లక్ష్యం చేరిన గమ్యం  (Author: యలమర్తి అనూరాధ)

లోయల్లోంచి ఎతైన ప్రదేశాలకు వెళ్ళటమన్నా అక్కడ కనిపించే అందాలను సందర్శించటమన్నా 'గమ్య' కు ఎంతో ఇష్టం. చిన్నప్పుడు తండ్రి తనను ఎక్కువగా అలాంటి ప్రదేశాలకే విహార యాత్రలకు తీసుకు వెళ్ళేవారు. అక్కడ కనిపించే ప్రకృతి, ఆ అనుభూతి మామూలుగా చూసే దాని కంటే వెయ్యి రెట్లు ఆనందాన్ని ఎక్కువగా ఇచ్చేది. అదేమిటో 'అభయ్' ని పెళ్ళి చేసుకున్నాక అలాంటి వాటికి దూరమయ్యింది. తిరుమల వెళదామంటే 'కాళహస్తి' వెళదామంటాడు. ఊటీ వెళదామంటే 'ఉహూ' అన్నదే అతని సమాధానం. కారణం మాత్రం చెప్పడు. అలాగే కాలం గడిచిపోయింది. ఎప్పుడైనా మరీ ఎక్కువ కోరికగా అనిపిస్తే అలాంటి వాటికి స్నేహితులతో, సోదరుల కుటుంబాలతో వెళ్ళి వచ్చేది. దానికి మాత్రం అడ్డు చెప్పేవాడు కాదు. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండి చూసిరా అని తన పూర్తి సహకారాన్ని అందించేవాడు. తను నాతో ఉంటే అదో అందం. బెంగ ఉండదు. అదే తనని, పిల్లలని వదిలేసి వస్తే మనస్పూర్తిగా ప్రకృతిలో లీనమవ్వలేక పోతోంది. అభయ్ ఎలా ఉన్నాడో? పిల్లలు ఏం చేస్తున్నారో? తనని బాగా ఏడిపిస్తున్నారేమో? వాళ్ళతో ఎలా అవస్థలు పడుతున్నాడో? ఇలా ఏవేవో ఆలోచనలు ఆహ్లాద వాతావరణాన్ని ఆనందింప చేయకుండా అడ్డుకునేవి. చివరకు అభయ్ లేకుండా తను ఎక్కడికీ వెళ్ళకూడదు అనుకునేలా ఆ ఆలోచనలతో వెళ్లి తిరిగి వచ్చేది. అసలు నువ్వు ఎందుకు రానంటావ్? అని అభయ్ ని నిలదీసేది. అతని నుంచీ మౌనమే సమాధానమయ్యేది. ఎప్పటికీ అతని దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం ఉండదా? ఆలోచనల ప్రవాహంలో ఎంత కొట్టుకు పోయినా చివరకు తీరం చేరవలసిందే అన్నట్లు మళ్ళీ 'సంసారం' దగ్గరే తేలేది 'గమ్య' అగమ్యంగానే!

ఇలాగే పాతిక సంవత్సరాలు అభయ్ తో గడిపేసానని తలచుకుంటుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదో చిదంబర రహస్యంగా తన జీవితంలో నిలిచిపోతుందా? దీనిని తను ఛేదించలేదా? మనసును ఎన్నో సార్లు ప్రశ్నించుకుంది. మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదంటారుగా. మరి తానెందుకు ఆ ప్రయత్నం చెయ్యకూడదు? అవును.. అభయ్ ఎలాగూ ఆ విషయం గురించి అడిగినా చెప్పడు. తనే తెలుసుకోవాలి. సినిమా కెళ్ళినా బాల్కనీకి వెళ్ళటానికి ఇష్టపడడు. అక్కడైనా ఇక్కడైనా ఒకటే. డబ్బు లెక్కువ పెట్టి పైకి వెళ్ళటం అవసరమా అనేవాడు. బాల్కనీ క్రిందే కదా మనం కూర్చునేది. అదీ నిజమే కదా అని తను పట్టించుకునేది కాదు.

