యత్ర నార్యస్తు పూజ్యంతే (మొదటి బహుమతి)

గమనిక: ఈ కథలో వాడిన కొన్ని అశ్లీల పదాలని, రచయిత రాసినట్లుగా పూర్తిగా కాకుండా లం, ముం అని కౣప్తంగా ప్రచురిద్దామనుకున్నాం. కానీ అలా పరిష్కరించకుండా పూర్తిగా ఉంచితేనే, ఈ రోజుల్లో కూడా కోడళ్ళని అత్తవారింట్లో అలా తుఛ్ఛంగా చూస్తున్నారు, కాల్చుకు తింటున్నారు అన్న భావం పూర్తిగా వస్తుందని అలానే ఉంచేశాం. పాఠకులు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాం.  ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి!

*****

‘‘రూప పుట్టింటికి వెళ్లిపోయిందిట. విడాకులు తీసుకుంటానంటోందిట. రమ వదిన బజార్లో కనబడి కళ్లనీళ్లు పెట్టుకుంది!’’ తను తెచ్చిన కూరల సంచీ భార్య గౌరి చేతికి అందిస్తూ చెప్పాడు మహీథర్‌.

        ‘‘విడాకులా...’’ తెల్లబోయింది గౌరి. ‘‘పెళ్లయి ఆర్నెల్లు కూడా అయినట్టు లేదు...అప్పుడే విడాకులేమిటండీ?’’

        ‘‘పెళ్లయి ఆరేళ్లయితే విడాకులు తీసుకోవచ్చా...’’ అక్కడే ఉన్న కపర్ది నవ్వుతూ ప్రశ్నించాడు తల్లిని.

        గౌరి కోపంగా చూసింది కొడుకు వైపు.

        కపర్ది మాత్రం తల్లి కోపాన్ని పట్టించుకోకుండా...‘‘పెళ్లిపీటల మీద ఆ పిల్లతో రమేష్‌ పవర్తన చూసినప్పుడే అనుకున్నాను నేను ఇది ఎన్నాళ్లో నిలిచే వ్యవహారం కాదని. పాతికేళ్ల కిందట ఏ కారణంతో అయితే నువ్వు ఆ ఇంటినుంచి బైటికి వచ్చేశావో, ఇప్పుడు అదే కారణంతో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్లిపోయి ఉంటుంది!’’ అన్నాడు.

        గౌరి మాట్లాడకుండా భర్త వైపు చూసింది.

        మహీథర్‌ ఒక్క వేదాంతపు నవ్వు నవ్వి, ‘‘నీ కొడుకు చెబుతున్నది నిజమే గౌరీ. పాతికేళ్ల కిందట వేరు కాపురం కోసం నువ్వు పట్టుబట్టినప్పుడు నీ మీద నాకేమైనా కోపం వచ్చి ఉంటే, అది కూడా ఈ క్షణంలో పోయింది. నిజంగా నిన్ను చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి!’’ అన్నాడు

        ‘‘అదృష్టం మీది కాదు, నాది. ఒకప్పుడు నేను మీకు చెప్పిన మాటల్ని ఇంచుమించు ప్రతి ఆడదీ తన భర్తకి చెబుతుంది. కాని భార్య మాటకి విలువ ఇచ్చి పాటించే మొగవాళ్లు మన సమాజంలో చాలా తక్కువ. ఆ తక్కువ శాతంలో మీరొకరు. మీ సహకారం లేకపోతే ఏమయ్యేది!’’ మనస్ఫూర్తిగా అంది గౌరి.

        ‘‘ఏముంది...నువ్వు కూడా రూప లాగే అమ్మమ్మా వాళ్లింటికి వెళ్లిపోయి ఉండే దానివి!’’ తేలిగ్గా అన్నాడు కపర్ది

        గౌరి సాలోచనగా కొడుకు వైపు చూస్తూ, ‘‘లేదు నాన్నా, మా తరం వాళ్లకి అంత తెగింపు లేదు. ఎన్ని బాధలైనా పడుతూ అత్తవారింట్లోనే ఉండేవాళ్లం. ఒకరకంగా చెప్పాలంటే పరిస్థితుల్ని చక్కదిద్దుకోలేని మా నిస్సహాయత వల్లే పిల్లల పెంపకాలు సరిగ్గా జరగలేదనిపిస్తుంది నాకు. రమక్క కూడా నాలాగే ఆలోచించేది. మీ నాన్న సహకారం ఉండటం వల్ల నేను అడుగు ముందుకు వేసి నిన్నూ నా కాపురాన్నీ చక్కదిద్దుకోగలిగాను. పెదనాన్నగారి మూర్ఖత్వం వల్ల దొడ్డమ్మ ఆ ఊబిలోనే మరింత కూరుకుపోయింది.’’ అంది

        ఎవరూ మాట్లాడలేదు. ముగ్గురి ఆలోచనలూ దాదాపు ముప్ఫై ఏళ్ల వెనక్కి వెళ్లాయి.

