పుస్తకాలయం
పుస్తకాలయం (Author: గడ్డం దేవీప్రసాద్)
వందలాది జీవితాల వడబోసిన అనుభవాలు
బహువిధాల రచనలన్ని ఆకృతైన పుస్తకాలు
అందమైన అద్దాల బీరువాల అరల లోన
పదిల పరచి నిష్ఠ తోడ వ్యాస పీఠమైన నాడు
మానసోల్లాసమును పొందినారు పాఠకులు
జ్ఞానోదయ ప్రభా గరిమతోడ తాము వెల్గినారు
బ్రతుకుకర్థ మెరిగినారు జీవనాన మెరసి నారు
సార్థకంపు ఉనికితోడ సమాజాన నిలిచినారు
చదువరుల గుసగుసలు పుస్తక పుట రెపరెపలు
పురాతన అధునాతన పరిమళాల గుబాళింపు
పారవశ్యమొందించగ పులకించిన మూర్తిని
అమ్మవాణి పుత్రికగా ఆరాధ్యత బడసినాను
అయ్యంకి వంశజలధి పూర్ణ సుధాకరుడు నైన
వేంకట రమణయ్య బృందము చేయూత తోడ
ఊరు వాడల యందున ఉజ్వలముగా వెలసి
జనుల జ్ఞానార్తి దీర్చిన ఘన మనస్వినిని నేను
నా నీడలో నిలిచిన వారికి పాస్పోర్టుల పనిలేక
వీసాల బెడద లేక రంగురంగుల ప్రపంచాన్ని
చూపించి మురిపించి ఆనందామృతాన్ని పంచి
దివ్యానుభూతిని కలిగించిన దీప్తిని నేను
బుల్లితెర ధారావాహికలు దిగ్బంధం చేశాయా
హస్తభూషణాలైన సెల్ఫోనులు ఆపేస్తున్నాయా
దినపత్రికలు చదువడానికైనా ఎవ్వరూ రారేమి?
వన్నె తగ్గి వాడిపోయి దిగాలు పడిన స్థితి నాది
ధూళితో నిండిన బీరువాల అరల మాటున
చెదలు పట్టి శిథిలావస్థకు చేరిన పుస్తకాల
వేదనను వీక్షిస్తూ విషాదాశృవులతో దినదినం
నిశ్శబ్దంగా రోదిస్తున్న నిశ్శబ్ద పాలకురాలను
ప్రాశస్త్యాన్ని గుర్తించి చేయూత నివ్వకపోతారా
సహకారాన్ని అందించి శక్తిని పెంచక పోతారా
అని విజ్ఞుల కోసం అహరహం ఎదురుచూస్తూ
నిర్వేదంతో నిలిచిన పుస్తకాలయాన్ని నేను