భారతంలో గాంధారి పాత్ర  (Author: కాశీనాధుని రాధ)

 

“యది హాస్తి తదన్యత్ర

యన్నే హాస్తి న తత్ క్వచిత్”

- అంటే “ఇందులో ఉండేది ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఎక్కడా లేదు.”

గ్రంధం మహాభారతం. కర్త  వేదవ్యాసుడు.   ప్రపంచంలో ఏ కవి/రచయత చేయని సాహసపూరితమైన ప్రకటన ఇది.

అందుకే నేమో “ప్రపంచంలో నీకు ఒక్క పుస్తకాన్ని మాత్రమే  రక్షించుకునే అవకాశం ఉంటే దేన్ని ఎంచుకుంటావంటే “మహా భారతాన్ని” అన్నాడుట ఒక పాశ్చాత్యుడు.    మరి ఈ గ్రంథం ఎలాంటిది?

“ఏయది హృద్య, మపూర్వం

                బేయది, ఎద్దానిని వినిన ఎఱుక సమగ్రం

                బై యుండు, అఘ నిబర్హణ

                మేయది, అక్కథయ వినగ నిష్టము మాకున్

– అని శౌనకాది మునులు అడగగా పరమ పౌరాణికుడైన సూతుడు చెప్పిన బృహత్  కథ ఇది.  వేలాది సంవత్సరాల నాటి  ఈ గ్రంథంలో  క్లిష్టమైన కథావస్తువు, సన్నివేశాలు, పాత్రలే కాకుండా అనేకమైన ధర్మాలు, శాస్త్రాలు, నీతులు, హితోక్తులు  నిండిఉన్నాయి.  వీటిని అర్థం చేసుకోవటానికి జీవితకాలం సరిపోదు.  సరిపోయింది అనుకుంటే అది సత్యం కాదు.  ముగించిన మర్నాడే మరో కొత్త అర్థం గోచరిస్తుంది. ఇక్కడ నేను కొత్తగా  చెప్పబోయే విషయాలు ఏమి లేవు. అన్నీ మీరు విన్నవే, మీరు చదివినవే.  ఒక్కసారి పునశ్చరణం చేసుకుంటున్నాం అంతే.   ఇందులో  కవిత్రయ విరచిత ఆంధ్ర మహాభారతాన్ని, నాకు అందుబాటులో ఉన్నంత వరకు వ్యాసభారతంలో ఉన్న వివరాలను ఆధారం చేసుకుని చెబుతున్న మాటలు.  సినిమాలలో, లోక ప్రచారంలో ఉన్న కథా విశేషాలను ఇక్కడ ప్రస్తావించడంలేదు.   యయాతి కథలో దేవయాని,శర్మిష్టలు, దుష్యంతుడి కథలో శకుంతల, శంతనుడి కథలో గంగాదేవి, మత్స్యగంధి, ధృతరాష్ట్రుడు, పాండురాజుల కథలో గాంధారి, కుంతి - వీరందరినీ పరిశీలిస్తే, ఆదిపర్వం లో కథలకు స్త్రీ పాత్రలు ఊపిరి పోస్తున్నాయి అన్న విషయం విశదం అవుతుంది.  

ఇక అసలు విషయానికి వద్దాం.  వెయ్యి ఏనుగుల బలం కలవాడు, కళ్ళులేకండానే కథని నడిపించిన చతురుడు, కౌరవసామ్రాజ్య చక్రవర్తి (ప్రజ్ఞాచక్షుండు)అయిన ధృతరాష్ట్రుని భార్య, రోషమయ మహాతరువు, అసూయాగ్రస్తుడు, దురహంకారి,కుటిలుడు, మహాబలుడు అయిన దుర్యోధనుని తల్లి అయిన “గాంధారి” పాత్ర గురించి. 

