మా ఫలేషు కదాచన  (Author: ఎస్. ఘటికాచల రావు)

తనకు వచ్చిన ఈమెయిల్ చూసుకున్నాడు రమణి.

         “యువర్ వీసా అప్లికేషన్ రిజెక్టెడ్” అని ఉన్నది. కారణం చెప్పలేదు అందులో.

         అమ్మాయి కెనడా వెళ్లి ఐదేళ్ళైంది. ఇప్పటికే ఆమె మూడుసార్లు ఇండియా వచ్చి వెళ్ళింది.

         “నాన్నా. ఈసారి ఎలాగైనా మీరు రావాల్సిందే. మీ ఉద్యోగం బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే. కానీ వచ్చి తీరాలి అంతే” అన్నది వందన నిక్కచ్చిగా.

         “చూద్దాం లేమ్మా. తీరుబడి దొరకాలిగా. అదీగాక ఎక్స్ ఇండియా లీవ్ పెట్టుకోవాలి. నా ఒక్కడి అనుకూలత మాత్రమే కాదు. మీ అమ్మకు కూడా శెలవు దొరకాలిగా”

         “అదంతా నాకు తెలీదు. మీరు వస్తున్నారు. అంతే” అన్నది పట్టుదలగా.

         నవ్వేశాడు రమణి. ఇది ఆరు నెలల క్రిందటి మాట. ఇప్పడు అమ్మాయినుంచి మళ్ళీ ఆహ్వానం. ఐతే ఇది సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైయ్యే సమాచారం. తప్పనిసరిగా వెళ్ళితీరాల్సిన సమయం. తాను తాతయ్య కాబోతున్నాడు. అమ్మాయికి మూడో నెల. ఆ సమాచారం తెలిశాకే వీసా దరఖాస్తు చేశాడు. ఐతే రెండు నెలల సమయం గడిచాక ఇప్పుడు అందిన సమాచారం ఇది. అశాంతిగా కదిలాడు రమణి.

         కెనడా వీసాకు దరఖాస్తు కేవలం ఆన్ లైన్లో మాత్రమే చెయ్యాలట. అలాగే చేశాడు. అడిగిన సమాచారమంతా ఇచ్చాడు. ఐనా తిరస్కరించారు.

         పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ అప్లై చేశాడు. అప్పటికి అమ్మాయికి ఆరునెలలు నిండాయి. కనీసం ప్రసవం సమయానికైనా అక్కడ ఉండగలిగితే కొండంత అండగా ఉంటుంది.

         నెల తరువాత జవాబు వచ్చింది.“యువర్ వీసా అప్లికేషన్ రిజెక్టెడ్”. రెండోసారి కూడా అలా జరగడంతో విపరీతమైన నిస్పృహకు లోనయ్యాడు రమణి. కనీసం కారణం కూడా చెప్పకుండా ఇలా జవాబివ్వడం ఏమిటో అస్సలు అర్థం కాలేదు. ఎవర్నడగాలో కూడా తెలియలేదు. ఐతే ఈ విషయం అంత తేలికగా వదలదల్చుకోలేదు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మళ్ళీ అప్లై చేశాడు.

         అప్పటికి అమ్మాయికి దాదాపుగా ప్రసవం తారీఖు దగ్గరపడింది.“నాన్నా. వచ్చే నెల మొదటి వారంలో డెలివరీ డేట్ ఇచ్చారు. కనీసం ఆలోగానైనా రండి” అన్నది దీనంగా.

         “నేనేం చేసేది తల్లీ. ఇప్పటికి రెండుసార్లు రిజెక్ట్ చేశారు. కారణం చెప్పలేదు. అప్లికేషన్ లో ఏదైనా తప్పుంటే సరిదిద్దుకో వచ్చనుకుంటే అది కూడా స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసాను. చూద్దాం” అనగలిగాడు అంతే.

