మారిన శీతాకాలం

నవంబర్ నెల...ఎముకలను కొరుకుతోంది చలి. ఉదయం 6 గంటలు అవుతున్నా ఇంకా తెలవారలేదు, మంచు దుప్పట్లోనే ఉన్నాడేమో సూరీడు మరింతగా బద్దకిస్తున్నాడు.

తలపై నుండి కొంగు పరచుకుని  హాస్టల్ ఆరుబయట రెండు కట్టెెల పొయ్యిల పైన పెద్ద పెద్ద గంగాళాలలో నీళ్ళు కాచుతోంది అలిమేలు... అలిమేలు ఆ హాస్టల్ ఉద్యోగిని కాదు. పక్కింటి అమ్మాయి.

గోపీ కళ్ళు నులుముకుంటూ "అలిమేలక్కా అప్పుడే వచ్చేశావా..." అంటూ ఆమె పక్కనే పీటపై కూర్చుని పొయ్యి మండుతుంటే చలి కాచుకుంటున్నాడు. గోపీ కి పదేళ్ళుంటాయి. ఆ హాస్టల్ లో ఉండే ఆరవ తరగతి విద్యార్థి.

ఇంతలో నోట్లో బ్రష్ వేసుకుని పళ్ళు తోముకుంటూ "ఈ..." అంటూ నవ్వుతూ వచ్చి పొయ్యి కి కాస్త దూరంలో రాతిపైన కూర్చుంటూ "ఉదయాన్నే మా హాస్టల్ వాకిట్లో పూసే గోగు పువ్వువే అలిమేలు నువ్వు..." అన్నాడు రెడ్డెప్ప.

అతని మాటలన్నా, చూపులన్నా భలే చిరాకు అలిమేలుకి.

"గోపీ...రాత్రి దొంగ పిల్లి ఇంట్లో కి రావాలని ప్రయత్నించిందా గౌరన్న దుడ్డు కర్రతో ఒక్కటిచ్చాడు... కాలు విరిగి అది అరుచుకుంటూ బయటకు వెళ్ళింది తెలుసా..." నీకూ అదే గతి అన్నట్లు రెడ్డెప్ప ను చూస్తూ అంది.

తూ... అంటూ నోట్లో ఉన్న పేస్టును పక్కన ఉమ్మి విసురుగా లోపలికి వెళ్ళి పోయాడు రెడ్డెప్ప.

అది చిత్తూరు జిల్లా లోని ఒక మండల కేంద్రం లోని బాలుర సంక్షేమ వసతి గృహం. అందులో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకునే పాతిక మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ వార్డెన్ రెడ్డెప్ప మదనపల్లి వాసి ఇక్కడే హాస్టల్ లోనే ఉంటాడు. సెలవులు ఎక్కువగా పెట్టడు. మంగమ్మ, గౌరి ఇద్దరూ ఆ ఊర్లో వాళ్ళే వంట చేసే టైంకు వచ్చి గదులు ఊడ్చి, ఉదయం ఏదైనా టిఫిన్ రాత్రి భోజనం వండి పెట్టి వెళ్ళి పోతారు. మధ్యాహ్నం పిల్లలకు వాళ్ళు చదువుకునే బడిలోనే భోజనం ఉంటుంది. బడి హాస్టల్ కు చాలా దగ్గర లోనే ఉంది.

భోజనం పర్వాలేదు బాగానే దగ్గరుండి చేయిస్తాడు రెడ్డెప్ప.  తను కూడా అదే తినాలి కదా మరి. హాలు వంటగది కాకుండా మరో మూడు గదులు ఉంటాయి. ఒక గది పూర్తిగా రెడ్డెప్ప వాడుకుంటాడు. ఆఫీస్ వర్క్ కోసం తను రెస్ట్ తీసుకోవడం కోసం. ఇంక మిగిలిన  మరో రెండు గదులలో విద్యార్థులందరూ సర్దుకుని వాడుకుంటారు. 

పురాతన భవంతి అది. కిటికీ తలుపులు ఎప్పుడో విరిగి పోయి సగం సగం ఉంటాయి. ఎండ, వాన, చలి యదేచ్ఛ గా లోపలికి వస్తాయి. ఎండాకాలం ఓకే... చలికాలం లో చలిగాలులు, వర్షాకాలం లో వాన జల్లులతో చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. కిటికీలు బాగు చేయించడు కానీ ఏదో గోనే పట్టలను కాస్త అడ్డుగా పెడతాడు రెడ్డెప్ప. బలంగా చలిగాలి వీస్తే ఆ గోనెపట్టాలు కూడా కిందకి జారిపోతాయి. ఆరోజు చలితో పిల్లలకు జాగరణే... ఇంక ఉదయం స్నానం మంచి నీళ్ళు. బకెట్లో చేయి పెడితే జివ్వు మంటుంది ఇంక ఒంటిపై ఆ నీళ్ళేం పోసుకోగలరు పిల్లలు. ఏ నాలుగు రోజులకో ఒకసారి ఒంటిపై నాలుగు చెంబులు కుమ్మరించుకుని లోనికి పరుగులు తీస్తారు. వాళ్ళల్లో ఉన్న చిన్న పిల్లలయితే వారానికి ఒకసారి మాత్రమే స్నానం. ఇలా స్నానం చేయకుండా ఉండేదాని వల్ల కొద్ది మందికి చర్మ వ్యాధులు కూడా వచ్చాయి. 