పాత్ర పోషణ అనే మాట మనం ఎప్పుడూ వినేదే.  కథలో అయితే కవి/రచయత పోషిస్తాడు.  నాటకంలో అయితే కథని ఆధారంగా పెట్టుకుని పాత్రధారి తన పాత్రని పోషిస్తాడు, కొన్ని సార్లు మెరుగులు పెడతాడు.  మంచి పాత్రధారిని “వాడు ఆ పాత్రలో జీవించాడు” అంటాం.  నిజానికి మనం చేసేది కూడా అదే .  మన పాత్రని  మనం పోషించడమే జీవితం.    ఇంగ్లీషు భాషలో “evolve” అనే మాటను  వాడతాం.  అదే అర్థంలో  వివిధ సన్నివేశాల్లో సంఘటనలలో ప్రయాణిస్తూ, ఈ  పాత్ర తాను ఏ విధంగా రూపు దిద్దుకున్నది అన్నది చూద్దాం.

          ముందరే చెప్పుకున్నాం కదా ఇది చాలా విస్తృతమైన కథ.  ఈ కథలో గాంధారి మనకి ఏ సందర్భాలలో కనబడుతుందో , ఎలా కనబడుతుందో చూద్దాం.  ఆయా సందర్భాలలో ఆవిడ గుణవిశేషాలను లెక్కపెడుతూ వెళదాం.

        సభాపర్వంలో  గాంధారి గురించి ఒక చక్కటి మాట చెబుతారు నన్నయ.  “భానుమతీ ప్రభృతి స్నుషా పరివృతయయి, తారా పరివృత యయి యున్న రోహిణియుం బోలె నున్న గాంధారీదేవికి, వినయంబున, అనుజ సహితుండయి ధర్మజుడు మ్రొక్కె,  ..” ( వెలుగులు చిందే నక్షత్రాల మధ్య దేదీప్యమానమైన రోహిణీ నక్షత్రంలా ఉన్నది) ఇది కవి కుంచె విసిరితే పుట్టిన “స్నాప్ షాట్”  నిజంగానే .. నేను ఇప్పుడే మీకు మహారాజ్ఞి గాంధారిని చూపించేశాను.

అత్తవారింట అడుగుపెట్టిన నాటి నుంచి కురుక్షేత్ర యుద్ధం ముగిసి, ధర్మరాజు పట్టాభిషేకం అయ్యేదాకా, కురుసామ్రాజ్య పట్టమహిషిగా వెలిగిన రాణి.  గాంధార రాజు సుబలుడు ఈ విషయాన్ని తన ముందుచూపుతో గ్రహించే కాబోలు పుట్టు గుడ్డివాడైనా ధృతరాష్ట్రుణ్ణి  తన కుమార్తెకు తగిన వరునిగా ఎంపిక చేశాడు.  తండ్రి నిశ్చయించిన ఈ వివాహం గురించి విన్న బంధుజనం ”ఇదెక్కడి విడ్డూరం” అని  చెవులు కొరుక్కున్నారు.  వారి మాటలు విన్న గాంధారి “నా తల్లిదండ్రులు నాకొరకు ఎంపిక చేసిన  ధృతరాష్ట్రుడే  నాభర్త” అని, అసూయకు అతీతంగా జీవించ నిశ్చయించుకుని నేత్ర పట్టమును కట్టుకుంది.  ఈ నిర్ణయమే గాంధారికి  జీవితకాల నియమం అయింది. వివాహానికి ముందే  కళ్ళకు గంతలు కట్టి,  భవిష్యత్తులోకి ప్రయాణం కట్టింది  ధీరవనిత గాంధారి.  కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం, అచంచలమైన దీక్ష, ఆత్మవిశ్వాసం అన్న లక్షణాలు ఇక్కడ కనబడతాయి.

వందమంది పుత్రులకి జన్మనిస్తుందని గాంధారి జాతకంలో ఉన్నది.  వివాహానతరం గాంధారి గర్భవతి అవుతుంది.  తన కంటె ముందుగా ధర్మరాజును పొందిన కుంతిని చూసి, అసూయతో మనసు మండి, కడుపు బాదుకోగా  గర్భచ్యుతి అవుతుంది.  ఆమెలో మానవ సహజమైన “అసూయ” ఈ సమయంలో కనబడుతుంది.  

