అమ్మ
అమ్మ (Author: మైలవరపు శ్రీవల్లి భాస్కర్)
సాయం సంధ్య వేళ గోరింటాకు చెట్టు నుండి ఒక్కొక్క ఆకు కోస్తూ చీర కొంగు విడదీసి అందులో వేస్తోంది సీతాలు. అప్పుడే సన్నగా వాన తుంపరులు ప్రారంభం అయ్యాయి, పేరటిలోని మొక్కలు ఆనందంగా తలలాడిస్తూ ఆ వాన చినుకులు ఆస్వాదిస్తున్నాయి. మందార పువ్వులు విచ్చుకుని చిరునవ్వులు చిందిస్తున్నాయి.
మనసు ప్రశాంతంగా లేదు భర్త మాటలు గిరగిర తిరుగుతున్నాయి, నెల రోజుల నుండి తన అంతరంగాలలో సాగుతున్న అంతర్యుద్ధం. ‘అసలు నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా’ సీతాలు నోటి నుండి బాణంలా దూసుకొని వచ్చింది. ‘మన కష్టాలు తీరిపోతాయి’ మరో మాటకు తావు లేకుండా తలవంచుకుని ‘కష్టపడి సంపాదిస్తే కష్టాలు తీరుతాయి కాని ఇలాంటి పనుల వలన కాదు మావ’
‘బయట వెలుగు ఇంటిలో చీకటి ఇదేనా మన బతుకు, అయినా ఇప్పుడు అడుగుతున్నది మన కోసం కాదు, మన పిల్ల భవష్యత్ కోసం’. సీతాలంటే ఎంతో ప్రేమ, ఇల్లు గడవడం కోసం సీతాలు కూడ కష్టపడడం చూడలేక ఎవరి ద్వారానో పరిచయమైన వ్యక్తుల ద్వారా ప్రపోజల్ రావడంతో భార్యను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు.
గోధూళి వేళ చూడాలి సిద్ధాపురం పల్లె మనోహర దృశ్యం. సాయం సంద్య వేళ సూర్యుడు మెల్లగా పడమర కొండలలోకి దిగుతూవుంటే... ఆ పసిడి కాంతిలో గ్రామం మెరుస్తూ ఉంటుంది. గేదెలూ, ఆవులు వరుస క్రమంలో ఇంటికి తిరుగు ముఖం పడుతూ ఉంటే పేడ కోసం తట్టలు పట్టుకుని వాటి వెనుక పరుగులు తీసే పిల్లలు, వారితో పోటిగా లేగ దూడల గెంతులు. గ్రామం మొత్తానికి ఐదారు మోతుబరి రైతుల భవంతులు, అక్కడక్కడ పెంకుటిళ్ళు, మిగిలిన గుడిసెలు వంద వరకు ఉంటాయి.
ఆ గ్రామంలో బడి లేదు కాని వారు నమ్ముకున్న గుడి ఉంది. నాట్లు నాటేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, పండుగలు పబ్బాలకు జనంతో ఆ గుడి తిరుపతి వెంకన్న స్వామి కొండను తలపిస్తుంది. అనారోగ్యం వస్తే దవాఖానా లేదు కాని పంతులు గారు కల్వంలో నూరిన మందును చిన్న చిన్న గోళీలుగా చేసి, నాడి పట్టుకోకుండానే మనిషిని చూసి ఇస్తే చాలు ఎటువంటి రోగమైన వేప మండలకు దెయ్యం వదిలినట్టు వదల వలసిందే అదే వారి నమ్మకం. అయితే రెండు రోజులకు ఒకసారి రయ్... రయ్ మంటు మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ ఎర్రబస్సు ఒకటి ఆ గ్రామానికి వచ్చి వారందరని పలకరించి వెళుతుంది. గవర్నమెంట్ వాళ్లకు, రాజకీయ నాయకులకు ఆ గ్రామం గుర్తుకు వచ్చేది ఎన్నికల సమయంలో మాత్రమే.
సీతాలు తొమ్మిదో తరగతి వరకు చదువుకొని మావ మీద మనసుపడి, అమ్మానాన్నలను ఒప్పించి పెళ్ళి చేసుకొని సిద్ధాపురం వచ్చింది. గ్రామంలో తెలుసున్న ఇళ్లలో పని చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ, గ్రామంలోని పిల్లలను చేరదీసి చదువు, ఆటలు నేర్పిస్తుంది. గ్రామంలో చాలా మందికి తలలో నాలుక... ఏ విషయమైనా సీతాలు సలహ తీసుకుంటారు.
