ఛిద్రమైన బతుకులు  (Author: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము)

పచ్పని, మెత్తని తివాచీ పరుచినట్టుగా ఉంది ఆవరణ. మధ్య లో రోడ్డు కిరువైపుల వందనం చేసే సైనికుల్లెక్క

        సక్కగా పెరిగిన అశోక చెట్లు. ఎంతో మంది శాస్థ్రవేత్త లను, విద్యావంతులనూ, నాయకులను తయరు చేశానన్న దర్పంతో, మేరునగ గాంభీర్యంతో అప్పుడే పూసిన పువ్వులా మెరుస్తోంది ఆర్ట్స్ కాలేజీ భవనం.   

అచ్చిపోయే పోరగాళ్ళతో అలుపు లేకుండ ఉంది లోపల. కాలేజీ బయట దాని నీడలు పాకిన చోటల్లా పిల్లల కోడిలెక్కన అక్కడక్కడ కొంతమంది విద్యార్థులు జమైండ్రు. కాకిరిబీకిరిగా మాట్లాడు కుంటున్రు. మరికొందరు జగడం పెట్టుకున్నతీరుగ ముచ్చట్లు ఆడుతున్రు. మరో చోట అదాలత్ తీరున వాడివేడి చర్చ సాగిస్తున్నరు. ఇంకో కాడ ఒకల్నొకలు పరాచికాలు ఆడుకుంట, పళ్ళు ఇగిలిస్తున్నరు. వాళ్ళ అందరికీ దూరంగా మరికొంత మంది తపం చేస్తున్న మునుల్లెక్కన పుస్తకాల్ల మునిగిండ్రు.  ఆ చెట్ల నీడన దీర్ఘాలోచన చేస్తూ కూసున్నడు నర హరి. నెత్తి మీద అరెకరం జుట్టూడిపోయింది. కళ్ళకు అద్దాలు. అక్కడక్కడ ముడుతలు పడ్డ మొఖంలో నైరాశ్యం. కళ్ళలో అసంతృప్తి. పూరాగా దివాలా తీసిన మడిసి లెక్కున్నడు. గుంపులుగా మూగిన కాలేజీ పోరగాండ్లను తనే మాత్రం పట్టించుకోవటం లేదు.  ఆళ్ళ ముచ్చట్లేవీ అతని చెవికెక్కతలే. ఇనాలనీ లేదు.

        క్యాంపస్ లోనే ఐదేళ్ళు సదివిండు. రెండు పీజీలు చేసిండు. రెండేళ్ళుగా గిదే క్యాంపస్ హాస్టళ్ల లో నాన్ బోర్డర్ గా ఉంటున్నడు. గవన్నీ అతనికి షరా మామూలే. వాటినేవీ పట్టించుకోకుండానే చేతిల పట్టుకున్న బుక్ ను మూసుకుంటా, తెర్సుకుంటా ఉన్నడు. సదవ మనసొప్పక అట్లనే ఛాతీ మీద పెట్టు కుని కళ్ళు మూసుకున్నడు.  

        'అన్నా, అన్నా..' అంటూ యాదయ్య పిలుపుతో ఉరుమేదో మీద పడ్డట్టుగా దిగ్గున లేచి కూసున్నడు.  

        'అన్నా, నీ కోసం పొద్దుగాల నుంచి క్యాంపస్ అంతా తిరుతీరుగుతున్నా; గడిగడికి మనరూం కాడికి పోయొచ్చిన. ఓసారి కొరియరాఫీసు కాడికి పోయొ చ్చిన. పొద్దున్నుంచి ఏడికి పోయినవ్' అంటూ టీవీల వార్తలు చదివినట్లుగా చదువుతాండు యాదయ్య.  'ఏడకి పోలే, ఈడనే కూసున్న తమ్మి' అంటూ నిర్లి ప్తంగా సమాధానమిచ్చిండు నరహరి.  'ఈడ్నే కూసుని' ఏంచేస్తున్నవ్ 'అని యాదయ్య మళ్ళీ ప్రశ్నించిండు.  'మనసెట్లనో ఉందిరా ఇసికియ్యకు'అంటూ బతిమి లాడినట్టుగా నరహరి అనేసరికి.  'సరే సరే నీకో ముచ్చట చెప్పాలే. పా అట్ల ఛాయ్ తాక్కుంటు మాట్లాడుకుందాం' అంటూ పైకి లేచాడు 

