అక్షర వ్యూహంలో అభిమన్యుడు  (Author: కొయిలాడ బాబు)

"అక్షరాలు సరిగ్గా వ్రాయలేవా. ఎందుకు పెన్నుని కోడి గెలికినట్లు గెలుకుతున్నావ్. సరిగ్గా ఒక పదం వ్రాయడం కూడా నీకు చేతకాదు. నీ హ్యాండ్ రైటింగ్ చూస్తే నీ మీద అసహ్యం వేస్తోంది" అంటూ ఆ బాలుడిపై విరుచుకుపడింది టీచర్. ఆ బాలుడి పేరు అభి. చేతివ్రాత బాగుండకపోవడం వల్ల తన్నులు తిన్నడం తనకు కొత్త కాదు. పాత క్లాసులోనూ అదే పద్ధతి. కొత్త క్లాసులోనూ అదే పద్ధతి.

         అందుకే టీచర్ కొట్టిన దెబ్బను రుద్దుకుంటూ, అభి మళ్ళీ తన క్లాస్ వర్క్ తాను చేసుకోవడం ప్రారంభించాడు. అందరి మాదిరిగానే అభికి కూడా అందంగా వ్రాయాలని, తన చేతి వ్రాతను చూసుకొని ఎంతో మురిసిపోవాలని ఉంటుంది.

         అయితే తన వల్ల అది సాధ్యపడడం లేదని తనకు ఎప్పుడో అర్థమైంది. తను ఎందుకు బాగా వ్రాయలేకపోతున్నాడో ఆ కుర్రాడికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. తన ప్రయత్నలోపం ఏదైనా ఉందా? అంటే అది కూడా లేదు.

         తన చేతివ్రాతను మెరుగుపరుచుకోవడానికి అభి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. మనసులో ఒక పదాన్ని అందంగా వ్రాయాలని అనుకున్నా, అది పేపర్ మీద పెట్టేసరికి వేరేగా కనబడుతోంది.

         తను ఎంత అందంగా వ్రాయాలని అనుకుంటే, అవే అక్షరాలు అంతే అందవిహీనంగా కనబడుతున్నాయి

         అప్పుడప్పుడు ఈ సమస్య వల్ల తన కళ్ళ వెంబడి నీళ్ళు కూడా వస్తుంటాయి. అభికి కూడా తన అశక్తత అర్థమవుతోంది.

         అప్పుడప్పుడు తన మిత్రుల పుస్తకాలలో చేతివ్రాతను చూసి ముచ్చటపడుతుంటాడు అభి. వారిలా తను కూడా చాలా అద్భుతంగా వ్రాయాలనుకుంటాడు. ఓసారి తన స్నేహితుడైన రాముతో ఇదే మాట చెప్పాడు. అయితే రాము అక్షరాన్ని వ్రాస్తుంటే, అది తిన్నగా వస్తోంది.

         కానీ అభి వ్రాస్తుంటే మాత్రం అది వంకరలు పోతోంది. అలా వంకరలు పోయేటప్పుడు, కొంచెం చేయి వణకడం కూడా ప్రారంభమవుతోంది. ఒకసారి చేయి వణికితే, ఆ వ్రాత మరింత అధ్వానంగా తయారవుతోంది.

         అయితే తన బాధ ఇంతటితోనే ఆగలేదు. అభి చేతివ్రాతను తన క్లాసులో వెక్కిరించే వారు కూడా ఎక్కువయ్యారు. చాలామంది తుంటరి పిల్లలు అభి వ్రాసే పదాలు డైనోసార్‌ బొమ్మల్లా ఉంటాయని, కొందరేమో జిలేబీల్లా ఉంటాయని ఆటపట్టించేవారు.

         తన స్నేహితులే తనను ఆటపట్టించడంతో అభి కుంగిపోయేవాడు. తన బాధను ఎవరితోనూ చెప్పకోలేక, తనలో తానే మధనపడేవాడు. ఆ విధంగా తనలో ఓ విధమైన ఆత్మనూన్యతా భావం పెరిగింది.