గ్రామానికి రెండు గంటల దూరంలో పట్నం ఉంది. సినిమా హాళ్ళు, ఆసుపత్రులు, బట్టల షాపులతో చాల సందడిగా ఉంటుంది కానీ ఆ పట్నం చాల చిన్నది కావడంతో అందరు దాన్ని చిన్నపట్నం అని పిలుస్తారు. పండుగలు, జాతరలు వచ్చిప్పుడు బళ్లు కట్టుకొని ఈ పట్నానికి వచ్చి కావలసినవి కొనుక్కుని, సినిమా చూసి వెళతారు. ఎవరికే అవసరం వచ్చినా సైకిళ్ళ మీద గుంపులు గుంపులుగా వచ్చి కావలసినవి తీసుకొని చీకటి పడక ముందే గ్రామానికి చేరుకుంటారు.
పంచభూతాలకు సీతాల ఇల్లు అంటే మహా ఇష్టం ఆ మధ్య నిప్పు అంటుకొని గుడిససె మొత్తం కాలిపోతే మిగిలిన సామాన్లు బయట పడేసి. మట్టి గోడలు లేపి వాటికి తాటి దూలాలు అమర్చి వెదురు బద్దలు కలిపి పెంకులతో ఇంటిని అందంగా తీర్చిదిద్దింది. మొన్నటికి మొన్న ఈదురుగాలికి పై కప్పు పెంకులు ఎగిరిపోయాయి, మిగిలిన పెంకులను కోతులు పీకి పారేస్తున్నాయి. తిరిగి పెంకులు అమర్చి ఆపై గోనే సంచులు కప్పి తాళ్లతో కట్టి, రాళ్లు బరువుగా పెట్టించారు. వర్షపు నీరు ఆ పెంకుల మధ్యలోనుండి దారి చేసుకొని ఇంటి లోపలకు తొంగి చూస్తున్నాయి.
ఇంట్లో నీళ్లు కారే చోట గిన్నెలు పెట్టి ఆ నీటిని చాకచక్యంగా ఒడిసి పట్టేందుకు ప్రయాశపడుతోంది సీతాలు బిడ్డ. అక్కడ గిన్నె ఇక్కడ, ఇక్కడి గిన్నె అక్కడ పెడుతూ ఒక ఆటలా తెగ సంబర పడుతోంది. తమ బతుకులు ఆ పసి మనసుకు ఏమి తెలుసు ఆ దృశ్యం చూస్తూ మనసులో అనుకుంది సీతాలు.
ముఖానికి ముత్యమంత పసుపు, నుదుటున పావలా కాసంత మందారంలాంటి బొట్టు, నెమలికి కట్టినట్టు అందంగా కట్టిన చీర కట్టు, చేతులు నిండుగా వేసుకున్న గాజుల గలగలలు. సీతాలు ఆహార్యం చూస్తే పెద్దింటి అమ్మాయిలా అనిపిస్తుంది. చినుకులు తగ్గడం తో బిందె చంకన చేర్చి నడుస్తూ ఉంటె హంస ధ్వని రాగంలా ఘల్ ఘల్ మనే కాలి అందెలు... సీతాలు వస్తోంది అనేందుకు సంకేతాలు. ఆ ఆలోచనలతోనే పెద్దబావి వద్దకు నడిచింది.
‘వారు సెలవు పై వచ్చారు, మనం మాట ఇస్తే, డబ్బులు ఇచ్చేస్తారు ఇంక ఎవరితోను సంప్రదించరు’ ఆ మాటలు అలలు అలలుగా గాలిలో తెలియాడుతూ సీతాలు చెవులలో మారుమ్రోగుతున్నాయి. ‘జస్ట్ కని ఇచ్చేయడమే’
చిన్న గాలివానకే కరెంటు పోతుంది, మిణుకు మిణుకు మని వెలిగే కిరోసిన్ బుడ్డి వెలుతురులో భర్త మోహం కేసి చూసింది సీతాలు. ‘జస్ట్ అంతే, అలాగే చెప్పారు చాలా ధనవంతులు వాళ్లు, వారికి పిల్లలు లేరు. డబ్బులు బాగా ఇస్తారుట’
‘ఏంటీ జస్ట్ కని ఇచ్చేయడమేనా... నీ మాటలు వింటే నరాలు కట్ అయిపోతున్నాయి... ’ గాలికి అటుఇటు అడ్డంగా తల ఆడిస్తూన్న కిరోసిన్ బుడ్డి వైపు చూస్తూ... సీతాలు
‘ప్రసవం వరకు ఖర్చులు అన్నీ వాళ్లే భరిస్తారు. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు, కాలు కింద పెట్టనివ్వరు. మన కష్టాలు తీరుతాయి, ఆలోచించు’
‘మన బతుకులకు ఒక్కరే చాలు అనుకున్నాం, కాని పెద్ద అయ్యాక కష్టసుఖాలు పంచుకోవడానికి, కనీసం చెప్పుకోవడానికి మరొకరు తోడు ఉండాలని ఆలోచించి ఈమెకు తోడు మరొకరి కోసం ప్రయత్నిస్తే ఏమైంది... దైవానుగ్రహా లేక సంవత్సరం క్రితం అబార్షన్ అయ్యింది. కొన్ని సంవత్సరాలు వరకు ఆగమని డాక్టరమ్మ చెప్పింది కదా’ గత విషయాలు గుర్తు చేస్తూ సీతాలు.
