అమ్మకు ప్రేమతో…  (Author: కోటమర్తి రాధా హిమబిందు)

“అమ్మగారు.. తలుపేసుకోండి.. కూరగాయలు తెస్తాను” అంటూ బయటకు వెళ్ళిపోయింది తులసి. భారతీదేవి తలుపులు మూసి బోల్టుపెట్టి సోఫాలో కూర్చుంది. పెద్ద కొడుకు నుండి ఫోన్ వస్తే స్విచ్ ఆఫ్ చేసింది. ఆమెకు గతం గుర్తు రాబోతుంటే లేచి కాసేపు అటూ ఇటూ తిరిగింది. ఎదురుగా గోడమీద వున్న ఫోటోలో భర్త చిరునవ్వులు చిందించాడు. ‘నువ్వు ధైర్యంగా ఉండాలి? ’ ఎంతో లాలనగా ప్రేమగా అంటున్నట్లు అనిపించింది. ‘ఎక్కడ ఎక్కడో బ్రతుకుతున్న ఇద్దరి వ్యక్తులను ఒకటిగా చేసే వివాహబంధం ఎంత గొప్పది? అలా ఒక్కటైన జంట విడివిడిగా చనిపోవడం ఎంత దారుణం? అండలేకుండా ఒంటరిగా జీవించడం చాలా కష్టం.. బాధాకరం.. తోడు ఉంటే ఆ ధైర్యమే వేరు’ భర్తను తలుచుకుంటూ దుఃఖించింది భారతీదేవి. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ముందుకెళ్లి కిటికీనుండి చూస్తూ“తులసి.. తులసీ” అంటూ పిలిచింది.. ఎవరూ పలుకలేదు.. తలుపు తీసింది. ఎదురుగా నిలుచున్న కొడుకులను చూసి విస్తుపోయింది. ధైర్యం తగ్గుతుంటే భర్తను స్మరించుకొని వాళ్లను లోపలికి రమ్మన్నది. ఇద్దరూ కూర్చున్నాక మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. చిన్నకొడుకు చంద్రకాంత్ గ్లాసును టీపాయ్ మీద పెట్టాడు. పెద్దకొడుకు దినకర్ నీళ్ల గ్లాసును కోపంగా బలంగా క్రిందికి విసిరికొట్టాడు. భారతీదేవి క్షణకాలం భయపడింది. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది.

        “ఎందుకోసం వచ్చారు మీరు?” ప్రశాంతంగా అడిగింది.

        “ఎందుకోసమా? నువ్వు ఎలా ఉన్నావో చూసి పోదామని వచ్చాం” హేళనగా అన్నాడు దినకర్. అప్పుడే తులసి నుండి ఫోన్ వచ్చింది.

        “ అమ్మగారు.. మార్కెట్లోకి తాజాగా క్యాలీఫ్లవర్ వచ్చింది తీసుకోనా? ఫ్రిజ్ లో పచ్చిమిర్చి ఉన్నాయో లేదో ఒకసారి చూస్తారా? నాకు సరిగా గుర్తులేదు.. అలాగే పనిలో పని కిరాణా కూడా తేనా?

        “కిరాణా సంగతి తర్వాత చూసుకోవచ్చు.. కూరగాయల వరకు తీసుకొని రా.. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా తీసుకో”“ఎవరు.. తులసే కదా.. ఫోన్ ఇటివ్వు.. మేము మాట్లాడతాం” కఠినంగా అంటున్న కొడుకులకు ఫోన్ ఇవ్వకుండా ఆఫ్ చేసింది భువనేశ్వరి. చంద్రకాంత్ తల్లిని కోపంగా చూశాడు. దినకర్ పళ్ళు కొరికాడు. భువనేశ్వరికి గతం గుర్తొస్తుంటే ప్రతాప్ కు మిస్డ్ కాల్ ఇచ్చింది.. కొడుకులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు.

