కుసుమ విలాపం  (Author: భమిడిపాటి విజయలక్ష్మి)

కుసుమ చలికి లెక్క చేయక, శీతాకాలపు సుఖ నిద్రకు లొంగక, తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గు వేయడానికి వెళ్ళింది. గంటకు పైగా కష్టపడి, ఎంతో సుందరంగా రంగులద్ది తీర్చిదిద్దిన ముగ్గును చూసి మురిసిపోయింది.

         ఆ ముగ్గుకి ఫోటో తీద్దామని, సెల్ ఫోన్ కోసం లోపలికి వెళ్ళింది.

         వాళ్ల ఆయన్ని పిలిచి ముగ్గుతో నాకు ఫోటో తీయరా! అని అడగాలనుకుంది. కానీ ఆమె అలా అడగలేదు.

         పక్కింట్లో కొత్తగా పెళ్లయిన జంట అనుకుంటా!

         భార్య వేసిన వంకరటింకర ముగ్గునే ఎన్నో యాంగిల్స్ లో ఫోటో తీయడం చూసిన ఆమె మనసు చివుక్కుమంది.

         ‘నా మొగుడు ఉన్నాడు ఎందుకు? ’ అనుకుంటూ మనసులోనే ముక్కు చీదుకుంది.

         అంత బాగా కుదిరిన ముగ్గుని కనీసం తాను అన్న ఫోటో తీసుకుందాం అని, సెల్ తీసుకుని గబగబా బయటికి నడుస్తున్న కుసుమ, తన భర్త గొంతు విని ఆగిపోయింది.“కుసుమ బాక్స్ రెడీ అయిందా? నీకు నిన్ననే చెప్పాను కదా! ఈ రోజు అర్జెంటు పని ఉంది బాక్స్ త్వరగా రెడీ చేయమని" అంటూ లోపలి నుంచి కేకలు వేసుకుంటూ కుసుమ దగ్గరికి వచ్చాడు ఆమె మొగుడు కార్తీక్.

         అతని అరుపులకి జడిసి, గబగబా లోనికి వచ్చి ఫోన్ టీ పాయ్ పైన పడేసి, వంట గదిలోకి ఉరికింది కుసుమ.

         గబగబా ఉప్మా చేసి కార్తీక్ ముందు పెట్టింది.

          ఆఫీస్ కి టైం అయిపోతుంది అన్న కంగారులో వేడి వేడి ఉప్మా తింటూ నోరు కాలి, ఆ బాధతో... "బుద్ధుందా! ఇంత వేడిగానా పెట్టేది! ఓ రుచి లేదు పచి లేదు. ఇంతోటి ఉప్మాకి ఏదో పిండి వంటలు వండి వారుస్తున్నట్లు పెద్ద హడావిడి" అంటూ తిట్టి పోస్తూనే ప్లేట్లో చిన్న చట్నీ బొట్టు కూడా లేకుండా సాంతం నాకేసి, ఇంకేదో తిట్టుకుంటూ... అప్పటికే కుసుమ రెడీ చేసి ఇచ్చిన లంచ్ బ్యాగ్ తో బయటకు వెళ్లిపోయాడు కార్తీక్.

         ******

         బయటికి వెళ్తున్న భర్త వైపు చూస్తూ...

         'ఇది రోజు ఉండేదేగా! ఏరోజైనా నన్ను పొగిడిన నోరా అది. పెళ్లయిన రోజు నుంచి ఈరోజు వరకు ఏ విషయంలోనూ నన్ను మెచ్చుకున్నది లేదు. ఎప్పుడూ తన సొంత డబ్బా కొట్టుకోవడం, నన్ను చులకన చేసి మాట్లాడటం తప్ప ఏ సందర్భంలోనూ శభాష్ అంటూ నా భుజం తట్టింది లేదు. కానీ నా ముందు ఫోజులు కొట్టడానికి, తాను కాలేజీ డ్రీం బాయ్ అని, అమ్మాయిలు అంతా తనంటే పడిచచ్చిపోయే వాళ్లు అని, ఒక పక్క వాళ్లు ఎంత అందగత్తెలో అని వాళ్ళ అందాన్ని వర్ణిస్తూనే… ఎవరిని కన్నెత్తి చూసేవాడిని కాదు అంటాడు ఏంటో!'