క.     దాని నెఱింగి పరాశర

సూనుఁడు చనుదెంచి సుబలసుతఁ జూచి “మనో

హీనవయి గర్భపాతము

గా నిట్టుల సేయు టిదియుఁ కర్తవ్యంబే?  

 - ఆంధ్రమహాభారతం. ఆది. పంచ.99

        క.     ఇమ్మాంసపేశి నేకశ

తమ్ముదయింతురు సుతులు ముదమ్మున నిది త

థ్యమ్మింక నైన నతియ

త్నమ్మున రక్షింపు దీని నా వచనమునన్  .  ( ఆంధ్రమహాభారతం. ఆది. పంచ.100 )

ఈ విధంగా వ్యాసుడు మందలించి, ముక్కలైన పిండాన్ని కుండల్లో భద్రపరచి జాగ్రత్తగా కాపాడుకోమని హెచ్చరించి వెళతారు.  కొంతకాలానికి భీమసేనుడితో సమవయస్కుఁడైన దుర్యోధనునితో మొదలు పెట్టి నూరుగురు కొడుకులు ఒక కూతురు జన్మిస్తారు. 

అటుతరవాత మనం ఆమెను చూచేది  సభాపర్వంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సందర్భంలో.  ప్రాతికామి వెనుక సభను ప్రవేశించిన ద్రౌపది ధృతరాష్ట్రునికి సమీపంలో నిలుస్తుంది.  అప్పుడు దుర్యోధనుడు “ ఈ ప్రాతికామి వృకోదరునికి భయపడుతున్నాడు.  నీవు ఆ ద్రౌపదిని సభా మధ్యంలో కి తీసుకురా” అని ఆజ్ఞాపిస్తాడు.   

ఆ.     “నిర్దయాత్ముఁ  బాపనిరతు దుశ్శాసను

పనుచు టెరిగి, కృష్ణ ,పంకజాక్షి

కడు భయంబు నొంది, గాంధారి యొద్దకు

నరిగె కడునడంగి రయమున.                     ( సభా. ద్వితీయా. 213)

ఇక్కడ విషయం వివరంగా చెప్పలేదు. కాని

        చ.     తడయక కౌరవానుజుఁడు దాని పిఱుందన పాఱి “యింక నె

                క్కడ కరుగంగఁ బోలు? జులుకం జనుదెమ్మిట; సౌబలుండు ని

                న్నొడిచె దురోదరంబునఁ  గురూత్తము నర్థమ వైతి; నిన్నునుం,

బుడమిని, దమ్ముఁ  గోల్పడిరి పొల్తి!భవత్పతులైన పాండవుల్.”  (214)

గాంధారి  చెంతన నిలుచున్న ద్రౌపదిని “నిన్ను శకుని జూదంలో గెలిచాడు.  నీ భర్తలు,నిన్ను,రాజ్యాన్ని,తమను కూడా జూదంలో కోల్పోయారు.  ఇప్పుడు నీవు దుర్యోధనుడి సొత్తువు అయ్యావు. ఇంక ఎక్కడకు వెళతావు? మాటాడక  ఇటు రా! “ అంటూ  గాంధారి ఎదుటనే దుర్భాషలాడుతూ దుశ్శాసనుడు, “బలాత్కారంబున” ఆమెను లాక్కువెళ్ళాడు  అన్న  విషయం స్పష్టంగా చెప్పబడింది.

ఈ సన్నివేశంలో గాంధారి, ఇంటి యాజమానురాలిగా, మహారాణిగా పోషించ వలసినది - ఉదారత, గంభీరత, రాచరికపు అధికారము.  కానీ గాంధారి ఈ పరీక్షలో పూర్తిగా విఫయలురాలైంది.  మరెందుచేతో?  దైవనిర్ణయం కాబోలు.  ఇక్కడ కళ్ళకు కాదు మనసుకి, హృదయానికి, అంతకు మించి బాధ్యతకూ గంతలు కట్టుకుంది.   తనను సమీపించిన ద్రౌపదిని రక్షించక ఉదాసీనత వహించింది.  దానికి ఫలితమే  కౌరవవంశ వినాశనం.

