మా ఊరు
మా ఊరు (Author: చైత్ర వర్ణిత)
మా ఊరు
కాలుష్యం లేని పల్లెటూరు!
కలిసి మెలసి ఉండే మనుష్యులే
అవుతారు ఎదురు!
పూసిన మామిడి పునాస...
మా ఊరి మట్టి వాసన!
మా ఊరు
కొబ్బరి తోటల గుబురుల్లో
కూసే కోయిల!
తోటి పిల్లలతో హాయిగా ఊగే ఊయల!
చుట్టూ గోదావరి గల గల
మా ఊరు
పట్నం పక్కనే
ఉన్న పచ్చని పొలం!
బాలయోగి వారధి దాటగానే
ఊరి పొలిమేర పలకరింపు పరిమళం!
దారంతా పలకరించే
కొబ్బరి చెట్ల నేస్తాలు!
షేక్ హ్యాండ్ ఇచ్చే
వంగిన మామిడి కొమ్మలు!
మా ఊరి గోదారి ఒడ్డునే
చేపల గంపలు
ఆరోగ్యాన్ని అమ్ముతాయి
పులస కోసం పుస్తెలు
అయినా అమ్మమంటాయి
మర్యాదల్లో మారాజు
మా ఊరు
కోడి పందాల్లో కోనసీమ
జోరు
మా ఊరి
పొలాలు
ఊరి జనం ఆకలి తీర్చడానికి
రోజంతా పని చేస్తూనే ఉంటాయి
మా ఊరి కొబ్బరి చెట్ల గాలిలో
గుడి సుప్రభాతం
చర్చి గంటల శబ్దం కలిసి వినిపిస్తాయి!
మా ఊరు ఇప్పుడు
చదువులకు
పట్నం వచ్చేసిన మాకు
సమ్మర్ స్పాట్!
మా నాన్న బాల్యాన్ని గుర్తు చేసే
పడవ!
మా అమ్మ నవ్వుల్ని పూసే చెట్టు!
మా అమ్మానాన్నతో
మా ఊరు వెళితే...
వృద్ధ గౌతమీ పక్కనే
చిన్నప్పుడు నాన్న ఆడిన ఆటలు కనిపిస్తాయి!
మా వీధి వెంట వెళుతుంటే
అన్ననూ, నన్నూ ఆడించిన
పెద్దనాన్న ప్రేమ నవ్వులు
పదే పదే గుర్తుకొస్తాయి!
మేమొస్తే సంబర పడే
బంధు జనం ఆప్యాయత
మరీ మరీ మురిపిస్తుంది!
నన్ను ఎత్తుకు కూర్చున్న అరుగుపై
తాతయ్య కుర్చీ
చేతులు చాపి నన్ను పిలుస్తుంటుంది!
నాకెంతో ఇష్టమైన
మా ఊరు మురమళ్ళ
చుట్టూ గోదావరి పరవళ్లు!