         'మొన్నటికి మొన్న ఎవరో పాత స్నేహితురాలు కలిసింది అని, తను ఇప్పటికి అప్పటిలాగే పుత్తడి బొమ్మల ఉందని చెబుతుంటే ఒళ్ళు మండిపోయింది. పోనీ నేను అందగత్తెను కాదులే అనుకున్న, కనీసం మిగతా విషయాల్లో అయినా ఏనాడన్న మెచ్చుకున్నాడా అంటే అదీ లేదు.'

         'తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు.

         కానీ భర్త భార్యని పొగిడితే, ఆమెకి అతనిపై ఇంకా ప్రేమ పెరిగి, అతని ఆయువు పెరుగుతుందని తెలుసుకోలేరు ఏమిటో ఈ మగాళ్లు! ’ అనుకుంటూ ప్లేట్ లోని

         ఉప్మా నోట్లో పెట్టుకుంటూ...

         'బాగానే ఉందిగా!? మరి ఎందుకో రుచి పచి లేదంటూ తిట్టుకుంటూ వెళ్లిపోయాడు! ఏంటో ఈ మనిషి? ఎప్పుడు మారతాడో ఏమిటో?' అనుకుంటూ ఉప్మా తింది కుసుమ.

         *******

         ఎందుకో అతని తిట్ల దండకానికి నిలువెల్లా నీరసం ఆవహించింది కుసుమకి. అలా తనలో శక్తి క్షీణించినప్పుడు ఏం చేయాలో ఆమెకి బాగా తెలుసు. పడిపోతున్న ఎనర్జీ లెవెల్స్ నిలబెట్టుకోవడానికి తన జీవిత పుస్తకంలోని తనకు నచ్చిన పొగడ్తల పుటలను తెరుస్తుంది. తిరిగి శక్తిని పుంజుకుని మళ్లీ పనిలో పడిపోతుంది. ఇది తనకు మామూలే.

         ఒకసారి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి, కళ్ళు మూసుకుంది. నిరాశని నెగ్లెక్ట్ చేస్తూ, నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ... తను అందుకున్న పొగడ్తల పేజీలోకి తొంగి చూసింది. వెలుగు రేఖల అక్షరాలు తన ముఖాన్ని తాకగానే, ఎంతో హాయిగా అనిపించింది కుసుమకి.

         ఎన్నిసార్లు చదివినా తనివి తీరని, తనకి

         ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే, ఎవరికీ చెప్పని జ్ఞాపకాల పేజీలు అవి. ఆమె నిరాశకు గురి అయిన ప్రతిసారి ఆ పేజీలను తెరిచి చూసి స్వాంతన పొందుతుంది. ఇప్పటిదాకా తన లైఫ్ లో జరిగిన కొన్ని మధురమైన సంఘటనలను, ఆ సందర్భంలో తను అందుకున్న పొగడ్తల అవార్డులను ఆ పేజీల్లో పదిలంగా దాచుకుంది.

         అది కుసుమ

         కాలేజీలో జాయిన్ అయిన తొలిరోజు.

         అప్పుడు ర్యాగింగ్ ముమ్మరంగా జరుగుతుంది.

         ఒక సీనియర్ జూనియర్స్ అందరినీ వరుసగా నిలబెట్టి కప్పలా గెంతుతూ... కుక్కల అరవమంది.

         ఈ కాంబినేషన్ వింతగా అనిపించి కుసుమ కిసుక్కున నవ్వింది.

         "ఎవరా నవ్వింది?" అని కోపంగా అడిగింది సీనియర్. వెంటనే అక్కడ ఉన్న అందరి చేతులు కుసుమ వైపు తిరిగాయి. కుసుమ భయం భయంగా, సీనియర్ వంక చూసింది.

         సీనియర్ కుసుమ దగ్గరికి వచ్చి...