         ఓ రోజు క్లాస్ టీచర్ అభి తండ్రిని పిలిచి, ఆయనకు కుర్రాడి హ్యాండ్ రైటింగ్ చూపించాడు. "చూడండి సార్. మీ అబ్బాయి చేతివ్రాత ఎంత దారుణంగా ఉందో. ఇలా అయితే ముందు ముందు క్లాసులలో కష్టమే. పబ్లిక్ పరీక్షల్లో మంచి చేతివ్రాత ఉంటేనే మార్కులొస్తాయి. మీరైనా సరే, తనను నయానో భయానో ఒప్పించి బాగా వ్రాసేలా చూడండి" అంటూ క్లాస్ పీకాడు. దీంతో అభి తండ్రికి తల కొట్టేసినట్లు అయ్యింది.

         ఇంటికి వెళ్ళగానే తండ్రి అభిని గొడ్డును బాదినట్లు బాదాడు. "ఏం! సరిగ్గా వ్రాయలేవా? ఎందుకు అందరూ వ్రాస్తున్నట్లు తిన్నగా వ్రాయవు. మరోసారి అక్షరాలను పిచ్చి పిచ్చి గీతలుగా వ్రాశావో చెమడాలు ఒలిచేస్తాను జాగ్రత్త" అంటూ హెచ్చరించాడు.

         తండ్రి కూడా తన బాధను అర్థం చేసుకోకుండా కొట్టడంతో అభి ఇంకా బాధపడ్డాడు. తనవాళ్ళే తనను అర్థం చేసుకోకపోతే, తన కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి? అంటూ మధనపడ్డాడు.

         నిజానికి అభి చాలా తెలివైనవాడు. ఏ పదాన్ని అయినా తప్పుల్లేకుండా వ్రాయగలడు. అయితే వ్రాసే పద్ధతే బాగోదు. చాలామంది పిల్లల్లో ఉండే అలవాటే అది. అందరూ అందంగా వ్రాయాలంటే కుదరదు.

         అయినప్పటికీ, తన చేతివ్రాతను మెరుగుపరచుకోవడానికి తన కష్టాలేవో తాను పడుతున్నాడు అభి. అయితే ఈ క్రమంలో ఎవరూ తనకు చేయూతనివ్వకపోవడంతో తను మరింత ఆత్మన్యూనతకు గురవుతున్నాడు.

         అభి చాలా చురుకైన కుర్రాడు. బాగా చదువుతాడు. స్కూల్లో పెట్టే ఓరల్ పరీక్షలలో ఎప్పుడూ ముందే ఉంటాడు. ఏ పద్యానైనా గుక్కతిప్పుకోకుండా అప్పజెప్పగలడు. మాస్టార్ అడిగే ప్రశ్నలకు, ఏ జవాబునైనా అవలీలగా చెప్పేయగలడు. అయితే చేతివ్రాత ఒక్కటే తనకు శాపమై కూర్చుంది.

         ఆ చేతివ్రాత వల్లే తనకు ఏ టీచర్ కూడా పూర్తిగా మార్కులు వేయడం లేదు. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందా? అని తాను ఆలోచించని రోజంటూ లేదు.

         చేతివ్రాతను మెరుగుపరచుకొనే క్రమంలో అభి తన పెన్నుతో అనేక ప్రయోగాలు చేసేవాడు. ఒకసారి నెమ్మదిగా వ్రాసేవాడు. మరోసారి వేగంగా వ్రాసేవాడు. ఒకసారి ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కుంటూ మరీ, దానికి ఒక ఆకారం తీసుకురావడానికి ప్రయత్నించేవాడు.

         అయినా సరే తన వ్రాత అష్టవంకరలుగానే వచ్చేది తప్పితే, దానికంటూ ఒక నిర్దిష్టమైైన ఆకారం వచ్చేది కాదు. దీంతో అభికి ఇంకా దిగులెక్కువైంది.

