ఒక్క క్షణం  (Author: పతి మురళీధర శర్మ)

ఆ రోజు ఆదివారం. ఈవేళ ఎలాగైనా ఆత్మహత్య చేసేసుకోవాలని ఆనందరావు నిశ్చయించేసుకున్నాడు. కారణాలేవయితేనేం ఎవరూ చూడకుండా ఇంటినుండి బయలుదేరేడు. సెల్ ఫోన్ ఇంట్లో వదిలేశాడు.

         చివరిసారిగా దైవదర్శనం చేసుకుందామని శివాలయానికి వెళ్ళాడు ‘స్వామీ! నేను నీ దగ్గరికే వస్తున్నాను’ అని చెప్పడానికి అన్నట్లుగా. శివుడికి అభిషేకం చేయించాడు. ఎవరైనా తమ కోరికలు తీర్చమని విన్నవించు కుంటారు. అలాగే ఆనందరావు తన ఆత్మహత్య నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాడు ఆ పరమేశ్వరుణ్ణి.

         పూజారి “అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం“ అంటూ తీర్థం ఇచ్చాడు ఆనందరావుకి. నేనే మృత్యువును ఆహ్వానిస్తుంటే ఇంక అకాల మృత్యుహరణం ఎలా అవుతుంది? అనుకున్నాడు. ఈ తీర్థం లాగే విషాన్ని తీసుకుంటే సరి అనుకున్నాడు. ప్రసాదం కూడా తీసుకుని కాసేపు ఆ భోళా శంకరుడి సన్నిధిలో కూర్చున్నాడు.

         మనసంతా కకావికలంగా ఉంది. ఉరిశిక్ష పడినవాడికి ఉరి తీసేరోజు వాడి చివరి కోరిక చెప్పమంటారు. అది తీర్చిన తర్వాత ఉరి తీస్తారు. అలాగే చనిపోతున్నామని తెలిసిన వాళ్ళు చనిపోయేముందు వాళ్ళ చివరి కోరిక తీర్చమని అడుగుతారు. అది తీరిందన్న సంతృప్తితో చనిపోతారు. కాని ఆనందరావుకి అలాంటి అవకాశమేలేదు. అంచేత తనకు తానే చివరి రోజు సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాడు.

         గుడి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న ముష్టివాళ్ళంతా ఒక్కొక్కరూ “అయ్యా ధర్మం! బాబూ ధర్మం!“ అంటూ ప్రాధేయపడుతున్నారు. అందులో ఒక కుష్టురోగి కూడా ఉన్నాడు. తాను పోయేముందు వీళ్ళకు సంతృప్తికరమైన దానం చేసి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ కుష్టువాడు చాచిన వేళ్ళులేని చేతిలో పైనుండి వందనోటు పడేశాడు. అది కాస్త గాలికి ఎగిరి దూరంగా పడిపోయింది. ఆ నోటు తీసుకొచ్చి మళ్ళీ అతని డబ్బాలో పడేశాడు ఆనందరావు. ఆ కుష్టువాడు వెంటనే, “దండాలు బాబయ్యా! తవరు మాపాలిట దేవుడు. నేకపోతే నాలాటోడికి ఒంద రూపాయలు ఎవరేత్తారు? తవరూ, తవరి కుటంబం అంతా పిల్లాపాపలతో పది కాలాలు సల్లగా ఉండాల మారాజా” అన్నాడు.