         "చిలకలా భలే నవ్వావే! నువ్వు రోజు నాకు కనపడి ఇలాగే నవ్వుతూ విష్ చేయాలి. ఇదే నేను నీకు ఇచ్చే టాస్క్" అని కుసుమ బుగ్గ గిల్లుతూ అంది.

         'చిలకనవ్వు' అని సీనియర్ తనకిచ్చిన కాంప్లిమెంట్ నీ పదే పదే గుర్తు చేసుకుంటూ… తన నవ్వుని చిలుకతో పోల్చిన ఆ సీనియర్ పొగడ్తకు పులకిస్తూ...

         పక్క పేజీలోకి వెళ్ళిపోయింది కుసుమ.

         అది తను రోజు వెళ్లే పాల వాళ్ళ ఇల్లు.

         పాలు పితికే సుబ్బయ్య రోజు తనని చూడగానే "దొరసానమ్మ వచ్చేసావా?" అంటూ పలకరించేవాడు.

         ఒకరోజు ఎందుకో కుసుమకి కోపం వచ్చి

         "దొరసాని ఏంటి దొరసాని? నా పేరు కుసుమ!" అని కాస్త కినుగా అంది.

         "సరే అయితే దొరసాని కాదు గాని, జయమాలిని అంటాను" అన్నాడు.

         "చ... చ.. అదేం పోలిక. నా పేరు కుసుమ అని చెప్పాను కదా! అలాగే పిలువు?" అని అంతే కోపంగా అంది.

         "ఏమో అమ్మాయిగారు! నాకు జయమాలిని అంటే చాలా ఇష్టం. ఎవరన్నా అందంగా ఉన్నారు అని చెప్పాలంటే జయమాలినిలాగా ఉన్నావు అంటాను అంతే!

         నాకు అంతకన్నా పోలికలు రావు" అని మొహం అమాయకంగా పెట్టి అన్నాడు సుబ్బయ్య.

         అతని మాటలకు పాల కోసం వచ్చిన మిగిలిన వాళ్లంతా పగలబడి నవ్వారు. వాళ్లలో ఒకరు...

         "అలా అంటే బాగోదు సుబ్బడు" అనగానే..

         "సరే అయితే... కోకిలమ్మ అని పిలుస్తాను. అమ్మాయిగారు కోకిలలా తియ్యగా పాడతారు. నేను అమ్మాయి గారి పాటలు చాలాసార్లు విన్నాను" అని ఆమె పాటను గుర్తు చేసుకుంటూ అన్నాడు సుబ్బయ్య.

         కళ్ళు మూసుకుని సుబ్బయ్య తనకు ఇచ్చిన కాంప్లిమెంట్ ని గుర్తు చేసుకుంటూ..'కోకిలమ్మ! ఎంత బాగుంది పోలిక! అనుకుంటున్న ఆమె గొంతు తీయగా హాయిగా మూలిగింది. మది గదిలో జ్ఞాపకాల ఊయల ఊగుతున్న ఆమె మనసు కొత్త ఆశలరాగం అందుకుని, కోయిలై కూసింది.. ముఖం కాస్త ప్రశాంతంగా మారింది.

         ఇలా కొన్ని మధురమైన, తన మనసుకి మత్తుని కలిగించి, బాధని మటుమాయం చేసే జ్ఞాపకాల, పేజీలు అయ్యాక, చివరిగా తనకి ఎంతో ఇష్టమైన లాస్ట్ పేజీ చదవబోతున్నాను అనుకుంటేనే ఆమె మనసు తన్మయత్వంలో తేలిపోయింది.

         అది తన కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్న రోజులు.

         పుట్టినరోజు అని లంగా వోణీ వేసుకుని గబగబా కాలేజీకి బయలుదేరింది.

         ఆమె వెనుక ఇద్దరు కుర్రాళ్ళు నడుస్తూ... ఏవో కామెంట్స్ చేస్తున్నారు. కానీ అవేం పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది కుసుమ.

         ఆ కుర్రాల్లో ఒకరి గొంతులో నుంచి వినిపించిందో పాట.

         "కాకినాడ వీధుల్లో తిరిగే మందారమా.

