‘‘తృతీయం, అద్వితీయం!’’  (Author: పాణ్యం దత్త శర్మ)

బంధుప్రీతీ, అవినీతీ, ఆశ్రిత పక్షపాతమూ

లాంటి అవగుణాలకతీతంగా పనిచేస్తుంది

మన భారతీయ న్యాయవ్యవస్థ!

ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఆ మూడవదే

ఇంతవరకూ సొంత నిజాయితీని నిల్పుకుంటూ వస్తూంది!

కానీ, ఎందుకోమరి, పైకి లేస్తున్నాయి                                                  

కొందరి కనుబొమలు అనుమానంతో                                                   

నిప్పూ పొగ సామెతకు ఆస్కారం కలిగిస్తున్నాయి

బహిరంగంగానే ఆ కొందరు ఆరోపిస్తున్నారు                                  

నిస్పక్షపాత న్యాయం సామాన్యుని కందనిపండని

కాదేదీ కోర్టుకేసు కనర్హంఅన్నది కూర్చుంది నిజమై

ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు రాజకీయానికయ్యాయి ఆజ్యాలు

లైంగిక హింస, మానభంగ నేరస్తులను ఎన్‌కౌంటర్‌ చేస్తే                             

ఆ పోలీసులకు నీరాజనాలు పట్టే జనం!

ఆలస్యమైతే న్యాయం, అందనట్లే అనా జనాభిప్రాయం?

తల్లీ, న్యాయదేవతా! నీవొక్కదానివే                                            

కల్లోలాలను నివారించావు సమాజంలో                                                

నీ విశ్వసనీయతనే శంకిస్తే, నీ గౌరవాన్ని ఇంకిస్తే

పరిబృఢీకృతమవుతుందా అమ్మా ప్రజాస్వామ్యం?

నిర్దయగా, నిర్భీతిగా, వెలువరించుజననీ సమన్యాయం!   

Lisää kommentteja