పురుషులందు పుణ్యపురుషులు వేరయా
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (Author: కాశీనాధుని రాధ)
ఆ. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ! వినుర వేమా!
ఇది మనం చిన్ననాటి నుంచి ఎరిగిన వేమన పద్యం. ఇటువంటి పద్యాలు ఎన్నెన్నో మన నోటిలోనూ, మనసులోనూ కదులుతూ, ప్రతినిత్యం మనం చూసే సత్యాలనే, మనసుకి విందు చేసే విధంగా వడ్డిస్తాయి.
- ఉప్పూ, కర్పూరం ఒక్కలాగే కనబడినా రుచులను పరిశీలిస్తే వాటికి ఉన్న తేడా తెలిసిపోతుంది. అలాగే మనుషులంతా బాహ్యంగా కనబడే రూపురేఖల విషయంలో ఒకలా కనబడినా, వీరిలో “పుణ్యపురుషులు” వాళ్ళ లక్షణాలని, గుణగణాలని బట్టి వేరుగానే కనబడతారు. అయితే ఈ పుణ్యపురుషులు ఎవరు? అన్నది ప్రశ్న. దీనికి మహాభారతంలో ఒక చక్కటి నిర్వచనం ఉంది. ఉండక ఎక్కడికి పోతుంది? “ఇందులో ఉండేది ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఎక్కడా లేదు.” ఢంకా బజాయించి మరీ చెప్పారు వేదవ్యాసుల వారు. ఇది మహాభారతం ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసంలో కనబడుతుంది.
సందర్భం: పాండవులు అజ్ఞాతవాసం పూర్తిచేశాక, విరాట మహారాజు కుమార్తె ఉత్తరతో అభిమన్యుడికి వివాహం జరుగుతుంది. అటు తరవాత పాండవులు తమ రాజ్యభాగాన్ని తిరిగి పొందే ప్రయత్నంగా రాయబారం నడుపుతారు. మొదటిది ద్రుపద పురోహితుడు కౌరవుల వద్దకు వెళ్ళడం. రెండవది సంజయ రాయబారం. ధృతరాష్ట్రుడు పంపగా, పాండవుల వద్దకు వెళ్లి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు సంజయుడు. రాయబారం తాలూకు విశేషాలను ఆ రాత్రి ధృతరాష్ట్రుడితో చెబుతాడు. సంధిలో సమయంలో జరిగిన విషయాలు అన్నీ విన్న తరువాత ధృతరాష్ట్రుడు ఆందోళనతో, విదురుని పిలిపించి, తనకు మనసు కల్లోలంగా ఉందని, ఆ అలజడి తగ్గే లాగ మంచిమాటలు చెప్పమని అడుగుతాడు. అప్పుడు విదురుడు చెప్పిన నీతులలో ఇది ఒకటి.
తే. చెల్లి యుండియు సైరణ సేయునతఁడు
పేదవడియు నర్ధికిఁ బ్రియము తోడ
దనకుఁ గల భంగి నిచ్చు నతండుఁ బుణ్య
పురుషులని చెప్పి రార్యులు కురువరేణ్యా!
(ఆంధ్రమహాభారతం. ఉద్యోగ. ద్వితీయా. ప. 42)
కురువరేణ్యా = ఓ కౌరవశ్రేష్టుడా! (ధృతరాష్ట్రుడి కి సంబోధన)
ఆర్యులు = పెద్దలు, చెల్లి ఉండియు = తనకు సమర్ధత ఉండి కూడా
సైరణ సేయు నతడు = సహనం/ఓర్పు వహించి ఊరుకునే వాడు
పేద పడియు = తను పేద వాడైనా (తను పేదరికం లో ఉన్నా)
అర్ధికి = అడిగిన వాడికి, ప్రియము తోడ = ప్రీతి పూర్వకం గా / ఇష్టపడి
తనకు కల = తనకు కలిగినంతలో (ఉన్నపాటిలో), భంగిని = విధము/పద్ధతిలో
ఇచ్చు నతడు = ఇచ్చేవాడు/ ఇచ్చే వారు
పుణ్యపురుషులు అని చెప్పిరి = అటువంటి వారు“పుణ్యపురుషులు” అని చెప్పారు.
తనకు సమర్ధత ఉండి కూడా, తొందర పడకుండా సహనం వహించి ఉండే వాడు, తాను పేదవాడైనా తనకు ఉన్నంతలో, తోచిన విధంగా, ఎంతో ఇష్టంగా అడిగిన వారికి ఇచ్చే వాడు, అన్న ఈ రెండు లక్షణాలు కలవారిని వారిని పెద్దలు“పుణ్యపురుషులు” అని చెప్పేరు. – ఇది ఈ పద్యానికి భావం.