ఇప్పుడు అదే తన శోధనకి మొదటి మార్గం అనిపిస్తోంది. పైకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి. అవును. ఎక్కడ మెట్లు ఎక్కాల్సి వచ్చినా ఇలాగే కుంటి సాకులు చెప్పి వద్దంటున్నాడు. అదే కారణమై ఉంటుంది. ఫ్లాష్ లా మెరిసిన ఆ ఆలోచన మెరుపులా ఆమెలో ఉత్సాహాన్ని నింపింది. అంటే ఎత్తు ఎక్కాలంటే భయపడుతున్నాడా?

ఏ ఊర్లో ఇల్లు తీసుకోవాల్సి వచ్చినా క్రింద భాగమే తీసుకుందామనేవాడు. గాలీ, వెలుతురూ బాగా వస్తాయని తను మొదటి అంతస్తు లో ఉందామనేది. ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. క్రింద ఉన్నంత హాయి మరి దేనిలోనూ లేదు అనేవాడు. ఇక అతను వద్దన్నాక తనకు తప్పేది కాదు. ఇక ఆ విషయం గురించి ఆలోచించేది కాదు. ఇప్పుడు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని విశ్లేషించుకుంటుంటే అన్నిటికీ సమాధానం ఒక్కటే. ఆ ఒక్కటి ఇన్నాళ్ళూ తనకు అర్ధం కాలేదు. ఇప్పుడు అర్ధమవుతోంది. అంతే తేడా.

అభయ్ దగ్గర ఈ రహస్యాన్ని బయట పెట్టింది.

"అబ్బే! అలాంటిదేమీ లేదు గమ్యా! నా కిష్టముండదు. అంతే!" అంటాడు.

ఇష్టం లేదని చెప్పకనే చెబుతున్నాడు. అర్ధమవుతోంది. అవును తనకు తెలిసింది సగం మాత్రమే. ఆ మిగతా సగాన్ని కూడా తెలుసుకుంటే మొత్తం సమస్య విడగొట్టవచ్చు. తేలికగా పరిష్కారాన్ని పొందవచ్చు అనుకున్నాక కానీ 'గమ్య' ప్రశాంతంగా నిద్ర పోలేక పోయింది.

 * * *

"అభయ్! ఈ ఆదివారం మా పెదనాన్న గారి అబ్బాయి 'శుభకర్' అని చెబుతాను చూడు అతను మన ఊరు వస్తున్నాడు ఏదో మీటింగ్ కోసమని. అదేదో హోటల్ పేరు చెప్పాడు. అక్కడ దిగుతానని అన్నాడు."

 "గమ్యా! మనం ఉండగా అక్కడెక్కడో హోటల్ లో దిగటమేమిటి? మనింటికి రమ్మను. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమని నేను చెప్పానని చెప్పు" అంటూనే కోటు వేసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే 'శుభకర్' ని ఇంటికి వచ్చేయమని గట్టిగా చెప్పింది. వస్తానని ఒప్పుకునే దాకా ఊరుకోలేదు. ఎవరికి వారు దూరంగా బంధాలను తెంచుకుంటూ అనుబంధాలను వదిలేస్తూ యాంత్రికతకు ప్రాధాన్యమిస్తూ అందమైన అనుభూతులకూ ప్రేమకూ దూరమౌతున్నారన్న బాధను కాస్త తగ్గించింది శుభకర్ వస్తానని ఒప్పుకున్నాక.

 * * *

అనుకున్నట్లే ఆ ఆదివారం ఉదయాన్నే 'శుభకర్' విమానం లో ప్రయాణం చేసి రెక్కలు లేని పక్షి అయిన తను రెక్కలున్న పక్షి లాంటి దాంట్లోంచి ఊడి పడ్డానని రాగానే జోక్ చేసాడు.

