా పైకి వెళ్లి పరిశీలిత్తన్నారు బోట్ ని. చెంచులు తుండుతో తడి తల తుడుచుకుంటూ.."అదే మన సొంతబోట్ అయితే ఎంత బాగుండేది! ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. ఆయిల్ పెట్టుబడి పెడితే చాలు. వలలో పడ్డ సరుకంతా మనదే అప్పుడు. కానీ ఏం లాభం! అంత డబ్బు మనకాడ ఏడది?" అన్నాడు.

అప్పుడు నాకు ఒక అవిడియా వచ్చింది.

"అరే చెంచులు! నువ్వు ఒక పని చెయ్! ఏడనో ఆడన, ఏదో ఒక డొంకల్లో నెల రోజులు ఎవరికీ కనపడకుండా దాక్కో. నేను, నిన్ను చేపమింగేసిందని సెప్తాను. సంద్రంలో చనిపోయిన వాళ్లకి గవర్నమెంటోళ్ళు 10 లక్షలు నట్ట పరిహారం ఇస్తారు కదా! దానికి కొంత డబ్బులు కలిపి బోటు కొనుక్కుని, ఎంచక్క నువ్వే ఓనర్ అయిపోవచ్చు" అని నా పానాలు కాపాడిన చెంచులకి, ఏదైనా చేద్దామని ఈ అవిడియా సెప్పాను కానీ అది బెడిసి కొట్టడమే కాదు. నేనే ఆడిని చంపి దాచేసానని, నా మీదే కేసు పెట్టేట్టున్నాడు ఆ సీఐ మరియదాసు. ఇప్పుడు ఏం చేయాలో పాలు పోవట్లేదు కాటమ్మ!" అని దిగాలుగా చూసాడు మంగులు.

కాటమ్మ, కొడుకు బ్రతికే ఉన్నాడన్న ఆనందంలో వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ " పోనీలే, ఆ గంగమ్మ తల్లి దయవల్ల నా కొడుకు బతికే ఉన్నాడు. ఓ పని చెయ్ చెంచులు.. భైరవపాలెం దిబ్బల దగ్గర, ఎవరో పడిపోయి ఉన్నారన్న వివరం తెలిసిందని, మరియదాసుకి కబురంపు. అందరు కలిసి అక్కడికెళ్దాం. కానీ, ఎల్లేముందు ఈ

ఇసయం చెంచులకి సెప్పి ఉంచు."

"మరి ఆడిని సొర చంపేసిందని సెప్పాను కదా కాటమ్మ!" "ఓ పాలి చెంచులు, మారేడుమిల్లి అడవిలోకి సరదాగా వెళ్ళినప్పుడు, పెద్ద కొండ సిలువ కాళ్ళ నుండి పైకి చుట్టేత్తే... చాకుతో చీల్చుకుని వచ్చేసాడాడు. ఇక ఆడు సొరని చీల్చుకుని బయటికి రావడం పెద్ద ఇసయమా! అదే చెబుదాం.

సొర నుండి బయటపడి, సంద్రం లో రెండు రోజులు ఈదుకుంటూ, ఒడ్డుకొచ్చి పడ్డాను అని చెంచులతో

చెప్పిస్తే సరి.

ఎదవ డబ్బులు రాకపోతే పోయాయి. నా పానానికి పానం చెంచులు దక్కాడు. అదే పది లచ్చల కన్నా ఎక్కువ. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఆ పని చెయ్!" అంటూ ఎంత పని చేసావ్! అని మంగులు జుట్టు పట్టుకొని, కిందకి వంచి, పొట్టపై చెక్కిలిగింతలు పెట్టి, కొడుకు బ్రతికే ఉన్నాడన్న ఆనందంలో పసిపిల్లలా పకపకా నవ్వేసింది కాటమ్మ.

_______________&&&&&&______________


コメントの追加