         దరఖాస్తు చేశాక జవాబుకోసం రోజూ ఆతృతగా ఎదురుచూడటం అలవాటుగా మారింది.

         సుమారు నెలన్నర తరువాత సరిగ్గా మరుసటి నెల మొదటివారంలో జవాబు వచ్చింది.

         “యువర్ వీసా అప్లికేషన్ రిజెక్టెడ్”

         ఐతే ఈసారి దానికి అనుబంధంగా మరికొంత సమాచారం కూడా ఇచ్చారు.

         “మీకిక్కడ బలమైన రక్త సంబంధాలు ఉన్న కారణంగా వీసా తిరస్కరిస్తున్నాము”

         ఆ జవాబు చదివి అయోమయానికి గురయ్యాడు రమణి.

         ‘ఇదేమిటి! రక్త సంబంధాలు ఉన్నాయని వీసా ఇవ్వరా? పిల్లలను చూసుకునేందుకే కదా వచ్చేది. అక్కడే పాతుకు పోయేందుకు కాదుకదా. వాళ్ళకలా అనిపించిందేమో’

         రమణికి కెనడా కాన్సులేట్ జవాబు మింగుడు పడలేదు.

         ఐనా చెయ్యగలిగింది ఏమీ లేదు. ఆన్ లైన్ వీసా వల్ల వచ్చిన చిక్కే ఇదంతా అనిపించింది. ‘కనీసం మౌఖిక వీసా పద్ధతి ఉండిఉంటే బాగుండేది. తమ వాదనను వినిపించే అవకాశం ఉండేది. ఐనా రక్త సంబంధమున్నంత మాత్రాన ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని అక్కడే పాతుకుపోతామని ఎలా అనుకున్నారు? ’

         రమణిలో పట్టుదల పెరిగింది. ఎలాగైనా వీసా తీసుకునితీరాలని నిశ్చయించుకున్నాడు. లాయరు ఎవర్నైనా కలిసి తరుణోపాయం కనుక్కోవాలనుకున్నాడు.

         ఆ మరునాడే అల్లుడు ఫోన్ చేశాడు. అమ్మాయి ప్రసవించిందనీ, ఆడపిల్ల పుట్టిందనీ.

         రమణి దంపతులు అమితంగా సంతోషించినా ఆ సమయంలో కూతురు పక్కన ఉండాల్సినవాళ్ళు వేల మైళ్ళ దూరంలో ఉండడం గుండెను పిండింది.

         రమణి వీసాకోసం తన ప్రయత్నం ముమ్మరం చేశాడు.

         అదే సమయంలో అమ్మాయి ఒక విషయం చెప్పింది.

         “వీసా తిరస్కరిస్తున్నారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ప్రస్తుతానికి వీసా ప్రయత్నం మానెయ్ నాన్నా. నేను పర్మనెంట్ రెసిడెంట్ (పీఆర్) కు అప్లై చేశాను, అది రాగానే మీరు సూపర్ వీసాకు అప్లై చేసుకోవచ్చట. అది సులభంగా దొరుకుతుంది” అన్నది.

         అమ్మాయి చెప్పినట్టు కొన్నాళ్ళయ్యాక తమకు పీఆర్ వచ్చిందని తనే ఫోన్ చేసింది.

         అందువల్ల వెంటనే సూపర్ వీసాకు అప్లై చేసుకోవచ్చని చెప్పింది. సూపర్ వీసా అంటే అక్కడి శాశ్వతవాసులు అంటే పర్మనెంట్ రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కలిసేందుకు తల్లిదండ్రులను తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలను అనుమతిస్తారు. ఆ విధంగా మళ్ళీ అప్లై చేసుకోవడం మూలంగా ఎట్టకేలకు వీసా దొరికింది. అప్పటికి మనవరాలికి ఆరునెలలు నిండాయి.

