శ్వాస  (Author: ఉయ్యూరు అనసూయ)

స్ప్రింగ్ డోర్ తీసుకుని బయటికి వచ్చాడు డాక్టర్ శరత్. ఎదురుగా ఉన్న మనోహర్ చూసి ఒక్క నిమిషం అన్నట్లుగా చేత్తో సైగ చేసి కొంచెం దూరంగా వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాక వెనక్కు తిరిగాడు. తానేం చెప్తాడా అని ఆదుర్ధాగా ఎదురు చూస్తున్న మనోహర్ వైపు చూసి మీ ఫాదర్ కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. కంగారు పడకండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటూ భుజం తట్టి ఐసి యునిట్ లోకి వెళ్ళాడు.

         పరిస్థితి అంతా అయోమయంగా వుంది మనోహర్ కి “ఇలా ఎలా జరిగింది?” అని మనసులో ఓ వంద సార్లన్నా ప్రశ్నించుకుని వుంటాడు.. కానీ అంతకుమించి అతని అలోచన ముందుకు సాగటం లేదు. ఓరకంగా చెప్పాలంటే మెదడు మొద్దు బారి పోయింది. హాల్లో వున్న కుర్చీలో కూర్చుని తండ్రి వున్న ఐసియు గదివైపే చూస్తూన్నాడు నిస్తేజంగా.

         పది నిమిషాలు తర్వాత “ఒరే ఏమైందిరా నాన్నకి?” వణుకుతూ పలుకుతున్న మాటలు విని తల తిప్పి చూసాడు. బాబాయి నాలుగడుగులు దూరంలో వస్తూ కనిపించాడు.

         అప్పటి వరకూ కాస్త నిబ్బరంగా ఉన్న మనోహర్ బాబాయ్ ని చూడగానే కళ్ళంట నీళ్లు. మెల్లని స్వరంతో“.... ఏం లేదు బాబాయ్ నాన్న.. నేను పెళ్లి రిసెప్షనుకు బయలుదేరాము కొద్ది దూరం వెళ్ళే సరికి కుక్క అడ్డం వచ్చింది... సడన్ బ్రేక్ వేశాను. బ్యాలెన్స్ తప్పి ఇద్దరం పక్కకి పడిపోయాం. నాకు ఇక్కడ అంతా గీసుకుపోయింది అంటూ కొద్దిగా రక్తం మరకవున్న చేయి చూపించి.. నేను గబుక్కున లేచి నాన్నని లేపటానికి ప్రయత్నించా, వంటిమీద దెబ్బలు ఏం లేవు కానీ స్పృహలో లేరు. వెంటనే హాస్పిటల్ తెచ్చాను. కానీ డాక్టర్ క్రిటికల్ అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు” చెప్తూ కారుతున్న కన్నీరు తుడుచుకున్నాడు.

        “నాన్న తలకేమైనా దెబ్బలు తగిలాయా?”

         లేదు ఒక్క దెబ్బకూడ లేదు. సడన్ బ్రేక్ వేసే సరికి ఊహించ లేదు కదా... అందుకే ఓ గాడ్! అని గట్టిగా అరుస్తూ పడిపోయారు. అంతే దాని తర్వాత అసలు ఎంత పిలిచినా మాటలేదు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ రావటం ఆంబులెన్స్ పిలవటం, నేను అక్కకు ఫోన్ చేయటం జరిగింది అన్నాడు.

         రమ చెప్పబట్టే వచ్చాను. అది చాలా కంగారు పడుతుంది. నాన్నతో వెళుతున్నప్పుడు కాస్త నిదానంగా డ్రైవ్ చేయాలని తెలియదా? ఎందుకు అంత స్పీడు అని కసురుకుంటూ మాట్లాడింది?”

        “అయ్యో లేదు బాబాయ్! నేను చాలా నిదానంగా వెళుతున్నా. కుక్క షడన్ గా బండికి అడ్డం రాబట్టి దాన్ని తప్పించటానికి కొంచెం పక్కకి జరిపా చిన్న జర్క్ తో స్కిడ్ అయింది. అందుకే పెద్ద దెబ్బలేం తగలలేదు చూడు” అంటూ మళ్ళీ తన శరీర అవయవాలు చూపించాడు.

