మహానగరంలో మరీచికలు  (Author: మద్దూరి నరసింహమూర్తి)

"ఈ ఊరు ‘పల్లెకు పెద్ద నగరానికి చిన్న అంటూ స్వంత ఇల్లు స్వంత ఊరు వదులుకొని మమ్మల్ని మహానగరంలో ఉంటున్న నీ దగ్గరకు వచ్చి ఉండమనడానికి తగిన కారణాలు ఏమిటో నువ్వు వివరించు, అప్పుడు ఆలోచిస్తాను" అన్నారు నారాయణగారు తన దగ్గరకి వచ్చేయండి మీరిద్దరూ అన్న కొడుకు శ్రీనాథ్ తో.

కొడుకు ఏమిటి చెప్తాడా అని కుతూహలంగా చూస్తున్నారు రుక్మిణిగారు.

"నేను రోహిణీ ఇద్దరం ఇంట్లోనే కూర్చొని పని చేసుకుంటున్నాము.  ప్రతీ శనివారం ఆదివారం ఆఫీసు పనికి, పిల్లల బడికి సెలవే. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రెండు పూటలా వంటమనిషి వస్తుంది. మిగతా రెండు రోజులూ నేను మీకోడలు కలిసి అన్ని పనులు చేసుకుంటాము. అందుచేత, మీరిద్దరూ అక్కడ ఒక్క పని కూడా చేయవలసిన అవసరం లేదు. కూరగాయలతో సహా అన్నీ అపార్ట్మెంట్ లో ఉన్న సూపర్ బజారులోనే ఉదయం ఏడు నుంచి రాత్రి పది వరకూ దొరుకుతాయి. ఎప్పుడేనా మనం వెళ్లాలనుకుంటే, టిఫిన్ మరియు భోజనం కోసం మంచి రెస్టారంట్ కూడా అపార్ట్మెంట్ లోనే ఉంది. వారంకి మూడు రోజులు ఉదయం ఒక గంట, రాత్రి ఒక గంట, అపార్ట్మెంట్ కి డాక్టర్ వచ్చే సదుపాయం ఉంది. మందులు అమ్మే దుకాణం అపార్ట్మెంట్ లోపలే ప్రతీ ఉదయం ఏడు నుంచీ రాత్రి పదకొండు వరకూ తెరిచిఉంటుంది.  అపార్ట్మెంట్ కి పది కిలోమీటర్ల వృత్తం దూరంలో పెద్ద పెద్ద ఆసుపత్రులు నాలుగు ఉన్నాయి. భగవంతుని దయవలన అవసరం పడకూడదు కానీ, ఎప్పుడేనా అవసరం పడితే, పావుగంటలో ఆసుపత్రికి వెళ్ళవచ్చు.  అపార్ట్మెంట్ దగ్గరలోనే పెద్ద పార్కు రోజంతా తెరిచే ఉంటుంది" అని –

అరచేతిలో వైకుంఠం చూపుతూ శ్రీనాథ్ చెప్పిన మాటలకు అతని తల్లితండ్రులు కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయినా, ముందుగా తేరుకున్న నారాయణగారు –

“సరే, ఇప్పుడు నీతో వచ్చి పదిరోజులు ఉండి మాకు నచ్చితే నీదగ్గరకి పూర్తిగా వచ్చేస్తాము"

"పదిరోజుల్లో మీకు అక్కడ లైఫ్ ఏమి అర్ధం అవుతుంది"

“అన్నం ఉడికిందో లేదో ఒకటి రెండు మెతుకుకులు చూస్తారు కానీ అన్నం అంతా చూస్తారేమిటిరా.  అయినా,  కుక్కర్లో వండుకునే మీకు ఏమి బోధపడుతుందిలే" రుక్మిణిగారు నవ్వుతూ అన్నారు.    

"అయితే, రేపు మధ్యాహ్నం రెండు గంటల ఫ్లైట్ కి టిక్కెట్లు తీస్తాను"

"ఫ్లైట్ అంటే పక్క ఊరికి వెళ్ళాలి కదా.  మన ఊరిలో రేపు సాయంత్రం ఇక్కడ ట్రైన్ ఎక్కితే ఎల్లుండి ఉదయానికి మీఊరిలో దిగిపోమూ"

"రాత్రంతా ట్రైన్ ప్రయాణం చేసే కంటే, రేపు రాత్రికి అక్కడ మన ఇంట్లోనే హాయిగా పడుకోవొచ్చు కదా నాన్నా"

"సరే, నీ ఇష్టం"                                        