         మిస్టర్ అండ్ మిసెస్ రమణి ఎక్కిన బోయింగ్ విమానం పదహారు గంటలు ఏకబిగిన ప్రయాణించిన మీదట కెనడాలోని వాంకూవర్ విమానాశ్రయంలో దిగింది.

         వందన సంతోషానికి అవధుల్లేవు. అసలిక రాలేరేమో అనుకున్న వాళ్ళు ఎలాగైతేనేం సూపర్ వీసా పుణ్యమా అంటూ వచ్చారు.

         పాప బొద్దుగా ఎంతో ముద్దుగా ఉంది. పాతికేళ్ళ క్రితం వందనను ఎత్తుకున్న అదే అనుభూతి కలుగుతోంది రమణి దంపతులకు. ఆ ఆనందం అనిర్వచనీయం. ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత అక్కడి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూసి వచ్చారు.

         తరువాత రెండు రోజులకు వెళ్లి నయాగరా జలపాతాన్ని కూడా చూసి వచ్చారు. నయాగరా జలపాతం కెనడా అమెరికాల సరిహద్దు ప్రాంతం. నయాగరా నదికి ఒక తీరం కెనడా మరొక తీరం అమెరికా. సరిహద్దు మ్యాప్ సూచించిన ప్రకారం జలపాతం కెనడా భూభాగానికి చెందినది.

         తిరిగి వాంకూవర్ చేరుకున్న మరునాడు పాపకు సుస్తీగా అనిపించింది. ఒళ్ళు వేడి చేసినట్టు కూడా అనిపించడంతో కొద్దిగా కంగారుపడ్డ వందన వెంటనే ఆసుపత్రికి వెళ్దామన్నది.“చిన్న చిన్న విషయాలకే ఇలా కంగారు పడకూడదు” అని తండ్రి చెప్పినా వందన నెమ్మదించలేదు.

         “ఇంటిపట్టునే ఏదో ఒక మాత్ర మింగే పద్ధతులు కావిక్కడ. మెడికల్ అటెన్షన్ తప్పనిసరి. మెడికల్ షాపులో మన ఇష్టానికి మాత్రలు ఇవ్వరు” అంటూ ఆసుపత్రికి బయలుదేరింది బిడ్డతో వందన. ఆమెను అనుసరించాడు రమణి. ఇంటికి దగ్గరగానే ఉన్న ఒకే మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ కు వెళ్లారు.

         ఆరు నెలలు నిండని చిన్నపాపను తీసుకుని విహారయాత్రకు ఎందుకెళ్ళారని అక్కడి డాక్టర్ కోప్పడ్డాడు. వాతావరణం మారడంవల్ల కలిగిన ఇబ్బంది మాత్రమేనని భయపడాల్సిన అవసరం లేదని చెప్పి రెండు రకాల సిరప్ మాత్రం రాసిచ్చాడతను. అక్కడే ఉన్న షాపులో మందులు తీసుకుని బయటికి వస్తుండగా అంతలో అక్కడ బయట ఏదో కలకలం వినిపించింది.

         అంబులెన్స్ ఒకటి వేగంగా వచ్చి నిలబడగానే అక్కడున్న సిబ్బంది స్ట్రెచ్చర్ తీసుకువచ్చి అందులో ఉన్న పేషెంట్ ను అంతకన్నా వేగంగా లోపలికి తరలించారు.

         రక్తస్రావం బాగా ఎక్కువగా ఐనట్టుంది. స్ట్రెచర్ మొత్తం ఎర్ర రంగులో ఉంది.