********

        ‘‘రామచంద్రం మేస్టారమ్మాయి గౌరిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను’’ కాస్త భయపడుతూనే చెప్పాడు మహీథర్‌

        ‘‘గౌరా...ఆ పిల్ల రామచంద్రం తమ్ముడి కూతురు కదూ’’ తండ్రి అన్నాడు

        ‘‘అవును. తల్లీ తండ్రీ చచ్చిపోతే రామచంద్రం మేస్టారే తన కూతుళ్లతో బాటూ పెంచారు. మా అమ్మాయి అనే చెబుతారు ఎవరికైనా’’

        ‘‘ఆయనగారు ఎలా చెబితే ఏం గాని, పిల్ల పేరున ఎర్ర ఏగానీ లేదు. రామచంద్రం తన కూతుళ్లకే కట్నం ఇవ్వలేక నానా పాట్లూ పడ్డాడు. ఇక ఈ పిల్లకేం పెడతాడు?!’’

        తెగించేశాడు మహీథర్‌...‘‘ఏమీ ఇవ్వరు. సారె సామాను కూడా ఏమీ రాదు. గుళ్లో కూచోబెట్టి పెళ్లి  చేసి పంపిస్తారంతే!’’

        ‘‘అంత దిక్కులేని పెళ్లి చేసుకోవడానికి నీకేం ఖర్మరా..’’ అప్పుడే అక్కడికి వచ్చిన రెండో అన్న శ్రీథర్‌ అన్నాడు

        ‘‘బాగా చెప్పావు. వీడి నోట్లో నలుగురూ ఇంత గడ్డి పెట్టండిరా... అప్పుడు గాని ఆ బుర్రకి పట్టిన తుప్పు వదలదు!’’ ఈసడింపుగా అంది తల్లి మాణిక్యాంబ

        మహీథర్‌కి నోరు విప్పే అవకాశం కూడా ఇవ్వకుండా తండ్రి, ఇద్దరన్నలు, పెద్ద వదిన, తల్లి అందరూ తలో వాగ్బాణమూ వేసేశారు.

        మహీథర్‌ నోరెత్తలేదు. లొంగివచ్చాడనుకున్నారందరూ.

        మూడోనాడు పసుపు బట్టలతో గౌరి చెయ్యి పట్టుకుని గుమ్మంలో నిలబడే సరికి ఎవరికీ ముందు నోట మాట రాలేదు.

        ‘‘నా గుమ్మం తొక్కడానికి వీల్లేదం’’టూ పెడబొబ్బలు పెట్టబోయింది మాణిక్యాంబ

        తల్లి సంగతి బాగా తెలిసిన శ్రీధర్ ఆమెని గబగబా లోపలికి లాక్కెళ్లాడు. ‘‘మా ఇద్దరి జీతాల కంటే మహీ జీతమే ఎక్కువ. ఇంటికి వాడే ఎక్కువ ఇస్తున్నాడు. ఆ పిల్ల కూడా ఉద్యోగం చేస్తోంది. దాని దగ్గర నుంచి కూడా ఎంతో కొంత లాగొచ్చు. ఇప్పుడు వాళ్లిద్దర్నీ గెంటేశావంటే నీకు అటు డబ్బు నష్టం ఇటు చెడ్డపేరు. రానిచ్చావంటే డబ్బుకి డబ్బు... పని చెయ్యడానికి మరో ఆడది. ఆలోచించుకో!’’

        మాణిక్యాంబ గదిలోంచి బైటికి రాలేదు. మొగుడు ఆజ్ఞాపించిన మీదట శ్రీథర్‌ భార్య రమ నూతన దంపతులిద్దరికీ హారతిచ్చి స్వాగతం పలికింది.