        యాదయ్య. ఆ వెనకే నరహరి లేచాడు. ఆ పక్కనే ఉన్న ఛాయ్ బండి దగ్గరికి పోయిండు.  'ఏంది తమ్మీ ఏదో ముచ్చట చెప్తనన్నవ్' అంటూ అడిగిండు నరహరి.  'ఏం లేదన్న ఇంటికి పోయిన కదా; సడక్ ఎంబడ నడుసుకుంట పోతాంటే మొన్నపెద్దవ్వ కండ్ల బడ్డది. ఇంటి మొఖాన రమ్మని ఒక్కతీరుగా జెప్పితే, ఇటచ్చే ముందు పోయిన. నాయిన గూడ   కలిసిండు. 'అంటూ యాదయ్య ఇంటికాడి ముచ్చట తీయంగనే కళ్ళన్నీ పెద్దగ జేసుకొని ఏదో ఆతురత తోటి 'అవ్వ నాయిన ఎట్లున్నరు తమ్మి' అంటూ అడిగిండు నరహరి.  'అన్నా, అవ్వ నాయిన - నీ గురించే చానా రంది బెట్టుకున్నరు. మా ఓడు ఇంటికొచ్చుడే మానేసిండని నాయిన బాధల అన్నడు.'ఆడు ఎట్టున్నడో’ ననీ నీ గురించే తండ్లాడతాండ్లు. 'నౌఖరీ అచ్చేనా,  రాకపోయేనా' అని అడిగిండు. పెద్దవ్వయితే కండ్ల నీళ్ళు పెట్టుకున్నది. నౌఖరంటే ఉత్తగనే అత్తదా. సదువద్దా. ఊకే ఇంటిమొఖానే రమ్మంటే ఎట్ల' అని నాయిన్నే గదమాయించిండు. దేనికైనా పనికొస్తయని ఇగో రెండు వేలు ఇచ్చిండు.' అంటూ అసలు విషయాన్ని చెప్పిండు యాదయ్య. 'నాయిన' అన్న మాట ఇనంగనే నరహరి కండ్ల కొసల నీళ్ళు తిరిగినయ్. పూడుకు పోయిన గొంతు తో 'ఇంకేం చెప్పిండు తమ్మీ' అని అడిగిండు నరహరి.  

        'అంతా మంచిగనే ఉన్నమని, యాళకింత తినమని జెప్పిండు. సదువేది ఏదీ లేకుంటే ఉగాదికి రమ్మన్నడు' అంటూ యాదయ్య చెప్పగానే అక్కడ్నుంచి ఉన్నఫళంగా లేచి మళ్ళీ చెట్ల నీడలున్న జాగ మొఖాన నడిచిండు.  ఛాయి పైసలిచ్చి ఉరుకుత నడిచిండు యాదయ్య. క్యాంపస్ ల ఓ మూలనున్న బెంచీపై కూలబడ్డ నరహరిని పట్టుకుని 'అన్న ఏమైందే ఎందుకట్ల ఫికరైతవ్' అంటూ ధైర్యం జెప్పుతున్నడు యాదయ్య. 'ఏం చెప్పేదిరా తమ్మీ, చెప్పడానికి ఏముందని? నౌఖరి అంటే దుక్నమా ఏంది అట్లా ఎళ్ళి ఇట్లా పొట్లం కట్టించుకుని అచ్చినట్లు, ఏం చేద్దాం' నిట్టూర్చాడు నరహరి.