‘లక్ష్మిదేవి మన ఇంటి తలుపు తడుతోంది, మన కష్టాలు తొలిగిపోతాయి, ప్రసవ్ం అయ్యే వరకు ఖర్చు అంతా వాళ్లే చూసుకుంటారు. నువ్వు ఆరోగ్యంగా ఉండేందుకు పళ్లు, టానిక్‌లు... తొమ్మిది నెలలు నిన్ను కంటికి రెప్పలా అసలు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. ప్రసవం కాగానే బిడ్డను తీసుకుని వెళ్ళిపోతారు’
‘డబ్బు కోసం కన్న బిడ్డను అమ్ముకుంటామా, ఎంత నీచం’
‘సీతాలు.. నీకు అర్ధం కావడం లేదు వారికి పిల్లలు పుట్టరని తెలిసి పెంచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు, అందుకు ప్రతిగా మనకు డబ్బులు ఇస్తున్నారు’
‘పౌరాణిక సిన్మానా ఏంటి?... అర్ధం కాకపోవడానికి’
‘వాళ్ళకు మాట ఇచ్చాను... చాలా మంచి వాళ్ళు’
‘నాకు మనసు ఒప్పుకోవడం లేదు కంటే మన పాపకు తోడు కోసమే కనాలి. అంతే కాని ఇలా అమ్ముకోవడం అన్నది... అయినా ఊళ్ళో మన పరువు ఏం కాను? పైసల కోసం కన్న బిడ్డను అమ్ముకుందని చెడ్డ పేరు రాదు?’
‘మందితో పని ఏముంది మన ఆకలి తీరుస్తున్నారా?, మన కష్టాలు పంచుకుంటున్నారా! ’
‘కన్న మమకారం, అమ్మతనం గురించి నీకు ఏం తెలుసు మావ, పైసల కోసం కడుపు తీపిని చంపుకొని, అమ్మతనం చిన్నబోయేలా వ్యవహరించడమా!’
‘పుట్ట లేదనుకో... ’
‘మావ... ’ఒక్క అరుపు అరిచింది గట్టిగా సీతాలు
‘నారు పోసిన వాడు నీరు పోయడా... అని నువ్వు అంటావు కదా ఆ నీరు పోసేవాడే ఇప్పుడు వచ్చాడు’
‘ఊరి వారు ఏమనుకుంటారు ఆలోచించావా మావా?’
‘జనానికి మనం ఏం చెపితే అదే. పట్నంలో ప్రసవం చేసుకుని వస్తాం, అప్పుడు ఏదో ఒకటి చెబుతాం’
బావిలో వేసిన చేద ఎంతకూ పైకి రాక పోవడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి నూతిలోకి తొంగి చూసింది. బావిలోకి ఒకేసారి దిగిన చేదలు అన్నీ ఒక దానికి ఒకటి చిక్కుకొని విడువడడం లేదు. మదిలో చిక్కుకున్న సీతాలు ఆలోచనలు కూడ అలానే ఉన్నాయి, చాలా చిరాకుగా.
‘ఓయ్ మరదలు పిల్లా నీళ్లు నింపకుండానే బిందె సంకన పెట్టుకుని పోతున్నావు. ఏంటీ ఆలోచనలు... మళ్లా నీళ్ళోసుకోవడానికా... ’
చెక్కు చెదరని బంధాలు, కల్మషాలు లేని అప్యాయతలు ఆ పల్లె సొంతం, ఆ పలకరింపులలో ఏదో తెలియని అభిమానం.
****
భోజనాలు ముగించుకొని చీకటిపడ్డాక ఇంట్లో వాళ్లు అంతా ఆరుబయట అరుగులు మీద, నులక మంచాలపై చేరి నింగినున్న ఆ నిండు చంద్రుడి అందాలు వీక్షిస్తూ, నక్షత్రాలను లెక్కబెడుతూ దేశంలోని కబర్లు అన్నీ కలబోసి మనసులను తడుతూ ఏ జాములోనో నిద్రలోకి జారుకునేవారు.