         అందాల గ్రంథంలో తొలి పేజీ నీదే సుమా!" అని ఎంతో శ్రావ్యంగా పాడుతూ ఉన్నాడు.

         'ఆహా ఎంత మంచి పాట! ఎంత బాగా అల్లి పాడాడు! ఎవరూ పాడింది?' అని టక్కున వెనుకకు తిరిగి చూడాలకుంది కుసుమ. కానీ కాలేజీ గేటు దగ్గర ఫ్రెండ్స్ కనపడేసరికి.. వాళ్ళని చిరునవ్వుతో పలకరించి, వడివడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది.

         పాట పాడిన కుర్రాడు ఎవరో తెలియదు గానీ, ఆ పాట మాత్రం తన చెవుల్లో ఇప్పటికి అలాగే మధురంగా శ్రావ్యంగా వినపడుతూనే ఉంది. తన మనసుని ఉల్లాసపరుస్తూనే ఉంది.

          ఎదుటివారు కోపంతో అన్న ముళ్ళు లాంటి మాటలు తగిలి, తన మనసు చివుక్కుమన్నప్పుడల్లా, ఇదిగో ఇలాగే పొగడ్తల పుటలు తెరిచి, తన్మయత్వంలో కాసేపు మునిగి, మనసుని రంజింపచేసుకుని, మళ్లీ ఈ లోకంలోకి వచ్చేస్తుంది కుసుమ.

         **********

         కుసుమ మొక్కలకి నీళ్లు పోస్తూ.. ఆరోజు ఆ కుర్రాడు పాడిన పాట హుషారుగా పాడుతూ ఉంది.

         ఆమె పాటలో లీనమై, గేటు తీసుకొని లోపలికి వస్తున్న కార్తీక్ ని గమనించలేదు.

         కార్తీక్ కుసుమ వెనకగా వచ్చి,

         "ఈ పాట ఏ సినిమాలోది?" అని ఎంతో ఆత్రుతగా అడిగాడు.

         "సి... సి... సినిమా లోది కాదు" అని తడబడుతూ అంది.

         "మరి!" అడిగాడు ఆరాగా.

         "ఈ మందార చెట్టు మా కాకినాడ నుంచి తెచ్చాను కదా! అందుకే ఎందుకో! అలా నేనే సరదాగా పాట అల్లి పాడుతున్నాను" అంటూ అప్పటికప్పుడు మాటలు అల్లేసి, భయపడుతూనే అబద్ధం చెప్పేసింది.

         వెంటనే కార్తీక్ కుసుమ భుజాలు పట్టి ఊపేస్తూ,

         "ఎక్సలెంట్ మారువలెస్!" అని చప్పట్లు కొడుతూ.."ఇంకెప్పుడు, ఎక్కడ పాడకు ఈ పాట.

         ఇప్పుడే వస్తా" అంటూ లోనికి వెళ్లకుండానే, అటు నుంచి అటే గేటు తీసుకుని వెళ్ళిపోతూ... వెనక్కి తిరిగి థాంక్స్ అన్నట్లుగా కుసుమ వైపు చూశాడు.

         *****"

         కార్తీక్ ఈవినింగ్ స్వీట్ ప్యాకెట్ తీసుకొని భార్య దగ్గరకు వచ్చి, ఒక స్వీట్ తీసి నోట్లో పెడుతూ... "మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ పనిమీద వెళుతున్నాను అన్నాను కదా! అది సూపర్ సక్సెస్ అయింది. నేను ఉదయం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి మంచి పని చేశాను" అని చెప్తున్న భర్త వంక ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంది కుసుమ.

         అయోమయంగా తన వైపే చూస్తున్న కుసుమ వైపు చూస్తూ.... "అబ్బా! నీకు మొదటినుంచి చెప్పాలి" అని, కుసుమని సోఫాలో కూర్చోబెట్టి, తను ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుని..."మా ఫ్రెండ్ ప్రసాదు ఒక సినిమా తీస్తున్నాడు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాడే. నేను కాలేజీ చదివే రోజుల్లో కవితలు, పాటలు రాస్తూ ఉండేవాడిని. వాడు అది గుర్తుపెట్టుకుని మొన్న నాకు కాల్ చేసి, నా సినిమాకు నువ్వు ఒక పాట రాయాలి ప్లీజ్ అన్నాడు. సరే అని రాసి ఇచ్చాను. కానీ వాడికి పాటలో చరణాలు నచ్చాయి గాని పల్లవి నచ్చలేదు ఆట. మళ్ళీ ట్రై చేసి, సాయంత్రం కల్లా ఇవ్వగలవా అన్నాడు."