మొదటి లక్షణానికి ఉదాహరణ గా చెప్పుకోవలసిన వాడు, మహాభారత కథకు నాయకుడు ధర్మరాజు. పరాక్రమము, బంధుబలగము, శ్రీ కృష్ణుని అండదండలు కలిగి ఉండి కూడా, తనకు దుర్యోధనాదులు చేసిన అన్యాయాలను, అక్రమాలను భరించి, నియమాలకు, ధర్మానికి కట్టుబడి, సహనం వహించిన ధర్మమూర్తి యుధిష్టిరుడు.
రెండవ లక్షణానికి అతికినట్టు పోలిక గలవాడు రంతిదేవుడు. ఇతని వృత్తాంతం భాగవతంలో తొమ్మిదవ స్కంధంలో వస్తుంది. ఇతడు భరతవంశపు రాజు. తన సంపదలను అన్నింటినీ దానం చేసి, పేదవాడై, చివరకు తిండి తిప్పలు లేక నానా అవస్థలు పడుతుండగా, ఒక రోజు అదృష్టం కొద్దీ కొంత ఆహారం, నీళ్ళు లభిస్తాయి. ఆ సమయంలో దేవతలు అతనని పరీక్షించ దలిచి, యాచకుల వేషంలో ఒక్కొక్కరే వస్తారు. తాను ఆకలితో ఉన్నా, వచ్చి అడిగిన వారికి తన వద్ద ఉన్న ఆహారాన్ని ఇచ్చేస్తాడు. ఇంతలో ఆకలి దప్పులతో ఒక చండాలుడు వచ్చి కాపాడమని వేడుకోగా, దయతో
ఉ. అన్నము లేదు, కొన్ని మధురాంబువు లున్నవి, ద్రావుమన్న, రా
వన్న, శరీరధారులకు నాపద వచ్చిన, వారి యాపదల్
గ్రన్నన మాన్చి, వారికి సుఖంబులు సేయుటకంటె నొండు మే
లున్నదె? నాకుఁ దిక్కు పురుషోత్తముఁ డొక్కడ సుమ్మ పుల్కసా!
నా వద్ద అన్నం లేదు. కాని కొంచం మంచి నీళ్ళు ఉన్నాయి. వచ్చి తాగు. ఆపదలో ఉన్న మనుషులను కాపాడి, వాళ్ళకు సుఖం కలిగించడం కంటే మంచి పని ఇంకొకటి లేదు. నన్ను గురించి బాధ పడకు. నాకు ఏ కష్టం రాదు. నన్ను దేవుడే రక్షిస్తాడు. – అన్నది పై పద్యానికి భావం.
ఇలా క్షుద్భాదతో, దాహంతో అలమటిస్తూ, తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా, ఆర్తులకి తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఇవ్వటమే కాదు, చివరకు తన వద్ద మిగిలిన కొద్దిపాటి మంచినీళ్ళని కూడా తాను త్రాగకుండా దానం చేసిన రంతిదేవుని వంటి వాళ్ళు“పుణ్యపురుషులు”.
ఈ కధకు ముగింపు: చివరికి దప్పికతో రంతిదేవుడు మరణిస్తాడు. కాని దైవ మహిమతో పోయిన ప్రాణాలను తిరిగి పొందుతాడు. తనను పరీక్షించడానికి మారువేషాలలో వచ్చిన దేవతలు, తర్వాత నిజరూపాలతో ఎదురుగా ప్రత్యక్షం అయినపుడు కూడా రాజ్యాన్ని గాని, సంపదలను గాని, ఆఖరికి, తన కనీసావసారాలు తీర్చమని కూడా కోరలేదు. అంతా విష్ణుమాయగా గ్రహించి, జ్ఞానంతో ముక్తిని పొందాడు.
తిక్కన గారి ఉద్యోగపర్వంలో, ఈ సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నీతులు సుమారు 30 పద్యాల వరకు ఉన్నాయి. ఒక్కొక్కటి సానపెట్టిన రత్నం వంటిది. గుడ్డివాడే కాదు, చెవిటివాడు కూడా కాబోలు అనిపించే ఆ ధృతరాష్ట్రుడు, ఒక్క మాట కూడా వినిపించుకోలేదు. కాని అతగాడు అడగడం చేత మనకి తెలిసివచ్చాయి.
__________________________
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)