వాళ్ళ అవస్తలను పక్కింటి అలిమేలు రోజు చూస్తూ ఉన్నందు వల్ల వాళ్ళ కోసం ఏదైనా చేయాలని హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తో వాళ్ళ హాస్టల్ పెరట్లోనే ఇటుకలతో రెండు పొయ్యిలు తానే స్వయంగా తవ్వుకుని ఉదయం 6 గంటల నుండి నీళ్ళు కాచి ఇస్తుంది. ఇలా రెండు ట్రిప్పులు కాచుతుంది. పిల్లందరూ ఉదయం వరుసగా ఆ వేడి నీళ్ళతో ఇప్పుడు స్నానం చేస్తున్నారు.

7గంటల కంతా ఈ కార్యక్రమం అయిపోతుంది. 

ఏడు గంటల నుండి తన ఇంట్లో పనులు చేసుకుని వంట కూడా వండుకుని తన భర్త గౌరన్న తో కలిసి పొలం పనులకు పోతుంది అలిమేలు. సాయంత్రం తిరుగు ప్రయాణం లో తాటి మట్టలు, కంప చెట్లు ఇవన్నీ పోగుచేసుకుని ఇంటికి తెచ్చుకుంటారు. గౌరన్న తెచ్చిన వంట చెరకు తమ ఇంటికి వాడుకుంటే అలిమేలు తెచ్చింది హాస్టల్ పిల్లలకు నీళ్ళు కాచేందుకు ఉపయోగిస్తుంది. గౌరన్న ఇంట్లో పనిలో అలిమేలుకి బాగా సాయం చేస్తాడు.

అలిమేలు కు 18 సంవత్సరాలు వయసుంటుంది గౌరన్న కు 23 ఏండ్లు. వాళ్ళకు ఈమధ్య నే పెళ్ళయింది. పక్క ఊరే అలిమేలుది. రెండు కుటుంబాలు పేదరికం లోనివే. గౌరన్న అమ్మ ఆ ఊళ్ళోనే పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది.

గౌరన్న కు అలిమేలంటే చాలా ఇష్టం. కారణం అలిమేలు చామనఛాయగా ఉన్నా అందంగా ఉంటుంది... అందమే కాదు అణకువ, అంతే కాకుండా వంట కూడా బాగా చేస్తుంది. ఉన్నంతలో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుంది. తనతో పనికి వచ్చి కష్టపడడం గౌరన్నకు ఇష్టం లేదు. కానీ అలిమేలే వెళ్తుంది కాస్త ఆర్థిక సాయంగా ఉంటుందని. 

ఇంత పని చేసుకుంటూ కూడా అలిమేలు హాస్టల్ పిల్లల బాధ చూడలేక వేడి నీళ్ళు కాచివ్వడం కూడా చేయడం గౌరన్న కు గొప్పగా అనిపిస్తుంటుంది.

తమకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలనే మనస్తత్వం గౌరన్నకు అలిమేలుకు ఇద్దరికీ ఉండడం యాదృచ్ఛికమే. అందుకే వాళ్ళ జంట ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. కలసి ఇంట్లో పని చేసుకుని కలసి బయట పనులకు వెళ్ళడం...ఉన్నంతలో సంసారాన్ని గుట్టు గా సాగిస్తున్నారు.

ఈ క్రమంలో సంక్రాంతి సెలవులు ఇచ్చారు. పిల్లలందరూ వాళ్ళ ఊర్లకు ఆనందంగా బయలు దేరారు. వాళ్ళ పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళను తీసుకుని పోయారు.

**************************

పిల్లలు ఊర్లకు వెళ్ళాక ఏమీ తోచేది కాదు అలిమేలుకి. పిల్లలందరూ తనతో బాగా మాట్లాడుతారు 'అలిమేలక్కా' అంటూ. 

పది రోజులు ఆనందంగా కుటుంబం తో గడిపి మళ్ళీ హాస్టల్ కు వచ్చేటప్పుడు అలిమేలు కోసం పువ్వులు, పండ్లు, మిఠాయిలు ఇలా చిన్న చిన్న బహుమతులు తెచ్చి ఇచ్చారు పిల్లలు.