అప్పుడనిపించింది ఆనందరావుకి.“ ఎలాగూ చనిపోదామనుకున్న తనకు ఇంత శరీరాభిమానం ఎందుకూ? వాడి చెయ్యి తన చేతికెక్కడ తగుల్తుందోననే కదా అలా నోటు పైనుండి పడేశాను. వాడి రోగం తనకు ఎక్కడ అంటుకుంటుందోననే భయం. ఛ! నాకే ఇలా అనిపిస్తే ఆ రోగాన్ని అనుభవిస్తున్న వాడికెలా ఉంటుంది? వాడిని చూస్తే అందరూ అసహ్యించుకుంటారు. అలాంటిది వాడికి చచ్చిపోవాలనిపించదా? బ్రతుకు తీపి అంటే ఇదేనేమో!” అనుకుంటున్న ఆనందరావుతో ఆ కుష్టువాడన్నాడు “ఏటి బాబూ! అలా ఆలోసిత్తన్నారు? ఈడిదీ ఓ బతుకేనా? అనుకుంటున్నారు కదూ! ఏం సేత్తాను బాబయ్యా! పుట్టిన పెతీ మడిసికీ ఎప్పటికైనా సావు తప్పదు. పుట్టడం మన సేతిలో లేనప్పుడు సావడం మాత్తరం మన సేతిలోకి ఎందుకు తీసుకోవాలి? నన్ను సూత్తే అందరూ అసయ్యించుకుంటారు. నిజవే! గాని మాలాటోల్లని సూసినప్పుడు పాపాలు ఎందుకు సెయ్యకూడదో తెలుత్తాది అందరికీ. మాలాటోల్లకి దానం సేసినోల్లకి పున్నెం ఒత్తాది.“ జీవన రహస్యం చెప్పేడా ముష్టివాడు.

         ఆనందరావు తికమక పడ్డాడు. ఇలాంటి రోగే బ్రతుకు బండి ఈడుస్తున్నప్పుడు ఏ రోగమూ లేని తను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని. అలాగే ఆ ముష్టివాళ్ళలో కాళ్ళు లేనివాళ్ళూ, చేతులు లేనివాళ్ళూ, గ్రుడ్డివాళ్ళూ, పిల్లల తల్లులూ ఉన్నారు. వీళ్ళంతా మరొకరిపై ఆధారపడిన వాళ్లే. అన్ని అవయవాలూ సవ్యంగా ఉన్న తను ఎవరిమీదా ఆధారపడలేదు. పైగా తనమీద ఆధారపడినవాళ్లే ఉన్నారు. అలాంటిది తను చేయబోయే పనేంటి? తగునా అది? మొదటిసారిగా మనసు వెనక్కులాగింది. అయినా తమాయించుకుని అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరికీ తలో వందరూపాయలూ వేసేశాడు.

         మనసు బాగోకపోయినా కడుపు ఆకలిని గుర్తుచేసింది. భోజనం చేద్దామని ఓ ఏ. సీ. రెస్టారెంట్ కి వేళ్లాడు ఎందుకంటే ఈ చివరిరోజు ఆనందంగా గడుపుదామని అనుకున్నాడు కదా. తనకిష్టమైనవన్నీ సుష్టుగా తిని బిల్లు చెల్లించి బయటకు వచ్చేడు. అక్కడొక ముసలివాడు కదలలేని స్థితిలో పడి ఉన్నాడు. అయితే మెలకువగానే ఉన్నాడు. కాని ఎవరూ వాడ్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడున్న రెస్టారెంట్ సెక్యూరిటీ గార్డ్ ఆ ముసలివాడిని అక్కడినుంచి పొమ్మంటున్నాడు “లేరా! లే!” అంటూ. “ఏమైంది?“ అని అడిగాడు ఆనందరావు ఆ ముసలాడిని.

         “రెండ్రోజుల్నుండీ తిండి నేదు బాబయ్యా!” అన్నాడు లేని ఓపిక తెచ్చుకుంటూ.

         “ఏం నీకెవరూ లేరా?” అడిగేడు ఆనందరావు.

         “నేకేం బాబూ! ఉన్నా లేనట్టే.“ అన్నాడు ముసలాడు నీరసంగా. సెక్యూరిటీ గార్డ్ ఆనందరావుతో అన్నాడు “మీరు మరీ అమాయకుల్లా ఉన్నారు సార్. వాడు చిత్తుగా తాగి పడిపోయి ఉంటాడు. లేదా ఇలాంటివాళ్ళే దొంగతనాలు కూడా చేస్తారు ఎవరూ అనుమానించరని.“ ఆనందరావు అతని మాటల్ని పట్టించుకోకుండా వెంటనే రెస్టారెంట్ లో కౌంటర్ దగ్గరికెళ్లి ఓ భోజనం పార్సిల్ ఆర్డరిచ్చి తీసుకొచ్చి ఆ ముసలివాడికిచ్చాడు. అది చూసి ముసలాడికి ప్రాణం లేచివచ్చింది. శక్తినంతా కూడగట్టుకుని లేచి పార్సిల్ అందుకుని ఆత్రంగా తినేయసాగేడు. ఆకలి బాధ ఎలా ఉంటుందో వాడ్ని చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. వాడ్ని అలాగే చూస్తూ ఉండిపోయేడు ఆనందరావు.