         ఇద్దరూ మాట్లాడుతుండగా అక్క, బావ గబగబా వచ్చారు.“నాన్న ఎక్కడ? ఎలా వున్నారు? అడుగుతూనే పక్కన వున్న రూంలోకి తొంగి చూసింది. ఇక్కడ కాదు ఐసియు లో అంటూ ఆ వైపు చూపించాడు.“ ఇస్సెన్టివ్ కేర్లోనా? అంత ప్రమాదమా?” ఆశ్చర్యంగా అడుగుతున్న అక్కకి సమాధానం చెప్పలేక బాబాయి వైపు చూసాడు.

         బాబాయి కల్పించుకుని ఇందాక తనకి చెప్పిన విషయాలనే తాను దగ్గరుండి చూసినట్లుగా వివరించి చెప్పాడు.

         అయినా ఆందోళన తగ్గని ఆమె “రిసెప్షన్ కి సమయానికి వెళ్లాలని రూల్ ఏదైనా ఉందా?.. వెళ్ళామా.. కనిపించామా అన్నట్టు ఉండాలి గానీ... తొందరగా వెళ్ళాలని అనుకుని ఇలా ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకున్నట్లు?”

        అయ్యో... అక్కా! నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. మేము మామూలుగానే వెళుతున్నాం... షడన్ గా జర్క్ వచ్చేసరికి ఆయన కంగారు పడ్డారు. అప్పటికీ అసలు ఈ రిసెప్షన్ కి వెళ్ళటం అవసరమా?.. అని కూడా అడిగాను.

        అలా అంటే ఎలా రా... రేపు నీ పెళ్లికి ఎవరు వస్తారు చెప్పు. ఈ రిసెప్షన్ కి మా చిన్ననాటి స్నేహితులంతా వస్తున్నారు. వారందరికీ నిన్ను చూపాలి... నీ పెళ్ళికి అందర్నీ ఇలాగే రమ్మని పిలవాలి, అంటూ వారం రోజులుగా ఒకటే ఎక్జయిట్మెంట్ తో వున్నారు”.

        “అవునే మొన్న నేను ఫోన్ చేసినప్పుడు తన స్నేహితుడి కొడుకు పెళ్ళి వుంది వెళ్ళాలి అన్నాడు. పైగా నీవు రారా... నీకు నా స్నేహితులంతా తెలుసు కదా వాళ్ళందరినీ చూసినట్లు వుంటుంది, అలాగే వాళ్ళు రిసెప్షన్ లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చూస్తే రేపు మన మనూ గాడి పెళ్ళిలో కూడా ఏ లోటు రాకుండా చూసే అవగాహన వస్తుంది అన్నాడు” నాన్న చెప్పింది గుర్తుచేసుకుంటూ చెప్పాడు బాబాయి.

         వీళ్లు ఇలా మాట్లాడుతూ ఉండగా బయటి నుండి వచ్చిన ఇద్దరు డాక్టర్లని అసిస్టెంట్స్ లోపలికి తీసుకెళ్ళటం కనిపించింది. ఆ వాలకం చూసి ఏదో కీడు సంకించింది బాబాయికి.

         ఏం దెబ్బలు లేవంటున్నారు వీళ్ళ హడావిడి చూస్తుంటే సినిమాల్లో ఆఖరి సీనులో డాక్టర్ల ఓవరాక్షన్ సీన్ లా కనిపిస్తుంది... ప్రేక్షకుడిని టెన్షన్ పెట్టడానికి చూపిస్తారు. కానీ నిజానికి ఏ డాక్టర్ మన ఫీలింగ్స్ అనుకూలంగా స్పందించరు. మన ఫీలింగ్స్ తో పనిలేకుండా చాలా మామూలుగా కూల్ గా వారి పనులు చేసుకుపోతుంటారు.