        ‘‘నీకు ముందే చెప్పాను...ఒక్క నేను తప్ప మిగతా వాళ్లందరూ నీ దారిలో ముళ్లే పరుస్తారని. నువ్వు గాయపడకుండా సాథ్యమైనంతగా చూసుకుంటాను గాని నిన్ను నువ్వు కూడా రక్షించుకుంటూ ఉండవలసిందే!’’ తొలిరాత్రి భార్యని ప్రేమగా దగ్గరకి తీసుకుంటూ అన్నాడు మహీథర్‌

        ‘‘రమక్క కూడా మీలాగే.. చాలా స్నేహంగా ఉంది’’ సిగ్గుపడుతూనే చిరునవ్వుతో చెప్పింది గౌరి

        ‘‘మా చిన్నొదినా... పాపం మంచిది. తనకి చదువంటే చాలా ఇష్టం. పుట్టింటివాళ్లు ఆడదానికి చదువెందుకని ఇంటర్‌తో ఆపేశారట. ప్రైవేటుగా బికాం చదువుకుంటాననీ ఉద్యోగం చేస్తాననీ పెళ్లయిన ఈ ఐదేళ్లలో కనీసం వందసార్లు ప్రాధేయపడి ఉంటుంది. చిన్నన్నయ్య మా అమ్మకి నమ్మినబంటు. ఇద్దరూ వదిన్ని కనీసం పేపరు కూడా చదవనివ్వరు. అప్పుడే ఏవో పనులు చెప్పి లేవగొడతారు!’’

        మర్నాడు ఉదయాన్నే లేచి గది బైటికి వచ్చిన గౌరి, వీథి వాకిట్లో నిలబడి పేపరు చూస్తున్న రమని చూసి చిరునవ్వు నవ్వింది.

        ‘‘కొత్త పెళ్లికూతురివి, అప్పుడే లేచేశావా? కాఫీ కలుపుతానుండు!’’ చేతిలో పేపరు భద్రంగా మడిచి టేబిల్‌ మీద పెట్టేస్తూ అంది రమ

        ‘‘కాఫీ నేను కలుపుతాన్లే అక్కా, నువ్వు పేపరు చదువు!’’ స్నేహపూర్వకంగా అంది గౌరి

        రమ నవ్వింది. ‘‘ఇంకా నయం...అత్తగారింకా లేవలేదు కాబట్టి కాస్త హెడ్‌లైన్లు చూశానంతే. మొహం కడుక్కు రా, కాఫీ ఇస్తాను!’’ అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది.

        ఆ తర్వాత అత్తవారింట్లో చాలా పరీక్షలే ఎదుర్కొంది గౌరి. మొదటి పరీక్ష డబ్బు దగ్గర ఎదురైంది.

        ‘‘ఏమిటీ...సంసారానికి ఐదువేలు ముష్టి వేస్తున్నావా.. అసలెంతమ్మాయ్‌ నీ జీతం?!’’ తొలిసారి కోడలు ఐదువేలు తెచ్చి తనకివ్వగానే కోపంగా అడిగింది మాణిక్యాంబ.

        ‘‘నా జీతం ముప్ఫై వేలు. పదివేలు నెలనెలా మా పెదనాన్నకిస్తాను. తను నా కోసం కొన్ని అప్పులు చేశాడు అవన్నీ తీర్చడం నా థర్మం. మరో పదివేలు మా భవిష్యత్తు కోసం సేవ్‌ చేస్తాను. ఐదు వేలు మా ఖర్చులకి. మిగతా ఐదువేలూ మీకిస్తున్నాను!’’ నెమ్మదిగానే చెప్పింది గౌరి

        ‘‘నీకు ముప్పొద్దులా తిండి మేం పెడుతున్నాం.. మీ పెదనాన్న కాదు. పెళ్ళయ్యాక కూడా ఆయనగారికేమీ దోచి పెట్టక్కర్లేదు గానీ  మరో పదివేలు పట్రా!’’

        ‘‘మహి మీకిచ్చే డబ్బు మరో ఐదువేలు పెంచానని చెప్పాడు. నన్ను ఐదువేలు ఇమ్మన్నాడు. నేను అదనంగా వచ్చినందుకు ఇద్దరం కలిసి మొత్తం పదివేలు ఎక్కువ ఇస్తున్నాం!’’ తన మాటల్లో ఎక్కడా కాఠిన్యం లేకుండా జాగ్రత్తపడుతూ సాధ్యమైనంత మృదువుగా అంది గౌరి.