        ఒక నిమిషం మౌనం.... మాటల్లో వణుకు... దుఃఖంతో మూసుకుపోతున్న గొంతులోంచి 'తమ్మీ, ఇంటికి నేను తొలిసూరు బిడ్డను. ఉన్న రెండెకరాల భూమితో యవుసం చేస్తు నాయిన బొక్కలన్ని తెల్లబడ్డయ్.  తిని, తినక ఓ పొద్దు పస్తులుంటూ పైసా పైసా కూడబెట్టి ముడ్డికిందకి ముప్పై ఏళ్ళు అచ్చేదాకా నన్ను కూకోబెట్టి ఆళ్ళు సాకిన్రు. అప్పులు దెచ్చి సదువు కోమని పట్నానికి పంపిండు. ఇంకా పైసలడగనికి మనసొప్పక ఆ కొరియర్ సెంటర్ లో గంటలెక్కన పని సేయవడ్తిని. బుద్దెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నా కష్టంతో కొని ఆళ్ళకు నేనేమి ఇయ్యలేదు. గీదినం వరకూ నీ నౌఖరేమైందిరా అని ఏనాడు నన్ను అడగలే. ఉన్న ఆ రెండెకరాల భూమిని చెల్లి పెళ్ళి కోసం పోయినేడే అమ్మిండు. 'భూమమ్మకే.. నేను ఊళ్ళనే ఉండి ఏదో పనిచేస్త. అప్పులు కడుదమే నాయినా' అంటే 'కడుపు కట్టుకుని నిన్ను సాకింది నా లెక్కన యవుసం చేసేందుకు కాదని కండ్లెర్ర చేసిండు. 'భూమమ్మితే ఎట్ల బతుకతవే' అని నేనంటే 'నువ్ లేవార బిడ్డా..' అని ధైర్యంగా చెప్పిండు. ఉన్న భూమమ్మి ఇప్పుడు ఆ భూమినే కౌలు తీసుకుని యవుసం చేస్తుండు. ఎన్నడు పక్క పొలానికి కూడా పోని మా అవ్వ కైకిలికి (కూలికి) పోతాంది.  'ఊళ్ళో ఉండి అవ్వ అయ్యలను చూసుకుంటున్ననా ఈడు పోరగాండ్లను చూస్త ఆళ్ళు మనసులనే బాద పడ్డరు కానీ నన్నే పొద్దు బాధపెట్టలే. ఆళ్ళ తోటోల్లు మనుమలు, మనుమరాండ్లను సూసుకొని మురిసిపోతాండే. ఆళ్ళు కుమిలిపోని దినం లేదు.  వాణ్ణెందుకు ఇంకా సదువిత్తావ్ అని ఎవడైనంటే అగ్గి మీద గుగ్గిలం లెక్కనైతడు. అందిన కాడల్లా చేయి సాపి పెడతనంటడు. బొక్కలన్నీ సురసుర చేసుకుంటూ నువ్ మాత్రం సదువు ఆపొద్దు బిడ్డా అంటడు. గీ సర్టిఫికెట్లను చూసినప్పుడల్లా నాయిన చేసిన అప్పు కాగితాలు, పడ్డ తిప్పలే మదిల మెదుల్తయి. ఆ గోల్డ్ మెడల్ చూసినప్పుడల్లా కరిగిపోయిన అవ్వ పుస్తెలతాడే నా కండ్లల మెరుత్తది. ఆళ్ళు చేసే కట్టాన్ని చూడలేక ఉండి ఉగ్గబట్టలేక, ఊరికి పోవుడే మానిన. 'పోయినేడు ఉగాదికి పోయిన. మళ్ళా ఇంటి ముఖం చూడలే. నాకు నౌఖరత్తదనే ఆశతోటే గుండె ధైర్యం చెడక బతుకుతుండ్రు. గందుకే మనీడు పోరగాండ్లు కళ్ళబడితే చాలు, నాకొడుకు పట్నంల సదువు తాండు. మీకు ఎప్పుడైన కలుత్తడా, ఆనికి నౌఖరెప్పుడొత్తదనే ఆరాలు తీస్తాంటడు. మనూరి పోరగాండ్లు కలీస్తే ఎట్లున్నడు, ఏం చేస్తున్నడని నా మంచిచెడ్డ అరుసుకుంటడు. ఊళ్ళోకి ఏ గవర్నమెంట్ నౌఖరీ గాడన్న అత్తే చాలు అని లెక్కన నన్ను ఊహించుకుంటడు. నాకు నౌఖరి అత్తదని పిట్టకు పెట్టినట్లు చూస్తాండు. ఇగ కొరియర్ ఆఫీసుకు కోచింగ్ సెంటర్ కు తిరుగుట్లనే పట్నంల బతుకు తెల్లారవట్టె. మన సదూవులన్నీ ఆనకాలం సదువులేనాయె.