         నిజానికి అభికి పెన్ను పట్టుకోవడమే సరిగ్గా రాదు. బొటనవేలికి, చూపుడు వేలికి మధ్య సమన్వయం కుదరకపోవడం వల్లనేమో, ఆ పెన్ను సరిగ్గా కాగితం మీద అక్షరాలను గీయలేకపోతోంది. ఇంగ్లీషు వ్రాతతోనే తనకు ఈ కష్టాలు ఆగలేదు. తెలుగులో, హిందీలో కూడా తాను వ్రాసే అక్షరాలు మరింత వంకరగా ఉండేవి. దీంతో అభి నోటు పుస్తకాల నిండా రిమార్కులే కనిపించేవి. "మెయిన్‌టైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్" అంటూ ప్రతీ టీచరూ తనకు నోట్ రాసి పంపేవారు. దీంతో బాగా చదువుతాడన్న పేరున్నా, ఆ టాలెంట్ ఈ చేతి వ్రాత పుణ్యమా అని మరుగునపడిపోయేది

         అభి క్లాసులోనే రీటా అనే ఓ అమ్మాయి ఉండేది. ఆమె చేతివ్రాత చాలా అందంగా ఉండేది. దీంతో ఆమెను టీచర్లు కూడా చాలా ప్రేమగా చూసేవారు. దీంతో అభి దగ్గర ఆమె కొంచెం అహంకారంగా ప్రవర్తించేది. తానే గొప్ప అన్నట్లు ఫోజు కొట్టేది. అప్పుడప్పుడు తనతో కొంచెం పెడసరంగానూ మాట్లాడేది. దీంతో చేతివ్రాత బాగుండకపోవడం వల్లే కదా? తనకిన్ని సమస్యలు అని అభి మనసులో వ్యాకులత చెందేవాడు.

         ఓ రోజు ఇంటికి వెళ్లి తన మొరంతా తన తల్లితో చెప్పుకున్నాడు అభి. "అమ్మా. నా చేతివ్రాత బాగుండడం లేదని అందరూ నన్ను ఆటపట్టిస్తున్నారమ్మా. స్కూల్లో టీచర్ కూడా తిడుతున్నారమ్మా. నువ్వు నాన్నతో చెప్పి నన్ను వేరే స్కూలులో చేర్పించమ్మా. నేను క్లాసులో అసలు ఉండలేకపోతున్నాను. అందరూ నన్ను కామెంట్ చేస్తున్నారు. నా గురించి కామెడీగా మాట్లాడుకుంటున్నారు" అని బాధతో అడిగాడు.

         అయితే అభి తల్లి కూడా తనను సరిగ్గా అర్థం చేసుకోలేదు. "నీ చేతివ్రాత బాగా లేదంటే, అది ముమ్మాటికి నీ తప్పే. అందరూ సరిగ్గానే వ్రాస్తుంటే, నువ్వెందుకు వ్రాయలేకపోతున్నావు. రేపట్నించి కర్సివ్ రైటింగ్ బుక్స్ బాగా ప్రాక్టీసు చేయు.

         అప్పుడు వ్రాత అనేది దానంతట అదే వస్తుంది. అంతేగానీ, ఏవేవో కారణాలు చెప్పి, స్కూలు మాన్పించమని మరోసారి అడగద్దు. ఈ ఊరిలో నువ్వు చదువుతున్నదే బెస్ట్ స్కూల్" అని అభి తల్లి గట్టిగా చెప్పేయడంతో రాజీపడిపోవడం తనకు తప్పలేదు

         తన తల్లిదండ్రులు కూడా తనను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో, అభి మనసు చాలా బాధపడింది. తనవాళ్లే తనను అర్థం చేసుకోకపోతే, ఇక బాధలనేవి తను ఎవరితో పంచుకోగలడని లోలోన మధనపడసాగాడు.