వద్దంటున్నా ఇంట్లో కి వచ్చి మరీ ఇచ్చి వెళ్తుంటే వాళ్ళ ప్రేమకు ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గోపీ గాడైతే తన రెండు చేతుల నిండా సంపెంగ పూలు తెచ్చి ఆమె ఒళ్ళో పోశాడు. వాడి బుగ్గ పైన ముద్దు పెట్టుకుంది అలిమేలు.

పండుగ నెల పూర్తవగానే కాస్త చలి తగ్గింది. పిల్లలే ఇంక వేడి నీళ్ళు వద్దనగానే ఆ పని ఆపింది అలిమేలు.

అయినా కూడా గోడ అవతల నుండి అలిమేలుతో పిల్లలు ప్రతిరోజూ మాట్లాడే వాళ్ళు.

****************************

మరో మూడు నెలలకు పెద్ద పరీక్షలు వచ్చాయి. తరువాత వేసవి సెలవులు... అనంతరం పిల్లలు మళ్ళీ హాస్టల్ కు కాస్త బద్దకంగా, కాస్త కన్నీళ్ళతో వచ్చారు. ఈసారి సెలవులు నెలపైనే కదా, అందుకని ఇంటితో బంధం ఎక్కువగా పెనవేసుకు పోయింది వాళ్ళను. ఆ బాలుర సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులు అందరూ బాగా పేద వాళ్ళు. వాళ్ళను ఇంట్లో ఉంచుకుని చదివించే శక్తి లేని చుట్టు పక్కల ఉన్న ఊళ్ళలోని పిల్లలే వాళ్ళందరూ.

అలిమేలు గౌరన్నకు పెళ్ళయి ఏడాదైన శుభసందర్భంగా ఆమె కడుపుతో ఉందనే వార్త మరింత ఆనందాన్ని ఇచ్చింది గౌరన్నకు... అలిమేలును మరింత బాగా చూసుకోవాలనే తపనతో తాము ఇన్నాళ్ళు కూడబెట్టుకున్న డబ్బు తో ఇంకాస్త బాంక్ లోన్ తీసుకుని ఆటో కొన్నాడు. పూర్తిగా పొలం పనులకు వెళ్ళడం ఇద్దరూ మానేశారు. ఇప్పుడు హాయిగా ఆటో నడుపుకుంటున్నాడు.

అలిమేలుకి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అలవాటు లేని పని. వేరే ఏ పనికి వెళ్ళాలన్నా గౌరన్న ఒప్పుకోడు.

ఏదో ఒకటి చేయాలని పట్టుదలగా ఉన్న అలిమేలు ఆలోచనలకు ఒక రూపం వచ్చింది. త్వరగా వంట చేసి ఎదురింటికి వెళ్ళింది. తన ఈడు పిల్లే రాజీ ఉంటుంది ఎదురింట్లో వాళ్ళ అమ్మ నాన్నలతో... ఇంటర్ వరకు చదువుకుని ఆపేసింది రాజీ. అలిమేలుతో స్నేహంగా ఉంటుంది. రాజీ ఇంట్లోనే పూసలతో ఆర్టిఫిషియల్ జ్యువలరీ చేసి దగ్గర ఉన్న షాపులకు ఇచ్చి వస్తుంటుంది. అప్పుడప్పుడు అలిమేలు కూడా ఆమె చేసే పని చూస్తూ ఉంటుంది. కాస్త ప్రయత్నం కూడా చేసింది నేర్చుకోవడానికి.

ఇప్పుడు గట్టిగా నేర్చుకోవాలనే వెళ్ళింది. రాజీ ఆమెకు బేసిక్స్ నుండి చిన్నగా నేర్పించడం మొదలు పెట్టింది. చెవులకు జూకాలు, కమ్మలు, మెడకు హారాలు, గాజులు ఇలా ఒక్కొక్కటిగా పది రోజుల్లోనే పట్టుదలగా నేర్చుకుంది. రాజీ ఏ షాప్ కి వెళ్ళి కావలసిన మెటీరియల్ తెచ్చుకోవాలో, తయారు చేసినవి ఏ ఏ షాపులకు వేయాలో కూడా చూపించింది. అలిమేలు 7వ తరగతి వరకు చదువుకుంది. తెలుగు చదవడం బాగా వచ్చు. ఇంగ్లీష్ మాత్రం బోర్డ్ లపై ఉన్న పేర్లు చదవడం వరకు వస్తుంది.