         "ఆఫీసులో ఆలోచనలు రావని, పర్మిషన్ తీసుకుని వచ్చేసాను. కానీ ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు ఏదో పాట పాడుతూ ఉన్నావు. అది విన్నాక, నువ్వు పాడిన లైన్స్ నా చరణానికి సరిగ్గా సరిపోతాయి అనిపించింది. వెంటనే వాటిని పల్లవిగా పెట్టేస్తే! అన్న ఆలోచన వచ్చింది. ఎలాగూ ఆఫీసులో పర్మిషన్ తీసుకున్నాను కదా! అనుకుని, నేరుగా ప్రసాద్ దగ్గరికి వెళ్లి పాట పూర్తి చేసి ఇచ్చేసాను. వాడికి నేను రాసి ఇచ్చిన పల్లవి చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చేసేసాడు. ఫస్ట్ టైం సినిమాలో నేను రాసిన పాట రాబోతుంది" అని ఎంతో ఆనందంగా చెప్తున్న కార్తీక్ ని వింతగా చూసింది కుసుమ.

         పెళ్లి అయిన ఇన్నేళ్లలో అతను ఇంత చనువుగా, తనను మెచ్చుకుంటూ మాట్లాడింది లేదు.

         'ఆ పాట నాకే కాదు నీకు ఆనందాన్ని ఇచ్చింది అన్నమాట' అనుకుని మనసులో నవ్వుకుంది కుసుమ.

         ************

         సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ ఒక్క పాటతో కార్తీక్ కి పాటలు రాసే చాన్సులు వరదలా వచ్చి పడ్డాయి. చాలా తక్కువ కాలంలోనే ఫేమస్ లిరిక్ రైటర్ అయిపోయాడు కార్తీక్. కానీ భార్య పట్ల అతని తీరు ఏ మాత్రం మారలేదు.

         *********************

         కుసుమ కొడుకు 26 ఏళ్ల కౌశల్ మంచి ప్యాకేజీ తో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. కౌశల్ కి పెళ్లీడు రావడంతో సంబంధాలు చూస్తూ ఉన్నారు కుసుమ దంపతులు.

         తల్లి ఒక మంచి సంబంధం గురించి చెప్తే...

         "నాకు పెళ్లి చేసుకోవాలని లేదు ఎప్పటికీ" అన్నాడు.

         "అలా అనకూడదు నాన్న. ఎందుకు ఇష్టం లేదో

         చెప్పు?" అని సోఫాలో కొడుకు పక్కన కూర్చుంటూ అడిగింది కుసుమ.

         కౌశల్ ఓ నిట్టూర్పు విడిచి, శూన్యంలోకి చూస్తూ..

         "ఈ కాలం ఆడపిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు అమ్మ. వాళ్ళకి మీకు ఉన్నంత సహనం లేదు. ఒకవేళ నాకు పెళ్లయ్యాక నేను నా భార్యని కోపంలో ఒక మాట అన్నానే అనుకో తనకి అది భరించే ఓర్పు ఉండకపోవచ్చు.

         నేనూ నాన్న రక్తాన్నే కదా అమ్మా! నాన్న నిన్ను ఎలా

         చూసుకున్నారో, నీ పట్ల ఎలా ప్రవర్తించారో నేను దగ్గర్నుండి చూశాను. నేను కూడా నాన్నలాగే నా భార్య మాటకి విలువ ఇవ్వకుండా, ఆమె మనసు తెలుసుకోకుండా ఆమె మాటల్ని ఆలోచనల్ని కూరలో కరివేపాకు లాగా ఏరి పడేస్తూ, తిడుతూ ఉంటే... తన మనసులో నా స్థాయి తగ్గిపోతుంది. ప్రేమ ప్లేస్ లో ద్వేషం పెరిగిపోతుంది. అందుకే నాకు పెళ్లి అంటే భయంగా ఉంది అమ్మా" అని విరక్తిగా అంటున్న కొడుకు వైపు చూస్తూ...