         అలాంటి సందర్భంలోనే స్కూల్లో అభికి మున్నీ అనే అమ్మాయి పరిచయమైంది. మున్నీ చేతివ్రాత కూడా అంత బాగోదు. అయితే అభి కంటే చాలా బెటర్. "అభి.. ఏం పరేషాన్ కావద్దు. నా చేతివ్రాత కూడా మొదట్లో చాలా చెత్తగా ఉండేది. కానీ ప్రాక్టీసు చేయగా, చేయగా కొంత బెటర్ అయ్యింది. నువ్వు కూడా రోజూ ప్రాక్టీసు చేయు" అని ఓ రోజు ఓదారుస్తూ చెప్పింది.

         ఏదేమైనా, ఈ చేతివ్రాత అనేది అభికి పెద్ద సమస్య అయ్యి కూర్చుంది. పైగా తన బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవడంతో, నెమ్మదిగా స్నేహితులతోనూ, తల్లిదండ్రులతోనూ మాట్లాడడం తగ్గించాడు. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించడం మొదలుపెట్టేవాడు. తానే ఎందుకు మంచి చేతివ్రాతను అలవాటు చేసుకోలేకపోతున్నాడని అనుకొనేవాడు. అసలు తన సమస్య తీరుతుందా లేదా? అనేది కూడా అభికి తెలియదు.

         ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ గడపడం వల్ల, అభికి చదువు మీద కూడా కాస్త శ్రద్ధ తగ్గింది. దీంతో తనకు వచ్చే మార్కులు కూడా తగ్గుముఖం పట్టాయి. టీచర్లకు కూడా అభి విషయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. కొట్టినా, తిట్టినా తన చేతివ్రాత మారదనే విషయాన్ని వారు రూఢీ చేసుకున్నారు. దీంతో అభిలో అభద్రతాభావం మరింత పెరిగింది. తనను అందరూ దూరం పెడుతున్నారేమో అన్న భావం కూడా కలిగింది.

         మున్నీకి అభిని చూసి చాలా జాలి కలిగింది. అయితే తనకు కూడా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. అయినా చేతివ్రాతను చూసి ఎగ్జామ్‌లో మార్కులేయడం ఏమిటో? అని మనసులో అనుకుంది. తాను తన మిత్రుడికి ఈ విషయంలో ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానని బాధపడింది. అభికి మంచి చేతివ్రాతను ప్రసాదించమని దేవుడికి మొక్కుకుంది. ఇదే మాట అభికి చెప్పింది. మున్నీ దేవుడికి మొక్కుకున్న విషయం తెలుసుకొని, అభి నవ్వుకున్నాడు.

         రోజులు గడుస్తున్నాయి. అభి ప్రవర్తనలో మార్పు మున్నీకి కొట్టొచ్చినట్లు కనిపించింది. తను రోజు రోజుకీ మొండిగా తయారవుతున్నాడు. ఎవరిని లక్ష్యపెట్టడం లేదు. తనకు నచ్చినట్లు వ్రాస్తున్నాడు. నచ్చినట్లు చదవుతున్నాడు. ఎవరినీ ఖాతరు చేయడం లేదు. తన క్లాసులోనే ఉన్న ఓ తుంటరి గ్యాంగ్‌తో కలిసి తిరగడం, వారితో కలిసి క్లాసులు బంక్ కొట్టడం కూడా ప్రారంభించాడు.

         మున్నీకి అభి ప్రవర్తన చూసి చాలా భయం వేసింది. ఒకప్పుడు ఎంతో సాత్వికంగా ఉండే అభిలో ఈ మార్పును ఆమె ఊహించలేకపోయింది. ఓ రోజు తనను కలిసి, ఆ తుంటరి పిల్లలతో కలిసి తిరగడం మానేయమని అభికి హితబోధ చేసింది.

