తోలు బొమ్మలాట
తోలు బొమ్మలాట (Author: తెలికిచెర్ల విజయలక్ష్మి)
'ఎవరైనా, పొద్దున్న లేవగానే మంచిపని చేయాలనుకుంటారు. నా ఖర్మకి లేవగానే చెత్తలు ఏరుకునే దానిలా ఈ నత్తలు ఏరుకోవటం ఏవిటో?' అని తిట్టుకుంటూ..వాకిట్లో ఉన్న నత్తల్ని ఏరి, దోసెడు గడ్డలుప్పు వేసిన కవర్ లో వేస్తూ సీతాలక్ష్మి గొణుగుతుంటే..
"మొదలైందా ఆంటీ! నత్తలు ఏరే కార్యక్రమం? మీరలా వాటిని ఉప్పు వేసి చంపుతుంటే...అవి, ఉప్పులో కరుగుతున్న వాసనకి నాకు వాంతి వస్తుంది. నేను, మాత్రం వారానికి ఒకసారి మందు స్ప్రే చేస్తాను వాకిలంతా" అంటూ మొహం తిప్పుకుంది గౌరి.
"ఆ మందులు ప్రమాదం తల్లీ. చిన్న పిల్లలున్నారు ఇంట్లో ఎక్కడ పెడతావో జాగ్రత్త. ఎక్కడనించీ తయ్యారవుతాయో ఈ నత్తలు. ఈ రోజు వాకిలంతా తిరిగి ఏరెస్తానా! రేపటికల్లా, ఇంతకు రెండింతలు తయ్యారుగా వుంటాయి. 'నత్తలొస్తున్నాయి జాగ్రత్త' అనే నవల చదివినప్పుడు అన్నీ... కల్పితాలు అనుకున్నాను. ఇవి, చూసేక నిజంగా ఆ రచయిత రాసినవన్నీ నిజాలే అనిపిస్తుంది. సరే, నేపోయి కాఫీ తాగుతా" అంటూ లోపలకు వెళ్ళబోతున్న సీతాలక్ష్మిని, గౌరి ఆపి..
"ఆంటీ, బాబాయ్ గారు ఊళ్ళోనే ఉన్నారా?"
"ఉన్నారమ్మా. ఏమైనా పనివుందా?"
"రాత్రంతా, చంటిది ఏడుస్తూనే ఉంది. కలకత్తా, డ్యూటీకి వెళ్ళిన ఈ మనిషి ఒక్క ఫోన్ చెయ్యలేదు. మొన్నను రావాల్సింది ఇంతవరకూ రాలేదు" అంది దిగులుగా.
"మీ బాబాయిని, ఆఫీసులో కనుక్కొమ్మంటాలే" అంటూ అరబస్తా దాకా ఐన నత్తల్ని మూటలాకట్టి గేట్ బయటకు విసిరి స్నానానికి వెళ్ళింది సీతాలక్ష్మి.
పూజ, చేస్తున్న సీతాలక్ష్మి మనసు నిలకడగా లేదు. గౌరి పురిటికెళ్ళినప్పుడు, ఆమె భర్త సూర్య స్నేహితులను ప్రతీరోజూ ఇంటికి తెచ్చి పేకాడటం, అర్ధరాత్రి దాకా నవ్వులతో హోరెత్తిస్తుంటే...ఆ గోలకి రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఆ బాధ భరించలేక ఒకరోజు రామంగారు, సూర్యని పిలిచి నెమ్మదిగా నచ్చచెప్పటంతో అప్పటినుంచీ స్నేహితులను తీసుకు రావడం మానేసేడు. అప్పటినుంచీ సూర్య, ఇంటికి వస్తున్నాడో, లేదో కూడా తెలిసేది కాదు.
పుట్టింటినించీ వచ్చిన గౌరి, ఇద్దరు పిల్లలతో అవస్థపడుతుంటే..గౌరిమీద ఉన్న అభిమానంతో, పడుకున్న
భర్తను లేపి...
"పక్కింటి సూర్య, మూడ్రోజులై ఇంటికి రాలేదని గౌరి బెంగపడుతోంది. ఒక్కసారి వాళ్ళ ఆఫీసుకి వెళ్ళి కనుక్కోండి" అన్చెప్పి పనిలో పడింది సీతాలక్ష్మి.
***
మధ్యాహ్నం భోజనానికి వచ్చిన రామం..
