తెలుగు బువ్వంబంతి  (Author: గడ్డం దేవీప్రసాద్)

పరిచిరి వరుసగా అందమైన బంతిచాపలు

కొలువుతీరాయి వాటిముందు అరటాకులు

శుద్ధికై చిలకరించిరి వాటిపై నీటిజల్లులు

సాగరలక్ష్మి మొదట వచ్చి చేరింది లవణమై

 

కులుకుతూ వచ్చి చేరె అరుణశోభిత కొత్తావకాయ

కుదురుకొంది ఊరిస్తూ గోంగూరపచ్చడి

జతకట్టాయి అరిసెలు, గారెలు, పూర్ణాలు

పచ్చళ్ళను పలుకరిస్తూ వచ్చి తమస్థానాల్లో కుదురుగా నిలిచాయి

 

ఆరోగ్యదాయిని మునగాకు తాలింపు ఒకవైపు

గుమ్మడి వడియాలు, అప్పడాలు మరోవైపు చేరె

పోపుపెట్టిన ముద్దపప్పు నెయ్యితో రాగా

ఆకు మధ్యన ధవళకాంతితో వరి అన్నము విరాజిల్లె

 

విస్తారముగా వివిధ వంటకాలతో విస్తళ్లునిండ

ఆరగింప సంతసముతోడ

అతిధిదేవుళ్లొచ్చి ఆసీనులైరి విస్తళ్ళముందు

రుచులాస్వాదిస్తూ ఒక్కొక్క దానినే జఠరాగ్నికి అర్పణ గావించిరి

 

మారొడ్డించే యింతుల చేతి గాజుల గలగలలు

పట్టుకోకల గరగరలు, కాలి అందియల గళగళలు

నీళ్లను నింపుకొంటూ లోటాలు చేసే గుళగుళలు

అప్పడాల పెళపెళలతో కొనసాగె జుగల్బంది

 

పులుసులు, రసాలు అన్నాన్ని ఓలలాడిస్తే

పచ్చడి లోని మామిడి ముక్కల రుచి జోడిస్తూ

విస్తళ్ళని ఖాళీ చేసింది తెల్లని గడ్డపెరుగు

భోక్తల తృప్తి సవ్వడి చేస్తూ త్రేన్పులుగా బయటకొచ్చే

 

దొప్పల్లో నేతి పాయసపు ఘుమఘుమలకు తోడు

అరమగ్గిన అరటిపళ్ళు కొసరుగా కవ్విస్తూ

ఆహ్వానితుల జిహ్వలకు శుభం పలుకంగా

ఆకులు, వక్కలు, సున్నమూ నోళ్లకు పనిపెట్టించి

ఎర్రటిరంగు పులిమి వీడ్కోళ్ళు చెప్పె

Añadir comentarios