         క్షణాల్లో సెక్యూరిటీ సిబ్బంది ఆ ఆసుపత్రిని చుట్టుముట్టారు. డాక్టర్లు నర్సులు హడావిడిగా అటుఇటు పరుగులు తీశారు. పది నిముషాల వ్యవధిలో అక్కడ అత్యవసర పరిస్థితిలాంటిది నెలకొన్నది. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి అదేపనిగా ఫోన్లు చేస్తూందిగానీ ఆమెకు కావలసిన సమాచారం మాత్రం దొరుకుతున్నట్టు లేదు. అసహనంగా అక్కడికొచ్చిన డాక్టర్ తో కూడా అదే మాట చెప్పి నిస్సహాయంగా నిలబడింది. డాక్టర్ తల పట్టుకుని కూర్చున్నాడు.

         రమణి మెల్లగా అక్కడున్న ఒక నర్సును ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నాడు.

         అంబులెన్స్ లో వచ్చింది ఆ దేశపు మంత్రి కుమార్తె అట. కారులో వస్తూండగా ఏక్సిడెంట్ జరిగి విపరీతంగా గాయాలయ్యాయి. కాళ్ళు చేతుల ఎముకలు విరిగాయి. అన్నింటికన్నా తలకు తగిలిన గాయం చాలా తీవ్రమైనదిగా ఉన్నది. రక్తస్రావం విపరీతంగా జరిగింది. వెంటనే రక్తం అందించకపోతే ప్రాణానికి ప్రమాదం. ఐతే ఆమె గ్రూప్ రక్తం ప్రస్తుతం ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో స్టాక్ లేదు. వేరే పక్కనే ఎక్కడైనా ఆస్పత్రుల్లో దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తే అక్కడ కూడా లేదట. మరో అరగంటలో ఎలాగైనా ఆపరేషన్ చేసి తీరాలట.

         “ఇంతకూ ఆమెది ఏ గ్రూప్?” అడిగాడు రమణి.

         “చాలా అరుదైనది. ఎబి నెగెటివ్” అన్నదా నర్సు.

         రమణి ముఖంలో ప్రసన్నత కనిపించింది. కూతురు చెయ్యి వదిలి రెసెప్షన్ వద్దకు నడిచాడు.

         “ఎక్స్ క్యూజ్ మీ” అన్న మాట విని విసుగ్గా చూశాడు అక్కడున్న డాక్టర్ రమణివంక.

         చెయ్యి ముందుకు చాచి“అయామ్ ఎబి నెగెటివ్. యూ కెన్ టేక్” అన్నాడు రమణి.

         ఒక్కసారిగా ఆ డాక్టర్ అదిరిపడి నిలబడి“ఈజిట్” అంటూ కీచుగా అరిచాడు.

         తలూపాడు రమణి. అతని వెనకే వందన నిలబడి ఉన్నది.

         తండ్రి ఉన్నపళంగా అలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఉలికిపడింది వందన. రక్త ఇవ్వడమంటే ఆషామాషీనా? అనుకుంది. కానీ రమణికి ఇదివరకే అనేకమార్లు రక్తదానం చేసి అలవాటుందన్న విషయం ఆమెకు తెలియదు. అడపాదడపా ఆర్నెల్లకోమారు అత్యవసరమైన చోట్ల ఇస్తూ ఉంటాడు. అతను వీసా ప్రయత్నాల్లో ఉన్నప్పుడే ఒకసారి ఇచ్చాడీమధ్యన.

         “హూ ఆర్యూ” అన్నాడు డాక్టర్ ఉత్తేజితుడై రమణివంక చూస్తూ.

         “అయామ్ ఫ్రమ్ ఇండియా” అన్నాడు చేతిని స్థిరంగా అక్కడే టేబిల్ పైన ఉంచి.

         ఒక్క ఉదుటున రమణి చేతులు పట్టుకుని దాదాపుగా లోపలికి లాక్కెళ్ళినంత పని చేశాడా డాక్టర్.

         అతనలా వెళ్ళగానే బయట ఒక కారు వచ్చి ఆగింది. అందులోనుంచి ఒక వ్యక్తి ఆదుర్దాతో దిగి లోపలికి పరుగు తీశాడు. అతని వెనకే మరో నలుగురు కూడా.

