నింగి-నేల  (Author: సిహెచ్ చిన సూర్యనారాయణ)

నేనొక సామాన్య ఉద్యోగిని. నా జీతము జీవించడానికి సరిపోయినంత. నా భార్య, ఇద్దరు పిల్లలు, ఇది నా కుటుంబము. ఉద్యోగరీత్యా పట్టణ ప్రాంతములో ఇల్లు అద్దెకు తీసుకొని బ్రతకడం తప్పలేదు. గొప్ప భోగాలుతో జీవించడానికి, నా సంపాదన సరిపోవడం లేదు కాని, కూడు గుడ్డకు ఏ లోటూ లేకుండా జీవితం గడిచిపోతుంది. అద్దె ఇంట్లో బ్రతుకునీడిస్తూ, ఫీజులు కట్టలేక పిల్లలను ప్రభుత్వ బడిలో చదివిస్తూ, ఉన్నంతలో సర్దుకుపోతూ, అసంతృప్తితో కాలం గడుపుతున్న కుటుంబము నాది. భోజనానికి, బట్టలకు లోటు లేకపోయినా, నా ఎదురిల్లు, వెనకిల్లులుతో పోలిస్తే, నా ఇంట్లో ఆనందం తక్కువే. నా ఇంటికి వెనుకనున్న ఇంట్లో వారు, ఎలాంటి వారో, తెలియదు కానీ, ఎప్పుడూ నవ్వులు వినబడుతూ ఉంటాయి. నేనంత ఆనందముగా బ్రతుక లేక పోతున్నాననే బాధ నన్ను వెంటాడుతుంటుంది. ఎదురింట్లో వారిని చూస్తుంటే, నాకు చాలా ఈర్ష్యగా ఉంటుంది. వారితో పోల్చుకొని చూస్తే, "ఛీ నాదీ ఒక బ్రతుకేనా?" అనిపిస్తుంది. సొంత ఇల్లు, అతని ఇంటి ముందొక కారు. పైకి కనిపించను కాని, ఎప్పుడూ నా దృష్టి వాటి పైనే ఉంటుంది. దేవుడు నాకెందుకు అలాంటి బ్రతుకు ఇవ్వలేదని, నాలో నేనే కుమిలి పోతుంటాను. నా ఇంటి వెనుక నున్న వాళ్ళు ఎలాంటి వారో తెలియదు కానీ, వాళ్ళింటి నుండి ఎప్పుడూ నవ్వులు వినబడుతూ ఉంటాయి. ఈ రెండు కుటుంబాలు మద్య, నేను చిన్న బుచ్చుకొని బ్రతుకుతున్నాను.

అప్పుడప్పుడు, నా మనసులో దాగున్న ఆ విషయాన్ని, మా ఆవిడ ముందు బయటపెడుతూ ఉంటాను.

"ఏమిటి? పార్వతీ, దేవుడు అందరికీ మంచి జీవితాన్ని ఇచ్చి, నాకొక్కడికే, ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ జన్మలో ఎదురింటి వాళ్ళు లాగ, వెనుకింటి వాళ్ళు లాగ బ్రతుక గలమా?" అని వాపోయే వాడిని.

నా భార్య నాకు హితోపదేశము చేస్తూ ఉండేది. "మనకిప్పుడు ఏమిటి లోటండి?. మన పిల్లలు చక్కగా చదువు కుంటున్నారు. మీరు తెచ్చిన జీతము మనకు బ్రతకడానికి సరిపోతుంది. ఇంతకన్నా మంచి జీవితము ఇంకెవరికుంటుందండి" ఇదీ మా ఆవిడ నాకెప్పుడూ బోధ పరుస్తున్న విధానము.

అయినా, మా ఆవిడ మాటలు నాకు రుచించేవు కావు. ఎదురింట్లో ఉన్న టీవీయే అరవై వేలు రూపాయలట. ఇంకా నా ఇంట్లో ఎప్పటిదో పాత డొక్కు టీవీయే ఉంది. అలాంటి టీవిలో కార్యక్రమాలు చూసే అదృష్టం నాకెప్పుడు వస్తుందో?, రోజు రోజుకీ నాలో నున్న ఈ మనోవ్యధ, మనోవ్యాధిగా మారిపోతుంది.

వెనుకనున్న ఇంట్లో వారు బాగానే బ్రతుకుతున్నారు, ఎదురింట్లో ఉన్న వారు బాగానే బ్రతుకుతున్నారు, మద్యలో ఈ సగటు జీవితం నన్ను ఇబ్బంది పెడుతుంది. ప్రతి రోజూ వీళ్లను చూస్తూ బ్రతకడం కష్టంగా ఉంది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇల్లు విడిచి వేరొక చోట ఇల్లు అద్దెకు తీసికొని వెళ్లిపోదామని. ఈ విషయం నా భార్యకు చెప్పాను.

నా భార్యకు ఒక అలవాటుంది. నేనేమి చెప్పినా, నేనేమి అడిగినా ఒకే వాక్యములో సమాధానము చెప్పి, తన పనిలోకి తాను నిమగ్నమై పోతుంది. సీరియస్ గా తీసుకోదు. ఇప్పుడు కూడా అలాగే చేసింది.

"ఇక్కడ మనకు బాగానే ఉంది కదండి, ఏం తక్కువైందని మనం ఇల్లు మారాలి అంటున్నారు. మీ ఇష్టము మరి" మనసులో మాట చెప్పేసి వెళ్లి పోయింది.