        అయినా సరే, గౌరి మాటలు వింటూనే భద్రకాళే అయిపోయింది మాణిక్యాంబ. ‘‘ఆ ఆడంగి వెథవ వల్లే కొంప ఇలా తగలడింది. మూడు లక్షల కట్నం, పాతికవేలు అత్తగారి లాంఛనం ఇచ్చి పిల్లనిస్తామని వచ్చారు. ఆ ముదనష్టపు ముండాకొడుకు నిన్ను తగులుకోబట్టి మా బతుకులు ఇలా అఘోరించాయి...!’’ అత్తగారి వాగ్థాటికీ ఆ నడివయసు ఆడదాని నోటినుంచి వస్తున్న మాటలకీ బిత్తరపోయి గదిలోకి పారిపోయింది గౌరి.

        ఆ తర్వాత హోరాహోరీ యుద్ధం జరిగింది. మరో మూడు వేలు తనే ఇస్తానని చెప్పి తల్లిని శాంతపరిచాడు మహీథర్‌. అయినప్పటికీ పూర్తిగా శాంతించలేదు మాణిక్యాంబ. గౌరి పట్ల తనకి గల అయిష్టతను బాహాటంగానే ప్రదర్శించేది. తన మాటలన్నిటికీ తందాన పాడే పెద్దకోడలు సీతని పూర్తిగా పని మానిపించేసి, ఇంటెడు చాకిరీ రమకీ గౌరికీ పంచింది. రెండోసారి గర్భవతి అయి రమా, తొలిచూలు గర్భిణిగా ఉంటూ గౌరీ పల్లెత్తుమాట మాట్లాడకుండా చాకిరీ చేశారు. ఏడోనెల వచ్చాక రమ పుట్టింటికి వెళ్లిపోయింది. గౌరిని పురిటికి పుట్టింటికి కూడా పంపలేదు మాణిక్యాంబ.

        ‘‘అమ్మా అబ్బా ఎవరూ లేని కొంప పుట్టిల్లేమిటి.... మనవడికి బంగారం పెడతారా మాకందరికీ పట్టుచీరలు పెట్టి బాలసారె చేస్తారా...?! ఎక్కడికీ వెళ్లక్కర్లేదు.... ఇక్కడే తగలడమను!’’

        కన్నీళ్లు దిగమింగుతూ పురుటినొప్పులు వచ్చే క్షణం దాకా చాకిరీ చేసింది గౌరి. మళ్లీ ఇరవై ఒకటో రోజు నుంచీ పనిలోకి దిగింది. తన బిడ్డతో బాటు గౌరి కొడుకుని కూడా రమ చూసుకుంటూ ఉండబట్టి ఉద్యోగం మానేసే పరిస్థితి మాత్రం రాలేదు.

        అలా రెండేళ్లు గడిచాయి. గౌరి కొడుకు కపర్దికి బాగా మాటలొచ్చేశాయి. ఒకరోజు ఆఫీస్‌ నుంచి ఆలస్యంగా వచ్చింది గౌరి.

        గుమ్మంలోనే ఆడుకుంటున్న కపర్ది తల్లిని చూసి పరిగెత్తుకుంటూ దగ్గరగా వచ్చి, ‘‘లంజముండా, లేటుగా వస్తున్నావేం?!’’ అన్నాడు

        రెండున్నరేళ్ల పసివాడి నోటినుంచి వచ్చిన మాట విని గౌరి బిత్తరపోయింది. ఒక్కక్షణం ఆమెకి కోపం ఉవ్వెత్తుగా వచ్చింది. కాని తమాయించుకుంటూ, ‘‘ఎవరన్నారా మాట...?!’’ అంటూ నెమ్మదిగానే అడిగింది.

        ‘‘మామ్మ అంటోందిగా... ఆ లంజముండ ఇంకా రాలేదు... ఎవడితో కులుకుతోందో...’’ చిలకలా అప్పజెప్పాడు కపర్ది

        గౌరి మాట్లాడలేదు. ఎవరినీ ఏమీ అడగనూ లేదు. కాని ఆ క్షణం నుంచి ఆమెలో సరికొత్త ఆలోచనలు మొదలయ్యాయి.