'మనం సదివిన సదువు వేరు. గిప్పుడు పరీక్షల వాళ్ళడిగేది వేరు. ఒక్క ఉద్యోగానికి వేయి మందిమి ఉంటిమి. దాట్ల తౌడు బోసి కుక్కల కొట్లాట బెట్టినట్లు చేయవట్టె. గవర్నమెంటోడు లక్ష ఉద్యోగాలని చెప్పబట్టె. ఆఫీసుల చప్రాసీలకు, బందోబస్తుకు, లెక్కలు చూసే, కరెంట్ పని చేసే నౌఖరీలను సూపిస్తూ తన్నబట్టే. మాటలతోనే మాయ చేయ   వట్టె. ఈ యేడు ప్రకటన ఈయవట్టె. అచ్చెయేడు పరీక్ష బెట్టవట్టె. మనల్ని ఏదొక్కటి సక్రమంగా సదువుకుంట చేయవట్టె. ఉన్నోడు సంవత్సరాల కొద్ది పరీక్షలకు తర్ఫీదు తీసుకోవట్టె. ఇంకా ఉన్నోడు నౌఖర్లనే కొనుక్కోవట్టె. తినబోతే తిండికి, పండబోతే మంచానికి కరూవన్నట్లుగా మన బతుకులుండే. ఇంకేదన్న పన్జేసుకుందామంటే ఇంత సదువు సదివి నువ్ గిదేనా అని నలుగుట్ల నవ్వుల పాలైతమని భయమాయె. అదీగాక అదెప్పుడు పీకేస్తడో తెల్వదు. అంత చేయించుకుని ఆఖరికి జీతమిస్తడో ఎగ్గొడ్తడో తెల్వదు. గ తిప్పలేదో ముందుగనే పడితే తరువాత బేఫికర్ గా బతుకొచ్చు గదాని సదువూతాన్న. 'మరోసారి గిన్ని దినాలు ఆళ్ళను కట్టుబట్టి గసుమొంటి నౌఖరెట్ల చేసెదనిపిస్తది. సదువుకు తగ్గవి కాకున్న ప్యూన్ నౌఖరి కాడ్నుంచి అన్నింటికి అర్జీ పెడ్తున్న. పట్నంల బైట ఉండనీకి, తిననీకి పైసల్లేక నీ అలాంటి తెలిసినోళ్ళ సాయంతోటి క్యాంపస్ ల నాన్ బోర్డర్ గా ఉండవడ్తిని. మెస్ ల కేర్ టేకర్ గానికి కనిపించకుండ దొంగలెక్కన బతుకవడ్తిని. పండుగ లేదు. పబ్బం లేదు. అవ్వ లేదు. అయ్య లేడు. దినాము సదువులల్లే మునగవడితిని. నౌఖరొచ్చెదెన్నడు. మన బతుకు బతికేదెన్నడు. ఆళ్ళను సాకేదెన్నడు 'అంటూ గుడ్ల నీళ్ళు కక్కుకున్నడు నరహరి.  'ఇంటింటికి మంటిపొయ్యే అన్నట్లగా క్యాంపస్ ల ఆ చెట్ల క్రిందన కూసున్నోళ్ళందరి బతుకులు, ఈ యేడు పోతే ఆఖరికి నా బతుకు అంతే 'అంటూ నిట్టూర్చాడు యాదయ్య.'అది సరే గీ యాల ఈడ్నే పొద్దూకింది పద పద ఆ మెస్ లకు ఎవడు రాకముందే పోదాం. మెస్ టేకర్ గాడు అచ్చిండంటే మన కడుపు మాడుడే. 'అంటూ నరహరిని ఏగిరబెట్టిండు యాదయ్య. తప్పదన్నట్లుగా ఇంకా ఏదో ఆలోచిస్తనే లేచిన నరహరి తన తో పాటు యాదయ్య ఆ మెస్ వైపు సాగిపోయిండ్రు.  