"పిల్లల కోసం రెండు రకాల మిఠాయిలు త్వరగా చేస్తాను" అంటూ రుక్మిణిగారు లోపలికి వెళ్ళబోతూంటే –

"వద్దమ్మా, అక్కడ దొరకనిది లేదు. మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటే, సూపర్ బజార్ లో దొరకకపోతే, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే నేరుగా మన ఇంటికి వచ్చేస్తాయి. అందుకే, నువ్వు మరేమీ శ్రమ పడకు. రెండు బ్యాగులు మించకుండా నీవి నాన్నవి బట్టలు సర్దేయి. మనిషికి పది కేజీలకు మించి ఏదీ తీసుకొనివెళ్ళడానికి ఫ్లైట్ వాళ్ళు ఒప్పుకోరు.  మంచినీళ్లు కూడా మనిషికి 200 మిల్లీ లీటరు మించి తీసుకొనివెళ్లనివ్వరు. అందుకే, మన ముగ్గురికీ వేరు వేరుగా చిన్న నీళ్లసీసాలు కొంటాను"  

ఇన్ని ఆంక్షలతో ఫ్లైట్ ప్రయాణం గురించి వింటూంటే -- నారాయణగారికి రుక్మిణిగారికి చిన్నగా విముఖత అప్పుడే ప్రారంభం అయింది.  విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ ఇచ్చేచోట అరగంట, సెక్యూరిటీ చెకింగ్ కోసం అరగంట, బోర్డింగ్ కు మరో అరగంట పైన పట్టి, తమ తమ సీట్లలో కూర్చోనేసరికి శ్రీనాథ్ తల్లితండ్రులిద్దరూ అలసిపోయేరు.  ఏదో కారణాంతరాలవలన వారు కూర్చున్న ఫ్లైట్ బయలుదేరడానికి మరో అరగంట సమయం ఆలస్యమైంది.

శ్రీనాథ్ కుటుంబంతో నివసించే మహానగరంలో విమానం దిగి సమయం చూసుకుంటే సాయంత్రం నాలుగున్నరయింది. అక్కడ బ్యాగులకోసం చాలా సమయం వేచి ఉండి, క్యాబ్ లో బయలుదేరితే శ్రీనాథ్ ఉండే అపార్ట్మెంట్ చేరుకునేసరికి రెండు గంటలు పైన గడిచి రాత్రి ఎనిమిది అవొచ్చింది.  

అపార్ట్మెంట్ గేట్ దగ్గరుండే సెక్యూరిటీ వాళ్ళు శ్రీనాథ్ అమ్మానాన్నల పేర్లు మొబైల్ నంబర్లు వ్రాసుకొని వారిని లోపలికి వదిలేసరికి మరో పది నిమిషాలు గడిచి రాత్రి ఎనిమిది దాటినతరువాత ఇంట్లోకి అడుగిడేరు.  

తలుపు తాళం తీసి లోపలికి వెళ్లిన శ్రీనాథ్ "పిల్లలూ, రోహిణీ సర్ప్రైజ్. చూడు ఎవరొచ్చేరో" అని కేక వేసేసరికి ఒక గదిలోంచి రోహిణీ మరో గదిలోంచి పిల్లలిద్దరు బయటకు వచ్చేరు.

అప్పటికే నిస్త్రాణగా సోఫాలో కూర్చుండిపోయిన అత్తమామలను చూసిన రోహిణీ వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి, త్వరగా లోపలికి వెళ్లి  త్రాగడానికి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది.

పిల్లలు -- కరుణా, కిరణ్ -- కూడా తాతగారికి మామ్మకి కాళ్ళకి నమస్కారం చేసి -- "వెల్కమ్ గ్రాండ్పా  వెల్కమ్ గ్రాండ్మా" అనగానే, తాతా మామ్మలు ముద్దొస్తున్న పిల్లలిద్దరినీ ఒంట్లో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ అలసట మరచిపోసాగేరు.

"కొంచెం కాఫీ తెస్తాను" అంటూ రోహిణీ లోపలికి వెళ్తూ, శ్రీనాథ్ ని రమ్మని సైగ చేసింది.

                                                  

"శ్రీ నీకేమైనా మతి ఉందా లేదా, ఇంత హఠాత్తుగా మీ అమ్మానాన్నలతో దిగితే వాళ్లకి తినడానికి ఏమి పెట్టేది. వంటమనిషి సాయంత్రం ఏడు కాకుండానే వెళ్ళిపోతుందని నీకు తెలియదా. నాకు ఫోన్ చేసి ముందుగా చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు" అని ఎడాపెడా కడిగేసింది శ్రీనాథ్ ని కాఫీ చేస్తూనే.

"నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు రోహిణీ"

"మీ అమ్మా నాన్నలకు నువ్వేమి సర్దిచెప్పుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం ఇప్పుడు వంట చేయలేను. నువ్వు ముందు పద, నేను కాఫీ బిస్కట్లు తీసుకొని వస్తాను"  

లోపల కొడుకు కోడలు ఎంత మెల్లిగా మాట్లాడుతున్నా ఇవతలున్న పెద్దవారి చెవిలో పడకపోలేదు.

నారాయణగారు రుక్మిణిగారు సైలెంట్ గా కాఫీ త్రాగుతూంటే శ్రీనాథ్ "అమ్మా నాన్నా, మీరు  ఫ్రెష్ అయితే, మనం అందరం కలిసి మన అపార్ట్మెంట్ లోనే ఉన్న రెస్టారంట్ కి వెళ్లి భోజనం చేసి వద్దాం"

"పిల్లలిద్దరూ పెందరాళే తినేసేరు. హోమ్ వర్క్ చేసి పడుకుంటారు, పొద్దున్నే త్వరగా లేవాలి కదా వాళ్ళు. నాకు ఇంకా రెండు మూడు గంటల ఆఫీస్ పని ఉంది. మీరు అత్తయ్యని మామయ్యని తీసుకొని వీధి తలుపుకి తాళం వేసుకొని వెళ్ళండి" అని లోపలికి వెళ్తూ --

"నేను పనిచేసుకోవాలి, మీరు మీగదిలోకి వెళ్లి హోమ్ వర్క్ చేసుకొని త్వరగా పడుకోండి" అని పిల్లలకి చెప్పిరోహిణి --

"సారీ అత్తయ్యా సారీ మామయ్యా, నేను పని చేసుకుందికి లోపలికి వెళ్తున్నాను" అంటూ రోహిణి మరో నిమిషం కూడా అక్కడ ఉండకుండా తన గది లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది.

పరిస్థితి అర్ధంచేసుకొని నిశ్శబ్దంగా ఉన్న తల్లితండ్రులతో శ్రీనాథ్ రెస్టారంట్ కి వెళ్లి ముగ్గురూ భోజనం చేసి వచ్చేరు.

అమ్మా నాన్నకు పడుకుందికి గది చూపించి, శ్రీనాథ్ కూడా పడుకుందుకి వెళ్ళిపోయేడు.

మంచంమీద నడుం వాల్చిన దంపతులకు కొడుకు కాపరం అవగతమై కళ్ళతోనే సంభాషించుకున్నారు.   

మరునాడు ఉదయం ఏడో గంటకు వచ్చిన వంటమనిషికి రోహిణి ‘మరో ఇద్దరికోసం కూడా చేయాలి’ అని చెప్పింది. తొమ్మిది సరికి టిఫిన్, మధ్యాహ్నం కోసం వంట కూడా చేసి, అన్నీ హాట్ ప్యాక్ లలో సర్దిపెట్టి వంటమనిషి వెళ్ళిపోయింది.  అది చూసిన రుక్మిణిగారికి వంటమనిషి సహాయం ఎలా ఉంటుందో అర్ధమైంది.

టిఫిన్ చేసిన తరువాత నారాయణ దంపతులు అపార్ట్మెంట్ చూద్దామని బయలుదేరేరు.

ముందుగా సూపర్ బజార్ కి వెళ్లి చూస్తే,  కూరగాయలు పళ్ళు రోజూ ఉదయం పదకొండు గంటల తరువాత మాత్రమే వస్తాయని, అవన్నీ వారు అమ్మకానికి సర్ది ఉంచేసరికి సుమారుగా మరోగంట పడుతుందని తెలిసింది. తమ ఇంట్లో కాసే తాజా కూరగాయలు పొలంలో చెట్టుకు పండే పళ్ళు జ్ఞాపకం వచ్చేయి నారాయణ దంపతులకు                                    

అక్కడనుంచి మందుల దుకాణములోకి వెళ్లి చూస్తే,  ఒకతను అక్కడున్న మేనేజర్ తో  "మందులు కావాలని మీకు ఆర్డర్ అడ్వాన్స్ ఇచ్చి మూడు రోజులైంది, ఇంకా ఎన్నాళ్ళు మందుల కోసం వేచి ఉండాలి" అని ఘర్షణ పడుతున్నాడు. మరొకతను "అన్నిచోట్లా, మందుల మీద కనీసం పది శాతం డిస్కౌంట్  ఇస్తూంటే, మీరు ఒక పైసా కూడా తగ్గించరెందుకు" అని వాదిస్తున్నాడు.  మందుల దుకాణం మనిషికి ఫోన్ చేస్తే, మందులకు అయే ఖర్చు బట్టి పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ తో తమ ఇంటికే మందులు రావడం గుర్తుకు వచ్చేయి నారాయణ దంపతులకు.