        మరో రోజు రమ కూతుర్ని ‘‘ఆడముండవి, నీకెందుకూ...’’ అంటున్నాడు సీత కొడుకు గిరిథర్‌

        అక్కడే ఉన్న సీతా, మాణిక్యాంబా నవ్వుతున్నారు.

        ‘‘ఆడముండా... ఫో...’’ అన్నకి వత్తాసు పలుకుతున్నాడు కపర్ది

        సీత మరింతగా విరగబడి నవ్వుతూ, ‘‘మీ అమ్మ కూడా ఆడముండేరా వెథవా’’ అంది కపర్దితో.

        అవన్నీ స్వయంగా విన్న గౌరి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. ఆ రాత్రే ఆమె మహీథర్‌తో స్పష్టంగా చెప్పింది... ‘‘మన బిడ్డ మొగవెథవలా గాకుండా మనిషిలా ఎదగాలనుకుంటే మనం వేరుకాపురం పెట్టుకుందాం మహీ!’’

        మహీథర్‌ మాట్లాడలేదు.

        ‘‘ఈ ఇంట్లో మగవాళ్లకి ఆడదాని పట్ల గౌరవం లేదు.  ఆడవాళ్లకి నీతీ లేదు... స్వాభిమానమూ లేదు. అతి తేలిగ్గా బూతులు మాట్లాడతారు. రెండేళ్ల పసివాడికి నువ్వు మగవాడివి అది ఆడముండ అని చెబుతూ వాడి లేతమనసులో స్త్రీజాతి పట్ల అగౌరవ బీజాలు నాటుతున్నారు. రేపు వాడు నన్ను ముండా అనడానికి జంకడు. పెళ్లాన్ని చాలా సులువుగా లంజా అని తిట్టగలడు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు మహీ... ఇలాంటి విద్యా, సంస్కారహీనులైన ఆడవాళ్ల వల్లే మన సమాజంలో మగవాడు దుర్మార్గుడవుతున్నాడు. ఆడదాన్ని గౌరవించడం, సహాయం చెయ్యడం మగపిల్లలకు ఉగ్గుపాలతో తల్లులు నేర్పిస్తే, మన సమాజపు రూపురేఖలే వేరుగా ఉండేవి. నన్ను మీ అమ్మగారు ఎన్ని మాటలన్నా భరించాను. రాచి రంపాన పెట్టినా సహించాను. కాని నా కొడుకు వ్యక్తిత్వాన్ని హరిస్తూంటే మాత్రం భరించలేను!’’

        మహీథర్‌ అప్పటికీ ఏమీ మాట్లాడలేదు. అతని చూపు అమాయకంగా నిద్రపోతున్న కొడుకు వైపు తిరిగింది. నిద్దట్లో వాడి మొహం ప్రశాంతంగా ఉంది. మహీథర్‌కి ఒక్కక్షణం ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన డొరియన్‌ గ్రే గుర్తొచ్చింది. నిష్కల్మషంగా ఉన్నప్పుడు ఎంతో అందంగా కనబడి, కల్మషపూరితుడైన వెంటనే అనాకారిగా కనిపించిన డొరియన్‌ గ్రే! రేప్పొద్దున్న తల్లినీ, పెళ్లాన్నీ అగౌరవంగా చూస్తే కపర్ది కూడా డొరియన్‌ గ్రే లాగే వికృతంగా కనిపిస్తాడు. ఎవరికీ కనిపించని వికృతి!

        ఆ తర్వాత ఇంట్లో చాలా పెద్ద ఎత్తునే గొడవైంది. అందరూ కలిసి మహీథర్‌ని దుమ్మెత్తి పోశారు. గౌరిని నానా తిట్లూ తిట్టారు. శాపనార్థాలు పెట్టారు. పెద్ద పెట్టున శోకించారు. ఎవరు ఎన్ని చేసినా గౌరి, మహీథర్‌ పట్టించుకోలేదు. కేవలం తమ బట్టలు మాత్రం తీసుకుని ఆ ఇంట్లోంచి బైటికి వచ్చేశారు.

        తాము అద్దెకు తీసుకున్న చిన్న ఇంట్లోకి పొందిగ్గా కొద్దిపాటి సామాను మాత్రం కొంది గౌరి. అన్నిటి కంటే ముందు కొన్ని దేవతామూర్తుల ఫోటోలు కొంది. వాటిని వంటగదిలో ఒక మూల చిన్న బల్ల వేసి చక్కగా అమర్చింది. కపర్దికి తలారా స్నానం చేయించి, ఆ బల్ల ముందు కూర్చోబెట్టింది. ఫోటోలకి పువ్వులు పెట్టి, కపర్ది చేత దీపం వెలిగింపించింది.