         కానీ ఇక్కడేంటో కొంచెం తేడాగానే అనిపించింది. ఒకవేళ ఏదైనా ఎక్కువ ఫీజు కోసం ఏమైనా సినిమా ట్రిక్ చేస్తున్నారా? అని బాబాయి అనుమానం.

         ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి “పేషెంట్ తాలుకు ఎవరు వున్నారు?” అడిగాడు. బాబాయ్ దగ్గరికి వచ్చి ఇదిగో వీడు కొడుకు, కూతురు, అల్లుడు.. నేను తమ్ముడిని అన్నాడు.

         మనోహర్ వైపు తిరిగి“మీరంతా పేషెంటును చూసాక నా రూంకి రండి” అంటూ తన రూం లోకి దారి తీశారు. ఆయన చెప్పినట్లే తండ్రిని చూసి డాక్టర్ గదిలోకి వెళ్ళారు‌. అందరినీ కూర్చోమని ఆయన మనోహర్ వైపు చూస్తూ“చూసారుగా నాన్నగారి కండిషన్... ఆయన కిందపడటం వలన ఏ ప్రమాదం జరగలేదు. కానీ ఆ తర్వాత పరిణామానికి బీపీ పెరిగి మెదడలో రక్తనాళాలు చిట్లాయి. అందువల్ల ఓవర్ బ్లీడింగ్ అయింది. సాధారణంగా ఈ పరిస్థితిలో కొంచెం ముందు వచ్చినట్లయితే ఛాన్స్ ఉండేదేమో.... ప్రస్తుతం కోమాలో ఉన్నారు” అన్నాడు.

         నలుగురూ ఒకరిమొకాలు ఒకరు చూసుకున్నారు కోమా అనగానే కాస్త ఆందోళనతో తర్వాత ఏం చెప్తారా అన్నట్టు ముఖం పెట్టారు.

        ‌“మేము మా లెవెల్ బెస్ట్ ప్రయత్నం చేసాం. మరో ఇద్దరు డాక్టర్స్ సంప్రదించాకే మీకు విషయం చెబుతున్నా మీరు హైదరాబాద్ లో ఎ హాస్పిటల్ కి తీసుకెళ్లినా ఇంతకంటే బెటర్ ట్రీట్మెంట్ అయితే జరగదు. ఏదైనా పోజిబిలిటీ వుందేమో అని సిటీలో ది బెస్ట్ డాక్టర్లని పిలిచాను. బ్రెయిన్ డెడ్ గా వాళ్ళు డిక్లేర్ చేసారు” అన్నాడు కొంచెం బాధగా.

         వింటున్న నలుగురూ మాన్పడిపోయినట్లు చూసారు. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అంటే వారికి తెలియంది కాదు. ఈ మధ్య పేపర్లలో ఇలాంటి విషయాలు బాగా విని వున్నారు.

         ఏం చెప్పాలో అర్థం కాక కొయ్యబారిపోయాడు బాబాయి. ముందుగా అల్లుడు తేరుకుని “అలా చెప్పకండి డాక్టర్ ఏం చేసయినా ఆయన్ని బతికించండి” అన్నాడు.

        “చేసాం. ఆయన హైపర్ టెన్షన్ కి గురవ్వడం వల్ల మెదడులో నరాల చిట్లి ఓవర్ బ్లీడింగ్ అయింది. ఫిజికల్ దెబ్బలు లేకపోవటం వల్ల ఎవరూ సస్పెక్ట్ చేయలేదు. కానీ స్కాన్ లో చూస్తే తెలిసింది చాలా సమయం మించిపోయిందని” చెప్తూ డాక్టర్ గొంతు సవరించుకొని నెమ్మదిగా అన్నారు..” ఆయన ఎంతకాలం వున్నా అలా వెంటిలేటర్స్ మీదే వుండాలి. కానీ దాని మూలంగా ఉపయోగం లేదు” మీరు సరే అంటే వెంటిలేటర్స్ తొలగిస్తాం” అన్నాడు.

