కృష్ణార్పణం  (Author: జి వి హేమలత)

ధనుర్మాస పుణ్యకాలం నడుస్తోంది. చినరావూరు రామాలయం వీధిలో ఎవరు నిద్ర లేచినా, లేవకపోయినా తెల్లవారకముందే వాకిలిని గోమయంతో కడిగి, అందమైన మెలికల ముగ్గులు పెట్టి, మధ్యలో గొబ్బెమ్మల నుంచి పసుపు కుంకుమలతో అలంకరించి హరిదాసు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గాయత్రి. ప్రాతః కాల తెలిమంచులో గుడిలోంచి వినవచ్చే తిరుప్పావై పాసురాలు వింటూ తన్మయత్వంగా ముగ్గులకి రంగులు వేయడం ఆమెకి ఎంతో ఇష్టమైన దినచర్య.

         హరిదాసు గారు అంటే నడిచి వచ్చే శ్రీ మహావిష్ణువని ఆయన అక్షయపాత్రలో అందరూ దేవతలు కొలువై ఉంటారని ఆమె నమ్మకం.

        పళ్లెం నిండా ధాన్యం, దక్షిణ, తాంబూలం, పండ్లు పెట్టుకుని తెల్లవారకముందే సిద్ధంగా ఉంటుంది. ఆయన పాడే కీర్తనలకి తన కాలి గజ్జలను లయబద్ధంగా కదిలిస్తూ తాదాత్మ్యం చెందుతుంది. హరిదాసు "బంటు రీతి కొలువు.... ఇయ్యవయ్య రామ!" అని తంబుర వాయిస్తుంటే వసారాలోంచి పరిగెత్తుకు వెళ్లి అక్షయపాత్రలోనికి దక్షిణ సమర్పిస్తున్నప్పుడు "కృష్ణార్పణం" అని ఆయన అంటున్నప్పుడు తను కూడా "కృష్ణార్పణం" అని నమస్కరిస్తుంది.

        గాయత్రి తండ్రి సోమయాజులు గారు చిన్న హుజూర్నగర్ లో ఉపాధ్యాయునిగా పనిచేసే రిటైర్డ్ అయ్యారు. పెళ్లయిన చాలా కాలానికి ఆయన కలిగిన సంతానం గాయత్రీ, గంగాధర్ లు.

        పిల్లలిద్దర్నీ మంచి విలువలతో కూడిన క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశారు సోమయాజులు గారు. భార్య లలితమ్మ కూడా భర్తకు తగిన ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. ఆయన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పని ఇల్లాలు.

         తల్లి నుంచి వినయాన్ని తండ్రి నుంచి మంచి చెడుల మధ్య విచక్షణ జ్ఞానాన్ని, నానమ్మ తాతయ్యల నుండి సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని పెంపొందించుకుంది గాయత్రి. ఉద్యోగ విరమణ అనంతరం సోమయాజులు కుటుంబాన్ని చినరావూరుకి మార్చారు. గాయత్రి వివాహానికి గంగాధర్ చదువుకి రిటైర్మెంట్ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. గాయత్రిని డిగ్రీ దాకా చదివించారు. గంగాధర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

         రామాలయంలో మూడు రోజుల నుంచి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తే భక్తుల కోసం ఎన్నో ఏర్పాట్లు.. ఇంకా, హరికథ చెప్పేందుకు వచ్చిన కళాకారులకు సంగీతకారులకు భజన బృందానికి అన్ని ఏర్పాట్లు సజావుగా సాగేలా చూసుకుంటోంది గాయత్రి.

        ఆరోజు వైకుంఠ ఏకాదశి. తెల్లవారుతుండగానే రోజులానే, హరిదాసు గారు రామనామ సంకీర్తనలతో సోమయాజులు గారి వాకిట్లో చిడతలు వాయిస్తూనే ఉన్నారు. కానీ గాయత్రి గజ్జలు చప్పుడు మాత్రం లేదు వారి ఇంటి బిక్ష రాలేదు. లోపలి నుండి స్పందన లేకపోగా ఏదో విషాదఛాయ అలముకున్నట్టు మాత్రం అనిపించింది. అక్కడే నిలబడ్డాడు. రెండు నిమిషాల తర్వాత ఎవరో ఏడుస్తున్నట్టు కూడా వినపడింది. హరిదాసు గారి గుండె కలుక్కుమంది. మనసులోనే రామునికి ప్రణతులు తెలియజేస్తూ వేడుకున్నాడు.

         "ఏ కీడూ వాటిల్ల కూడదు" అంటూ వెళ్లిపోయాడు.