"భలే చెప్పావన్నాయ్యా! రా! రా! లోపలికి!" అంటూ ఆహ్వానించింది గమ్య.

 వేడివేడిగా పెసరట్టు, ఉప్మా, అల్లంపచ్చడి తో చేసి పెట్టింది.

"ఇంత రుచిగా తిని ఎన్నాళ్ళయిందో?" అంటూ ఇంకొకటి కావాలి అని అడిగి మరీ వేయించుకున్నాడు.

"ఇది మీ చెల్లిల్లు. ఏమీ మొహమాట పడక్కరలేదు. అడిగి మరీ చేయించుకొని తినండి" అన్నాడు అభయ్.

"అలాగే బావగారూ! మా చెల్లి దగ్గర నాకు మొహమాటం ఎందుకు? పేరుకు పెదనాన్న కొడుకునే కానీ చిన్నప్పటి నుంచీ బాగా కలిసి ఉండేవాళ్ళం. నన్ను అందరూ గమ్య కు సొంత అన్నయ్యని అనుకునేవారు"

"మరి ఇకనేం?"

"అవును బావగారూ.. మీకు పుస్తకాలు అంటే ఇష్టమా?"

"ఆఁ అవును. చాలా ఇష్టం. అందుకే ఒక గదిని అంతా దానికే కేటాయిస్తాను"

"ఈ ఊర్లో గ్రంధాలయం ఎక్కడ ఉంది?"

"సెంటర్ లోనే ఉంది."

"మరి మీరు ఎక్కువ వెళుతూ ఉంటారా?"

ఇష్టమే కానీ వెళ్లేంత తీరిక ఉండదు. కోర్టులు, కేసులు. దీనితోనే సమయం గడిచిపోతుంది. లాయర్ ని కదా. కాస్తో కూస్తో సమయం దొరికితే నా దగ్గరున్న పుస్తకాలతో కాలక్షేపం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు కొంటూనే ఉంటాను. అది నా హాబీ"

"ఓ.. మంచిదే. పుస్తకాలు కొనేవారు లేరనే రచయితలు మీ లాంటి వారిని చూస్తే  ఆనందపడిపోతారు"

"హఁ హఁ హఁ!" అని నవ్వేసాడు అభయ్.

"గమ్యా! నేను వెళ్ళొస్తాను. కాస్త ఆలస్యమైనా కంగారు పడకు" అంటూ బయట పడ్డాడు శుభకర్.

అతని కాళ్ళు గ్రంథాలయాన్ని చూడాలని తపన పడుతున్నాయి మరి.

"మీటింగ్ కి ఆలస్యమౌతుందేమో?" అంతరంగం హెచ్చరించింది. అదీ.. ఇదీ.. రెండు పన్లూ కానిచ్చేద్దాం. ఏం కాదు. అని సమాధానమిచ్చుకున్నాడు. ఆ రెండు రోజులూ అభయ్ ని వదల్లేదు. ఏవేవో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. ఓపికగా సమాధానాలు చెప్పాడు అభయ్. ఎంతైనా బావమరిది కదా! అతను బాధ పడితే గమ్య కూడా బాధపడుతుంది అనే సంస్కారంతో. అదీ అతిథులను గౌరవించటం మన సాంప్రదాయం కదా అనే భావన అభయ్ ది.