ద్రౌపదీవస్త్రాపహరణ  ప్రయత్నం, అంక పీఠం మీద కూర్చోమని ద్రౌపదిని దుర్యోధనుడు  ఆహ్వానించడం,  భీముడి భీషణ ప్రతిజ్ఞలు - ఈ విషయాలు  తెలుసుకున్న గాంధారి,  విదురుణ్ణి  వెంటపెట్టుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి సంగతి చెప్పింది.  అంతఃపురంలో  దుశ్శకునాలు పుట్టాయి,  కొడుకుని పిలిచి మందలించమని భర్తకు కర్తవ్యబోధ చేస్తుంది.

అటు తరవాత దుర్యోధనుడు  పునర్ ద్యూతం కోరుతాడు.  పుత్రుని ఆలోచనలు  వంశక్షయ కారకాలు. “దుర్యోధనుడిని వదిలేసి అయినా కులాన్ని రక్షించు “ అని ధృతరాష్ట్రుడికి  హితబోధ చేస్తుంది. భర్తను సక్రమమార్గంలో నడపే  బాధ్యతను నిర్వహించి, యాజమానురాలిగా తన ధర్మాన్ని పాటించింది.

ఉద్యోగపర్వం లో సంజయడు పాండవులతో  రాయబారం నడిపి వస్తాడు.  కౌరవసభలో  పాండవుల సందేశాలను వినిపిస్తాడు.  గర్వాంధుడైన దుర్యోధనుడు సంధికి అంగీకరించడు.  ధృతరాష్ట్రుడికి కళ్ళు గుడ్డివి కాని, మనసు, బుధ్ది గుడ్డివి కావు.   కాని వాటి నిండా ఉన్నది  స్వార్థం  మాత్రమే.   అన్ని  సంగతులు  విని కూడా “మన కౌరవులు పాండవులను జయించలేరంటావా?” అని  సంజయుడిని అడుగుతాడు.  ఆ ప్రశ్నకు తెల్లబోయిన  సంజయుడు ఇక లాభం లేదు అని, కులానికి పెద్ద, హితాభిలాషి అయిన వ్యాసుడిని , ఇంటి యజమానురాలు, విజ్ఞురాలు గాంధారిని  పిలిపించు, వారి  ఎదుట దీనికి సమాధానం  చెబుతాను అంటాడు.  వారిద్దరిని పిలిపించి,  “శ్రీకృష్ణుని అండదండలున్న  పాండవులకి  విజయం తప్పదు” అంటాడు.   ఈ సందర్భంలో గాంధారి   “ దుర్యోధనా! నువ్వు తెలిసి ఎందుకు చావు కోరుకుంటావు? నీ  అవినీతిని మాని పాండవులతో సఖ్యం  చేసుకో “ అని కొడుక్కి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. 

కృష్ణరాయబార సందర్భంలో దుర్యోధనుడు అందరూ చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టి, ఆగ్రహంతో తన బలగంతో సభకు కొంత దూరంగా నిలబడుతాడు.  శ్రీకృష్ణుడు, “పూర్వం నేను కంసుడిని సంహరించి, మా వంశాన్ని రక్షించినట్టే, ఈ దుర్యోధనుడిని తొలగించి వంశాన్ని కాపాడు” అంటాడు.  దానికి గుడ్డిరాజు అదిరిపడి, విదురుని తో “బుద్ధిమంతురాలు పొందుగ పలుకంగ నేర్చు” అని గాంధారిని పిలిపిస్తాడు.  ఆమె చాకచక్యం మీద నమ్మకం, ఆమె తల్లిగా కొడుక్కి నచ్చచెబుతుందనే ఆశ, తనకి ఉన్నట్టుగా లోకాన్ని నమ్మించటం అతని ఉద్దేశ్యం.  ఇక్కడ ధృతరాష్ట్రుడికి పాండవులకు రాజ్యభాగాన్ని ఇచ్చే అధికారం ఉంది.  కాని తనపుత్రులకే రాజ్యం దక్కాలనేది అతని స్వార్థం.   అలా వచ్చిన గాంధారి నిర్మొహమాటంగా “నన్నేం చెప్పమంటావు?”   “ఈవు పాండవులకున్  ఏమిచ్చితేనిన్  ఎవ్వరికి అడ్డపడవచ్చు చెపుమ” అని భర్తకి చురక పెడుతుంది.  