        తర్వాత ఆ ఫోటోల్ని వరుసగా చూపిస్తూ కొడుక్కి చెప్పడం ప్రారంభించింది... ‘‘వీళ్లంతా దేవతలు. ఆడవాళ్లు. ఈమె సరస్వతీదేవి. మనకి మంచి బుద్ధి, చదువు ఇస్తుంది. ఈ తల్లి లక్ష్మీదేవి. మనం బతకడానికి కావలసిన డబ్బు ఇస్తుంది. ఈ దేవత పార్వతీదేవి. ఈవిడనే అన్నపూర్ణ అని కూడా అంటారు. మనం తినే అన్నం అన్నపూర్ణమ్మ భిక్షే! నీకు కనిపించే ప్రతి ఆడదానిలోనూ ఈ దేవతలు ముగ్గురూ ఉంటారు. అందుకే ఆడవాళ్లని గౌరవించాలి. ముండా రండా అనకూడదు.

        ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

        యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః

అంటే ఆడవాళ్లని ఎక్కడైతే గౌరవంగా చూస్తారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు. అన్నీ మంచి ఫలితాల్ని ఇస్తారు. ఎక్కడ ఆడవాళ్లని ఆదరించరో, అక్కడ ఏ పనికీ సత్ఫలితాలు రావు అని అర్థం. అంచేత ఆడవాళ్లని గౌరవించడం, ఆదరించడం, సహాయం చెయ్యడం నేర్చుకో!’’

        తల్లి చేసే హితబోధలు వింటూ, తల్లికి సాయం చేస్తూ పెరిగి పెద్దయ్యాడు కపర్ది!

        అదే వాతావరణం లో పెరిగి పెద్దవాడైన రమ కొడుకు రమేష్ కి ఇప్పుడు పెద్ద దెబ్బే తగిలింది. వాడు ఇష్టపడి చేసుకున్న పిల్ల రూప, ఆ ఇంటి వాతావరణాన్నీ, మొగుడి ప్రవర్తననీ భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది!!

*********

        మర్నాడు సాయంత్రమే బయల్దేరి అత్తవారింటికి వెళ్లింది గౌరి. గుమ్మంలోనే ఆమెకు మాణిక్యాంబ ఎదురైంది. డెబ్భై ఏళ్లు దాటినా కించిత్తూ మారని అత్తగార్ని చూస్తూంటే గౌరికి ‘‘భజగోవిందం మూఢమతే!’’ అన్న శంకరాచార్యులవారు గుర్తొస్తూ ఉంటారు. ప్రాపంచిక విషయాల్ని వదిలేసి కృష్ణా రామా అనుకోవలసిన వయసులో ఆమె పుట్టింటికి వెళ్లిపోయిన మనవడి పెళ్లాన్ని నానా దుర్భాషలూ ఆడుతోందని తెలుసుకున్న గౌరికి అత్తగారి మీద జాలేసింది.

        గౌరిని చూస్తూనే మొహం ముటముటలాడించింది మాణిక్యాంబ. తనని కాదని వేరుకాపురం పెట్టుకున్న ఈ కోడలంటే ఆవిడకి ఈనాటికీ విపరీతమైన కోపం. ‘‘ఏవమ్మా, గాలి ఇటు మళ్లిందేవిటివాళ... నిక్షేపంలాంటి పిల్లకి సుద్దులు నేర్పి పుట్టింటికి తగిలేశావు చాలదూ...’’ అంది మొహం అసహ్యంగా పెట్టి.

        గౌరి మాట్లాడలేదు. ఈ లోపున అత్తగారి మాటలు వినబడి లోపలినుంచి రమ గబగబా బైటికొచ్చింది. తోడికోడల్ని చూస్తూనే చేటంత మొహం చేసుకుని, ‘‘బావున్నావా గౌరీ,  రా లోపలికి...’’ అంటూ గౌరి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోబోయింది.