         ఆ వచ్చినతను ఎవరని వందన అడిగితే“ఆయనే మినిస్టర్. ఆయన కూతురికే ఏక్సిడెంట్ అయింది” అని చెప్పారు. వందన గుండె స్పందన వేగం హెచ్చింది.

         లోపలికి వెళ్ళిన డాక్టర్ సుమారు గంట తర్వాత రమణిని బయటికి పంపాడు. అతనితోబాటు మరొక నర్సు కూడా వచ్చి అతన్ని అక్కడే కూర్చోమని చెప్పి వెళ్ళింది.

         “ఏంటి నాన్నా. ఇంటికెళ్ళొద్దా” అన్నది కొద్దిగా ఆదుర్దాగా.

         “ఏమోనమ్మా. వాళ్ళు చెప్పేవరకూ వెళ్ళొద్దన్నారు. నాకు తెలిసి డొనేషన్ చేసిన తరువాత కనీసం అరగంట ఇక్కడే ఉండాలి. ఆ తరువాతే మనం వెళ్ళొచ్చు” అన్నాడు రక్తం ఇచ్చినచోట వేసిన ప్లాస్టర్ వంక చూసుకుంటూ.

         “సాధారణంగా ఎంత తీసుకుంటారు?”

         “350 మి. లీ. తీసుకుంటారు. అవసరాన్ని బట్టి 500 వరకూ తీసుకున్నా ప్రమాదమేమీ ఉండదు. ప్రస్తుతం నాకు 500 తీసుకున్నారు. అందుకే వాళ్ళు చెప్పేంతవరకూ వెళ్ళకూడదని అన్నారు”

         “ఎక్కువ తీసుకుంటే నీకేమీ ప్రమాదం ఉండదు కదా”

         “ఏమీ ఉండదు. అలా ఉంటే వాళ్ళే తీసుకోరుగా”

         సుమారు రెండు గంటల తరువాత డాక్టర్ బయటికి వచ్చాడు. నేరుగా రమణి దగ్గరికొచ్చి“థాంక్యు వెరీమచ్. ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రాణాపాయం తప్పింది. యూ అర్ రియల్లీ గ్రేట్ సర్. మీరెంత పెద్ద ఉపకారం చేశారో మీకే అర్థం కావడం లేదు. ఈ అమ్మాయి కెనడా ప్రభుత్వంలోనే అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి కూతురు” అన్నాడు డాక్టర్.

         రమణికి అతని మాటలు నచ్చలేదు. అతని మాటల్లో వ్యక్తి పూజ గోచరించింది. వ్యక్తి ఎవరైనా, ప్రాణాలు కాపాడడం ముఖ్యం. ఏక్సిడెంట్ ఎలా జరిగిందో అందులో తప్పెవరిదో చూసుకోవాలి కదా. అదే మాట అతనితో అనేశాడు.

         ఆ తరువాత“ఏమైతేనేం. ఒక ప్రాణం కాపాడేందుకు ఉపయోగపడ్డాను. అంతే” అన్నాడు.

         ఆ వెంటనే వందనను పిల్చుకుని మనవరాలితో ఇల్లు చేరుకున్నాడు రమణి.

         మర్నాడు అక్కడి పత్రికలలో ఈ వార్త ప్రధానంగా వచ్చింది.

         “ఒక భారతీయుడి సహకారం వల్ల మంత్రి కుమార్తె ప్రాణాపాయంనుంచి బయటపడింది”

         ఏ పత్రిక చూసినా ఇదే ప్రధాన వార్తగా నిలిచింది.

         బయట లాన్లో కూర్చుని పేపర్ చూస్తున్న రమణికి ఫోన్ వచ్చింది. చకితుడయ్యాడు.

         ‘ఇక్కడ తనకు ఫోన్ చేసేవాళ్ళెవరున్నారు? ’ అనుకుంటూ ఫోన్ తీసి“హలో” అన్నాడు.