యుధ్ధానికి బయలుదేరుతూ కురురాజు “తల్లి! దీవెన యిమ్ము  జయము గాన్ “ అడిగినప్పుడు.  ధర్మచింతన కల గాంధారి, పుత్రప్రేమని పక్కకు పెట్టి, “ కొడుక! ఎక్కడ నుండ ధర్మము అక్కడకు జయము సేరున్ “ అని అంటుంది.   అంతేకాక “యుధ్ధంలో వెనుదిరిగితే అపకీర్తి.  అంతకంటే మరణం మేలు. యుధ్ధవీరునిగా జీవించి స్వర్గలోక సుఖాన్ని పొందు.” అని క్షత్రియ మాతగా దీవిస్తుంది.

ఆమె నిష్పక్షపాత బుధ్ధిని మెచ్చుకుంటూ ..

నీ కెనవచ్చు రాజ రమణిన్ ధర నేఁడు గంటిమే? నృపా 

నీకము వించు నుండ, సుతునిం  దగు పల్కుల నంత యొత్తుదే?

నా కది సిక్కె చిత్తమున నాటి,  ప్రియం బగుచుండు నిప్పుడున్

  • సాక్షాత్తూ శ్రీ కృష్ణుడే  గాంధారితో  అన్న మాటలు  ఇవి.

స్త్రీ పర్వంలో పుత్రులకి అగ్ని కార్యాలు నిర్వహించడానికి,  సంజయునితో యుధ్ధభూమి చేరుకుంటారు గాంధారి ధృతరాష్ట్రులు.  అక్కడకు  తమను సమీపించబోయే ధర్మరాజుని ఆమె  శపించబోతుంది.  అసూయను వదలు, శాంతురాలివి కమ్ము - అని వ్యాసుడు నివారిస్తాడు. 

దానికి ఆమె “ నాకు అసూయ లేదు. దుఃఖంతో మనసు వికలం కాగా అలా ప్రవర్తిం చాను.  ఈ పాండవులు కుంతికి ఎలాగ కుమారులో నాకు అంతే. 

నాకు కలిగింది అసూయ కాదు ఆగ్రహం.  ఈ కృష్ణుడు చూస్తూ ఉండగా నాభి క్రిందుగా కొట్టి దుర్యోధనుణ్ణి  చంపటం నియమ నిబంధనలను ఉల్లంఘించటం కాదా?  ఇది వీరుల లక్షణమా? దుర్యోధనుడు దుష్టుడే అయినా  న్యాయం మరిచి తొడలు విరుగగొట్టాలా?  మరి దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రాక్షసుడిలా రక్తం తాగుతాడా భీముడు?  - అని అడుగుతుంది.  భీముడు(సంజాయిషీ ఇచ్చుకుంటాడు) తన ప్రతిజ్ఞలను వివరించి, నెత్తురు తాగటం కేవలం అభినయమే అని చెబుతాడు. 

అంతటితో ఆగలేదు వరసపెట్టున  ప్రశ్నలన్నీ భీముణ్ణి నిక్కచ్చిగా అడిగింది. “ వందమందిలో ఒక్కరైనా మీకు అపకారం చేయనివాడు లేడా? ఒక్కడిని మాకోసం వదిలిపెడితే మీ అన్న ఏకచ్ఛత్రాధిపత్యం గా భూమిని ఏలకుండా  అడ్డుపడతాడా?  అసలు ఆ ధర్మరాజెక్కడ?” అని కటువుగా అడుగుతుంది.  ధర్మరాజు “ ఇంతటి దారుణకాండ జరగడానికి బాధ్యుణ్ణి నేనే నన్ను శపించు- అంటాడు.  అనుకోకుండా వచ్చిన ఆ సమాధానానికి  అవాక్కై కఠినమైన దీర్ఘ నిశ్వాసం విడుస్తుంది.   ఆమె కంటికి కట్టిన గంతలలోనుండి ప్రసరించన చూపులకి ధర్మరాజు కాలిగోళ్ళు కందిపోయాయి.