స్వయంగా మెటీరియల్స్ తెచ్చుకుని చేత్తోనే అందమైన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చేస్తోంది అలిమేలు. కొద్దిగా సంపాదన పరురాలయింది. ఇంట్లో నే ఉంటూ ఇలా పని చేయడం చాలా హాయిగా అనిపించింది అలిమేలుకి. హాస్టల్ పిల్లలు ప్రతి రోజు వచ్చి పలకరిస్తుంటారు లేదా పిట్టగోడకు అవతలి నుండి మాట్లాడుతారు.

గౌరన్న క్రమం తప్పకుండా ఆటో నడుపుతున్నాడు. ఆటోకి తీసుకున్న బ్యాంకు లోను కూడా తీరుస్తున్నాడు. ఇంట్లో కి చిన్న చిన్న వస్తువులు కూడా కొంటున్నాడు. తమ ఇంట్లో కి రాబోయే పాపాయికి ఆహ్వానం పలికేందుకు.

*******************************

ఆరోజు కాస్త పెందలాడే ఇంటికి వచ్చాడు గౌరన్న. గౌరిని చెకప్ కోసం ఆసుపత్రికి తీసికెళ్ళాలని.              

ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చి భోజనాలు ముగించి పడుకున్న వెంటనే తలుపు కొట్టిన చప్పుడు కు లేచారు.

బయట హాస్టల్ పిల్లలు...

"అలిమేలక్కా వార్డెన్ సర్ కి బాగా లేదు..." అంటున్న వాళ్ళ మాటలకు హడావుడిగా గౌరన్న అలిమేలు హాస్టల్ లోకి వెళ్ళారు.

రెడ్డెప్ప చలిజ్వరంతో వణికిపోతున్నాడు. గౌరన్న ఆలస్యం చేయకుండా రెడ్డెప్ప ను తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. పరీక్షల్లో అతనికి డెంగ్యూ జ్వరమని తేలింది. ఆసుపత్రిలో నే రెండు రోజులు ఉండవలసి వచ్చింది. ఆ రెండు రోజులు గౌరన్న రెడ్డెప్ప దగ్గరే ఉండి అతన్ని ఆత్మీయంగా చూసుకున్నాడు. అలిమేలు, వంటచేసే మంగమ్మ ఇద్దరు హాస్టల్ లో పిల్లలను చూసుకున్నారు.

తిరిగి ఇంటికి వచ్చిన రెడ్డెప్ప అలిమేలు కు గౌరన్న కు కన్నీళ్ళతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

*******************************

మళ్ళీ నవంబర్ నెల వచ్చింది తనతో పాటుగా చలి కాలాన్ని తీసుకుని వచ్చింది. అలిమేలుకు ఇప్పుడు 6వ నెల... అయినా హాస్టల్ పిల్లలకు రెండు పొయ్యి లు వెలిగించి నీళ్ళు కాగపెట్ట సాగింది. 

ఇంతలో రెడ్డప్ప అక్కడికి వచ్చాడు. "ఎందుకు అలిమేలు నీకు ఈ శ్రమ...నువ్విప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదు...ఈ చలిలో నువ్విలా అవస్థలు పడొద్దు..."

"పర్లేదు లెండి సర్... కష్టం ఏమీ లేదు... నా తమ్ముళ్ళకు అయితే ఈ మాత్రం పని చేయనా..."

"వద్దు... వద్దు.. ఈ పనికి నేనే ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాను లే... చెల్లెలాంటి దానివి. నువ్విలా శ్రమ పడుతుంటే చూడలేను అలిమేలు... నన్ను మన్నించు..." అంటూ రెండు చేతులు జోడించి లోపలికి వెళ్తున్న రెడ్డెప్ప ను చూస్తుంటే అతని మాటల్లో నిజాయితీ కనిపించింది అలిమేలుకు...

ఏదో ఒకరోజు మనుషులు ఇలా మారవలసిందే...మార్పు రాకుంటే మానవ జన్మకు సార్ధకత లేదు... అని మనసులో అనుకుంటూ ఆరోజుటికి పిల్లలకు నీళ్ళు కాచి ఇచ్చింది.

******************************

మరుసటి రోజు ఉదయం 6గంటలకు పిట్ట గోడ నుండి హాస్టల్ లోకి తొంగి చూసింది. అక్కడ వంట చేసే మంగమ్మ పిల్లల కోసం నీళ్ళు కాస్తూ కనిపించింది. పర్లేదు రెడ్డప్ప మారాడు అని కచ్చితంగా నిర్ణయానికి వచ్చింది అలిమేలు...

శీతాకాలం చలిగాలులు జివ్వుమని తగులుతుంటే ఇంట్లో కి వెళ్ళిన అలిమేలుకి ఇప్పుడు మనసంతా వెచ్చగా, హాయిగా అనిపించింది...

(సమాప్తం)

Añadir comentarios