అయితే గమ్య ఇల్లు నా ఇల్లే! నా సొంతమే అనేది శుభకర్ ది. పిలవకుండా వచ్చే స్వతంత్య్రం ఉన్నా పిలిస్తే వచ్చే ఆనందంలో ఉండే కిక్కే వేరు. అందుకే అది కూడా అందుకునే వచ్చాడు. దీనినే అంటారు కాగల కార్యం గంధర్వుడే తీర్చాడు అని. అవన్నీ ఒకటొకటిగా గుర్తు వచ్చి నవ్వుకున్నాడు శుభకర్. "వచ్చిన పని అయిపోయింది. నీ కోరికా తీరింది. ఇక నే వెళ్ళిరానా?" అడిగాడు శుభకర్ గమ్యను. "సరే అన్నయ్యా! వీలయినప్పుడల్లా వస్తూ ఉండు. ఫోన్ లో మాట్లాడుకుందాం. ఇక్కడ నిన్ను ప్రేమించే చెల్లి ఉందని మాత్రం గుర్తు పెట్టుకో" అంటూ సాగనంపింది.

 * * *

"గమ్యా! ఏమిటి శుభకర్ ఫోను చేస్తున్నాడా?"

"ఆఁ! చేస్తున్నాడు తరచుగానే. మనింటికి వచ్చి వెళ్లినప్పటి నుంచీ తన కెంతో బాగుందట. మీ దాంపత్యం బాగుంది. పిల్లలు 'మామయ్య' అని పిలుస్తుంటే కడుపు నిండిపోయింది అనుకో. అదీ కాకుండా నీ రుచులతో నా మనసును కూడా నింపేశావు అంటూ ఒకటే చెబుతున్నాడు. చాలు అన్నా ఆపటం లేదు."

"పోనీలే. మన వల్ల ఒకరు సంతోష పడుతున్నారంటే మనకూ సంతోషమేగా"

"అవును అభయ్!" అంది అది తనకూ ఎంతో ఆనందాన్నిస్తోంది అన్నట్లుగా.

"సరే! కోర్టులో ఈ రోజొక ముఖ్యమైన కేసు ఉంది. అది ఎటు మలుపు తిరుగుతుందో అని భలే ఉత్కంఠగా ఉంది. మరి నే వెళ్ళిరానా?"

"అలాగే!" అంది.

అందరూ భర్తలను 'ఏవండీ' అని పిలుస్తారు. తనకెందుకో అది మొదటి నుంచీ ఇష్టముండేది కాదు. అందుకే పేరు పెట్టి పిలిచేది. అందరూ మొగుడ్ని పేరు పెట్టి పిలుస్తోంది. ఇదేం విడ్డూరం అని వింతగా చెప్పుకున్నా అభయ్ కి అభ్యంతరం లేనప్పుడు మిగతా వాళ్ళను పట్టించుకోవాలనిపించలేదు. అంతే! అలా పిలవటం అలవాటయిపోయింది. అలా పిలుస్తుంటే.. భగవంతునిలా తనకు అభయం ఇచ్చేవాడుగా అభయ్ కనిపిస్తాడు. అది ఎంతో ధైర్యాన్నిస్తోంది. తను లేని జీవితాన్ని తాను ఎప్పుడూ ఊహించుకోదు.

 పెళ్ళయ్యాక రోజు రోజుకీ తమ అనుబంధం పెరుగుతోందే కానీ తరగటం లేదు. వివాహ బంధం గొప్పతనం అదే కదా!

'అభయ్! నా అభయ్!' మనసులోనే అలా ఎన్నిసార్లు అనుకుందో ఆమెకే తెలియదు.

కాలింగ్ బెల్ మ్రోగటంతో ఈ లోకంలోకి వచ్చి "ఎవరు వచ్చారు ఈ వేళలో!" అనుకుంటూ తియ్యటానికి వెళ్ళింది గమ్య. తను అనుకున్న గమ్యానికి చేరువవుతోంది మరి.

 * * *

"గమ్యా! ఈ సెలవులకు'అరకు'వెళదామా?" అడిగాడు అభయ్. ఆశ్చర్యపోవటం ఆమె వంతయింది.

"నిజమేనా? జోకా?" అంది అతన్నే వింతగా చూస్తూ!

"పెళ్ళైనప్పటి నుంచీ అడుగుతున్నావ్. నీ కోర్కె తీర్చనే లేదు. ఇప్పుడైనా.." అంటూ ఆపేసాడు.