        అంతలో తల్లి మాటలు విని అక్కడికి వచ్చిన శ్రీథర్‌, మరదల్ని చూసి కోపంగా, ‘‘ఏం తల్లీ, మా పరువు పోయిందని పలకరించడానికొచ్చావా? చేసింది చాలుగాని దయచెయ్యి!’’ అన్నాడు.

        ‘‘అదీ మాట. అలా బుద్ధి చెప్పరా దానికి! ఆ పోయిందానికి ఇది ఎంత నూరిపోసిందో...’’ మాణిక్యాంబ వెంటనే కొడుక్కి వత్తాసు పలికింది.

        భర్త మాటలకి తెల్లబోయిన రమ, ‘‘గౌరి ఏం చేసిందండీ... తనసలు మనింటికి రావడమే లేదు!’’ అంటూ తోడికోడలి చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్లబోయింది.

        ‘‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని ఇలాంటివాళ్లు ఏమైనా చెయ్యగలరు. నువ్వు ముందు ఆ చెయ్యి వదులు.  తోడికోడల్ని లోపలికి తీసికెళ్లి రహస్యాలేమీ మాట్లాడక్కర్లేదు. పో లోపలికి!’’ శ్రీథర్‌ భార్యని గదమాయించాడు.

        రమ కళ్లనీళ్లు పెట్టుకుంటూ గౌరి చెయ్యి వదిలేసింది.

        గౌరి చలించలేదు. రమ వైపు చూస్తూ, ‘‘నేను నీకు రెండు మాటలు చెప్పి పోదామని వచ్చానక్కా. ఆ మాటలేవో వీళ్ల ముందే చెబుతాను. అభిమానం గల ఏ ఆడదీ తనకి గౌరవం దక్కని చోట ఉండలేదు. రూప కూడా అలాగే వెళ్లిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి మళ్లీ తిరిగి రావాలంటే ముందు మన పిల్లాడిలో మార్పు రావాలి. కపర్ది ఎలాంటి వాతావరణంలో ఉండకూడదని  నేను వేరుకాపురం పెట్టుకున్నానో సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే రమేష్‌ పెరిగాడు. అనుక్షణం ఆడదాన్ని చులకనగా చూసే మనుషుల మధ్య బతికిన మగవాడికి సహజంగానే ఆడపిల్ల పట్ల గౌరవం గాని, మర్యాద గాని ఉండవు. నువ్వు ఎలా పడి ఉంటున్నావో తన పెళ్లాం కూడా అలాగే పడి ఉండాలనుకుంటాడు. బైటివాళ్లెవరూ వాడిలో మార్పు తీసుకురాలేరు. వస్తువు పోగొట్టుకున్నచోటే అది దొరుకుతుంది. దుర్గంథ పూరితంగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తే తప్ప పరిశుభ్రమైన గాలి రాదు. రమేష్‌ మారాలంటే ముందు ఈ ఇల్లు, మనుషులు మారాలి. నువ్వు ఇలా పడి ఉంటున్నంత కాలమూ ఎవరిలోనూ మార్పు రాదు. నువ్వు నువ్వుగా బతుకుతూ, నీ కోడలికి వత్తాసుగా ఉంటే, అసాధ్యాలు సాధ్యమవుతాయి. వెళ్లొస్తాను!’’ అంటూ వెనుదిరిగింది.

         అప్పటిదాకా నోరు తెరవడానికి కూడా భయపడినట్టు మౌనం వహించిన శ్రీథర్‌, ‘‘హితబోధలు చాలుగానీ, మరొక్కసారి ఇలా వచ్చి నీతులు బోథించాలని చూస్తే మాత్రం మర్యాద దక్కదు! జాగ్రత్త!’’ అన్నాడు.

        గౌరి మాట్లాడలేదు. రమ వైపు ఒక్కసారి చూసి వీథిగుమ్మం వైపు నడిచింది.

        గౌరి వీథిగుమ్మం దాటబోతూండగా, వెనకనుంచి ‘‘గౌరీ, ఆగు!’’ అంటూ రమ మాట వినిపించింది.

        గౌరి ఆగి, తిరిగి చూసేంతలో పరుగులాంటి నడకతో తోడికోడల్ని సమీపించిన రమ, ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, ‘‘నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది. ఆ మార్పేదో ఈ క్షణమే, నీ సమక్షంలోనే ప్రారంభం కానీ..! రా లోపలికి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం.” అంది

        తోడికోడలి మాటలకి గౌరి మొహం ఆశ్చర్యానందాలతో ప్రఫుల్లమైంది.

