అమ్మ నాకంటే చిన్నది  (Author: చి. లక్కవరపు చైత్ర వర్ణిత)

పొద్దున్నే నిద్ర లేపే అమ్మ చేతులు అంత చల్లగా ఉంటాయి ఎందుకో

రాత్రి ఫ్రిజ్ లో నాకోసం తయారు చేసి పెట్టిన ఐస్ క్రీమ్ వల్ల ఏమో

 

చెప్పిన పని చేయనప్పుడు

అమ్మ కళ్ళు ఎర్రగా ఉంటాయి ఎందుకో

జ్వరం వచ్చిన నా దగ్గర రాత్రంతా మెలకువగా ఉన్నందుకేమో

 

అమ్మ పొడుగాటి జుట్టు నెప్పుడూ మెలి తిప్పి ముడేస్తుంది ఎందుకో

నా బుద్దుల్ని దువ్వుతూ

అమ్మ సొంత దువ్వెన ఎక్కడో పారేసుకుందేమో

 

అమ్మ పొట్టలోంచి నేను బయటకు వచ్చేసినా

ఏదో బరువు మోస్తున్నట్టు అమ్మ చెయ్యి ఎప్పుడూ నడుం పై ఉంటుంది ఎందుకో

నా  ఫ్యూచర్ ని ఇప్పుడు వీపుపై మోస్తున్నందుకేమో

అమ్మ ఒక్క రోజు లేకపోతే

ఎంతో భయంగా, బెంగ గా ఉంటుంది

అమ్మ వాళ్ళ అమ్మని వదిలేసి 

ఎలా ఉంటుందో....

 

అమ్మని ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా...

'నువ్వే నా బంగారు తల్లివి' అని ముద్దు పెడుతుంది ఎందుకో

 

అమ్మ నా కన్నా చిన్నది!

Lisää kommentteja