         “హలో సర్. ఆర్ యూ మిస్టర్ రమణి?”

         “ఎస్”

         “సర్. అయామ్ డాక్టర్ జేమ్స్ స్పీకింగ్. నిన్న మీరు బ్లడ్ డొనేట్ చేశారు గుర్తుందనుకుంటాను. మినిస్టర్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. విల్ యూ ప్లీజ్ కమ్ టు హాస్పిటల్ అరౌండ్ టెన్ ఓ క్లాక్” అన్నాడా డాక్టర్.

         కొద్ది క్షణాలాలోచించి“ఎస్ సర్” అని పెట్టేశాడు. వెంటనే ఆ విషయం కూతురికి చెప్పాడు.

         సుమారు పదిగంటల ప్రాంతానికి రమణి వందన తోడుగా హాస్పిటల్ కు వెళ్ళాడు. అతను వెళ్ళే సమయానికి అప్పటికే మినిస్టర్ వచ్చి ఉన్నాడు. విచిత్రమేమంటే ఆ సమయానికి అక్కడికి కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు. అదే రమణిని ఆశ్చర్యానికి గురి చేసింది.

         రమణిని చూడగానే మంత్రి స్వయంగా ఎంతో ఆప్యాయంగా ఎదురొచ్చి స్వాగతం పలికాడు.

         “మిస్టర్ రమణి. హి ఈజ్ డాక్టర్ రాబర్ట్ సన్, మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్” అంటూ రమణికి మంత్రిని పరిచయం చేశాడు డాక్టర్ జేమ్స్. తరువాత వాళ్ళ సంభాషణంతా ఇంగ్లీష్ లోనే సాగింది.

         “థాంక్యూ మిస్టర్ రమణి. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నా ప్రాణాన్ని నాకు తిరిగి అప్పగించారు” అన్నాడు మినిస్టర్ కంటతడితో.

         “అదేం లేదండీ. ఆ క్షణంలో ఎలాగైనా ఒక ప్రాణం కాపాడాలన్నదే నా మనసుకు తట్టిన ఆలోచన. సహాయం చెయ్యడం నా కర్తవ్యం. దాని ఫలితం నేను చెప్పలేను. సో ఐ హావ్ డన్ మై డ్యూటీ” అంటూనే మినిస్టర్ భావోద్వేగానికి కించిత్ ఆశ్చర్యపోయాడు రమణి.

         “అలా అనడం మీ గొప్పతనం. ఇకపోతే మీ గురించి అంతా తెలుసుకున్నాను. మూడుసార్లు మీ వీసా రిజెక్ట్ అయిందన్న సంగతి తెలిసి చాలా బాధ పడుతున్నాను. డెఫెనెట్లీ దేర్ ఈజ్ సమ్ మిస్టేక్ ఐ థింక్. మీకు కలిగిన అసౌకర్యానికి చాలా చింతిస్తున్నాను. ఇది నా పరిధిలోని సమాచారమే కాబట్టి నేను మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో మాట్లాడి దీనికేదైనా మార్పులు చెయ్యాల్సి ఉంటే చేస్తాను. అత్యంత కీలకమైన సమయంలో మీ అమ్మాయికి అండగా మీరెవరూ లేకపోవడం చాలా తప్పు. ఐనా ఆమెకు ఆ లోటు తెలియకుండా చూసుకున్నాము. మీకు కలిగిన ఇదే అసౌకర్యం మిగతావాళ్ళకు కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. బైద వే మీకు పర్మనెంట్ రెసిడెంట్ వీసాకోసం రికమెండ్ చేస్తాను”