"ఈ వెధవ, ఇంటికి రాకుండా... వేరే దానితో కులుకుతున్నాడు. ఈ భాగోతం ఆఫీసులో అందరికీ తెలుసునట. వీడికి, చీవాట్లు పెట్టి నాతోపాటు తీసుకు వచ్చేను" అంటూ సూర్య గురించి భర్త చెప్పిన మాటలు విని 'ఇది తప్పుడు సమాచారమయితే బాగుండును' అనుకుంటూ నిద్రకుపక్రమించింది సీతాలక్ష్మి. నిద్ర రావటం లేదు. ఈ సంగతి విన్న నాకే ఇంత బాధగా ఉంది, ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుందో? మనసు అశాంతిగా అనిపించి ఒక్కసారి గారితో మాట్లాడాలి అనుకుంటూ...గౌరికి ఫోన్ చేస్తే, ఆమె ఎత్తటంలేదు. మంచం మీద మరి ఉండాలనిపించక గౌరీ వాళ్ళ ఇంటి గేట్ తలుపు తీసుకుని వెళ్ళి తలుపు తట్టింది. ఎంత తలుపు కొట్టినా తియ్యటంలేదు. ఏదో అనుమానంగా అనిపించి... భర్తకు ఫోన్ చేసి...
"ఏవండీ, గౌరి తలుపు బిగించుకొని లోపల కూర్చుంది. ఎంత కొట్టినా తియ్యటంలేదు. నాకేదో అనుమానంగా ఉంది. సూర్యని త్వరగా రమ్మనండి" అంది.
సూర్య వచ్చి, తలుపులు విరగ్గొట్టేడు. అందరూ లోపలకు వెళ్ళగానే కనబడిన దృశ్యం...నోట్లోనుంచి నురగలు కారి గుడ్లు ముందుకు పొడుచుకొచ్చి భయంకరంగా చచ్చి పడివున్న పిల్లలు, నోట్లోనుంచి నురగ కారుతూ కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ మరణ వేదన పడుతున్న గౌరి...పక్కనే పడి ఉన్న పురుగుల మందు డబ్బాను చూసి... అందరికీ పరిస్థితి అర్థమైంది. గౌరిని, హాస్పటల్ కి తీసుకు వెళ్లేలోపు కక్కించాలి. విషం కక్కేస్తే బతకడానికి ఆశ వుంటుందని...పరుగున వాకిట్లోకి పరుగెత్తి... నత్తగుల్లలు ఏరి చిన్నగిన్నెలో ఉప్పుతో కరిగించి... ఆ రసం తెచ్చి, బలవంతంగా గౌరికి తాగించింది సీతాలక్ష్మి. భళ్ళున వాంతి చేసుకున్న గౌరిని, పిల్లలను హాస్పటల్ కి తరలించేరు. పిల్లలు, చనిపోయారని డాక్టర్స్ డిక్లేర్ చేసేరు. అపస్మారకస్థితిలో వున్న గౌరిని బతికించటానికి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్స్.” ఎందుకీ ప్రయత్నం చేసింది? పసి పిల్లల్ని దారుణంగా చంపవలసిన అవసరమేమొచ్చిందని?" పోలీస్ లు సూర్యని ప్రశ్నిస్తున్నారు. ఎవ్వరికీ, సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు సూర్య.
వారంరోజులు గడిచేయి. గౌరికి, తెలివొస్తే స్టేట్మెంట్ తీసుకోవటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అప్పుడే డ్యూటీకి వచ్చిన నర్స్, మూలుగుతున్న గౌరిని చూసి..
"ఎందుకిలాంటి పని చేసేవు? మీ ఆయన, నీకోసం ఎంత ఏడుస్తున్నాడో?" అంటూ తెలివి వచ్చిన గౌరిని మందలించింది.
భర్త, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడనే మాటతో మనసు కరిగి,” అతన్ని చూడాలనుందంటూ" విలపించింది గౌరి.
"ఉండు, బయటెవరూ లేకపోతే పంపిస్తాను" అని, సూర్యని లోపలకు పంపింది నర్స్.
మూలుగుతున్న, భార్యను చూస్తుంటే భయం వేస్తోంది సూర్యకు. మెల్లిగా... భార్య చేతిమీద చెయ్యివేసి...
"ఎందుకిలాంటి పని చేసేవు? మనం మధురంగా గడపిన రోజులేలా మర్చిపోయావు?" అని భర్త రోదిస్తుంటే..
"ఇంటికి, ఆలస్యంగా వస్తూ...ఏమని అడిగితే, కసురుతూ...నేను గట్టిగా అడిగేసరికి వండిన వంటంతా విసిరి, మహేష్ చెల్లెలిని పెళ్ళి చేసుకుంటా. నువ్వంటే, నాకు అసహ్యంమని అనగానే...మా ఉనికి మీకు నచ్చదని అర్థమై, మీరే దూరమైతే, నాకీలోకంతో పనిలేదనుకున్నాను. పిల్లలు, అనాథలవటం ఇష్టంలేక వాళ్ళను ముందు చంపేను. పొదరిల్లులాంటి నా సంసారం పేక మేడలా కూలిపోవడం తట్టుకోలేకపోయాను" అంటూ ఏడుస్తున్న భార్య మాటలకు...