ఆమె ఎంత చెప్పినా, పొరుగు వారిని చూస్తూ, ఈ ఇంట్లో బ్రతకడం, నా వల్ల కాదని, ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోవడానికే నిర్ణయించుకున్నాను.

రెండు మూడు రోజులు తిరిగిన తర్వాత, మరొక చోట నా తాహతుకు సరిపోయిన, ఇల్లు ఉందని తెలిసి, అక్కడకు వెళ్లి మాట్లాడి, అడ్వాన్స్ గా కొంత సొమ్మిచ్చి, వారము రోజుల్లో మంచి రోజు చూసుకొని, ఇంట్లో దిగుతానని చెప్పి వచ్చేసాను.

ఈ విషయాన్ని ఇంట్లో భార్యకు, పిల్లలకు చెప్పాను. ఇల్లు మారడం, నా భార్యకు పిల్లలకు ఇష్టము లేదు

"మరొక సారి ఆలోసించ"మని మా ఆవిడ, "ఇక్కడే బాగుంది నాన్నా"అని నా పిల్లలు అనేసి ఊరుకున్నారు.

నాది ఏ నిర్ణయమైనా, ఇష్టము లేకున్నా, గట్టిగా నాతో వాదించి, మార్పించే అలవాటు నా భార్యకు పిల్లలకు లేదు.

ఏదేమైనా, నేను ఆనందంగా బ్రతకాలంటే, ఈ ఇల్లును విడిచి పోవడమే మంచిదని, నేను నిర్ణయం మార్చుకోలేదు.

వారము రోజుల తర్వాత, ఇల్లు మారవలసిన, మంచి ముహూర్తపు రోజు రానే వచ్చింది.

లారీ ఇంటి ముందు ఆగింది. కూలీలు సామాన్లను లారీలోకి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు.

నా భార్య పిల్లల ముఖాల్లో ఆనందం కనిపించడం లేదు. అదోలా నా వైపు చూస్తున్నారు. వాళ్ళకు ఇల్లు మారడం ఇష్టము లేదు.

అయినా, అవేమీ పట్టించుకోడానికి నేను సిద్ధంగా లేను. కూలీలకు చెప్పాను, సామానులన్ని లారీలోకి ఎక్కించమని.

కూలీలు ఇంట్లోకి వెళ్ళారు, సామాన్లను లారీలోకి ఎక్కించడానికి.

ఆ ప్రక్కనే నిలుచున్న నాకు, ఎప్పటి నుండో ఒక సందేహం పీక్కుతింటుంది.

ఎదురింట్లో వారు, ఇంత ధనవంతమైన జీవితం గడుపుతున్నారు కదా, ఎప్పుడూ నవ్వులు వినిపిస్తున్న వెనుకనున్న వారు జీవితం, ఇంకా ఎంత ధనవంతమై ఉంటుందోనని. ఇంట్లో దిగిన తర్వాత నేను ఎప్పుడూ, నా ఇంటి వెనుకకు వెళ్లి చూడలేదు. అసలు ఇంటి వెనుకకు వెళ్లడానికి దారి లేదు. గోడ అడ్డంగా ఉంది. నా ఇంటి వెనుకకు వెళ్ళాలంటే, వీధి చివరి వరకు వెళ్లి, మరలా తిరిగి వెనుకకు రావాలి. అందువలన, ఆ ఇల్లును చూసే అవకాశం రాలేదు. ఎలాగూ ఈ ఇల్లు వదిలి పోతున్నాను కదా, ఒక సారి ఆ ఇల్లును కూడా చూస్తే, నా అనుమానం తీరి పోతుందనిపించింది.

"పార్వతీ, నాక్కొంచెము పనుంది, ఇప్పుడే వచ్చేస్తాను" అన చెప్పి బయలుదేరాను.

వీధి చివర వరకు వెళ్లి, అటూఇటూ చూచి, ఎవరూ చూడ లేదని, నిర్ధారించుకున్న తర్వాత, మా ఇంటి వెనుక మార్గము ద్వారా, మా ఇంటి వెనుకనున్న, ఇంటి దగ్గరగా వచ్చి నిలబడ్డాను.

అక్కడున్న దృశ్యాన్ని చూసి, నా మనసు కొట్టుకోవడం ప్రారంభించింది.

నా ఆలోచనా తరంగాలకు, అడ్డుకట్ట వేస్తున్నట్లు, నా భావనా వృక్షాన్ని పెకలించి వేస్తున్నట్లు, అలా చూస్తూ నిలబడి పోయాను. నిశ్చేష్ఠుడునై.

అసలు అక్కడ ఇల్లే లేదు. ఒక రేకుల సెడ్డుంది. ఆ సెడ్డు క్రింద నలుగురు బిక్షగాళ్ళు, అడుక్కొని తెచ్చుకున్న ఆహారాన్ని, పంచుకొని తింటున్నారు. తింటూనే, మద్య మద్యలో నవ్వు కుంటున్నారు. ఆ నవ్వుల్లో వాళ్ళంతా ఈ లోకాన్నే మరిచి పోయినట్టు కనిపిస్తున్నారు.

స్తబ్దుడునై వారి వైపు చూస్తున్న, నా కళ్లల్లోకి, జ్ఞానోదయ రేఖలు ప్రవేశించాయి. "నింగి వైపు కాదురా, నేల వైపు చూడరా" అని హెచ్చరికలు వినబడుతున్నాయి.

అంతే అక్కడ నుండి పరిగెత్తాను, లారీలోకి ఎక్కిస్తున్న సామాన్లను ఆపమని కేకలు వేస్తూ...


Lisää kommentteja