         కానీ, అభి పట్టించుకోలేదు. అస్సలు ఖాతరు లేనితనంతో మున్నీని ఓ చూపు చూశాడు. "నా ఇష్టం. నాకు నచ్చినట్లు ఉంటాను. నీకెందుకు?" అన్నట్లు ఉంది తన చూపు. మొత్తానికి అభి బాగా చెడిపోతున్నాడని మున్నీ అర్థం చేసుకుంది

         ఓ రోజు అభి స్కూలుకి రాలేదు. తన తుంటరి స్నేహితులతో కలిసి రోడ్డు మీద ఆడుతుండగా, ఓ బైక్ వచ్చి తనను వెనక్కి నుండి గుద్దేసింది. ఆ బాధకు తను తట్టుకోలేకపోయాడు. ఆ చిన్న ప్రాణం విల్లవిల్లాడింది. వెంటనే నేల మీద పడిపోయి, గట్టిగా అరవడం ప్రారంభించాడు.

         వెంటనే తన మిత్రులు అక్కడి నుండి పరుగులంకించుకున్నారు. అయితే ఏం మహాత్యమో తెలియదు గానీ... అప్పుడే తన బాబాయితో కలిసి స్కూలు నుండి వస్తున్న మున్నీకి అభి కనిపించాడు.

         వెంటనే అభి గురించి తన బాబాయికి చెప్పింది మున్నీ. అతను వెంటనే అభి దగ్గరకు హుటాహుటిన వెళ్ళాడు. తనకు గాయం చాలా పెద్దదిగా కనిపించింది. స్వయంగా డాక్టరు కావడంతో, అతను ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ముందుగా మున్నీని తన బండి ఎక్కమన్నాడు. ఆ తర్వాత, ఆ పిల్లాడిని కూడా తన బండి మీద ఎక్కించుకొని నర్సింగ్ హోమ్‌కి తీసుకెళ్ళాడు. అక్కడే గాయానికి మందు పూసి కట్టు కట్టాడు. ఆ తర్వాత అభిని రెస్ట్ తీసుకోమని చెప్పి, ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు

         అభి తల్లిదండ్రులకు యాక్సిడెంట్ వార్త తెలియడంతో వారు చాలా కంగారపడ్డారు. వెంటనే నర్సింగ్ హోమ్‌కు బయలుదేరారు. వారు చేరే సమయానికి, అభి బెడ్ మీద నిద్రపోతున్నాడు. డాక్టర్ వారికి జరిగిన విషయం చెప్పి, అంత కంగారుపడాల్సిన అవసరమేమీ లేదని తెలిపాడు. అయితే అభి తండ్రి మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. "అసలు వీడు స్కూలుకి వెళ్ళకుండా రోడ్డు మీద అడ్డదిడ్దంగా తిరుగుతుంటే, నువ్వేం చేస్తున్నావ్" అని అభి తల్లి మీద విరుచుకుపడసాగాడు.

         పాపం.. ఆ తల్లి మాత్రం ఏం చేస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంది. "పాపిష్టి దాన్ని. అప్పటికీ వాడు స్కూలు మార్చమని పదే పదే నాతో చెప్పాడు. నేనే వినలేదు. ఇప్పుడు దెబ్బలు తగిలించుకొని.. వాడు బాధపడుతూ, మమ్మల్ని కూడా బాధపెడుతున్నాడు" అంటూ వాపోయింది ఆమె. వెంటనే అభి తండ్రి కాస్త శాంతించి, ఆమెను అనునయించడానికి ప్రయత్నించాడు. "రేపు స్కూలుకి వెళ్ళి, ప్రిన్సిపాల్‌తో తాడోపేడో తేల్చుకుంటా" అన్నాడు

         అప్పటిదాకా ఆ ఆలుమగల మధ్య జరిగిన ఘట్టాన్ని దూరం నుండే గమనించాడు మున్నీ బాబాయి డాక్టర్ సత్యం. వారు కాస్త కుదుటపడ్డాక, నెమ్మదిగా వారి దగ్గరకు వెళ్ళాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు. "అసలు మీవాడి సమస్య ఏమిటో తెలుసా. నేను ఒక డాక్టరుని. నాకు వైద్యం చేయడమే కాదు, మనుషులను చదవడం కూడా తెలుసు. అందుకే ఓ విషయం చెబుతాను. జాగ్రత్తగా వినండి" అన్నాడు.