        ***** *****

        భారతీదేవి భర్త రామారావు చాలా మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి.. పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకువచ్చిన భార్యను అత్యంత ప్రేమగా చూసుకున్నాడు. పెద్ద కోడలుగా ఇంట్లో చాకిరీతో సతమతమయ్యే ఆమెకు ఎవరి సపోర్ట్ లేకుండా అయింది. అయినా ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని బాధ్యతలన్నీ నిర్విఘ్నంగా నిర్వహించి శభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత తన పిల్లల బాధ్యత నిర్వర్తిస్తూ అప్పుడు కూడా శభాష్ అనిపించుకుంది. కొడుకుల పెళ్లిళ్లు అయిన తర్వాత ‘ఇప్పటినుండి తను సుఖంగా బ్రతకవచ్చు’ అని ఆశించిన ఆమెకు భర్త చనిపోవడం బాధే మిగిల్చింది. పిల్లలకు పిల్లలు ఇంకా కలగలేదు. కొడుకులపై అత్తమామల ప్రభావం ఉండటంతో ఆస్తి దగ్గర వాళ్ళు వచ్చి చాలా పెత్తనం చేశారు. తండ్రి సంపాదించింది కొడుకులు హక్కుగా తీసుకున్నారు. ఆ విషయంలో మౌనంగా ఉంది భారతీదేవి. పుట్టింటి నుండి వచ్చిన రెండు ఎకరాల పొలం తన పేరున ఉండటంతో తనే ఉంచుకుంటానని చెప్పింది. కుటుంబానికి గొడుగులా ఉన్న తండ్రి లేకపోవటంతో వాళ్లు మరీ పెట్రేగిపోయి తల్లితో గొడవ పడ్డారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. తనింట్లో ఎప్పటినుండో పనిచేస్తున్న వీరయ్య మనవరాలిని తానే పెంచడంతో ఆ అమ్మాయిని తన కూతురుగానే భావించుకుంది. ఒక పాప పుట్టిన తర్వాత భర్త చనిపోవడంతో పుట్టింటికి చేరింది ఆ అమ్మాయి. తల్లి అమ్మమ్మ వీరయ్య ముగ్గురు ఒకేసారి పడవ ప్రమాదంలో చనిపోవడంతో భారతీదేవి ఆ అమ్మాయిని ఆదరించింది. అది కొడుకులకు నచ్చలేదు. అత్తమామలను పిలిచి మరోసారి కొడుకులు కోడళ్ళు నిలదీశారు.. తులసిని కర్కశంగా బెదిరించారు.

        “మీకు అమ్మ లేదనుకోండి.. నేను తులసి దూరంగా వెళ్లిపోతాం, నాకు అదంటే ఎంతో ఇష్టం. మీ నాన్నకు కూడా ఎంతో ప్రేమ. మీతో పాటు దాన్ని మేము చదివించాం.. దాన్ని కూతురుగానే చూసుకున్నాం.. అది ఒంటరిది.. నేను ఎలాగూ ఒంటరిదాన్నే.. ఇలా మీ పాదాల కింద బతకలేను. నా ఆత్మాభిమానం చంపుకోలేను. ఏమ్మా.. మీకు మీ అమ్మ నాన్న కావాలి. మీ భర్తలకు నాన్న ఎలాగూ లేరు. అమ్మను కూడా వద్దంటున్నారు. రెండెకరాల పొలం మాత్రం కావాలి.. ఇది న్యాయంగా ఉందా?” అంటూ కోడళ్లను మెత్తగా అడిగింది.

        “మీ ఇద్దరికీ ఒక కొడుకు ఉంటే బాగుండేది.. ఆ బంధం ఆ విలువ మీకు అర్థం అయ్యేవి” అంటూ వియ్యంకులను వియ్యపురాళ్లను నిలదీసింది. వాళ్లకు విపరీతంగా కోపాలు వచ్చి అప్పటికప్పుడు వాళ్లు వెళ్ళిపోయారు. తన సామాను బట్టలు సర్దుకుని, ముఖ్యమైన కాగితాలు తీసుకొని తులసి ఇంటికి వెళ్ళిపోయింది భారతీదేవి. చిన్న టౌన్ కాబట్టి అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. అంతా హేళనగా మాట్లాడుతూ నవ్వుకున్నారు కూడా. కొడుకుల పరువు పోవటంతో తులసిని చంపేస్తామని బెదిరించారు. అయినా కొడుకులను లెక్క చేయలేదు భారతీదేవి. కొడుకులకు తెలవకుండా నెలరోజుల్లో మంచి ఇల్లు కొని తులసితో పాపతో ఆ ఇంట్లోకి వెళ్లిపోయింది.

        ***** *****

        “ఎకరం పొలం అమ్మి ఇల్లు కొన్నావట.. అసలు ఏంటి ఈ పైత్యం” దినకర్ మాటలకు ఉలిక్కిపడింది భువనేశ్వరి.“పొలం మా పుట్టింటి వాళ్ళు నా పేరున వ్రాసింది. నా సొంతం నేను అమ్ముకున్నాను.. అది నా ఇష్టం. నా కొడుకులు నా కోడళ్ళు నా కుటుంబం అని నేను అనుకున్నాను.. కానీ మా అమ్మ మా అత్తగారు అని మీరు అనుకోలేదు. నాకు మీతో మాట్లాడాలని ఏమాత్రం లేదు. ఏరా.. తల్లిని బాధ్యతగా చూసుకోలేని మీ బ్రతుకులు ఎందుకు? ఇన్ని సంవత్సరాలైనా మీకు పిల్లలు కలగలేదు. ఎవరికోసం ఇంకా ఈ ఆశ.. ఉన్న ఆస్తి అంతా పంచుకున్నారు. నాన్న చనిపోగానే మీకు చాలా స్వేచ్ఛ వచ్చింది. మిమ్మల్ని కన్నతల్లిగా కనీస గౌరవం నాకు ఇవ్వలేదు. నేను మీనుండి వెళ్లిపోయేలా ప్రవర్తించారు. ఒక పనిమనిషిలా నన్ను వాడుకున్నారు. అమ్మ తెలివి తక్కువది సంతకం పెడుతుంది. రెండు ఎకరాలు మా సొంతం అవుతాయి అనుకున్నారు. ఇదిగో.. ఇలా మీరు మారిపోబట్టే నేను కూడా ఇంతగా మారాల్సి వచ్చింది. మాలాంటి తల్లులం ఎలా బ్రతకాలి? ఎలా జీవనాలు వెళ్ళదీయాలి? పరువు కోసం ఎంతమంది తల్లిదండ్రులు బయటకు రాలేక పిల్లల పాదాలకింద ఇలా నలిగిపోతున్నారో? ఎలాంటి ఆధారం లేక ఎంతమంది తల్లిదండ్రులు మగ్గిపోతున్నారో.. నాన్న పెన్షన్ నాకు రావటానికి తను ఉద్యోగం చేయలేదు వ్యవసాయం చేశారు.. పొలం అమ్మటం తప్ప ఇంకో మార్గం నాకు లేదు. కోటి రూపాయలకు ఎకరం పొలం అమ్మాను. డెబ్భై లక్షలతో ఇదిగో.. ఈ ఇంటిని కొన్నాను. ముప్పయి లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ చేశాను. మీరు నన్ను గెంటేశారు. తులసి నన్ను ఆదరించింది. దానికి ఒక నిండైన జీవితాన్ని తప్పక ఇస్తాను. దానికి పెళ్లి చేస్తాను. పాపకు తండ్రిని తెస్తాను. ఇంకో ఎకరం ఇప్పుడే అమ్మను.. భవిష్యత్తులో ఆ పొలాన్ని ఏం చేస్తానో నాకే తెలియదు. నాకు ప్రశాంతంగా బ్రతకాలని ఉంది” ధైర్యంగా అంది భారతీదేవి. దినకర్ చంద్రకాంత్ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూస్తూ లేచి నిలబడ్డారు.