ఇంతలో తనని సమీపించిన ద్రౌపదిని కౌగలించి, “మనిద్దరం పుత్రులందరిని కోల్పోయి ఒకే బాధను అనుభవిస్తున్నాం.  ఇదంతా నేను నాకుమారుల  దుర్మార్గాన్ని ఆపలేకపోవడం చేతనే.”  – అంటూ సానుభూతితో బాటు తన అసమర్థతని వ్యక్తం చేస్తుంది.

వ్యాస భాగవానుడి వరప్రభావంతో యుధ్ధ భూమిలో వున్న సమస్త వస్తువులనీ కంటికి గంతలు ఉండగానే చూడగలుగుతుంది. ఇది  ఒక రకంగా ఆమెకు శాపం.  ఎందుకంటే ఏ తల్లి  అనుభవించకూడని దారుణమైన, దయనీయమైన అనుభవానికి గురి అవుతుంది. 

అంతఃపుర స్త్రీలు, బంధువులు తమ వారిని, నిజానికి వారి శరీర భాగాలను వెదుకుతుండగా చూచే ఇలాంటి క్రూర స్థితి నాకు వచ్చిందంటే పూర్వజన్మలో నేను చేసుకున్న పాపమే.  తొడలు విరిగి నెల కూలిన దుర్యోధనుడి శరీరాన్ని చూసి

“పదకొండు అక్షౌహిణుల సైన్యం కలవాడు ఒంటరిగా గదాయుద్ధం చేస్తూ మరణించాడు.  భూమి మీద పడిఉన్న అతని మీద వీస్తున్నవి  సుందరీమణులు వింజామరల కావు.  రాబందుల రెక్కల గాలులు.  ధృత రాష్ట్రుడికి ఎవరూ లేరన్న దుఃఖం నాకు తప్పేది కాదు.  నా మాట ఎలా ఉన్నా, కోడలి బాధను ఎలా చూచి సహించగలను?  సుయోధనుడు తల్లినైన నన్నుగురించి గాని,నా కోడలిని గురించి గాని ఆలోచించకుండా తాను మాత్రం స్వర్గం చూసుకున్నాడు. నా గుండె ఇనుప గుండె ఇది బద్దలు కాదు.” అంటూ కుమిలిపోతుంది.

అక్కడినుండి కదిలి రణరంగాన కూలిపోయిన తన కుమారులని, అనేక మంది కౌరవవీరులను  ఒక్కొకరి “నీ చూపిస్తూ ఇదంతా నీ ఘనకార్యమే కదా ?” అని కృష్ణుణ్ణి ఎత్తిపొడుస్తుంది. 

అటుతరవాత ఉత్తరకుమారుడు,కర్ణుడు, బాహ్లీకుడు ఎలావున్నారో వర్ణిస్తూ, తలలేని సైంధవుని శరీరాన్ని చూస్తుంది.  అంతలో తన ఒక్కగానొక్క కూతురు దుస్సల ఏడవడం కూడా మరిచి, భర్త తల కోసం పిచ్చిదానివలె తిరుగడం చూసింది.  ఆ దుస్సల యుధ్ధానికి ముందు, కౌరవపక్షాన యుధ్ధం చేయవద్దని ఎన్నివిధాల భర్తకు నచ్చచెప్పిందో గుర్తుతెచ్చుకుంది.  “అభిమన్యుడి మరణానికి సైంధవుడిని మాత్రం కారణంగా చూపి, అతనిని చంపడానికి అర్జునుడు ప్రతిజ్ఞ చేయడం ఎలా న్యాయం?” అని ప్రశ్నిస్తుంది.  “పలువీరులు చుట్టుముట్టితే మరణించాడు అభిమన్యుడు.  దానికి చెల్లెలి భర్త అన్న దయ కూడాలేకుండా సైంధవుడిని  కారణంగా చంపడం అది సబబేనా?   బాలుడైన అభిమన్యుడు ముందు వెనుకలు చూడక వ్యూహంలో చొరబడం ఎంత సమంజసం?” అంటూ యుధ్ధన్యాయాన్ని, నియమాలని  సమగ్రంగా పరిశీలించి ప్రశ్నిస్తుంది.