        ఏదో తిన్నామా అంటే తిన్నమన్నట్లుగా కానిచ్చి తమ గది వైపు కదిలిండ్రు. మూలకున్న మడత కుర్చీని తీసి మంచం పక్కనే ఏసుకుని కూకున్నడు. సదివే బుద్దిగాకున్న ఏదో సదవాలన్నట్లు చేతిలకు ఓ పుస్తకం తీసుకున్నడు. పుస్తకం తెరిచిండన్న మాటే గాని కమ్మలైతే తిరుగుతలేవ్. యావ ఇంటిమీదికి పోయింది. పొద్దుగాల మాట్లాడుకున్న ముచ్చట్లే        నరహరి మదిల పెండల పురుగు మెసులుతున్నట్లు మెసులుతున్నయ్. సదువ బుద్ది గాక కుర్సిలకెళ్ళి లేచి పక్కెక్కి కళ్ళు మూసుకున్నడు. అయినా గా ముచ్చట్లే యాది కొస్తున్నయ్. నిద్ర పట్టక గడికో సారి అటూ ఇటూ బొర్రుతాండు. ఏ నడిజాము రాత్రో రవ్వంత సేపు కునుకు పట్టింది.  'అన్న... లే అన్న లే' అన్న యాదయ్య పిలుస్తుంటే 'ఏంది తమ్మి అట్ల చెవుగోసిన మేకలెక్కన అరుత్తానవ్' అంటూ నరహరి విసుక్కుంటూనూ పైకి లేచిండు నరహరి.  యాదయ్య మొగంల ఉన్న సంబురం చూసి 'ఏం తమ్మి ఏంది ముచ్చట. మాకూ జరంత చెప్పరాదు. మేం కూడ సంబుర పడతం' అంటూ విషయం అడిగాడు నరహరి. 'అన్నా, నీకు నౌఖరొచ్చిందే. పోయినేడు రాసిన పరీక్షల నువ్ పాసైనవ్. ఎల్లుండి ఇంటర్వ్యూలకు రమ్మన్నరు. గీ దినం నుంచి నీ కట్టాలన్నీ పోయినట్టే.' అంటూ పెద్ద చెరువు ముత్తడి పడ్డట్టుగా. యాదయ్య ఇంకా ఏదో జెప్తునే ఉన్నడు. నౌఖరొచ్చిందన్న మాట ఒక్కటే నరహరి చెవులకెక్కీంది. అంతే ఆ మాట తోనే మొఖం ఎన్టీపీసీ లా వెలిగి పోతాంది. జగాన్ని ఏలినంత సంబురం. గర్వంతో పొంగి పోతాండు. నోట్లకెళ్ళి ఒక్కమాట ఎల్తలేదు. భూమ్మీద కాళ్ళు నిలుత్తలేవు. కండ్లల నీళ్ళు ఆగుత లేవు. తలుడిగిన దూడలెక్కన మంచం కింద పెట్టిన సందుగ కాడికి ఉరికి దాన్ని తెరుచిండు. సర్టిఫికెట్లు వర్సలో సదురుడు మొదలు పెట్టిండు. రంగుల ఫోటోలు మంచివి ఉన్నయా లేవా అని పట్టిపట్టి సూత్తాండు.'అన్న ఇంటర్వ్యూ ఇయ్యాలగాదే' అంటూ యాదయ్య పరాచికాలడినా పట్టించుకోక తన పని తను చేసుకుంటున్నడు నరహరి. దినమంతా ఇంటర్వ్యూ గురించే ఆలోచనలు.  ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. అప్పటికే తయారై ఉన్న నరహరిని చూస్తూ 'అన్నా సూర్యుడు నడి నెత్తిమీద కొచ్చేదాంక పంటవ్. గీయాల అప్పుడే ముద్దుగ తయారైనవ్' అని యాదయ్య అంటుంటే 'తమ్మీ, అసలు రాత్రి నిద్రపోతే గదరా, పొద్దున్నే లేవనీకి' అని బదులిచ్చిండు నరహరి.  'ఇంటర్వ్యూ కాంగనే మొట్టమొదట నాయినకు ఫోన్ చేయాలే. నీ కొడుకు నౌఖరోడు అయ్యిండని  చెప్పాలే. లేదు లేదు అంటునుంచి అటే.. ఇంటికి పోయే చెపుతా' అంటూ చెప్తున్న నరహరిని చూసి మరేమి మాట్లాడలేదు. మెస్ వైపు నడుస్తున్న యాదయ్యని 'తమ్మీ, ఈ పొద్దు బైట తిందాం పదరా 'అంటూ ఉత్సహ పరిచాడు. ఇంటర్వ్యూ జరిగే చోటుకు దగ్గర్లో ఉన్న హోటల్ కి పోయి పూరీ చెప్పిండు. కుక్కలేవో తరిముతున్నట్లుగా అదరాబాదరాగా నాస్తా చేసిండ్రు. ఇంటర్వ్యూ హాలు వైపు పరుగులు తీసిండ్రు. 'అన్న నాకు జర పనున్నదే. ఇక్కడున్నట్లుగనే అస్త. నువ్ ఇంటర్వ్యూ కు పో. ఆడనే ఉండు' అంటూ తన పని మీద వెళ్ళిపోయాడు  యాదయ్య.  