అపార్ట్మెంట్ చుట్టూ వారు నడుస్తూంటే, నడిచే దారి చక్కగా చదును చేయకపోవడం వలన ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాదాలకు దెబ్బలు తగిలే అవకాశం లేకపోలేదని తెలుసుకున్నారు.

డ్రైనేజీ సదుపాయం మంచిగా లేకపోవడంతో, ఫ్లాట్లలోంచి బయటకు వచ్చిన వాడుక నీళ్లు ఎక్కడికక్కడే నిలవా ఉంటూ, దుర్గంధం వస్తూ,  దోమలు స్వైర విహారం చేస్తూ కనిపించేయి.

సెక్యూరిటీ వారి దగ్గర ఉన్న మేనేజర్ తో మాట్లాడితే  -- 

త్రాగేనీరు కోసం నీటి ట్యాంకర్లమీదనే పూర్తిగా ఆధారమని, ఒక్కో టాంకర్ వేయి నుంచి పన్నెండు వందల రూపాయలకు దొరుకుతాయని, అదే ఎండా కాలమైతే పదిహేను వందలిచ్చినా దొరకడం కష్టం అని, అలా కొనే నీటిని వేరుగా ఫిల్టర్ చేయకపోతే త్రాగలేమని -- వారికి తెలిసింది.  ఎండాకాలం చల్లని నీళ్లతో శీతాకాలం వెచ్చటి నీళ్లతో ఎప్పుడూ నీళ్లతో కళకళలాడే తమ ఇంట్లోని బావి గుర్తుకు వచ్చింది వారికి.

డాక్టర్ ఎక్కడ దొరుకుతారో చూద్దామని వెతుకుతూ ఉంటే – 'క్లినిక్ కి దారి' అని చిన్నపాటి  బోర్డు ఒకటి కనిపిస్తే ఆవైపుగా వెళ్ళేరు. తలుపులు వేసిన ఆ గది దగ్గర ఒక మనిషి కూర్చొని డాక్టర్ కోసం వచ్చే వాళ్లకి 'ఆయన మరో రెండు రోజులవరకూ రారు' అని చెప్తున్నాడు. అప్పుడు తెలిసింది డాక్టర్ ఆ ముందర రెండు రోజులూ కూడా రాలేదని.  

ఒకచోట పదిమంది గుమిగూడి ఉంటే ఏమైందని ఆరా తీస్తే – ఒక ఫ్లాట్ లో ముసలాయనకు ఉదయం 7 గంటలకు గుండె నొప్పి వస్తే, అంబులెన్సు కోసం ఫోన్లు చేస్తే, ఎంతో కష్టం మీద ముప్ఫై నిమిషాల తరువాత వచ్చిన అంబులెన్సులో రోగిని తీసుకొని బయలుదేరితే, ట్రాఫిక్ తో పాటూ రోడ్డుమీదున్న గతుకులు గోతులు ఇబ్బందులవలన హాస్పిటల్ చేరేసరికి ఎనిమిదిన్నర దాటిందట.  అప్పుడు రోగిని చూసిన డాక్టర్ 'చనిపోయిన మనిషిని తెచ్చేరు' అని చెప్పేరట.  

గుండెనొప్పి రాగానే, 'సార్బిట్రేట్' మాత్ర రోగి నోట్లో నాలిక కింద పెట్టలేదా అని విచారిస్తే, ఆ మాత్ర ఇంట్లో లేమందుల దుకాణంకి వెళ్తే అక్కడ దొరకలేదని తెలిసింది. 

అపార్ట్మెంట్ బయట మరో మందుల దుకాణంలో ప్రయత్నించలేదా అని అడిగితే, బయట ఉన్న మందుల దుకాణం ఇక్కడికి కిలోమీటర్ పైన దూరంలో ఉందని, అది కూడా ఉదయం తొమ్మిది దాటితే కానీ తెరవరు అని తెలిసింది.  

అక్కడనుంచి పార్క్ వరకూ వెళ్లి వద్దామని ఇద్దరూ బయలుదేరేరు. గతుకులతో అడ్డదిడ్డంగా ఉన్న పాదచారుల మార్గం మీద సుమారు అరకిలోమీటరు దూరం నడిచి వెళ్లిన వారికి  రోడ్డుకి అటువైపున పార్క్ కనిపించింది.   వచ్చే పోయే బళ్ళు అతి వేగంతో పరిగెడుతూంటే, అక్కడ జీబ్రా క్రాసింగ్ లాంటింది కానీ ట్రాఫిక్ సిగ్నల్ కానీ లేకపోవడం వలన, నారాయణ దంపతులు రోడ్డు దాటే పార్కు వెళ్లేందుకు సాహసం చేయలేకపోయారు.   