తన సహోదరుడు శకుని కళేబరాన్ని చూసి దుఃఖపడదు, జాలిపడదు. నీచుడు, మాయావి తన బిడ్డలను  తప్పుదారి పట్టించాడని  అని న్యాయం చెబుతుంది.  

చివరికి – శ్రీకృష్ణుడితో – “భీష్మద్రోణాది మహావీరులు దేవతలనైనా నాశనం చేస్తారే కాని నీవు, నీ తమ్ముడు సాత్యకి, పాండవులు ఏ అపాయం లేకుండా ఎలా బయట పడ్డారు? అని, వెంటనే “అయినా భాగవంతుడు చేయలేని పని లేదు కదా? “– అంటూ విధి నిర్ణయానికి  విజ్ఞానంతో తలవంచుతుంది. 

“రాయబారంలో ఎన్ని ధర్మసూక్ష్మాలు, రాజనీతులు, ఉపాయాలు చెప్పినా నేను పుత్రవ్యామోహంతో వినలేకపోయాను.  పెద్దల మాటలు ఆబద్ధం కావు కదా?” – అంటూ తప్పంతా ధృతరాష్ట్రుడి మీదో మరొకరు మీదో పెట్టకుండా, జరిగిన దానిలో తన బాధ్యతను ఒప్పుకుంటుంది.

 చిట్టచివరకు శోకం, పరితాపం కమ్ముకు రాగా యుద్ధ భూమిలో మూర్ఛిల్లుతుంది.  తెలివి తెచ్చుకుని మరల మానవ సహజమైన దుఃఖము, ఆగ్రహం, ఉద్విగ్నత కమ్ముకుని రాగా దీనికంతటికి కారణభూతుడైన కృష్ణుడిని చూసి, “కృష్ణా! సమర్థుడవై ఉండి నీవు చేసిన ఉపేక్ష వల్ల ఇంత అనర్థం జరిగింది. నిన్ను శాపాగ్నిలో  దగ్ధమూర్తి చేయుదాన “అంటూ .. శపిస్తుంది.

సీ.    పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున

సంపాదితం బైన  సారతనము

బలిమి సాధనముగా, పలికెద, నుత్తమ

               జ్ఞాతుల తమలోన సంగరమున

బొలియ జేసితి గాన, పొలియుదు రన్యోన్య

        ఘాతుకులై  భవద్ జ్ఞాతిజనులు,

నీవును దప్పక, నేడాదిగా, ముప్ప

                దారగు నేడైన యద్దినమున

తే.     నరయ దిక్కెవ్వరును లేని యగ్గలంపు

గుత్సితంపు తెరంగున గూలువాడ

విట్లు మీ వధూ జనములు నేడ్చు వారు

పతుల సుతులను బంధుల పనవి పనవి   - స్త్రీ పర్వం. ద్వితీ. 161

         భారతకథలో తారసపడే వందలాది పాత్రలలో గాంధారికి ప్రత్యేక స్థానం ఉంది.   సౌశీల్యం, పాతివ్రత్యం, బుద్ధి కుశలత, సామర్ధ్యం, ధీరత్వం  అనే లక్షణాలతో  తనను తానే  తీర్చి దిద్దుకున్న పాత్రయిది.  అందుకే స్త్రీ పర్వానికి నాయకురాలైంది.   కురుక్షేత్ర సంగ్రామంలో  సేనానాయకత్వం నిర్వహించిన భీష్మద్రోణాది తారలవంటి కౌరవ మహావీరుల పేరున ఒక్కొక్క పర్వం నడిచింది.   ఆయా పర్వాలలో ఆ పాత్రలు నిర్వహించబడిన విధం చూస్తే, ఒక్క భీష్ముడు తప్ప, తక్కినవి  ఏవీ  స్త్రీ పర్వంలో గాంధారికి ఉన్న స్థానానికి సాటి రావు.  