         ఆ ముసలివాడు అంతా తినేసి ఆనందరావు వైపు చూసి కృతజ్ఞతా పూర్వకంగా చేతులెత్తి నమస్కరించాడు. ఆనందరావుకు చిన్నదైనా ఓ మంచి పని చేసేనన్న సంతృప్తి కలిగింది. వెంటనే ఆ ముసలివాడ్ని అడిగేడు “నీకు నీ వాళ్ళుండీ ఇలా తిండికి నోచుకోనందుకు కష్టం అనిపించడం లేదా? ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నమాటలకు నీకేం బాధగా లేదా?“

         “కట్టంగా ఉన్నా, బాదగా ఉన్నా నాను సేయగలిగేదేమీ నేదు బాబుగారూ! తిండికి నేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ సచ్చిపోతాను. ఇంకా ఆ అయ్యే కాదు ఎవురు అన్నమాటలైనా పట్టించుకుంటేనే కద బాబూ బాద కలిగేది. నేకపోతే నేదు.“

         ఆ ముసలివాడు చెప్తున్న వేదాంతం విని ఆనందరావుకు మళ్ళీ అంతర్మథనం మొదలైంది. వాడు చెప్పింది నిజంగా బుద్ధుడి ఉపదేశాన్ని గుర్తుకు తెచ్చింది.

         అక్కడినుండి అలా నడుచుకుంటూ వస్తూ ఆలోచిస్తున్నాడు. “తిండికి లేనివాడు ఆత్మహత్య చేసుకోవడంలేదు. తనకు మంచి ఉద్యోగం, మంచి జీతం. డబ్బుకు లోటు లేదు. ఇల్లుంది. ఇల్లాలూ, తల్లీ, తండ్రీ అందరూ ఉన్నారు. దేనికీ లోటు లేదు. కాకపొతే కేవలం ఇంట్లో అంతులేని గొడవలవల్ల మనశ్శాంతి లేక తనకీ ఆలోచన వచ్చింది.

ఆ ముసలివాడు చెప్పినట్లు వాటిని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. అదేంటి? మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాను? వాడు అయితే పట్టించుకున్నా చేయగలిగేదేమీ లేదు. అంచేత పట్టించుకోడు. కాని పట్టించు కోకుండా ఉండడానికీ, రాజీపడడానికీ నాకేం అవసరం?“ ఇలా తర్జనభర్జన పడుతూ ఆనందరావు విషయాన్ని దారి మళ్ళించడానికీ, మెదడుకు విశ్రాంతికీ ఓ ఏ. సీ. థియేటర్ లో దూరేడు.

         సినిమా ప్రారంభమైంది. ఇంతకీ కథ ఏమిటంటే మామూలే. ఓ అమ్మాయి మానభంగానికి గురవుతుంది. ఆపై ఏసిడ్ దాడికి గురవుతుంది. కన్న తలిదండ్రులు కూతుర్ని వదులుకోలేరు కాబట్టి చికిత్స చేయించారు. కాని పూర్వపు రూపం తేలేకపోయారు. పరువుప్రతిష్ఠలు పోతాయని భయపడి ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. కూతురిజీవితం ఇలా అయిపోయిందేమిటా అని ఒకటే దిగులు. కూతురు ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందోనని ఒకటే భయం వాళ్లకు. కాని ఆ అమ్మాయి తన బ్రతుకు నాశనం చేసిన దోషికి శిక్ష పడేవరకూ పోరాడింది. ఇదీ కథ. “అదే ఆ అమ్మాయి అందరూ తనను అసహ్యించుకుంటున్నారని ఆత్మహత్య చేసుకుని ఉంటే అక్కడితో కథ ముగిసిపోయి ఉండేది. కాని ఆ అమ్మాయి ఆత్మస్థైర్యంతో అలా పోరాడబట్టే కదా నేరస్థుడికి శిక్ష వేయించగలిగింది. చనిపోయి ఉంటే ఏం  ?” ఆనందరావు అంతరంగం పదేపదే హెచ్చరిస్తుంది. ఆనందరావు నిర్ణయానికి అన్నీ అవరోధాలే.