         'ఎంత ఆలోచించావురా కన్నా! నాకు మీ నాన్నకు మధ్య ఉన్న బంధాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు!' అని అనుకుంటూ...

         "మీ నాన్న ఏం తప్పు చేశారో నువ్వు గ్రహించగలిగావు అంటే! ఆ తప్పు జరగకుండా నువ్వు తప్పకుండా చూసుకోగలవు. ఆడవాళ్ళ మనసు గెలుచుకోవడం, వాళ్ల ప్రేమని, మెప్పుని పొందడం అంత కష్టం కాదురా.

         సాధారణంగా ఎవరన్నా మనకి నచ్చని పని చేస్తే వెంటనే వాళ్లని కోపంతో తిట్టిపోస్తాం. ఆ కోపాన్ని కాస్తయినా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించం.

         కానీ ఎదుటివారిలో మంచి కనపడితే మాత్రం వాళ్లని పొగడడానికి నోరు రాదు. వారిని మెచ్చుకుంటే మన ఆస్తులు ఏవో పోతాయన్నట్టు పొగడ్తని పెదవి దాటనివ్వం. ఇక్కడ మాత్రం మన ఫీలింగ్స్ ని బాగా కంట్రోల్ చేసుకుంటాం. ఎక్కడా బయటపడం. అందరూ చేసే అతి పెద్ద తప్పు అదే. అలాంటి తప్పులు నువ్వు ఎప్పుడూ చేయకు.

         నువ్వు మంచి మనసున్న వాడివి.. మీ నాన్న చేసిన తప్పు నువ్వు కూడా చేస్తావేమో అని భయపడి పెళ్లి వద్దనుకుంటున్నావు కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు చాలా తెలివైన వాడివి. నిన్ను నువ్వు మార్చుకోగల సామర్థ్యం ఉన్నవాడివి. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. భర్త భార్యతో ఎలా మెలగకూడదో నువ్వు మీ నాన్నని చూసి తెలుసుకున్నావు. కానీ ఎలా మెలిగితే భార్యాభర్తల సంసారం సవ్యంగా సాగుతుందో నేను చెప్తాను విను... నీకు ఎప్పుడైనా నీ భార్య మీద కోపం వస్తే కంట్రోల్ చేసుకో. అప్పటికి నీ వల్ల కాకపోతే ఆమెను మనసులోనే తిట్టుకో. కోపం తగ్గాక మనసులో మాట పైకి అనలేనందుకు నువ్వు చాలా సంతోషిస్తావు.

         ఎప్పుడైనా నీ భార్య చేసిన పని, వంట, మాట, పాట ఇలా ఏది నీకు నచ్చిన వెంటనే నీ మనసుని కంట్రోల్ చేసుకోకుండా పొగడ్తల పువ్వులను నీ భార్యకి కానుకగా ఇవ్వు. నీ భాగస్వామి మనస్సు పుస్తకంలో పొగడ్తల పేజీలన్నీ నీవే అయ్యుండాలి. ఆ పుస్తకం నువ్వు తనని సంతోష పడేలా చేసిన పనులు, తన పనిని మెచ్చుకుంటూ నువ్వు తనకి ఇచ్చిన కాంప్లిమెంట్స్ తో నిండిపోవాలి.

         ఎప్పుడైనా తనకు బాధ కలిగినప్పుడు, పదేపదే తెరిచి చూసుకుని తృప్తి పడే ప్రతి పేజీలో నీ పేరే కనిపించాలి. ఆ పేజీలు తెరవగానే ఆమె మనసు పులకించాలి. అప్పుడు నీ అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు" అని కొడుకు తల ప్రేమగా నిమురుతూ అంది కుసుమ.

コメントの追加