         రమణి నవ్వి“నోనో. ఇప్పుడిక దాని అవసరమే లేదు. ఈరోజున మీ అమ్మాయికి జరిగిన ప్రమాదంవలన నాకు కలిగిన అసౌకర్యం మీ వరకూ వచ్చింది. లేకుంటే అసలు నేనెవరన్నది మరుగున పడిపోయేది. ఐతే వీసా రిజెక్ట్ చేసినందుకు మీరిచ్చిన కారణమే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ బలమైన రక్త సంబంధమున్నంత మాత్రాన నేనిక్కడే ఉండిపోతానని ఎలా అనుకుంటారు? నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. అది ఇండియాలోనే ఉంది. వయసు మళ్ళిన అమ్మ, నాన్న అక్కడే ఉన్నారు. వాళ్ళను వదిలి నేనెక్కడికీ రాలేను. అంతకన్నా ముఖ్యంగా నేను నా మాతృభూమిని వదిలి అసలు రాలేను. కాబట్టి శ్రమ తీసుకోవద్దు. లెట్ ద లా ఆఫ్ యువర్ ల్యాండ్ ప్రివెయిల్” అన్నాడు.

         “బట్ ఐ హావ్ టు డూ సంథింగ్ ఫర్ యూ”

         “బట్ ఐ డోంట్ ఎక్‌స్పెక్ట్. ప్రత్యుపకారం ఆశించను. దీన్నే మా ఫలేషు కదాచన అంటారని విన్నాను. కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాట్ ఓన్లీ మై సెల్ఫ్. భారతీయుల్లో చాలామంది ఈ సిద్ధాంతం మనస్ఫూర్తిగా నమ్ముతారు. దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ ఎవిరీ హ్యూమన్ డీడ్. అంటే, ఈనాడు ఈ విధంగా జరగాలని ముందుగానే నా జీవితంలో రాసి ఉంటుంది కనుక ఇన్నిసార్లు నా వీసా రిజెక్ట్ అయింది. ఒకవేళ అప్పుడే వీసా దొరికి నేనిక్కడికి వచ్చి ఉంటే?... ఇప్పుడు జరగాల్సిన ఏక్సిడెంట్ అప్పుడే జరిగేదేమో. లేకపోతే ఈ ఏక్సిడెంట్ అసలు జరిగేదే కాదేమో”

         అతని మాటలు వాళ్ళందరినీ ఉత్తేజితుల్ని చేశాయి. తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆశ్చర్యంతో వాళ్ళంతా చప్పట్లు కొట్టారు.

         “ఇప్పుడీ దేశంతో నా సంబంధం మరింత బలంగా కలిగింది. ఐ హావ్ ఎ రియల్ స్ట్రాంగ్ బ్లడ్ రిలేషన్ నౌ. ఇన్ డైరెక్ట్ లీ నౌ అయామ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యువర్ కంట్రీ”

         “యస్ దటీజ్ ట్రూ. బట్ భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. ప్లీజ్ లెట్ మీ డూ మై బెస్ట్”

         “చూద్దాం. ప్రస్తుతం మీ అందరి మనసుల్లో నేనిప్పుడు శాశ్వతంగా ఉండిపోయాను. అందుకు నాకు ఎటువంటి వీసా అవసరం లేదనుకుంటాను. మా అమ్మాయిని కలిసేందుకు వచ్చాను. మై పర్పస్ ఆఫ్ విజిట్ ఈజ్ ఓవర్ ఫర్ నౌ” అన్నాడు రమణి.

         “ట్రూలీ, యూ డోంట్ నీడ్ ఎనీ వీసా టు స్టే ఇన్ అవర్ హార్ట్స్. మా మనసుల్లో ఎప్పటికి శాశ్వతంగా ఉండిపోతారు” అన్నాడా మినిస్టర్ రమణి చేతిని ఆప్యాయంగా నొక్కుతూ. అప్పుడు మినిస్టర్ కళ్ళు చెమర్చాయి. ఆస్పత్రి ప్రాంగణం మళ్ళీ కరతాళధ్వనులతో మారుమోగింది.

         ***

Lisää kommentteja