ఓరోజు రాత్రి తొమ్మిది గంటలు ఆకాశంలో మెరిసే మెరుపులకు ఒక్కసారిగా మెలుకువ వచ్చింది సీతాలకు, కడుపులో కదలిక. డాక్టర్ ఇచ్చిన సమయం ఇంకా రెండు వారాలుంది, మరి ఈ అలజడి మంచం పై నుండి లేవడానికి ప్రయత్నం చేసింది కాని శరీరం సహకరించలేదు, మెరుపు గర్జనలకు చిగురుటాకులా వణికిపోతోంది సీతాలు.
మత్తుగా మూలుగుతున్న సీతాలును చూసి కంగారు పడి బయటకు వచ్చి పిలిచాడు. ఊరి లోని జనం సీతాలు ఇంటి ముందుకు చేరారు. సిద్ధాపురం లోనే కాకుండ చుట్టుపక్క పల్లెలకు సుపరిచితురాలు అయిన మంత్రసాని వీరమ్మకు కబురు అందింది. కబురు అందిందే తడవుగా చినుకులను లెక్కచెయ్యకుండా తలపై చిన్న గోనే సంచి పెట్టుకుని పరుగు పరుగున సీతాలు ఇంటికి చేరుంది.
‘కదలకు నాతల్లి కాస్త ఓపిక పట్టు, ధైర్యంగా ఉండాలి... నేక పోతే నీ పాణాలకే పమాదం’ మంత్రసాని హెచ్చరిస్తోందో లేక గద్దిస్తోందో అర్ధం కాలేదు సీతాలుకు.
భర్త, బిడ్డ గుర్తుకు వచ్చి కళ్లంట నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి, పట్నం వెళ్లి పురుడు పోసుకుని గుట్టుచప్పుడు కాకుండా గ్రామానికి వచ్చి ఏదో చెబుతాం అన్నాడు భర్త. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటో... అయోమయంగా ఉంది సీతాలకు.
జీవితంలో బతకడానికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు సంపాదించడానికి ఇంత వేదన అనుభవించాల. అయినా ఈ బాధ భర్తలకు ఏమి తెలుసు ‘జస్ట్ కని ఇచ్చేయడమే’ భర్త పై పట్టరాని కోపం వచ్చింది సీతాలుకు.
‘గర్భం ధరించడం ప్రతి స్త్రీ జీవితంలో ఓ అద్భుతమైన విషయం, తొమ్మిది నెలలు బిడ్డను మోయాలంటే మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి... నర్స్ వీళ్ళ ఇద్దరికి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పు’ అంది బెడ్ మీద పడుకున్న సీతాలును చెక్ చేసిన డాక్టర్.
సీతాలు తో పాటు వచ్చిన వారిని డాక్టర్ కూర్చోబెట్టి తీసుకోవలసిన జాగ్రత్తలు, శరీరంలో జరిగే మార్పులు హార్మోన్ల హెచ్చుతగ్గులు గురించి వారికి చెపుతూ ఉంటే. కర్టెన్ వెనుక బెడ్ మీద సీతాలు, ఆమె భర్త ఆ మాటలు వింటున్నారు జాగ్రత్తలు చెప్పే నర్స్ ఇంకా రాకపోవడంతో.
‘ఆమె ఒత్తిడి, ఆందోళన చెందకూడదు, బెడ్‌రెస్ట్ ఉండాలి, వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది... అంటూ డాక్టర్ చెపుతున్నారు.
మదిలో అప్పటి ఆలోచనలు తిరుగుతూ ఉంటే... మరోవైపు మంత్రసాని సూచనలు పాటిస్తూ చేతి పిడికళ్ళు గట్టిగా బిగించి, పంటికింద పెదాలను నొక్కిపట్టి బాధను ఓర్చుకుంటోంది సీతాలు.
అప్పుడే తెల్లటి పైజామా నుదుటన వీబూది నామాలు ఆ నామాల మధ్యలో ఎర్రటి కుంకం బొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో, చూరు తగలకుండా తల వంచుకుని భుజం మీద కండువా పడిపోకుండా పట్టుకుని లోపలకి అడుగు పెట్టాడు ఆరు అడుగుల ఆజానబాహుడు ఆ పల్లెవాసుల పంతులు.