        “ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకు.. ఏం చేయాలో మాకు బాగా తెలుసు” అంటూ మీది మీదికి వచ్చారు“హలో.. జస్ట్ వెయిట్” అన్న వాయిస్ వినిపించేసరికి గుమ్మంవైపు చూశారు ఇద్దరు.“మీ క్లాస్ మేట్.. ప్రతాప్.. ఎస్ పి.. వీడే నా ధైర్యం.. చిన్నప్పుడు చదువు కోసం వాడి ఊరు నుండి రెండు కిలోమీటర్లు నడిచి వచ్చి చిన్న క్యారియర్లో అన్నం తెచ్చుకుని మీ స్నేహానికి మన ఇంట్లో తినేవాడు. నేను కూడా వాడిని ప్రేమగా చూసుకునేదాన్ని.. హైదరాబాదులో ఉంటున్నాడు. వాడి అత్తగారు మామగారు వాళ్లు పక్కనే వుంటారు. అతను కూడా రిటైర్డ్ ఎస్పి.. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చూసి గుర్తుపట్టాడు. నా పరిస్థితి తెలుసుకొని మీ స్థానంలో నిలబడి నాకు చాలా సహకరించాడు. పొలం అమ్మే విషయంలో, ఇల్లు కొనే విషయంలో వీడే అండగా ఉన్నాడు. అదీకాక ఇక్కడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వీడికి బాబాయ్ కొడుకు.. ప్రతాప్ నా గురించి నీకు అంతా చెప్పాను కదా.. మీరు మాట్లాడుకోండి” అంటూ ప్రతాప్ పక్కకు వచ్చి నిలబడింది భారతీదేవి.

        “దినకర్.. చంద్ర.. అమ్మను వదులుకొని మీరు చాలా తప్పు చేశారు. మీరు చేసిన ఈ తప్పు ఎప్పటికైనా మీకు శాపంగా మారుతుంది. అమ్మా నాన్నే మనకన్నీ చేశారు. ఈ వయసులో వాళ్ళను మనం ఎంత ప్రేమగా చూసుకోవాలి? మీకు నాన్న లేరు. అమ్మను మీ బాధ్యతగా మీరు చూసుకోవాలి కదా.. అమ్మకు ప్రేమతో మీరు అండగా మీరు ఉండాలి కదా.. అమ్మని వదులుకున్న మీరు దురదృష్టవంతులు. అమ్మను ఈ రకంగా పొందిన నేను చాలా చాలా అదృష్టవంతుడిని, నాతోపాటు తులసి కూడా.. అమ్మ జోలికి మీరు ఎప్పుడూ రాకండి. భారతీదేవిగారు ఇకనుండి నాకు తులసికి అమ్మ.. మీకు కాదు. విలువైన వజ్రంలాంటి మీ అమ్మను మీరు చేజార్చుకున్నారు. ఈ వజ్రాన్ని అపురూపంగా అందుకున్నాను నేను.. అంతే.. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు.. అమ్మను తీసుకెళ్ళుదామని వచ్చాను” అంటూ భారతీదేవి భుజాల చుట్టూ చేయివేసి ప్రేమగా, ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు ప్రతాప్.. సరిగ్గా అప్పుడే తులసి లోపలికి వచ్చింది. దినకర్ చంద్రకాంత్ కు ఏం మాట్లాడాలో తోచక మాట్లాడలేని శిలావిగ్రహాల్లా నిలబడిపోయారు.

        ***** *****

Añadir comentarios

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)