         ధియేటర్ నుండి బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా తన అభీష్టానికి వ్యతిరేక సూచనలే. అలా నడుచుకుంటూ వస్తున్నాడు. రోడ్డు ప్రక్కన చెట్లూచేమలలో గుడిసెలు కనబడుతున్నాయి. అందులోని వాళ్లకు ఎండయినా, వానయినా, చలి అయినా అదే రక్షణ. క్రిమికీటకాల మధ్య విషపు పురుగుల మధ్య జీవిస్తున్నారు. ఆ బ్రతుకెంత దయనీయం! అయినా వాళ్ళూ మనుగడ సాగిస్తున్నారు. వాళ్ళ మొహాల్లో ఎక్కడా ఏ బాధా, విచారమూ కనబడలేదు.

         “ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఈవేళ నా కార్యక్రమానికి అంతరాయం కలిగించేలా ఉన్నాయి ఈ దృశ్యాలు అన్నీ. అయినా నేను వెనుదిరిగేదిలేదు.” అనుకుంటూ రైల్వేస్టేషన్ వైపు నడిచేడు.

         ఆ రైల్వేస్టేషన్ తో ఆనందరావుకు ఎంతో అనుబంధం. ఎందుకంటే ఉద్యోగరీత్యా ప్రక్క ఊరికి రోజూ వెళ్ళేది ట్రైన్ లోనే. అంచేత వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ రైలు ప్రయాణం ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది. ఒకసారి ఎవరో పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని రైలు సడన్ గా మధ్యలో ఆగిపోయింది. ఆ రోజు ప్రయాణీకులందరూ పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. అప్పుడు తనే అన్నాడు ఆత్మహత్యలంటే ఆటల్లా ఉన్నాయని. మరి ఇప్పుడు తను చేస్తున్న పనేంటి? తను అలా చేయకూడదు. ట్రైన్ ఎక్కి ఎవరూ చూడకుండా రైలు బ్రిడ్జి మీద నుండి వెళ్ళేటప్పుడు క్రిందకు దూకేస్తే సరి. ఎవరికీ ఇబ్బంది ఉండదు అనుకుని ఓ కంపార్ట్ మెంట్ ఎక్కేశాడు. ట్రైన్ ఇంకా కదలలేదు. నాకింకా టైం ఉంది అనుకున్నాడు ఆనందరావు. అంతవరకూ కాలక్షేపంగా కంపార్ట్ మెంట్ అంతా కలియదిరిగేడు.

         ఒక దగ్గర ఒకాయన పేపరు చదువుతున్నాడు. “ప్రేమ విఫలమై ప్రేమికుల ఆత్మహత్య” చూడండి. ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆషామాషీ అయిపొయింది. తల్లి మందలించిందని ఓ కూతురూ, తండ్రి కోప్పడ్డాడని ఓ కొడుకూ, టీచర్ తిట్టిందని అవమానం భరించలేక ఓ స్టూడెంటూ, పరీక్ష బాగా వ్రాయలేదు ఫెయిలవుతానేమోననే బెంగతో ఓ విద్యార్థీ, భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి ఓ భార్యా, వృద్ధాప్యంలో జీవితంమీద విరక్తి చెంది వృద్ధులూ, వర్షాలు లేక పంట పండలేదనీ, పండినపంట తుఫానులూ, వరదలవల్ల దక్కలేదనీ, చేసిన అప్పులు తీర్చలేమని రైతులూ ఇలా ఎవరికివారు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. వీళ్ళంతా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే తలిదండ్రులకు పుత్రశోకమూ, భార్యాభర్తలకు జంట వియోగమూ, సంతానానికి వృద్ద తలిదండ్రుల వియోగమూ తప్పించి ఉండేవారు” ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఇంకా అక్కడ ఉంటే తన మనసూ మారుతుందని డోర్ దగ్గరకు వచ్చేశాడు ఆనందరావు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది.