         అభి తల్లిదండ్రులు డాక్టర్ మాటలను జాగ్రత్తగా వినసాగారు. "ఈ ప్రపంచంలో అందరు వ్యక్తులూ ఒకేలా ఉండరు. అలాగే అందరు పిల్లలూ ఒకేలా ఉండరు. అందరూ ఒకేలా చదవరు. అందరూ ఒకేలా రాయరు. వారికున్న శక్తులను బట్టి, వారు ప్రతిభలో హెచ్చుతగ్గులనేవి కనిపిస్తాయి. వాటిని మనం గమనించి వారి సమస్యలకు పరిష్కారాలను కనిపెట్టాలి తప్పితే, వారి మీద కోపగించుకుంటే ఎలా?" అన్నాడు డాక్టర్ సత్యం.

         దీంతో అభి తల్లిదండ్రులు ఒకరి మొహం మరొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మళ్లీ డాక్టరే వారికి బదులిచ్చాడు. "మీ అబ్బాయి చేతివ్రాత బాగుండదు. అందుకే కదా, మీరు తనను ఎప్పుడూ ప్రాక్టీసు పదే పదే చేయమని కోప్పడుతుంటారు. నిజానికి కొన్ని సమస్యలు ప్రాక్టీసు వల్ల సమసిపోవు. మీ పిల్లాడి చేతివేళ్ళను ఎప్పుడైనా మీరు గమనించారా? నేను గమనించాను. ఆ తర్వాత పరీక్ష కూడా చేశాను. అవి చాలా బలహీనంగా ఉన్నాయి. ఆ బలహీనత వల్ల తాను ఎక్కువ సేపు పెన్నును వేళ్ళతో పట్టుకోలేకపోతున్నాడు. అందుకే చేతివ్రాత వంకరగా వస్తోంది" అన్నాడు.

         "మీరు ఎప్పుడైనా మీ పిల్లాడిని సమస్య ఏమిటో అడిగారా? మీరు అడగలేదు కాబట్టి, తాను తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తానే సతమతమయ్యాడు. నిజానికి తనకు ఉంది ప్రాక్టీసు సమస్య కాదు. వైద్యపరమైన సమస్య. దానికి కారణం కనుక్కోవాలి. విటమిన్ లోపం లేదా ఎముక బలహీనతకు సంబంధించిన లోపం కూడా అది అయ్యి ఉండవచ్చు" అంటూ డాక్టర్ అభి తల్లిదండ్రులకు అటువంటి లోపం ఉన్న పిల్లలు ఫోటోలు చూపించడంతో వారు హతాశులయ్యారు.

         తర్వాత డాక్టరే వారిని ధైర్యంగా ఉండమని చెప్పి, కొన్ని పరీక్షలు చేసి, ఈ సమస్యకు వైద్య సంబంధమైన పరిష్కారం చూపిస్తానని మాటివ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత తాము తమ పిల్లాడిని నిందించకుండా ఉండాల్సిందని తమలో తామే బాధపడ్డారు. నిజానికి, అప్పటి వరకూ తమ బిడ్డకు అటువంటి సమస్యనేది ఒకటి ఉందనేది తమ దృష్టికి రానందుకు తమను తామే తిట్టుకున్నారు.

         అప్పుడు బాధపడుతున్న ఆ తల్లిదండ్రులను డాక్టర్ ఓదారుస్తూ మళ్ళీ నాలుగు స్ఫూర్తివంతమైన మాటలు చెప్పాడు. "నిజానికి మన లోకం వేరు. పిల్లల లోకం వేరు. వారు వారికున్న చిన్ని ప్రపంచమే ప్రపంచమని అనుకుంటారు. నిజానికి మన బాధల కన్నా, వారి బాధలు చాలా ఎక్కువ. అలాగే ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడితే, వారు సహించరు. తమ సమస్యను పరిష్కరించకపోతే, ఇంకా మొండిగా తయారవుతారు" అని అన్నాడు.