‘పట్నం డాక్టర్ కొన్ని సంవత్సరాలు ఆగమని చెబితే ఎందుకు తొందర పడ్డారు... ’ సీతాలు మంచం పక్కన కూర్చుని నాడి పట్టుకొని చుస్తూ.
ఏమి చెప్పాలో తెలియక దూరంగా ఉన్న పిల్లను చేతితో సంజ్ఞ చేసి దగ్గరకు రమ్మని పిలిచింది సీతాలు. కూతురు తలపై చేయ్యి వేసి నిమురుతూ ‘దీని కోసం... దీని భవిష్యత్ కోసం నిర్ణయం తీసుకోవలసి వచ్చింది’ గొంతుకు గద్గతపోయి వస్తున్న దుఃఖం ఆపుకుంటూ.
‘బిడ్డ అడ్డం తిరిగింది, సాన కష్టం వెంటనే చిన్నపట్నం తీసుకు పోవాల, గంట మాత్రమే సమయం ఉంది, నేకపోతే తల్లి పాణానికే పమాదం’ బయటకు వచ్చిన మంత్రసాని అక్కడ ఉన్నవారికి గట్టిగా చెప్పి గబగబ తిరిగి లోపలకి వెళ్లిపోయింది.
ఆ మెరుపుల వెలుగులలో ఆమె కంగారు అందరికి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సీతాలుకు ఏమైన జరిగితే ఆ ఊహకే కళ్లు తిరిగి తూలిపడబోయిన భర్తను పట్టుకున్నారు.
‘పిల్లలను కనడం ఒకటే కాదు, పెంచడం కూడ తల్లి బాధ్యత. ఆ కోడిపిట్టను చూడు తన పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటోంది. ఎవరూ ఎత్తుకుని పోకుండా ఎంతో కష్టపడి తన రెక్కల మాటున దాచుకుంటొంది... అదీ అమ్మతనం’ సీతాలు మాటలు గుండెలలో గునపాలలా గుచ్చుకుంటున్నాయి.
‘బిడ్డ ఏడిస్తే తల్లి మనసు తల్లడిల్లి తన గుండెలకు హత్తుకొని లాలిస్తుంది, బిడ్డ ఆకలి బిడ్డకు తెలయదు కాని తల్లికి తెలుసు అది తల్లి ప్రేమ. నిద్రలో బిడ్డ చిన్నగా కదిలినా తల్లికి మెలకువ వచ్చేస్తుంది అదీ తల్లి బిడ్డ కి మధ్య ఉన్న బంధం, ఆ బంధాన్ని విడదీయాలని చూస్తున్నావు’ సీతాలు మాటలు గుర్తుకు వస్తున్నాయి.
‘మన కోసం అయితే అందులో ఓ ప్రేమ, ఆప్యాయత, ఓ కమ్మని అనుభూతి కలబోసి ఉంటుంది, బిడ్డ పుట్టీపుట్టగానే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే... ప్రేమ పెంచుకోవడం అవసరమా! ’ సీతాలు మాటలు గుండెలలో గుచ్చుకుంటున్నాయి.
‘ఈ సమయంలో చిన్నపట్నం ఎలా వెళ్లాలి... కనీసం మూడు గంటలు పడుతుంది. అడ్డరోడ్డులో అయితే గంటన్నరలో వెళ్ళవచ్చు’ అన్నారు ఎవరో.
‘కాలవ గట్టు నుండి వెళ్లితే ఇంకా తొందరగా వెళ్లవచ్చు... ’
‘అది చాల ప్రమాదం ఈ వర్షంలో గట్టు జారిపోతుంది’
‘తుఫాను…ఉదయం నుండి ముసురు అలానే ఉంది, కరెంటు కూడ లేదు ఎప్పుడు తీరం దాటుతుందో…’ తలొకరు తలో మాట మాట్లాడుతున్నారు
అసలు ఈ గ్రామం లో వైద్యశాల కావాలని అది వచ్చే వరకు ఎవరు ఓటు వేయ్యకండి అని సీతాలు చాలసార్లు చెప్పింది కాని ఎవరు వినిపించుకోలేదు, ఇప్పుడు ఆమెకే ఆపద వచ్చింది ఆమెను కాపాడుకోవాలి అని మనసులో అనుకుని. మాటలతోనే కాలక్షేపం జరుగుతున్నట్లు భావించి, మాటలు కాదు చేతలు కావాలని కూర్చున్న చోటు నుండి లేచాడు గ్రామ పెద్ద చంద్రన్న.