        తర్వాతి రోజు కూడా గాయత్రి బయటికి రాలేదు. రామ కీర్తనలు చిడతల శబ్దం కూడా మౌనం వహించి తప్పుకోవాల్సి వచ్చింది. తల వాకిట ముగ్గు లేదు. హరిదాసు కి ఇది కొత్తగా ఉంది… వెలితిగానే ఉంది.

        ‘ఆ అమ్మాయి కాలి గజ్జెల సవ్వడితోనే నాలోని కీర్తనలు అలవోకగా పలుకుతాయి. శ్రీ మహాలక్ష్మిలా కళకళలాడే ఆ పాప ముఖం చూడకపోతే ఏదోలా ఉంది. భగవంతుడా మళ్లీ సాధారణ స్థితిని కలిగించు’ అని మనసులోనే ప్రణమిల్లి తంబూరమీటి నిరాశగా సాగిపోయాడు.

         మర్నాడు కొద్దిగా తెల్లారాక రామాలయంలో సంకీర్తన హారతి పూర్తయ్య సమయానికి హరిదాసుగారు గాయత్రి ఇంటిముందు రామకీర్తన మొదలుపెట్టబోయాడు.

        ఇంటిలో నుండి గాయత్రి ఏడుపు వినపడింది. గాయత్రి పిన్ని గాయత్రిని దగ్గరకు తీసుకొని..

        "ఏడవకమ్మ. నిన్ను నువ్వు సంబాళించుకో! నువ్వు తమ్ముడికి, అమ్మకి ధైర్యం చెప్పవలసిన దానివి” అని సర్ది చెప్తున్న పిన్నిని అమాంతం చుట్టుకుంది గాయత్రి...

        "తెలుసు పిన్ని! వాళ్ళ దగ్గర గంభీరంగానే ఉంటున్నా. ఒక్కోసారి భవిష్యత్తు గురించి తలుచుకుంటే భయం వేస్తోంది. అసహాయత ఆవరిస్తోంది…” వెక్కి వెక్కి ఏడ్చింది గాయత్రి.

        ఇంతలో ఇంకొక పెద్ద ఆవిడ..

        "అవును ఎంతైనా నువ్వు చిన్న పిల్లవే కదా! బావగారు ఇలా నిద్రలోనే సునాయాసంగా మరణిస్తారని ఎవరు అనుకున్నారు 'సునాయాసేనా మరణం'... ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఆయన పుణ్యం లోకాలకు చేరుకున్నాడు. ఆయన కోసం వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి. పిచ్చిదానా! ఎవరమైనా పోవాల్సిన వాళ్ళమే. కాస్త ముందూ.. వెనక అంతే! ఏదో ఒక రోజు నుండైయినా నీ జీవితం నీ బాధ్యతలు నువ్వు చూసుకోవాల్సిందే. అదేదో కొంత ముందే వచ్చిందనుకో!! లేచి నువ్వు ఇంత ఎంగిలిపడి, అమ్మకి తమ్మునికి కూడా తినడానికి పెట్టు. నువ్విలా డిలా పడిపోతే…మీ నాన్నగారి ఆత్మ ఎంత క్షోభ పడుతుందో ఆలోచించు” అని కర్తవ్యబోధ చేసింది.

        కొద్దిగా తెల్లవారుతుండగా.. హరిదాసు గారి నోట..“నానాటి బ్రతుకు నాటకము.. కట్టకడపదీ.. కైవల్యము..” అనే కీర్తనవిని బయటకు వచ్చి..

        “స్వామి! మీకు మా ఇంటి భిక్ష పది రోజులు ఇవ్వలేకపోతున్నందుకు క్షమించండి.. మా నాన్నగారు మొన్న ముక్కోటి రోజున శివైక్యం చెందారు…” అంటూ గొంతు జీర పోతుండగా బాధని వెళ్లగ్రక్కుకొని లోపలికి వెళ్ళిపోయింది.

         పది రోజులు కార్యక్రమాలు పూర్తవడంతో బంధువులంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. మామయ్య, తమ్ముని అమ్మని నిద్ర చేయించుకుని తీసుకొని వచ్చాడు. ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి.

        “నాన్న పింఛన్ ఇప్పుడు వాడకూడదుట. బాబాయ్ చెప్పాడు. ఉపఖజానా కార్యాలయంలో, పించనుఆఫీస్ లో డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలట మామయ్య” అంది గాయత్రి మామయ్యతో.

        ‘సర్టిఫికెట్లు సిద్ధం చేసి ఉంచు నేను వీలు చూసుకుని వెళ్తాను ఆఫీస్ కి“ అని గాయత్రి మామయ్య ఊరు వెళ్లిపోయాడు.

