సున్నితత్వపు పొరలు  (Author: అవ్వారు శ్రీధర్ బాబు)

అన్నీ స్టోరేజ్ అవుతూనే ఉంటాయి
మనసు సీసీ కెమెరాలో....
క్రియలన్నింటికి.. అది సాక్షిభూతం.

నీడై వెంటాడుతూనే ఉంటాయి
నీ అహిత కర్మలు.
మోదుతూనే ఉంటారు
నీ తలలోనే ఓ పదిమంది మొలకెత్తి....

నీ కళ్ళు వెలుగుతాయి.... ఇతరుల దీపాలనార్పి.
ఆసమయంలోనే.... నీ మనసు దీపం ఈసడించుకుంటున్న మొహంతో
నిరసన జండా ఊపుతుంది.

నీ కలల నిండా నిండుకొని
దిగులు చూపులు ఎక్కుపెడుతారు....
నీ చేతబడి ఊబిలో కూరుకుపోయిన వాళ్లు.

కొందరు ఇప్పుడే ఊపిరిని
గాలి లోపలకు తొక్కుతుంటారు....
నీతో సహవాసం విడిచిన వాళ్ళు.

నీ కోసమే కాపుకాచి చూస్తోంది....
అందరూ దూరమే ....
నైరాశ్యం దగ్గర అయ్యే కాలం.

సూర్యుడు కూడా
మధ్యాహ్నం తీక్షణకిరణాలు విసిరి
జనాలను వేసారేటట్టు చేశానేమోనని
సాయంత్రం కల్లా తనపనికి
సిగ్గుపడి దాక్కుంటాడు
పశ్చిమ దిక్కులో.......

అడుగంటిన సున్నితత్వపు పొరలను గీసీ గీసీ
కుప్ప పోసి మనసులోకి
కూరాల్సిన సమయమొచ్చింది.


 

Añadir comentarios