వెనక్కి పోదామని అనుకున్న వారు వెనక్కి తిరిగేంతలో -                                  

సుమారు పాతికేళ్ళుండే అమ్మాయి రోడ్డుకి అటువైపునుంచి ఇటు వస్తూంటే, అతి వేగంగా వస్తున్న మోటార్ సైకిల్ ఆమెను గుద్దేసి ఆగకుండా అంతే వేగంగా వెళ్ళిపోయింది. ఆ దెబ్బకు రోడ్డుమీద పడిపోయిన ఆమెకు ఎవరూ చేయిచ్చి లేపే ప్రయత్నం కనీసం చేయకపోగా, చుట్టూ మూగిన నాగరిక జనం వారి వారి మొబైళ్ళలో ఆమెను ఫోటో తీస్తూ చాలా బిజీగా ఉండడం ఆశ్చర్యంతో చూసినారాయణ దంపతులు జనం మధ్యలోంచి ఆమె దగ్గరకు వెళ్ళేరు. అదృష్టవశాత్తు ఆమెకు పెద్దగా దెబ్బలు తగలలేదు. కానీ, అనుకోకుండా జరిగిన సంఘటనతో ఆమె కొంచెం షాక్ కి గురైంది.

అటూఇటూ ఆమెకు ఆసరాగా నిలబడిన నారాయణగారు రుక్మిణీగారు తాపీగా ఆమెను నడిపించుకొచ్చి పాదచారుల మార్గం మీదే కూర్చో పెట్టి అక్కడే ఉన్న కిళ్లీ దుకాణంలోంచి సోడా తెచ్చి తాగించేరు.  అప్పుడుకూడా గుమిగూడిన నాగరిక జనం ఈముగ్గురికీ కలిసి ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు.  రుక్మిణీగారు ఆమెను అడిగి ఆమె మొబైల్ నుంచి ఆమె ఇంటివారికి ఫోన్ చేస్తే, అరగంటకు వచ్చిన ఆమె ఇంటివారికి ఆమెను అప్పగించిన తరువాత, నారాయణ దంపతులు వెనక్కి ఇంటికి బయలుదేరేరు.

ఇన్ని (అ)సదుపాయాలతో ఇక్కడ ఉండేకన్నా, తమ ఊరికి వెంటనే వెళ్లిపోవడమే మంచిదనుకున్న నారాయణ దంపతులు మరుసటి రోజే తిరుగు ప్రయాణం పెట్టుకొని రైలులో ప్రశాంతంగా కూర్చున్నారు. 

రోహిణి ప్రశాంతంగా తన ఆఫీస్ పని చేసుకుంటోంది.

పని తగ్గిందని వంటమనిషి సంతోషించింది.

పదిరోజులు ఉండి చూద్దామని వచ్చిన అమ్మానాన్నా, కారణాలు ఏమీ చెప్పకుండా, మూడో రోజుకే ఎందుకు తిరుగు ప్రయాణం అయేరో అన్నది ఎంత ఆలోచించినా శ్రీనాథ్ కి అర్ధం కాలేదు.

తండ్రి దగ్గరనుంచి వచ్చిన ఉత్తరం చదువుతున్నాడు శ్రీనాథ్.

"బాబూ శ్రీ, నీకంటూ ఒక సంసారం ఏర్పడిన తరువాత నువ్వెలా ఉంటావో ఎక్కడ ఉంటావో నిర్ణయించుకొని, అక్కడే నువ్వు నీ భార్యా పిల్లలు సర్వ సుఖములు వెతుక్కోవలసి ఉంటుంది అన్నది సార్వజనీకం.   ఈ మలి వయసులో ఆ ఎండమావుల వెనక పరిగెత్తే ఓపిక అవసరం రెండూ మాకు లేవు.  ఎక్కడ ఉన్నా, నువ్వు కోడలు మనవలు సుఖంగా ఉండాలని కోరుకునే -- నీ (ముసలి) తల్లితండ్రులు.  

                  (ఇక మీదట  మమ్మల్ని ఆ మహానగరంకి తీసుకొని వెళ్లాలనే వ్యర్ధ

                  ప్రయత్నం చేయకు.   వీలైనప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చే

                  ప్రయత్నం చేస్తే, అదే మాకు మహదానందం)    

                                                   *****

Lisää kommentteja