        హాలు దగ్గర ఎవరూ లేరు. అక్కడే నేల సాఫు చేస్తున్న చప్రాసీల దగ్గరికి పోయి 'ఇంటర్వ్యూలు ఇక్కడ్నే గదా'అని అడిగాడు నరహరి. 'ఆ' అన్న మాటే మాట్లాడిండు. అవతలి మడిషి 'ఒక్క పురుగైనా లేరేంది' అని మరోసారీ అడిగాడు. 'నువ్ ముందొచ్చి ఎవలూ లేరేంది అంటవ్. ఇంకా షానా టైముంది పో పో' అని కసిరిచ్చుకున్నడు ఆ మనిషి.  ఆ పక్కనే కుర్సీలను జూసి బోయి కూర్చుండు. ఒక్కొక్కరు వచ్చి కూసుంటాంటే చూసి 'నౌఖరీల కోసం ఎంతమంది తండ్లాడుతాండ్లో' అనుకున్నడు. చిన్న పేపర్ కదిలినా వినబడేంత నిశ్శబ్దంగా ఉందా హాలు. నిమిషాలు యుగాలుగా నడుస్తున్నయ్. ఇంటర్వ్యూలు షురు ఐనయ్. నరహరిలోనూ ఏదో వణుకు మొదలైంది. మనిషికి కూకోను మనసైతలేదు. కాలు 

        నిలుత్తలేదు. గొంతుక ఎండుక పోతాంది. నుదుటన సెమట్లు పోత్తాన్నయ్. లోపలికెళ్ళి వాడిపోయిన మొగాలేసుకుని వచ్చేటోళ్ళను చూసినప్పుడల్లా గుండె దడ పెరుగుతాంది. నవ్వు మొగాలు వేసుకొచ్చేటోళ్ళను చూస్తుంటే నరహరి మొగంల ఆశల పూలు పూస్తున్నయ్. తన పేరు కోసం ఆత్రంగా చూస్తున్నడు. 'ఒకటి రెండు మూడు నాలుగు ఐదు' అంటూ నిమిషాలను లెక్కిస్తూ మునేళ్ళమీద నిల్చున్నడు. 'నరహరి' అన్న పిలుపు పూర్తి కాకుండానే లోపలికి పోయిండు.  

        -------------------------------------------------------------------

        యాదయ్య వచ్చేసరికి అక్కడెవరూ లేరు. అటూ ఇటూ చూసి అక్కడే ఉన్నతన్ని ఇవరం అడిగిండు.