         "నిజానికి అభి విషయంలో జరిగింది కూడా అదే. తనకు ఈ రకమైన సమస్య ఉందని తానే అర్థం చేసుకోలేకపోయాడు. నిజానికి నేను కూడా తనకు యాక్సిడెంటుకి ట్రీట్‌మెంట్ చేస్తున్నప్పుడు ఏ విషయమూ అడగలేదు. అయితే మున్నీ ఆ అబ్బాయి చేతివ్రాత గురించి చెబితేనే, నాకు కూడా డౌట్ వచ్చి పరీక్షించాను. వేళ్ళు బలహీనంగా ఉండే పిల్లలు పెన్నును గట్టిగా పేపర్ మీద స్ట్రెస్ చేసి వ్రాయరు. తేల్చి రాస్తారు. అభికి ఓ పేపర్ ఇచ్చి, టెక్స్ట్ బుక్కులో ఉన్న మ్యాటర్ వ్రాయమని చెప్పాను. తాను వ్రాస్తున్ననప్పుడే, అతడి వేళ్ళ కదలికలను నేను గమనించాను" అని అసలు వివరం చెప్పాడు డాక్టర్

         "అయ్యో డాక్టర్ గారూ. ఈ విషయం మాకు కూడా ముందే తెలీదండి. లేకపోతే సమస్య ఇంతవరకు వచ్చేది కాదు. స్కూల్లో టీచర్లు కూడా ఈ విషయం గురించి మాకు చెప్పలేదండి. ఇది మెడికల్ సమస్య అని మాకు తెలిస్తే, ముందే మీ వద్దకు తీసుకొచ్చేవాళ్లం. అంతా మా ఖర్మ అనుకోవాలి. పైగా మా బాబు కూడా ఎప్పుడూ మాకు తనకున్న వేళ్ళ బలహీనత గురించి చెప్పలేదు" అని కన్నీళ్లు పెట్టుకుంది అభి వాళ్ల అమ్మ.

         దానికి మళ్ళీ డాక్టరే సమాధానమిచ్చాడు. "అమ్మా. నిజానికి పిల్లల హెల్త్ రికార్డ్స్ అనేవి స్కూలు యాజమాన్యం కూడా తప్పకుండా మెయిన్ టైన్ చేయాలి. వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి వారే అప్పుడప్పుడు డాక్టర్ చేత పిల్లలకు పరీక్షలు చేయించాలి. కానీ ఎన్ని పాఠశాలలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయో తెలియదు. కనుక మీరు పిల్లాడి స్కూలుకి వెళ్ళి, ఈ విషయం చర్చించండి" అన్నాడు

         అభి తల్లిదండ్రులు డాక్టర్ మాటలతో ఏకీభవించారు. అలాగే డాక్టర్ సత్యం కూడా అభి డిశ్చార్జ్ అయ్యాక, ఈ సమస్యను ఊరికనే వదిలేయలేదు. జిల్లా కలెక్టరుకి ఒక వినతి పత్రాన్ని అందించాడు. స్థానికంగా ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోనూ నెలకోసారి పిల్లల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని చెబుతూ కొందరు వైద్యులతో కలిసి రిప్రజెంటేషన్ అందించాడు

         తర్వాత జిల్లాలో కొందరు డాక్టర్లను ఆహ్వానించి స్థానిక పాఠశాలలోనే ఒక సెమినార్ నిర్వహించాడు డాక్టర్ సత్యం. ఆ సెమినారులో "చైల్డ్ హెల్త్ కేర్"కు సంబంధించి అనేక కీలక విషయాలను చర్చించారు. అందులో ముఖ్యంగా పిల్లలు కూడా తమకు ఏవైనా సమస్యలుంటే వాటిని సంబంధిత వైద్యులకు హెల్ప్ లైన్ ద్వారా తెలియజేసేలా ఒక వ్యవస్థను నిర్మించాలని తీర్మానించారు. ఆ ప్రతిపాదనను ప్రభుత్వాన్ని పంపారు