        ఈ లోపున  శ్రీథర్‌ రెట్టించిన కోపంతో రమ దగ్గరగా వచ్చి విసురుగా ఆమె జబ్బ పట్టుకుంటూ, ‘‘మర్యాదగా లోపలికి పోతావా... నాలుగు తగలనివ్వమంటావా’’ అన్నాడు.

        ఈ సారి భర్త మాటలకి, కోపానికి రమ కించిత్తూ బెదరలేదు. ‘‘మీ అబ్బాయి కూడా ఆ పిల్లతో ఇలాగే అని ఉంటాడు. నాలుగు తగలనివ్వడం పెద్ద పనేమీ కాదు. మంచీ మర్యాదా వదిలేస్తే అదిగో ఆ మూలనున్న చీపురు తీసుకుని నేను కూడా నాలుగు తగలనివ్వగలను. పెళ్లయి ముప్ఫై ఏళ్లు దాటింది. ఇన్నాళ్లూ జీవచ్ఛవంలా పడి ఉన్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉండి నా కొడుకు కాపురాన్ని మంటగలిపే కంటే మిమ్మల్ని చంపి నేను చావడం చాలా మంచిపని!’’ అంటూ గౌరి చెయ్యి పట్టుకుని లోపలికి దారి తీసింది.

        తను కాస్త గట్టిగా కళ్లెర్రజేసి చూస్తే చాలు ఎక్కడిదక్కడ ఆగిపోయే భార్యలో అంత పెద్ద మార్పు చూసి స్తంభించిపోయాడు శ్రీథర్‌.

        మరో పక్క మాణిక్యాంబ, ‘‘ఓరి దేవుడో, ఇది మా ఇల్లంతా నాశనం చెయ్యడానికొచ్చిందిరా నాయనా’’ అంటూ శోకాలు ప్రారంభించింది.

        మొదటికే మతిపోయి ఉన్న శ్రీథర్‌, చిరాగ్గా తల్లి వైపు చూస్తూ, ‘‘ఆపమ్మా నీ ఏడుపులు..’’ అంటూ లోపలికి వెళ్లిపోయాడు.

తోడికోడలు ఇచ్చిన కాఫీ తాగి, కాస్సేపు కూర్చుని మంచీ చెడ్డా మాట్లాడుకున్న తర్వాత ఇక వెళ్లొస్తానంటూ లేచింది గౌరి.

        సరిగ్గా అప్పుడే ఇంట్లో కాలు పెట్టాడు రమేష్‌. గౌరిని తమ ఇంట్లో చూసి ఆశ్చర్యపోతూనే మర్యాదగా పలకరించాడు.

        ‘‘రూపని ఎప్పుడు తీసుకొస్తావు రమేష్‌...?!’’ చిరునవ్వుతో ప్రశ్నించింది గౌరి

        రమేష్‌ తలవంచుకున్నాడు...‘‘నన్ను వెక్కిరిస్తున్నావా పిన్నీ...ఇన్నాళ్లూ నేను ఎంత మూర్ఖత్వంలో బతికానో రూప వెళ్లిపోయిన క్షణంలోనే అర్థమైంది.  అప్పటినుంచీ పాఠాలు నేర్చుకుంటున్నాను. తమ్ముడైనా కపర్దే నాకు గురువయ్యాడు. వాడు అలా ఉన్నాడంటే అదంతా నీ గొప్పే.  నువ్వు గొప్పదానివి పిన్నీ!’’

        ‘‘మీ అమ్మ నా కంటే గొప్పది రమేష్‌. ఏళ్ల తరబడి పేరుకున్న కల్మషాన్ని ఒక్క క్షణంలో కడిగేసింది. ఇందాక కోడలితో కూడా మాట్లాడింది. వచ్చేవారం నేనూ రమక్కా కలిసి వెళుతున్నాం, మా కోడల్ని తీసుకురావడానికి!’’

        ఆ మాట వినగానే రమేష్‌ మొహం వికసించింది. లోపలినుంచి ఆ మాటలు విన్న శ్రీథర్‌ మొహం కూడా విప్పారింది.

        అతను మనసులోనే అనుకున్నాడు... ‘‘ఆడవాళ్లని గౌరవించకపోతే రోజులు మనవి కావంతే!!’’

**********

Lisää kommentteja

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)