తియ్యటి కన్నీళ్ళు
తియ్యటి కన్నీళ్ళు (Author: రాచమళ్ళ ఉపేందర్)
కుంకుతున్న పొద్దంటే
నాకెంతో ఇష్టం
రోజంతా రక్తమాంసాల్ని కరిగించి
వెట్టిలో ఉడికించిన నాన్న పాదాలను
నావైపు పంపుతున్నట్లే అనిపిస్తుందా దృశ్యం!
పనిలో ఎంత నలిగిపోయినా
చిరునవ్వును పులుముకొని
భుజాన కండువా మూటతో వస్తున్న
నాన్నను చూస్తుంటే
నాలో కలిగే ఆనందం అంతుపట్టలేనిది
ఇంటికి దగ్గరవుతుంటే
ఒలంపిక్స్ పోటీలా పరుగెత్తి
నాన్న కాళ్ళను గట్టిగా పట్టేసుకునేవాణ్ణి
అంత అలసటలోనూ
ప్రేమగా హత్తుకునేవాడు నాన్న...
ఇంట్లోకి రాగానే
త్వరగా స్నానం చేసి
నడుము వాల్చేవాడుకాదు
ఇంటి ముంగిట కట్టెపుల్లల్ని పోగేసి....
నిప్పు రాజేసి...
కండువా మూటను విప్పి
మంటలో గుమ్మరించేవాడు
పది నిమిషాల తరువాత
కాలే కాలే శనక్కాయలు
ఊదుకొని తింటున్న నన్ను చూస్తే
నాన్న కళ్ళల్లో వెల్లివిరిసే కన్నీరు
నా మనసులో ఇప్పటికి చెదిరిపోలేదు
ఇప్పుడు
నాన్న భౌతికంగా నా నుండి అదృశ్యమైనా...
జ్ఞాపకాలు మాత్రం... కన్నీళ్ళుగా జారుతూ...
కాల్చిన శనక్కాయల్లా
కమ్మటి వాసనలు
వెదజల్లుతూనే ఉన్నాయి!!
- 0 -