"ఒకరోజు, డ్యూటీ ఎక్కవగా చెయ్యవలసి వచ్చి, అలసటగా ఉండటంతో.. ఇంటికి రాగానే నువ్వు సాధిస్తుంటే...కోపంతో, పప్పుచారు చెయ్యలేదని వేరేదాన్ని చేసుకుంటాను అన్నాను. దానికోసం ఇంత అఘాయిత్యం చెయ్యాలా? పోనీలే, కనీసం నువ్వైనా బతికితే...నీ ఆరోగ్యం కుదుట పడ్డాక, డాక్టర్ సలహాతో పిల్లల కోసం ఆలోచిద్దాం" అంటున్న భర్త మాటలకు గౌరి మనసు కరిగి బతుకు మీదాశపుట్టి, పిడికిడంత ప్రేమకు పరవశించింది. చిటికెడు పసుపు కుంకుమతో మళ్ళీ కడుపు పండుతుందనే ఆశతో... చావుతో పోరాడుతూ ఆ ప్రాణం తపన పడింది.
"డాక్టర్ గారొస్తున్నారు. బయటకు వెళ్ళండి" అనే నర్స్ మాటతో బయటకు దారితీసాడు సూర్య. తెలివొచ్చిన గౌరిని పలకరించిన డాక్టర్, పోలీసులను పిలిచి స్టేట్మెంట్ తీసుకొమ్మన్నాడు.
"నాదే తప్పు. భర్తను అర్ధం చేసుకోలేకపోయాను. మూడు రోజుల తరువాత, డ్యూటీ నించీ వచ్చిన భర్త,
ఇష్టమైన పప్పుచారు చెయ్యమన్నాడని కోపంతో పిల్లల్ని చంపి నేను చావటానికి ప్రయత్నించేను. నన్ను క్షమించండి" అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది గౌరి.
"ఆత్మహత్యా ప్రయత్నం నేరమని నీకు తెలియదా? నువ్వు ఎంత కర్కోటకురాలివి? కడుపున పుట్టిన పసి ప్రాణాలను ఎలా చంపగలిగేవు? నిన్ను, పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు" అనే నర్స్ మాటతో కుళ్ళికుళ్ళి ఏడ్చింది గౌరి. పిల్లల్ని, చంపేనన్న బాధతో ఏడ్చిఏడ్చి... ఆరాత్రే ఆమె ఆరోగ్యం వికటించి మృత్యువు ఒడిలోకి చేరుకుంది.
భార్యకి, సరైన సమయంలో సింపతీ చూపించి, జైల్ జీవితం నించీ తప్పించుకున్నందుకు సంతోషించి గండం గట్టెక్కిందనుకుని..కార్యక్రమాలు పూర్తిచేసి, బారుకెళ్ళి తృప్తిగా తీర్థం పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు సూర్య.
***
గౌరి, మరణ వార్త విన్న సీతాలక్ష్మి..
"ఏమండీ, మనం ఇక్కడ ఉండద్దు. మన సొంత ఇంటికి వెళ్ళిపోదాము" అంటూ ఏడుస్తున్న భార్యను ఓదారుస్తూ..
"అలాగే, వెళ్ళిపోదాం. బాబాయ్, అంటూ గౌరి పిలిచే పిలుపు, ఇంకా నా చెవిలో ఉన్నట్టే ఉంది. మనకి, ఈ ఇంటితో అనుబంధం చాలా ఎక్కువ. ఇక్కడే రిటైర్ అయి, సొంత ఇంటికి వెళ్లాలనుకున్నాము. ఇప్పుడు, ఈ దుర్మార్గుడి పొరుగున ఉండాలని నాకూ లేదు. చచ్చేంటి సాధించిందాపిల్ల? చావు పరిష్కారమని ఎందుకు అనుకుంది? ఆడపిల్లని పెళ్ళిచేసి పంపడమే కాదు, మానసిక దృఢత్వం పిల్లలకు ఇయ్యాలి. అప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయి. సర్లే, ఇంక ఆ విషయం వదిలెయ్యి. ముందు, మన అమ్మాయి దగ్గరకు వెళదాము. తరువాత, ఇల్లు ఖాళీ చేసేద్దాం. సరేనా ఇంక పడుక్కో" అని భార్యకు సర్ది చెప్పి నిద్రకుపక్రమించేరు రామం.
పొద్దున్నే, గేట్ శబ్దం అవుతుంటే..'ఇంత పొద్దున్నే ఎవరో అనుకుంటూ..' తలుపు తీసిన రామం, సూర్య స్నేహితుడిని చూస్తూ..ఏంటి అన్నట్టుగా సైగ చేసేరు.
"సూర్య, వస్తున్న బైక్ కి ఇసక లారీతో ఏక్సిడెంట్ అయి కాళ్ళు తెగిపడ్డాయిట. పెళ్ళాం, పిల్లలు పోయేరు. ఆ దుఃఖం తీరకుండానే ఈ ఆపద వచ్చింది. మనం వెళ్ళి ధైర్యం చెప్తే బాగుంటుందేమో?" అంటున్న అతని మాటకు...
"నేను రాను. ఎవర్ని ఎలా ఓదార్చాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. ఇది, ఆ పరమాత్ముడు ఆడించే తోలుబొమ్మలాటలో భాగమే" అంటూ తలుపు వేసేసాడు రామం.
(సమాప్తము)