గాంధారి ఎప్పుడూ సందర్భోచితంగా తన బాధ్యతను నిర్వహించుకుంటూ వచ్చింది.   స్త్రీపర్వానికి మాత్రం తాను సారథ్యం వహించింది.  పార్థసారథిని తన వెనుక తిప్పుకుంటూ, యుధ్ధభూమిలో బీభత్సాన్ని వర్ణించింది.  కూలిపోయిన కురువీరులను పరిచయం చేసింది.   స్త్రీ జనం యొక్క దయనీయ స్థితిని హృదయం కరిగిపోయేటట్టు వివరిస్తూవెళ్ళింది.  సంజయుడు చెప్పగా విన్న యుధ్ధవార్తలను కూశాగ్ర బుధ్ధితో స్వఛ్ఛమైన అవగాహనతో, విశ్లేషించి, కృష్ణుడంతటి వాడికి యుధ్ధన్యాయాలను చెప్పుకొచ్చిన ప్రతిభావంతురాలు.  అతనితో  నిలదీసి నిక్కచ్చిగా మాట్లాడడమే కాదు.  నేను సామాన్యురాలిని అనుకుంటున్నావేమో నిన్నుసైతం పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితం బైన  సారతనమున  శపించగలను  అంటూ శాపం పెట్టింది.

చిట్టచివరకు ఆశ్రమవాస పర్వంలో మళ్ళీ ధృతరాష్ట్ర గాంధారులను గురించిన  ప్రస్తావన వస్తుంది.  జనమేజేయుడు -

“పాండవేయులు ధృతరాష్ట్రు వలనన్ ఎవ్విధంబు వారై నడచిరి? హతపుత్ర మిత్రామాత్యుండును, గతైశ్వర్యుండును నగు నా రాజును, యశోమహితయగు గాంధారియు నెట్టి భంగి వర్తించిరి?” – వైశంపాయనుని ప్రశ్నించాడు.  దానికి పాండవులు ధృతరాష్ట్రుని ఔన్నత్యానికి ఏవిధం గా భంగం రాకుండా చూసుకున్నారని, ఆ గాంధారీ దేవిని కుంతి,ద్రౌపది, సుభద్ర వీరంతా భక్తితో సేవించారని సమాధానం చెబుతాడు.   ఇక్కడ పాండవ వనితల ఔదార్యం, సంస్కారసంపత్తితో బాటు, గాంధారి సౌశీల్యం, ఉదాత్తత కూడా విదితం మవుతున్నది.

ధృతరాష్ట్రుని పుత్ర,మిత్ర ,అమాత్యులని కోల్పోయినవాడని, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడని  దీనునిగా వర్ణించి, గాంధారికి మాత్రం “యశోమహిత” అనే విశేషణాన్ని వాడి ఆమెకు బంధుజనంలో ఉన్న మంచి పేరును గుర్తుచేయడం జరిగింది.  మహారాణి గా హస్తినాపురం లో అడుగుపెట్టిన గాంధారి,  చరమదశలో కూడా కుంతీదేవి తనను కొలువగా వనభూముల వైపు ప్రయాణం కట్టింది.

“గాంధారీ! నీవు విచక్షణతో కూడిన జ్ఞానం కలిగిన దానివని , ధైర్యవంతురాలివని లోకం మెచ్చుకొనటం యధార్థం. నేను ఎప్పుడూ నిన్ను ప్రశాంత చిత్తం గల ఇల్లాలిగానే చూచాను.” – అని సాక్షాత్తూ ఆ వ్యాసుభాగవానుడి ప్రశంసకు పాత్రురాలైన  స్త్రీ గాంధారి.

*********

Añadir comentarios