         అక్కా తమ్ముళ్ళకి మీరు చెప్తే మీనాన్న ప్రాణం తీస్తాం అన్నట్లుగా అనిపించింది. రమ ఇక దుఃఖం ఆపుకోలేక రమ కర్చీఫ్ అడ్డు పెట్టుకుని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది.

         తను అలా వెళ్ళిపోవటం తో వాతావరణం సీరియస్ అయింది. డాక్టర్ మెల్లగా పైకి లేస్తూ “మీరు త్వరగా ఆలోచించుకుని ఏ విషయమూ చెప్పండి నేను మళ్ళీ వస్తాను” అంటూ వెళ్ళాడు.

        “ఏంటి బాబాయ్! నిక్షేపంగా వున్న మనిషి. ఏమాత్రం దెబ్బలు కూడా లేవు. హైపర్ టెన్షన్ అంట.. పోనీ హార్టు ఆగిందా అంటే.. అదీ లేదు. ప్రాణం వుందిట, కానీ ఆయన దేనికీ స్పందించరట. అందుకని ఆయనకి అందిస్తున్న కృత్రిమ శ్వాసని మనం ఆపమని చెప్పాలట. అలా.. ఎలా చెప్తాం బాబాయ్? ఇంత వైద్యం తెలిసిన డాక్టర్లే ఆపని చేసేసి వుండవచ్చు కదా! మనల్ని ఎలా అలా అడుగుతారు? వద్దు బాబాయ్ ఎన్నాళ్ళు వున్నా నేను చూసుకుంటాను నాన్నని వెంటిలెటర్లు తొలగించాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చయినా సరే” ఉద్వేగంతో అన్నాడు. వింటున్న బాబాయికి కళ్ళలో దుఃఖం పొంగుకు వచ్చింది.

        “ప్రయోజనం లేదంటున్నారు కదా బావా! ఓసారి ఆలోచించు” ప్రశాంత్ అంటుండగా ఇందాక ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిన ఇద్దరు డాక్టర్లలలో ఒకతను లోనికి వచ్చి మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి అన్నారు.

         కళ్ళు తుడుచుకుంటూ “చెప్పండి” అన్నాడు మనోహర్.“మీ నాన్నగారు పొజిషన్ మీకు అర్థం అయింది అనుకుంటా. ఎక్కువ కాలం ఆయన్ను అలా వుంచలేం. మీరు మానవత్వంతో స్పందిస్తే ఆర్గాన్స్ డొనేట్ చేయవచ్చు. దాని మూలంగా మరో నలుగురు కి ప్రాణదాతలౌతారు” అన్నాడు.

        “ప్రాణం ఎలా దక్కించాలా ఆలోచిస్తున్నాం డాక్టర్! దానికి ఏదైనా మార్గం చూడండి... అంతే తప్ప ఇప్పుడు మరొకరి గురించి ఆలోచించే పరిస్థితిలో లేము మేము”.

         డాక్టర్ దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేస్తూ“ మీ పరిస్థితి అర్ధంచేసుకోగలను. కానీ ఏ మాత్రం హోప్ లేదు. మామూలుగా ఏకారణంగా కోమాలోకి వెళ్ళినా దేరీజే ఛాన్స్ టు రికవర్. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇఫ్ బ్రెయిన్ రెస్పాండ్స్.. దాన్నే మిరాకిల్ జరిగి పేషెంట్లు తిరిగి కోలుకున్నాడు అంటాం. కానీ ఈ పర్టిక్యులర్ కేసులో ఖచ్చితంగా లేదు ఎందుకంటే అతని బ్రెయిన్ స్పందించ టానికి ఆస్కారమే లేదు. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఆ ప్రభావం మిగిలిన ఆర్గాన్స్ పై పడి గ్రాడ్యుయల్ గా అవి కూడ స్పందించటం మానుకుంటాయి.