        గాయత్రి బాగా చదువుకుంది. తెలివైన అమ్మాయి అయితే అనుకోకుండా వచ్చిన పెద్దరికం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏమేం చేయాలో ఎలా చేయాలో అన్ని విషయాలు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంది. ముందుగా మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి డెత్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. దానితో పాటుగా, సోమయాజులు గారి పెన్షన్ పుస్తకము, అకౌంట్ పుస్తకము.. ఇంకా పింఛను అమ్మకు అందేలా చేయాలనే దరఖాస్తు, జతపరచవలసిన కాగితాలు అన్ని సమీకరించి ఆఫీస్ లో ఇచ్చింది. ఇంకా ప్రభుత్వం వారు మట్టి ఖర్చులకోసం ఇవ్వవలసిన రొక్కము కూడా త్వరగా ఇప్పించవలసిందిగా అర్జీ కూడా సమర్పించింది.

        రోజులు గడుస్తున్నా ఖజానా కార్యాలయం నుండి ఏ సమాచారము లేదు. తమ్ముడి కాలేజీకి సెలవు పెట్టించి, తోడుగా తీసుకొని ఖజానా కార్యాలయానికి తీసుకెళ్లింది గాయత్రి. పింఛన్ కాగితాలు తీసుకున్న గుమస్తా గంగాధర్ ని పక్కకు తీసుకెళ్లి "మీ పేపర్లు ముందుకు వెళ్లాలంటే అది అది..." అని చిన్నగా నసిగాడు.

        "ఆ ఏమిటో చెప్పండి. అర్థం కాలేదు!" అన్నాడు గంగాధర్. పుస్తకాల్లో లేని సమాజం.. తోడేళ్ల లాంటి మనుష్య ప్రవర్తనలు ఇంకా తెలియని అమాయక విద్యార్థి.

        "అదే… బాబు!.. కొంచెం ఫార్మలిటీస్... అవి ఉంటాయి. పాతికవేలు మట్టి ఖర్చులు, ఫ్యామిలీ పెన్షన్ మరి మీ అమ్మగారి జీవితాంతం రావాలి కదా! ఏ ఖర్చులూ లేకుండా ఉత్త పుణ్యానికి రావాలంటే కుదరదు. మీ అక్కకి ఇదంతా అర్థమయ్యేలా చెప్పు." అని చిన్నగా నవ్వాడు.

        నీళ్లు నములుతున్న గంగాధర్ ని చూడగానే విషయం అర్థమైంది గాయత్రికి. వెంటనే పిలిచింది.

        "అతనితో మనకెందుకురా బేరాలు? నిజాయితీగా మనకు రావాల్సిందే మనం అడుగుతున్నాం!. ఎవ్వరికి డబ్బులు ఇవ్వనక్కర్లేదు!! నాన్నగారు మనకు నేర్పించింది ఇంతేనా? అవసరం కోసం నియమాలను పక్కన పెట్టడం అలవాటు చేసుకుంటే... దాన్ని వ్యక్తిత్వం అంటారా? - తప్పు!! రేపు మనం సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారిని కలుద్దాం. ఈ క్లర్క్ ని ఇక కదిలించకు" అని తమ్ముడికి బోధచేసింది.

         "అక్కా! వద్దు- వీళ్ళకి కోపం వస్తే మన ఫైలు ముందుకు కదలనివ్వరు. ముందు ఎంత అడుగుతారో చూద్దాం" భయపడుతూ అడిగాడు గంగాధర్.

        ఆ పక్కనే చెట్టు కింద నిలబడి ఇదంతా గమనిస్తున్న ఓ ముసలాయన గాయత్రి ఆత్మాభిమానానికి ముచ్చటపడి "ఇదిగో అమ్మాయీ! ఆ బండి స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడే ఆయనే సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు... వెళ్లి మాట్లాడు" అని సూచన చేశాడాయన.

         గాయత్రి తమ్ముడి చేతిని గట్టిగా పట్టుకుని ఆ ఉప ఖజానా అధికారి దగ్గరికి తీసుకెళ్లింది.

        "సార్.. సార్! ఒక్క క్షణం" అంటూ ప్రాధేయపడుతూ ఆయన టూ వీలర్ కి అడ్డుగా వెళ్లిన ఆమె, ఆయన్ని చూసి నిర్ఘాంతపోయింది. తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. అచేతనురాలైన ఆమె నోరు అప్రయత్నంగానే మూగబోయింది. గాయత్రిని చూసిన ఆఫీసర్ హెల్మెట్ పెట్టుకుని బండి స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోయాడు.

