సైతాన్ ఉరేసుకుంది  (Author: పల్లా వెంకట రామారావు)

ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించడమే కాదు

తమ సోదరసోదరీమణులకు సన్మానాలు కూడా చేస్తున్నాయి‌

తరగతి గదిలో ఉరితాళ్లు వేలాడుతున్నా చోద్యం చూస్తోన్న సమాజం

అంకెల గారడీ లో మునిగిపోతోంది మురిసి పోతోంది

ధనదాహంతో కళ్లను కాటేస్తున్న కనురెప్పలు

నీతులు బూతులైన వేళ 

దుష్టవ్వక్తిత్వాలకు ప్రతిభా పురస్కారాలు అందుతున్నాయి

జనాల బలహీనతను అందంగా క్యాష్ చేసుకుంటున్న

సాటి లేని నటశేఖరులు కొందరైతే 

శలభాల్లా మాడిపోటానికి సిద్ధమంటున్న కొందరు యువమూర్ఖులు

తోడబుట్టిన బంధాల కన్నా నకిలీ గౌరవాలకే ప్రాధాన్యం ఇస్తున్న వైనం

ప్రపంచీకరణ ప్రవాహంలో కొట్టుకుపోతున్న బంధాలు

కరెన్సీ నోట్ల లెక్కింపులో బిజీగా ఉన్నాయి

నాతిచరామి అన్న పదానికి అర్థం తెలియని బుర్రలు

క్షణికసుఖానికి జీవితాలను పణంగా పెడుతున్నాయి

సిగ్గూ శరాలను మాసిన వలువల్లా వదిలేసి

కుర్చీలను కావలించుకుంటున్న నాయకత్వాలు

మేధావితనం చేతులు ముడుచుకొని కూర్చుంటే

పనికిమాలినతనం పగ్గాలు తెంపుకుని వీరవిహారం చేస్తోంది 

ధనాన్వేషణలో బంధాలను బలిపెడుతున్న దృశ్యాలు

ఇప్పుడు వీధివీధినా సహజమైపోయిన వైనం

అరణ్యంకంటే భీతిగొలుపే జనారణ్యంలో 

మృదుత్వాలు అమాయకత్వాలు బ్రతికిబట్టకట్టవు

ఎదురుదాడే బ్రతుకు దారైన వేళ

వ్యక్తిత్వహననాలే ఆదర్శప్రాయంగా మారుతాయి

కన్న తల్లిదండ్రుల గుండెల్లో కత్తులు దింపుతున్న సంతానం

కన్నబిడ్డలనే పాముల్లా మింగుతున్న పితృత్వాలు మాతృత్వాలు

వర్తమానానికి సహజదృశ్యాలైన వ్యధార్థచిత్రాలను చూసి

ఇక నాతో వీళ్లకు పని లేదంటూ

సైతాన్ ఉరేసుకుంది

Añadir comentarios