అమ్మకు శెలవు ప్రకటిద్దాం  (Author: జుజ్జూరు ఉమాదేవి)

ఏ శిల్పి చెక్కిన శిల్పానివో,

 ఎ తొడిమ పుణ్యం చేసుకుంటే,

 పూసిన పుష్పానివో.

 వేకువ పొద్దునే నిదురను పారద్రోలి

 నిత్యం మాకై శ్రమించే,

 ప్రేమైక జీవివి.

 

 వేల వసంతాలు పూసిన

 నీ ప్రేమ ముందు ఏదీ!

 సరితూగదు.

 ఒక్క రోజు ఒకే ఒక్క రోజు

 ఈ అమ్మను జోల పాటతో,

 నిదురలేపి,

 మనకు నేర్పే అచ్చులను మాలగా కట్టి

 మెడలో దరిద్దాం.

 హల్లులతో పాదాలను అభిషేకిద్దాం.

 అమ్మను కూర్చోపెట్టి,

 ఒకే ఒక్క రోజు పారాడిన పసిపిల్లలా!

 ఈ మానవతా మూర్తిని చూసుకుందాం.

 ఈ శ్రామిక జీవికి బాధను తెలియకుండా!

 మన ప్రేమను అంతా మూటగట్టి,

 మమకారం అనే పాల బువ్వను,

 వండి వడ్డన చేద్దాం

 

 

 అమ్మ స్పర్శను మనం ఆస్వాదిస్తామే తప్పా!

 ఎప్పుడైనా తన మనసులోని ప్రేమను గుర్తించగలమా!

 అందుకే మన పుడమి తల్లులందరికీ

 వేల వందనాలతో పాదాలను ప్రణమిల్లుదాం

 అను నిత్యం వెన్నెలను పంచే

 ఈ మచ్చ లేని చందమామకు

 బడలిక లేకుండా!

 ఒక్క రోజు ఒకే ఒక్క రోజు

 విశ్రాంతిని ఇద్దాం.

 గుడి, బడి, అన్నీ తానై నిలిచిన,

 ఈ మాతృమూర్తికి

 ఒకే ఒక్క రోజు ఒక్క ఆదివారం అయినా

 అమ్మకు శెలవు ప్రకటిద్దాం.


Añadir comentarios