        ****

        "ఏంటక్కా నువ్వంటున్నది? ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నావు? ఇంకానయం! ఆయన ముఖాన్నే అడగలేదు, పరువు పోయేది!! ఆ గుమస్తా గారు చెప్పినట్లు ఎంతోకొంత డబ్బు ముట్ట చెప్పి మన కాగితాలు ముందుకెళ్లే మార్గం చూడు. ఇంకా తెలివి తక్కువగా గాంధీజీ కాలం నాటి ఆదర్శాలు మాట్లాడుతూ కూర్చోకు!!" అక్కయ్య కి అవకాశవాదం నేర్పాలనుకున్నాడు గంగాధర్.

        “నేను చెప్పేది నిజమని నాకు తెలుసు. ఈ నిజాన్ని నమ్మించడానికి నాకు ఇప్పుడు ఒక ఆధారం కావాలి. రేపు ఒక్కరోజు చూద్దాం. నువ్వు కూడా రేపు ఉదయం త్వరగా నిద్ర లేచి ఆయన్ని గమనించు. కావాలంటే నీ ఫోన్లో ఫోటో కూడా తీసుకో. ఆయన ఎక్కువ ఇళ్లకు కూడా బిక్షకు వెళ్లరు. మన ఇల్లు, నిర్మల ఆంటీ గారిల్లు, రామాలయం పక్కన ఆచార్యుల వారిల్లు, సీతక్క వాళ్ళ ఇల్లు ఇలా కేవలం నాలుగైదు ఇల్లు బిక్ష తీసుకొని వెళ్ళిపోతారు. అదీ…మంచు కరిగేలోపే!" గాయత్రి చెప్తున్నదంతా విస్మయంగా ఉన్న ఆసక్తిగా విన్నాడు గంగాధర్.

        మరుసటి రోజు ఉదయం…

        ముందుగా గణపతి భజన, రామదాస కీర్తన, అన్నమయ్య కీర్తన వరుసగా ఆలపిస్తూ చిడతలు వాయిస్తూ, తంబుర మీటుతూ గజ్జెల పదఘట్టనలు లయబద్ధంగా చేస్తూ "పార్వతి తనయ గజానన...." అంటూ హరిదాసు వచ్చారు.

        గాయత్రి పళ్ళెంలో ఎప్పటిలాగే పళ్ళు, ధాన్యము, దక్షిణ తాంబూలం సిద్ధం చేసుకుంది. ఆఫీసులో ఇచ్చిన కాగితాల తాలూకు నకళ్ళు పెడుతూ తన గోడు మొత్తం ఒక ఉత్తరంలో అక్షరీకరించి, ఆ అక్షయపాత్రలోకి విడిచింది.. తనకి ఇష్టమైన“కృష్ణార్పణం” అని బిగ్గరగా భక్తిగా అంటూ…సంపూర్ణ శరణాగతి ఆ కంఠంలో!

        ******

        రెండు రోజుల తర్వాత గాయత్రి కి ఉప ఖజానా కార్యాలయం నుండీ ఫోన్ రావడంతో వెళ్లి అధికారి కృష్ణ మోహన్ గారిని కలిసింది.

        “ఇదిగోనమ్మ ఇది పాతిక వేల రూపాయల మట్టి ఖర్చుల చెక్కు. మరి ఇదేమో మీ తల్లి గారికి ఇకపై నెలనెలా వచ్చే ఫ్యామిలీ పెన్షన్ కి సంబంధించిన ఆర్డర్ కాగితం” అంటూ ఆమె చేతికి అందించాడు అధికారి.

        “చాలా ధన్యవాదాలండి! ఇంత త్వరగా పని అవుతుందనుకోలేదు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము.” అంటూ వినమ్రంగా చేతులు జోడించింది.

        కృతజ్ఞతాభావం ఆమెలో ఉన్నప్పటికీ, ముఖంలో సందేహం, విస్మయం బహిర్గతం అవుతుండగా ఆయనకి అర్థమై…నవ్వుతూ ఇలా అన్నాడు..

        "నీ సంశయమేమిటో నాకు తెలుసు. నా రెండో రూపాన్ని చూశావుగా! మీ నాన్నగారు నీకు ఎలా సంస్కృతీ సాంప్రదాయాలు చెబుతూ పెంచారో, అదేవిధంగా మా నాన్నగారు కూడా నాకు“ కళావారసత్వాన్ని కాపాడాలి” అంటూ చిన్నప్పటినుంచి నూరి పోశారు.

