ఎవరిది రహదారి  (Author: కె. రమ్య)

చేతిలో ఫైల్స్ తో నేను, చంటి బిడ్డతో తను

బాధ్యత గల ఉద్యోగిగా నేను, మమకారపు తల్లిగా తను

ప్రశంసా పత్రం చూస్తూ నేను, బిడ్డ బోసి నవ్వులు చూస్తూ తను

విధి నిర్వహణ ఆలోచనలో నేను, బిడ్డకు టీకా వేసే తలపులో తను

గాలికి ఎగురుతున్న కాగితాల్ని పట్టుకుంటూ నేను; గాలికి ఎగిరే పైటకొంగును బిడ్డకు కప్పుతూ తను

ఉద్యోగంలో అలిసి కళ్ళు మూతపడే నేను, చిన్నారికి సేవ చేసే కునికిపాట్లు తీసే తను

పని ఒత్తిడిలో నిద్ర రాక నేను, పసిబిడ్డ నిద్రపోనీయక తను

కొత్త కోర్సులను నేర్చుకుంటూ నేను, పిల్లల సంరక్షణ పాఠాలను నేర్చుకుంటూ తను కార్యనిర్వహణ సామర్థ్యం పెంచుకుంటూ నేను, విద్యను పెంచే సమర్థత పెంపొందించుకుంటూ తను

నా చేతిలో బిడ్డ లేదే అని నేను! నా చేతిలో ప్రశంసా పత్రం లేదని తను!!

 ఒక రోజు మేము తారసపడ్డాము

నీ బిడ్డను నాకు ఇవ్వవా అని నేను, నీ ఉద్యోగాన్ని నాకు ఇస్తావా అని తను

అడిగాము, ఆగాము, ఆలోచించాము.

“నీ దారి నీది, నా దారి నీది నాది” అంటూ ఎవరిది వాళ్లు తీసుకుని వెనుదిరిగారు.

ఎవరిది రహదారో ఎవరికి ఎరుక?

コメントの追加