"తప్పకుండా వెళదాం. మీతో 'అరకు' అందాలను పంచుకుంటానంటే నా కాళ్ళు నేల మీద నిలవటం లేదు."

"అదే ఈ సారి మన మేరేజ్ డే కానుక నీకు"

"ఓ థాంక్యూ అభయ్!" అంటూ రెండు చేతులూ అతని మెడకు దండగా వేస్తూ గట్టిగా ముద్దిచ్చింది చిన్న పిల్లలా.

"హుష్! పిల్లలు చూస్తారు!" అన్నాడు అటూ ఇటూ చూస్తూ. ఆ ఆనందంలో అలాంటివేమీ పట్టించుకోవాలని లేదు గమ్యకు. అభయ్ కి కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచీ మెట్లు ఎక్కాలంటే భయం. ఎత్తు ప్రదేశాలకు వెళ్ళాలన్నా భయమే. అందుకే వాటికి దూరంగా ఉంటూ వచ్చేవాడు. ఈ విషయం 'గమ్య' కు చెప్పేవాడు కాదు. చెప్పాలనిపించేది కాదు. విషయం తెలిస్తే అందరూ తనను ఎగతాళి చేస్తారేమోనని మనసులోనే మథనపడేవాడు. ఈరోజుల్లో ప్రతి జబ్బుకు మందు ఉంది అని తెలిసినా ప్రయత్నించలేదు. తన జబ్బు మానసికం అని తెలుసు. దానికి వైద్యం సైకియాట్రిస్టుల దగ్గర దొరుకుతుందనీ తెలుసు. కానీ అక్కడకు వెళితే తనను పిచ్చివాడనుకుంటారని భయం.

మన శరీరంలో ఏ భాగానికి ఇబ్బంది కలిగినా ఆసుపత్రికి ఆలోచించకుండానే వెళ్ళిపోతాం. కళ్ళకు వస్తే కళ్ళ డాక్టరు దగ్గరకు, గుండెకు వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరకు అలా.. కానీ మనసు వ్యాధికి మాత్రం ఎంతో ఆలోచిస్తాం. అడుగు ముందుకు వెయ్యలేం. అదేమీ తప్పు కాదని తెలిసినా. అందుకే తన జబ్బును తానే పోగొట్టుకోవాలనుకున్నాడు. రోజూ ధ్యానంలో తన మనసుకు తనే సలహాలు ఇచ్చుకునేవాడు. తాను ఎత్తును చూసి భయపడనని. అది క్రమంగా తనలో మార్పును తెస్తోంది అని గ్రహించి దానినే అవలంబించాడు. ఫలితం ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా తనకేమీ అనిపించటం లేదు. అది తను సాధించిన విజయం అనుకున్నాడు అభయ్. కానీ అతనికి తెలియని విషయం మరొకటుంది.

 

