తన్మయత్వపు జోహార్లు  (Author: శాంతి కృష్ణ)

శీతాకాలపు సొగసుల రసఝరి

లేమంచు పరదాలో దాగిన కాంచన సిరి

గుత్తులు గుత్తులుగా విరబూస్తూ

తోటమాలుల అవసరం లేని

భువిపై పరచుకున్న వనసిరి...

చినుకు జాడ లేకున్నా

మంచుబిందువులకే మురిసి 

కొన్ని చోట్ల నదిలో కదిలే బతుకమ్మలుగా

కొన్ని చోట్ల ముగ్గులలో మెరిసే గొబ్బెమ్మలుగా

వాసికెక్కిన బహు వన్నెల సిరి...

వర్ణాలలో మహగొప్ప పసుపు వర్ణమై

సోయగపు సౌరభాల మహరాణి తానై

బాటకిరువైపులా గుబురు పొదలుగా   

ప్రతిరోజూ నా ఉదయపు నడకను 

రంగుల మయం చేసే సొగసరి...

పచ్చని పూలుగా విచ్చుకుని 

ముచ్చటగా గుర్తొచ్చే వెలకట్టలేని మౌక్తికంలా 

నా బాల్యపు గురుతుల పరిమళమై...

ఎంతెంతో సౌకుమార్యం గా

విరబూసే వెన్నెల సిరి... 

ఎంత చూసినా తనివి తీరని అందాలతో 

పూగుత్తుల భారానికి వంగిన రెమ్మలు...

స్వచ్ఛమైన పల్లె పడుచు నవ్వుల్లా

అచ్చమైన తెలుగు వారి స్వంతాలు...

అవే అవే తంగేడు పూలు...

తంగేడు పూలను మెచ్చని తరుణులు కలరా ఈ ఇలలో 

తంగేడు పూలతో తరియించని నేలలు కలవా

ఈ తెలుగునాడులలో....

రెండుగా విడిపోయిన తెలుగు నేలలో

బతుకమ్మకు, గొబ్బెమ్మకు 

తానే పసుపు పచ్చని పగడాల చీరగా మారిన

తంగేడు పూలకివే

తన్మయత్వపు జోహార్లు...!!

**********

Añadir comentarios