         రైలు ఊగిసలాగే ఆనందరావు మనసు ఊగిసలాడుతుంది. దూకేద్దాం అనుకున్న ప్రతీసారీ ఎవరో ఒకరు డోర్ దగ్గరకు వస్తుండడంతో ఆగిపోతున్నాడు. సమయంకోసం చూస్తున్నాడు. రైలు బ్రిడ్జి మీదకు రానే వచ్చింది. ఆనందరావు దూకేయబోతుండగా వెనకనుండి ఎవరో తట్టినట్లయింది. చూస్తే ఓ అమ్మాయి.

         “ఏంటమ్మా?” అన్నాడు ఆనందరావు. నాకు వినబడదన్నట్లు చెవి వైపు చూపించి సైగ చేసింది. “పోనీ చెప్పమ్మా“ అన్నట్టు సైగ చేశాడు ఆనందరావు. నాకు మాటలు కూడా రావన్నట్లు మూగభాషలో చెప్పింది. “మరెలా?“ అన్నాడు ఆనందరావు. వెంటనే ఆ అమ్మాయి ఓ కాగితం చూపించింది. అది చదివి ఆనందరావుకు నోటమాట రాలేదు. అందులో ఏమి వ్రాసి ఉందంటే –

         “అంకుల్! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు ట్రైన్ ఎక్కినప్పటి నుండీ చూస్తున్నాను మీలో ఏదో కంగారు, అలజడీ. ఒక దగ్గర కూచోకుండా డోర్ దగ్గర నిలబడి దూకేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. నేనో అనాథను. అనాథాశ్రమంలో ఉంటున్నాను. మీరెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలియదు. కాని నాలాగే మీకూ ఎవరూ లేకపోతే నన్ను మీ కూతురిగా స్వీకరించి ఆత్మహత్యాయత్నం మానుకోండి“.

         ఆనందరావు కళ్ళవెంట ఒకటే నీళ్ళు. ఆ అమ్మాయిని ఒక్కసారిగా కన్నకూతురిలా హత్తుకున్నాడు. ఉదయం నుండీ తాను చూసిన దృశ్యాలు ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి. “గుడి దగ్గర ముష్టివాళ్ళూ, రెస్టారెంట్ దగ్గర ముసలివాడూ, రోడ్డుప్రక్కన గుడిసెలలోనివాళ్ళూ. ఇప్పుడీ మూగ, చెవిటి అమ్మాయీ. వీళ్ళెవరూ ఆత్మహత్యలు చేసుకోవడంలేదు. వాళ్ళందరికీ లేని లోటు నాకేముంది? క్షణికావేశంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తెలిసింది. ఈ అమ్మాయి నా మనసు మార్చింది”. అనుకుంటుండగానే ఆ అమ్మాయికోసం ఓ పెద్దమనిషి అక్కడకు వచ్చాడు.

ఆ సన్నివేశాన్ని చూసి ఆనందరావుని అడిగి జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. తను ఆ అనాథాశ్రమ నిర్వాహకుడినని చెప్పేడు. ఆ అమ్మాయిని మౌనిక అంటామనీ, ఆ అమ్మాయిని పెంచుకోదలచుకుంటే పెంచుకోవచ్చుననీ చెప్పాడు. ఇంకేం ఆనందరావు ఆ అమ్మాయిని తన స్వంత కూతురిలా చూసుకుంటానని ఆ పెద్దాయనకు హామీ ఇచ్చి తనతో తన ఇంటికి తీసుకువెళ్తానని అనుమతి కోరాడు. ఆ పెద్దాయన సంతోషం వెలిబుచ్చుతూ అంగీకరించాడు. ప్రక్క స్టేషన్ లో ఆనందరావూ, ఆ అమ్మాయీ దిగిపోతూ ఆ పెద్దాయన దగ్గర సెలవు తీసుకున్నారు.

         ఆ స్టేషన్ లో రిటర్న్ ట్రైయినెక్కి ఇద్దరూ మళ్ళీ వాళ్ళ ఊరి స్టేషన్ లో దిగారు. స్టేషన్ లో అనౌన్స్మెంట్ వినబడుతుంది.