 * * *

గమ్య అనుకోకుండా ఒక పుస్తకంలో ఒక వార్త చదివింది. "నలభై సంవత్సరాలుగా మెట్లే ఎక్కలేదీయన.. కారణం?" అని. దానికీ తన భర్త అభయ్ కీ ఏదో దగ్గర సంబంధం ఉన్నట్లనిపించింది. దానితో ఉత్కంఠగా చదవటం ప్రారంభించింది. "మన్మధుడు" సినిమాలో నాగార్జున నీటిని చూస్తే "అమ్మో! నాకు భయం" అంటూ.. కళ్ళు మూసుకుని బ్రిడ్జి దాటే సీను మీకు గుర్తుందా? అదో ఫోబియా. మానసిక వైద్య పరిభాషలో ఈ ఫోబియాను "ఆక్వా ఫోలియా" అంటారు. అలానే ఎత్తులంటే భయపడే ఫోబియా కూడా ఒకటుంది. దీనిని "ఆక్రో ఫోబియా" అని అంటారు. ఇలాంటిదే మరో విచిత్రమైన ఫోబియా ఉంది. దీన్ని "ఫియర్ ఆఫ్ స్టెయిర్స్" అంటారు. తానొక మానసిక వ్యాధితో బాధపడుతున్నానన్న విషయం తనకు తాను గుర్తించలేక, తనకున్న భయాన్ని ఎవరితోనూ పంచుకోలేక లింకన్ షైర్ కు చెందిన ఓ మంచి రచయిత, యాభై రెండు సంవత్సరాల వయసు గలిగిన రిచర్డ్ గత నలభై సంవత్సరాలుగా మెట్లు ఎక్కడానికి భయపడుతూ.. వీలయినంతవరకూ వాటిని ఎక్కకుండా తన జీవితాన్ని గడిపేసాడు. ఎత్తుగా ఉండే ప్రదేశాలకు కూడా అతను వెళ్ళడు ఆ భయంతోనే. వెన్ను లోంచి వణుకు వస్తుంది అతనికి వాటిని చూస్తేనే. అది తెలిస్తే జనాలు పరిహసిస్తారనే భయంతోనే అతను ఆ విషయాన్ని దాచేసాడు. చివరకు అతని భార్యే అతన్ని సైకియాట్రిస్ట్ కి చూపించి ఆ వ్యాధిని పోగొట్టింది. మన చుట్టూ ఉన్న వారిలో నూటికి డెబ్భై మంది ఏదో ఒక మానసిక జబ్బుతో బాధపడుతూనే ఉంటారు. చికిత్స ద్వారా వదిలించుకునే ప్రయత్నం మాత్రం అందరూ త్వరగా చేయరు అన్నది అందులో సారాంశం. అది చదివాక 'అభయ్' విషయం పూర్తిగా అర్ధమయ్యింది.

'సైకియాట్రిస్ట్' దగ్గరకు వెళదామా అని సూచించింది.

ససేమిరా అన్నాడు. ఎంత అడిగినా ఒప్పుకోలేదు. ఇక తన భర్తకు చెప్పినా లాభం లేదని తనే ఏదో పథకం వెయ్యాలనుకుంది. అలాగే చేసింది.

అందులో భాగమే 'శుభకర్' ఆగమనం. ఒక మనిషిని మార్చటానికి తన కాలాన్ని వెచ్చించటానికి ఒప్పుకున్న గొప్ప సైకియాట్రిస్ట్. గ్రంథాలయం మొదటి అంతస్తులో ఉండటం వల్లనే అభయ్ అక్కడకు వెళ్ళటం లేదని గ్రహించాడు శుభకర్. దానితో విషయం అంతా అర్ధమయ్యింది. అభయ్ కి ట్రీట్మెంట్ ప్రారంభించాడు. మామూలుగా మాట్లాడుతున్నట్లే అభయ్ దగ్గర మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అతనిచ్చిన మందులను ప్రొద్దున టీ లో కలిపి ఇచ్చేది. అలాగే రాత్రిపూట నిద్ర పోయే ముందు కూడా పాలలో కలిపి ఇచ్చేది గమ్య. ఇలా త్రాగితే మీకు నిద్ర బాగా పడుతుందని అభయ్ ని నమ్మించింది. అలా వారిద్దరూ పడ్డ శ్రమ ఫలించింది. దానికి తోడు అభయ్ సంకల్పం కూడా బలాన్ని చేకూర్చింది. అలా గమ్య తన గమ్యాన్ని చేరుకుంది.  ఇప్పుడు అభయ్ భుజం మీద తలవాల్చి అరకు అందాలను ఆనందంగా తిలకిస్తోంది.  మరి పేరుకు తగ్గట్టు ఇప్పుడు అభయ్ భయం లేని అభయ్ కదా!

 సమాప్తం

Añadir comentarios

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)