భుజానికి ఉన్న తుండు తీసి తలకి చుట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్లి తన ట్రాక్టరును తీసాడు ఇంజను మోరాయించడంతో చాలా తీవ్రంగా ప్రయత్నం చేసాడు కాని సాధ్యపడలేదు. ఆలస్యం కాకూడదని పడుకున్న ఎద్దులను అదలించాడు, ఎద్దులకు ఏమి చెప్పాడో ఏమోగాని మెడలో గంటలు చప్పుడు చేసుకుంటూ సీతాలు కోసం మేము సిద్ధం అని ఒళ్లు విదిలించాయి. వాటికి కాడి తగిలించి బండి లోపల గడ్డి వేసి ఆపైన ఇంటిలో ఉన్న పరుపు తీసుకుని వచ్చి వేసాడు. వర్షానికి తడవ కుండా పైన ఉన్న చాప పరదా సక్రమంగా ఉందా అని పరిశీలించి భార్యను ఎక్కించుకుని సీతాలు ఇంటికి బండి పోనిచ్చాడు.
నాలుగు హరికేన్ లాంతర్లు సిద్ధం చేసి ఆ వెలుతురులో మెల్లగా సీతాలను బండి మీదకు చేర్చారు. ఆ వెనుకే మరో నాలుగు ఎడ్లబళ్లు సిద్దం అయ్యాయి.
వరుణుడు ప్రతాపం చూపినా, మెరుపులు గర్జించినా, సీతాలు కోసం మేమున్నామని గ్రామ జనాభా బళ్లు ఎక్కారు.
యుద్ధానికి బయలుదేరిన సైనికులులా... గుడిలోని దేవునికి వినబడేలా... మెడలో గంటలు మ్రోగించుకుంటూ గుడి ముందు నుండి ఒకదాని వెనక ఒకటి ఎడ్లబళ్లు చిన్నపట్నం వైపు కదిలాయి.
‘సీతాలు కాస్త ఓపిక పట్టవే పట్నం పోతున్నాం, అంతా మంచిగానే జరుగుతుంది. నా తప్పు అయితే క్షమించు’ సీతాలు రెండు చేతులు పట్టుకుని ఏడుపు ఒక్కటే తక్కువ మావకి
ఎద్దులను అదిలించి అడ్డరొడ్డులో పరుగులు తీయిస్తున్నారు, మధ్యమధ్యలో డప్పుల శబ్దం చేస్తూ ఉంటే. ఆఖరు బండిలో ముసలితాత పాట గట్టిగా అందుకున్నాడు.
ఆ చీకటిలో తమ దారికి ఏవి ఆటంకం కలిగించకుండా మంది వస్తున్నారు అన్న సంకేతం, తోటి జనంలో భయం పోగొట్టే మంత్రం ఆ పాట.
ఎడ్లపందాలలో పోటి పడినట్లుగా ఎద్దులు పరుగులు తీస్తున్నాయి...
‘కొంచం ఓపిక పట్టమ్మా... పట్నం దగ్గరకు వచ్చేతాం’ పక్కనే కూర్చుని మంత్రసాని సముదాయిస్తోంది సీతాలును.
నింగి నున్న గంగమ్మకు అలుపు లేదు, చారెడు నీళ్లు కూడ తాను ఉంచుకోకుండా అన్నీ నేల మీదకు కుమ్మరించేస్తోంది.
బళ్లు అన్నీ ఒకదాని వెనుక ఒకటి ఒక్కసారిగా ఆగిపోయాయి... ఏమైందో అన్న కలవరం
‘ఓరి చంద్రు ఏమైనాదిరా... ’చివరి బండిలోనుండి ముసలి తాత అరుపు
‘రోడ్డుకి అడ్డంగా ఏమో ఉంది, సరిగ్గా అగుపించడం లే’
‘సరిగ్గా చూడు దొంగలో నేక జంతువో... తొందర పడమాక’ అదే గొంతుక హెచ్చరించింది.
‘రోడ్డుకు అడ్డుగా నల్లగా అగుపిస్తోంది, దగ్గరకు వెళ్లి చూడాల’
‘క్షణం ఆగు జంతువు అయితే కదులుద్ది, దొంగ అయితే ఆడే వస్తాడు’ మరలా చీకటిని చీల్చుకుని వచ్చింది
‘నన్ను రమ్మంటావా... ’ బెరుకు లేని ఆ గొంతుకు గట్టిగా అరిచింది. చేతిలో దిట్టమైన కర్ర పట్టుకుని, ఎన్నో భయాలను దగ్గర నుండి చూసిన అనుభవం అది.