         “బి. ఆనందరావు ఎక్కడున్నా ఎంక్వయిరీ ఆఫీసుకి రావలసింది.“ అని. ఆశ్చర్యపోయేడు ఆనందరావు. గబగబా ఎంక్వయిరీ ఆఫీసు కి వెళ్లి చూస్తే అక్కడ తన భార్య అనూరాధ ఉంది.

         “ఏంటండీ! ఉదయం నుండీ మీరు కనబడలేదు. సెల్ ఇంట్లో వదిలేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? భోజనానికి కూడా రాలేదు. మేమెంత గాబరా పడ్డామో తెలుసా? ఇంతవరకూ రాకపోయేసరికి అందర్నీ ఎంక్వయిరీ చేస్తే ఎవరో మిమ్మల్ని రైల్వేస్టేషన్ లో చూసినట్లు చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ చేయించాను“ ఒకటే చెప్పుకుంటూ పోతోంది. 

         “చెప్తానుండవోయ్! ఆదివారం కదా అలా బయటకు వచ్చాను.”

         “బయటకు వెళ్తున్నట్టు ఇంట్లో ఎవరికైనా చెప్పొచ్చుకదా!” దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ఆనందరావుకి. “సెల్ ఇంట్లో మర్చిపోయాను. శివాలయానికి వెళ్ళాను. తిరిగి వచ్చేస్తుంటే దారిలో నా చిరకాల స్నేహితుడొకడు కనబడ్డాడు. వాళ్ళింటికి రమ్మంటే వెళ్ళాను. భోజనం చెయ్యమని బలవంతం చేస్తే వాళ్ళింట్లో భోజనం చేసేశాను.” అతికినట్లు అబద్ధం చెప్పాడు.

         “మరి ఆ సంగతి మాకెలా తెలుస్తుంది? మీ ఫ్రెండ్ ఫోన్ నుంచి చేసి చెప్పొచ్చు కదా! మీరు చెప్పేవాటికి పొంతన లేకుండా ఉంది. మీ వ్యవహారం మాత్రం నాకు ఏదో అనుమానంగా ఉంది.” అంది అనూరాధ. దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆనందరావుకి.

         “ఈ అమ్మాయి ఎవరు?” అడిగింది.

         “అదేనోయ్! మనకి పిల్లల్లేరు కదా! అందుకే తీసుకొచ్చాను అనాథాశ్రమం నుంచి పెంచుకుందామని. పేరు మౌనిక.“ అని చెప్పాడు అసలు సంగతి బయటపెట్టకుండా. భార్య ముఖంలో రంగులు మారాయి. “పెంచుకునేది మనం. నన్ను సంప్రదించాలని అనిపించలేదా?” నిలదీసింది అనూరాధ.

         “నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతోనే ఆ అమ్మాయిని చూడగానే అలా చేయాలనిపించింది.” సంజాయిషీ చెప్పేడు ఆనందరావు భర్తగా. అనూరాధ ఆ అమ్మాయిని తదేకంగా చూస్తోంది. ఇంక లాభం లేదని ఈ అమ్మాయి మూగ, చెవిటిది అని చెప్పెశాడు.

         “ఏం మరెవరూ దొరకలేదా?” వెటకారంగా అంది ఆ అమ్మాయి చెవిటిది, వినలేదనే ధీమాతో. కాని తన భార్య ముఖంలో భావాలు తెలిసిపోతుండొచ్చు అనుకున్నాడు ఆనందరావు.

“అన్నీ ఉండి లక్షణంగా ఉన్న పిల్లల్నెవ్వరైనా పెంచుకుంటారు. ఇలాంటి వాళ్ళను పెంచుకోవడమే గొప్ప, మానవత్వమూను” చెప్పాడు. దానితో అనూరాధ ఏం మాట్లాడలేకపోయింది. అదే అదనుగా, “పద. ఇంటికెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం. ఇక్కడ వాదించుకుంటే బాగోదు. అందరూ వింటారు”. అని సర్ది చెప్పి ఇద్దర్నీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఆనందరావు. శివాలయంలో తీర్థం మహిమ తెలిసొచ్చింది. తనకు అకాల మృత్యుహరణం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బాగుండేది అనుకున్నాడు ఆనందరావు.

          ( ఈ కథ ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళకు అంకితం )

Añadir comentarios