        'ఇంటర్వ్యూ లై పోయినయ్ కదా: అంటూ ఆ మనిషి చెప్పిండు.  'అన్న నౌఖరచ్చిన సంబురంల తమ్మిని యాదిమరి సిండు. అయినా జల్దీగా ఇంటికి పోవాల్ననీ పొద్దు గాల్నే చెప్పిండు. క్యాంపస్ కాడికి గిట్ల పోయిండు గావచ్చు' అని తనలో తనే అనుకుంటూ క్యాంపస్ అంతా ఎల్లిపోయిన కొంప లెక్క నిశ్శబ్దంగా ఉంది.  పోరగాండ్ల నవ్వులు లేవు. పుస్తకాలసప్పుడు లేదు. యాదయ్య కి అంతా ఇసిత్రం గా ఉంది. అందరూ హాస్టల్ లోనీ ఓ గది వైపు నడు స్తుంటే యాదయ్య అటేపుగా పోయిండు. ఒక్కొక్కరిని తోసుకుంటూ ముందుకు నడిచిండు. క్లాస్ రూం ధర్వాజా దాంకా వచ్చిండు. అంతే ఒక్క అడుగ్గూడా ముందుకేయలేదు. చేతిల పొట్లం అట్లనే కింద పడ్డది.  అది చినిగి అందులోని జీలేబిలన్నీ బైటపడ్డయ్. అట్నీ చూస్తూనే పాతాళగంగలా గుండెల్లోంచి దుఃఖం పొంగుకొస్తుంటే ఆపుకోలేక పోతున్నడు. ఎక్కెక్కి ఏడుస్తూ కన్నీళ్ళతో తడీసిముద్ధై పోతున్నడు (? ). రెండు చేతులతో గుండెల మీద బాదుకుంటున్నడు. గొంతెండిపోయేలా అరుస్తున్నడు. 'తమ్మీ, నీ పేరేంది.  ఆ పొలగాడు నీకెరుకన.' అంటూ అప్పూడే అక్కడి కొచ్చిన పోలీస్ అడుగూతుంటే ఎరుకన్నట్లుగా తల ఊపిండు. గదిలో ఫ్యాన్ కు ఏలాడుతున్న మనిషిని దించిన్రు పోలీసులు. సార్, జేబులో ఏదో చీటీ ఉందని తీసుకొచ్చి ఎస్సైకి ఇచ్చిండు ఓ పోలీస్.  దాన్ని సదువుడు మొదలుపెట్టిండు ఎస్సై.  'అవ్వ నాయనకు.. మిమ్మల్ని నట్టేట ముంచి పోతున్నందుకు నన్ను మన్నించండి. నేను నౌఖరీ అత్త దని గియ్యాటిదాంక చూసిన. గియ్యాల ఆశలన్నీ సచ్చిపోయినయ్. చప్రాసి నౌఖరి మొదలు కొని పెద్ద పెద్ద ఉద్యోగాల దాంక పైసల్తోనే పని నడత్తాంది. పరీక్షల ప్రశ్న లడిగితే రాత్తగాని పైసలడిగితే ఏడ తేను. దేవునికి  ముడుపు కట్టేశక్తి ఉన్నా నౌఖరీ కోసం ఆళ్ళడిగే ముడుపులు చెల్లించే శక్తి లేదే నాయన'. 'నువ్ పడె కట్టం సూసుకుంటనే నిన్నెట్లడగను.  నేను పని చేయలేని చేతగాణ్ణి కాను. సదివిన సదువుకు తగ్గ పని లేదనే అసంతృప్తుణ్ణి. నిరాశ తోనో, అనాలోచితంగానో, ఆవేశంగానో నేనేం సత్తలేనే నాయిన. సదివి ఏం సాధించినవని అందరూ అంటంటే నేనినలేను. అందరి ముందుగల బేవార్స్ గాణి తీర్గ బతకలేను.  గందుకే మిమ్మిడిసిపోతున్న. నా లెక్కనే నౌఖరీ కోసం గబ్బిలాల్ల క్యాంపస్ పట్టుకుని ఏళ్ళాడుతున్న పోరగాళ్ళకు మన ఆశలన్నీ చెప్పేందుకే ఈ పనిజేత్తున్న. ఎస్కార్ట్ లతో, ఏసీ కార్లల తిరుగుతూ నోటికచ్చింది మాట్లాడి పబ్బం గడుపుకునే నాయకులు కళ్ళు తెరుత్తరని, నాలాంటోళ్ళ అరి గోసను అప్పుడైనా సూత్తరని ఆశతోనే నన్ను నేను బలిచ్చుకుంటున్న. నాయిన మీరైతే నన్ను యాది మరవకండి. బతుకంటూ మళ్ళా ఉంటే గప్పుడైనా నౌఖరచ్చేట్టు చేయమంటా గ దేవుడ్ని.

                                        ఇట్లు,   నరహరి.  

        కండ్ల నీళ్ళు తుడుచుకున్నడు ఎస్సై. పెద్దవ్వ కు నాయనకు నేనేం చెప్పాలే అని ఏడుస్తున్నే ఉన్నడు యాదయ్య.  

        *ప్రస్తుతం పోటీపరీక్షలకు సమిధలై, ఛిద్రమైపోతున్న నేటి యువత, వారి భవిత. వాటికి నిలువెత్తు దర్పణం ఈ కథ సజీవ సాక్ష్యం.  

        ------------------సమాప్తం----------------------

Lisää kommentteja

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)