ఆ అరుపు మెరుపు కన్నా గట్టిగా చీకటిలో ప్రతిధ్వనించింది, చినుకులకు తడుస్తూ, చలికి బెదురుతూ ముడుచుకకొని సేదతీరుతున్న చెట్టుమీద పక్షులు ఉలిక్కిపడి లేచి, అరుపులు మొదులు పెట్టాయి తమ సామ్రాజ్యంలోకి ఎవరో శత్రువులు వచ్చారని.
సాధారణంగా రాత్రి తొమ్మిది దాటాక ఆ గ్రామానికి చిన్నపట్నానికి మధ్య రాకపోకలు ఉండవు. దారికాచి దోచుకునే దొంగలు, విషజంతువుల సంచారం ఎక్కువ. దారిపొడవున ఉన్న మర్రిచెట్లు ఊడలను చీకటిలో చూస్తే దడుసుకుని మూడు రోజలు నిద్ర లేవరు. ఏవైన పనులు మీద పట్నం వెళ్లినవారు సాయంత్రం గూటికి చేరిన పక్షుల మాదిరి గుంపులు గుంపులుగా సైకిలు మీద, బళ్ల మీద గ్రామానికి వచ్చేస్తారు.
తమ గ్రామ ఆడపడుచును కాపాడుకోవాలి అది ఒక్కటే మనసులో మెదిలే ఆలోచన, ధైర్యంగా బండి మీద నుంచి దూకి లాంతరు అందుకుని ఊపిరి బిగ పట్టి ముందుకు నడిచాడు చంద్రన్న.
రోడ్డుకు అడ్డంగా చెట్టు పడి ఉంది గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. చెట్టు తొలగిస్తేగాని బళ్లు ముందుకు కదిలే స్థితి లేదు. నింగి నుంచి శివ గంగ ఆగడం లేదు, తాటిఆకు గొడుగు ఆ నీటిని నిలువరించలేకపోతోంది.
‘మా చెడ్డ బమ్మదేవుడు ఓ జీవిని ఈ భూమ్మీదకు తీసుకుని రావడానికి... ఎంత చేస్తున్నాడో’ అన్నాడు పక్కనే వచ్చి నుంచున్న ముసలి తాత నిట్టూరుస్తూ.
‘దేవుడి లీలలు ఇట్టానే ఉంటాయి... నాను దివిసీమ తుఫానులో పుట్టానుట అందుకే నన్ను దివి చంద్రుడు అనే వారు’ అన్నాడు చంద్రన్న.
‘ఆగు చంద్రం మన బళ్లు ఆపడానికి దొంగలు చేసిన పనా నేక అదే పడిందా చూద్దాం’ మనసు శంకించడంతో హరికేన్ లాంతరు పట్టుకుని ఆ చుట్టు కలియచూసాడు ముసలి తాత
‘సీతాలు లేయే... సీతాలు... ’
‘మందితో మనకు పని ఏముంది అనబోక మావ, ఐదు వేళ్లు కలిస్తేనే ఏ పని అయినా చెయ్యగలము, అలాగే అందరిని కలుపుకుబోవాల. ఏవరితోను గొడవలు పడకూడదు... ’ సీతాలు మాటలు చెవులలో మ్రోగుతున్నాయి.
‘అయ్యా మీ అందరి కాలు మొక్కుతానే, మీరు చూపుతున్న ప్రేమ చాలా గొప్పది, సీతాలంటే నాకు మిక్కిలి ప్రేమ. ఈ గండం నుంచి సీతాలును బతికించండయ్య... మీకు రుణ పడి ఉంటాం, మాపై దయ చూపండయ్య’ అంటూ అందరకి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఏడుస్తున్నాడు.
ఆ ఏడుపుకు అక్కడున్న వారికి ఒళ్లు జలదరించింది, వెనకకు వెళ్లడానికి సమయం లేదు. చెట్టుని తొలగించి ముందుకు సాగాలి అనుకుని. వెనుదిరిగి బళ్ల వైపు చూసాడు చంద్రన్న, ఎవరు కదలడం లేదు. వర్షానికి బాగా తడిసి ముడుచుకుని కూర్చున్నారు.
‘అందరు వినండి... మన గ్రామానికి ఆసుపత్రి వచ్చేవరకు ఎవరు ఓట్లు ఎయ్యడానికి ఈల్లేదు. మన సీతాలు చాలా సార్లు మనకు చెప్పినా... మనలో మనకు పొసగక సీతాలు చెప్పిన మాటలు వినలేదు. గ్రామ పెద్దగా నేను సెపుతున్నా ఇనండి. ఈ సారి ఎలచ్చన్‌లకి ఎవరు ఓటు ఎయ్యడానికి ఈలేదు. మన ఊరి పాణం సీతాలును కాపాడుకుందా రండి... మగవాళ్లు అందరు బళ్లు దిగండి చెట్టు తొలిగిద్దాం’ అన్నాడు గట్టిగా అందరికి వినిపించేలా చంద్రన్న.