        “అందుకే ఆర్గాన్ డొనేషన్ గురించి ఆలోచించ మంటున్నాను”. ఇంకా అయోమయంగా చూస్తున్న అతనితో

        “యాబై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు తప్పని పరిస్థితిలో ఓ మనిషిని డాష్ ఇస్తూ వెళ్ళకపోతే లోయలో పడుతుంది. యబై మంది ప్రాణాలకోసం మనం దానిని కరెక్టే అంటాం అలాగే ఇదినూ. ఆలోచించండి” అంటూ ఆలోచించటానికి టైం ఇస్తున్నట్లుగా సైలెంట్ అయిపోయాడు.

         హారి భగవంతుడా! ప్రశాంతంగా నిద్రపోతున్న మనిషికి ఇస్తున్న శ్వాస ఆపండి అని మేము చెప్పాలట. ఇంత కన్నా దౌర్భాగ్యం ఇంకేమన్నా వుందా‌? వైద్యులే ఆపని చేసి ప్రాణం పోయింది అని చెప్పవచ్చు కదా! నా హృదయం అంతా పాషాణమా నిర్ణయం తీసుకోటానికి.

        ‌‌ అసలే నా మూలంగా ఆయనకి అలా అయిందని బాధ పడుతుంటే మధ్యలో ఇదేమిటి? మానసికంగా వేదన పడుతున్న మనోహర్ ఏం ఆలోచించే పరిస్ధితిలో లేడు. బాబాయి వైపు చూసాడు.

         సైన్స్ డెవలప్ అయిన కొద్దీ ఎంత ఉపయేగమో అంత పెయిన్ అనుభవించాలని మొదటి సారిగా తెలుసుకున్నా‌. గుండె తీసి గుండెను మార్చగలిగిన ఈ వైద్యం మరింత అందుబాటులోకి రాకూడదా? మన నిర్ణయాల‌ మీద మరో నాలుగు జీవితాల ప్రాణం నిలుస్తుందని చెప్పటం న్యాయమేనా? నేను నీకు ఈ విషయంలో సలహా ఇవ్వలేను అన్నాడాయన దుఃఖాన్ని దిగమింగుతూ.

         ఈలోపు బయట నుండి రమ గొల్లున ఏడవటం వినిపించింది. డాక్టర్ తో సహా అంతా బయటికి వచ్చి చూసారు. రమతో మాట్లాడుతూ డాక్టర్ లోనికి వెళ్ళటం కనిపించింది. ఏమైందో అనుకుంటూ దగ్గరగా వెళ్ళారు. వెంటిలేటర్స్ పనిచేయటం మానేసాయిట. ఆయన ప్రాణం పోయింది అంటున్నారు గట్టిగా ఏడుస్తూ చెప్పింది.

        “మీ మనోభావాన్ని అర్థం చేసుకుని మీకు కష్టం రాకుండా ప్రాణాలు వదిలారు నాన్నగారు” అన్నాడు తనతో వచ్చిన డాక్టర్. అవయవ దానం చేజారిందనే భావం ఏమాత్రం లేదాయన ముఖంలో. డాక్టర్ చెప్తున్నా వినకుండా సరైన సమయానికి స్పందించలేకపోయానా? మరో నలుగురికి సాయం అందించలేక పోయానా? అని“డాక్టర్” అంటూ చొప్పున ఆయన చేయి పట్టుకున్నాడు బాధతో.

        “డాక్టర్ల మీద నమ్మకం వుంచండి. నేనూ ఓ తండ్రికి కొడుకునే. నీ పెయిన్ నాకు తెలుస్తుంది. డాక్టర్ గా తాపత్ర పడ్డామంతే అంటూ చేయి మృదువుగా నొక్కి వదిలేసాడు”.

         ఇప్పుడు తండ్రి పోయిన బాధ కంటే మరో నలుగురిలో మమేకం అయి ఆయన ఈ లోకంలో వుండేవారు కదా! అలా చూసుకోలేక పోయానే అనే బాధ ఎక్కువైంది అతనికి. ‌

        ..... సమాప్తం....

Lisää kommentteja

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)