        తర తరాలుగా మాది హరిదాసుల కుటుంబం. మా తాత గారి పేరు విననివారు ఉండరు.. ఆయన గొప్ప హరికథా పితామహుడు. మా నాన్నగారు తిరుమల దాసు గారు. ధనుర్మాసంలో ఆయన ఇల్లిల్లూ తిరిగి తీసుకువచ్చిన బిక్షతోనే మా ఆకలి తీరేది. మా నాన్న గారితో కూడా నేను కూడా చిన్నతనం నుండి కాళ్లకు గజ్జలు పెట్టుకుని, మెడలో నారాయణ హారం ధరించి, చిడతలు తంబురా చేతిలో తీసుకుంటే మా అమ్మ శ్రీమన్నారాయణడు నాలోకి ఆవహించాడు అనేది.!! అక్షయపాత్ర సకల దేవతల ఆవాస స్థానము. కల్లాపి చల్లి ముగ్గులేసిన ముంగిళ్ళనుండి తీసుకున్న బిక్ష ద్వారా మా జన్మలు ధన్యతను అందుతాయని మా అవ్వ చెప్పేది. అందుకే పెద్దల మాటలు శిరోధార్యంగా భావిస్తూ.. ఆ పరంపరని కొనసాగిస్తున్నాను. నేను తర్వాత బాగా చదువుకొని గ్రూప్స్ రాసి ఉద్యోగం తెచ్చుకున్నప్పటికీ.. ధనుర్మాసం వస్తూనే.. మా నాన్నగారు పోతూ పోతూ నాకు అప్పగించిన వెలకట్టలేని ఆస్తి ఆ చిడతలు, తంబుర, గజ్జెలు, అక్షయపాత్ర అన్నీ ధరించి ఇలా శ్రీమన్నారాయణుడిని నాలోకి ఆవాహన చేసుకుంటాను. దీనివల్ల నా వృత్తి ధర్మానికి ఎలాంటి భంగం వాటిల్లదు కూడా!...“ అంటూ తన కుర్చీలో కూర్చున్నాడు ఉప ఖజానాధికారి కృష్ణమెహన్.

        “మీరు లయబద్దంగా పాడుతూ వస్తుంటే.. ‘కృష్ణార్పణం’ అని అంటున్నప్పుడల్లా ఒక అద్వైత భావన కలుగుతుంది.”

        "అవునమ్మా! అద్వైత భావన కలగాలంటే మానసిక పరిపక్వత అవసరం. ఆ మెచ్యూరిటీ ఉన్నవాళ్లు తమ ప్రతికర్మనీ కృష్ణునికి సమర్పిస్తారు. అప్పుడు అది నిష్కామకర్మ అవుతుంది. గీతాచార్యుడు బోధించిన తత్వమదే కదా! ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి మన కర్తవ్యం మనం నిర్వర్తించాలని!!... గాయత్రీ! నిన్ను చూస్తే.. నాక్కూడా చాలా అసూయగా ఉంటుంది. ఈరోజుల్లో పుట్టాల్సిన ఆడపిల్లవి కాదు నువ్వు. నీలాంటి సత్ప్రవర్తన గల అమ్మాయి నా కూతురుగా ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది. నీలా.. స్సవితా దేవత అయిన గాయత్రీ మాతలా నడుచుకొమ్మని మా అమ్మాయికి రోజుకి కనీసం ఒకసారైనా నీ గురించి చెప్తూనే ఉంటాను తెలుసా?" అని ఆయన గాయత్రిని మెచ్చుకోలుగా చూశారు.

        "మీరు నన్ను మరీ అందలం ఎక్కిస్తున్నారు. మా నాన్నగారు నేర్పిన సంస్కారానికి తోడుగా, మీ దీవెనలు చాలు నాకు....” అంటూ బయలుదేరింది.

        గాయత్రి మనసులో ఒక్కసారిగా తండ్రి తాలూకు జ్ఞాపకం పొలమారింది. కళ్ళు చెమర్చాయి.

        "చెక్కు, పెన్షన్ పుస్తకం జాగ్రత్త.. ‘కృష్ణార్పణం’ అంటూ వదిలేయకు. అది మీ నాన్న గారి కష్టార్జితం!!.. తన తదనంతరం.. కుటుంబానికి ఇచ్చిన భరోసా..!!”.. వెనక నుండి కృష్ణమోహన్ అనే హరిదాసు గారి హెచ్చరిక వినబడుతూ ఉండగా.. చెమ్మగిల్లిన కళ్ళ నుండి రెండు ఆనంద భాష్పాలు రాలాయి. చేతిలోని ఫోల్డర్ ని మరింత గట్టిగా పట్టుకుని ఇంటిదారి పట్టింది సుమధుర గాత్రి గాయత్రి.

        -****

コメント数: 1

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)