సీతాలు బాగా ఆయాస పడుతోంది, ఊపిరి అందడం లేదు, శరీరం అంతా చల్ల బడింది, పొట్ట పైకి కిందకు ఆడుతోంది. మంత్రసాని రెండు కాళ్లు అదిమి పట్టి ధైర్యాన్ని ఇస్తోంది సీతాలుకు.
సీతాలుకు నోట్లో నుండి మాట పైకి రావడం లేదు. ఏదో అంటోంది పైకి వినబడటం లేదు. సీతాలు చెవి దగ్గరకి వెళ్లి ‘భయపడమాక దేవుడు చల్లగా చూస్తాడు పట్నం పోతున్నాం, నీకు ఏంగాదు’ అన్నాడు మావ
ఏదో అంది సీతాలు వినబడలేదు, ఏమి కాదు అన్నట్టు సముదాయించాడు మావ సీతాలును
మావ చెయ్య పట్టుకుని దగ్గరగా లాగింది సీతాలు, మావ తన చవిని సీతాలు దగ్గరగా పెట్టాడు
‘మావ ఇందులో నీ తప్పు ఏమి నేదు, మన చిన్నదాని భవిష్యత్ కోసం నీ ఆలోచన. మన బతుకులే ఇట్టా ఉన్నాయి’
సీతాలును ఎక్కువ మాటాడించొద్దని మంత్రసాని హెచ్చరించడంతో
‘నువ్వు ఊకోవే సీతాలు’ అనవసరంగా వారి నుండి డబ్బులు తీసుకుని నిన్ను కష్టంలోకి నెట్టాను
సీతాలు ఏదో చెబుతూ చెయ్యి చాచింది, మావకు వినబడలేదు సీతాలు పెదవుల దగ్గర చెవి పెట్టాడు.
‘నాకు మాట ఇవ్వవా’ కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి సీతాలుకు. మావ చేతిని తీసుకొని తన పొట్టమీద రాస్తూ...
‘మావ ఈ బిడ్డను ఎవరికి ఇచ్చేది లేదు మనమే ఉంచుకుందాం... ఈ బిడ్డే మన బిడ్డకు తోడు. నేను కష్టం చేసి పైసలు తెస్తా... ’ మెల్లగా సీతాలు కళ్ళు మూత బడిపోయాయి.
‘సీతాలు... సీతాలు... తప్పు చేసాను క్షమించు సీతాలు’ మావ స్వరం గద్గద పోయింది
‘పట్నం త్వరగా వెళ్లగలిగితే మంచిది, నేక పోతే చేజారిపోతుంది’ మెరుపుల వెలుగులలో సీతాలును చూస్తూ మంత్రసాని.
ఆ మాట విన్న ముసలి తాతకు ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది ఆలస్యం చేస్తే... అంతకన్నా ముందు రాబోయే ప్రమాదం కనిపెట్టాడు దూరం నుండి జంతవులు అరుపులు వినిస్తున్నాయి నిశిరాత్రి... చుట్టూ చిమ్మచీకటి జంతువులు ఒక్కసారిగా దాడి చేస్తాయి, ఎటువైపు నుండి వస్తాయో తెలియదు, మనుష్యుల వాసన వాటికి చేరింది. జంతువులు కన్నా అతి ప్రమాదం దొంగలు ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఎదుర్కోలేం అని అనుకున్నాడు. కర్రలకు గడ్డి చుట్టి అంటించి మంటలు పెద్దవి చేయమని హెచ్చరించాడు. వచ్చిన వాళ్ళలో ధైర్యం నింపేందుకు పెద్ద కంఠంతో పాట అందుకున్నాడు.
చల్లబడిన శరీరంలో రక్త వేగంగా కదులుతూ ఉంటే ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, శత్రువులకు ఎదురొడ్డి దేశ భద్రత కోసం సరిహద్దులలో కావలి కాసే సైనికులులా తమ గ్రామ బిడ్డను రక్షించుకోవాలని ఒక్కొక్కరు బళ్ల మీద నుండి కిందకు దుమికారు.
తల్లిని కాబోతున్నానన్న వార్త తెలిసి అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది స్త్రీ. ప్రసవ వేదనను భరిస్తూ బిడ్డకు జన్మనిస్తున్న మాతృత్వం, అదే అమ్మతనపు సౌభాగ్యానికి నిలువెత్తు నిదర్శనం ‘అమ్మ’
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)