         ఏదేమైనా, అభి చేతివ్రాతతో వెలుగులోకి వచ్చిన ఒక సమస్య, ఆ తర్వాత ఆ జిల్లాలో పెద్ద విప్లవానికే దారితీసింది. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని, ప్రతీ పాఠశాలలో ఓ డాక్టరు కచ్చితంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తల్లిదండ్రులకు కూడా పిల్లల ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్నెస్ తదితర విషయాలకు సంబంధించిన రిపోర్టును స్కూలు యాజమాన్యమే ఎప్పటికప్పుడు అందివ్వాలని తెలిపింది.

         ఇదంతా ఒక ఎత్తు అయితే, అభి తల్లిదండ్రులలో మాత్రం చాలా మార్పు వచ్చింది. వారు డాక్టర్ చెప్పిన సూచనల మేరకు తమ బిడ్డకు సరైన వైద్యం చేయించారు. విటమిన్ లోపం కోసం వైద్యులు సూచించిన టానిక్‌లు అందించారు. వేళకు మంచి ఆహారం, పానీయాలు ఇవ్వడంతో పాటు చిన్నిపాటి వ్యాయామాలు చేయించడం వల్ల అతని చేతివేళ్ళలో కూడా బలం నెమ్మదిగా పుంజుకుంది.

         ఒకసారి తన వేళ్ళకు బలం చేకూరి, తనకు పెన్ను మీద గ్రిప్ దొరకడంతో అభి ఆశ్చర్యపోయాడు. పేపర్ మీద పెన్ను నిబ్‌తో స్ట్రెస్ చేశాక, అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకప్పుడు తనను ఆవరించిన నిసత్తువ తనలో నుండి దూరంగా పోతున్న ఫీలింగ్ కూడా కలిగింది. వెంటనే మున్నీని పిలిచి, తను వ్రాసిన పదాలు చూపించాడు. అవి మునపటి కన్నా బెటర్‌గా ఉండడం చూసి తను కూడా ఆశ్చర్యపోయింది

         అభి స్కూలులో కూడా టీచర్లు కాస్త పద్ధతి మార్చారు. చేతివ్రాత బాగాలేని విద్యార్థులకు ఉన్న సమస్య ప్రాక్టీసు సమస్యా? లేదా మెడికల్ సమస్యా? అనే విషయాలు కూడా తెలుసుకోవడం ప్రారంభించారు. బాధ్యాతాయుతంగా మెలగడం ఆరంభించారు. ఒకవేళ నిజంగానే మెడికల్ సమస్య ఉంటే, వెంటనే అలర్ట్ అయ్యేవారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించేవారు.

         ఓ రోజు డాక్టర్ సత్యాన్ని కలవడానికి వచ్చిన ఓ మిత్రుడు తనతో ఇలా అన్నాడు. "నిజానికి అక్షరాలు సరిగ్గా వ్రాయడం రాని నీ అభిమన్యుడు, ఒక వ్యవస్థ మారడానికే దోహదపడ్డాడు. అయితే ఇదంతా నువ్వు చొరవ చూపడం వల్లే సాధ్యమైంది. అలాంటి అభిమన్యులు మరి మన మధ్యలో ఇంకెంత మంది ఉన్నారో. వారికి దిక్కెవరూ" అని తన సందేహాన్ని బయటపెట్టాడు. "అందుకు తగ్గ చట్టాలు, నిబంధనలు వస్తే, సాధ్యం కానిదేముంది" అంటూ నవ్వుతూ బదులిచ్చాడు డాక్టర్ సత్యం.

コメントの追加

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)