Article
హౌరా మెయిల్లో (Author: పెనుమాక రత్నాకర్)
నేను మండలం రోజుల దీక్ష తర్వాత అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమల ఎల్తన్నాను. కన్నెస్వామిగా ఇది నాకుఐదోసారి శబరి ఎల్లటం. మా ఏనుగుల మహల్లో నాలా ఎల్లినోళ్ళు లేరు. మాఊరు రావులపాలిం నించి బబ్బర్లంక ఎల్తంటే తగుల్తాది. నేను చేలా నిష్టగా ఈమండలం రోజులూ పాటిత్తాను. పొద్దున్నే సూరీడు రాకముందే లెగిసి గౌతమిలో తానం చేసి తెల్లారగట్లే పూజ మొదలెడతాను. ఈ మండలం రోజులూ ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం మసాలాలు ముట్టను. ఇంటికెళ్ళను. మా స్వాములందరం పడిపూజకని తెలుకులోళ్ళ ఈదిలో ఉండీ రామాలయం తీసుకున్నాం. అక్కడే బిక్ష వొండుకోటం సందాల ప్రదోషకాలంలో మళ్ళీ పూజ ఆ తర్వాత అక్కడే నేలమీదపడుకోటం ఇలా నిష్టగా పూజ చేత్తాను. నాతో పాటు ఈ ఏడు ఇరవైయొక్క మంది స్వాములు దీక్ష తీసుకున్నారు. చేలామంది శబరిమల ఎల్లలేక ఈమజ్జ దోరపూడిలోనే మొక్కు తీర్చేసుకుంటున్నారు. నేనిప్పటికి ఎళ్ళిన నాలుగుసార్లు శబరిమలే ఎళ్ళాను. నన్ను చేలామంది నిష్టతో నిప్పులు కూడా కడుగుతాడు అని చెప్పుకుంటారు. కాని నేను ఎప్పుడూ నిప్పులు కడగలేదు కానీ ఉప్పు కూడా కడిగే ఏసుకుంటాను. మా ఏనుగుల మహల్లో ఏ దేవుడి కార్యక్రమం అయినా నేనే ముందుంటాను.
రామజన్మభూమి శిలన్యాస్ సమయంలో ఇంటర్ చదువుతున్నాను. కానీ మా ఊరే కాదు చుట్టుపక్కల ఊళ్ళలో కూడా రామభక్తుల్ని పోగేసి బస్సెట్టుకుని తలా మూడిటికలు పట్టికెళ్ళాం.
ఈసారి శబరి ఎల్తన్న గురుస్వామితో కలిపి ఇరవైరెండు మందిమి టెంపో పెట్టుకుంటే అది రెండ్రోజుల ముందే ఏక్సిడెంట్ అయ్యింది. వేరేది దొరకలేదు. హౌరామెయిల్‌కి రాజమండ్రినించి చెన్నైఎళ్ళి ఆ తర్వాత మంగుళూరు మెయిల్లో కోజికోడ్‌లో దిగి అక్కణ్ణించి బస్సులో శబరి ఎళ్ళాలని రిజర్వేషన్ చేయించుకున్నాం. మాకందరికీ స్లీపర్‌లో వొచ్చింది. మా గురుస్వామికి 3వ ఏ.సి.లో రాములుస్వామికి సెకండ్ ఏ.సి.లో వొచ్చింది. స్లీపర్‌లో మాకొచ్చిన భోగీలో అడుగెట్టడానికి ఖాళీలేకండా ఉంది. మా సీట్లో బీహార్లో ఎక్కినోళ్ళు కూచ్చున్నారు, ఒక్కో సీట్లో ఆరుగురు చొప్పున. లగేజి పెట్టుకునే చోట పెద్దపెద్ద బేగులెట్టేసారు. సీట్లకి మజ్జన ఖాళీలో కూడా జనం ఒకళ్ళోళ్ళో ఒకలు కూచ్చున్నారు.
మాకు లోపలికెల్తానికి పావుగంటట్టింది. మా సత్తిబాబుస్వామి హిందీలో లెగమని అయ్యి మాసీట్లనీ అరిచీసరికి మాకు కూచ్చోటానికి చోటిచ్చారు. పక్కనున్న బెర్తులదగ్గర అదే పరిస్ధితి అక్కడైతే చీరలతో సీట్లకి మజ్జన ఉయ్యాల్లేసి పిల్లల్ని పడుకోబెట్టారు. ఈళ్ళెవరికీ రిజర్వేషన్లు లేవు. కానీ టికెట్ ఎక్జామినర్ వొచ్చినపుడు లంచమిచ్చి భోగీలో ఎక్కడోదిక్కిన కూచ్చోటానికి అనుమతి పొందినోళ్ళు. ఎలాగో ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళం కూచ్చున్నాం. ఒకపక్క ఉక్కపోత, గుట్కాకంపు, మనిషికీ మనిషికీ మజ్జన అరంగుళం ఖాళీలేని పరిస్ధితి. ఇన్నాళ్ళూ కాపాడుకున్న నిష్ట చెమటకంపులో గుట్కావాసనలో ఆవిరైపోయింది. అంత కాలు కదపలేని రద్దీలోనూ జాంకాయలు అమ్ముకునీవోళ్ళు, గుట్కాళోళ్ళు బిస్కెట్లు, చాక్లెట్లు అమ్ముకునీవోళ్ళు వాటర్ బాటిళోళ్ళు ఆళ్ళ యాపారం మానకండా జనాల్ని తోసుకుంటా, తొక్కుకుంటా ఆటంకం లేకండా చేసకుంటన్నారు. ఇలాంటి ప్రయాణం నేనెప్పుడూ చెయ్యలేదు. రాములుస్వామి ‘‘స్వామీ మీకసలకే నిష్టెక్కువ, స్లీపర్‌లో ఎవడు ఏ రకమైన మైలతో ఉంటాడో తెలదు. ఏ.సి.లో ఎక్కూమందుండరు. మీకు నీసుగాలి, మైలుగాలి తగలదు. ఆ స్వామి మీకోసమే ఇలా ఏర్పాటు చేసాడు.’’ అంటా తనబెర్త్‌లో నన్ను కూచ్చోమన్నాడు. ముడుపుకట్టిన ఇరుముడితో నేను
భోగీలోకొచ్చి నాసీట్లో కూచ్చున్నాను. ఇందులో ఆరు సీట్లున్నా ఇద్దరమే ఉన్నాం, నేను సర్దుకుని కూచ్చుంటంటే నల్ల బురఖా ఏసుకుని ఇంచుమించు నా ఈడే ఉన్న ఓ ఆడమనిషి వొచ్చి నా ఎదర సీట్లోకూచ్చుంది. వాష్‌రూమ్‌కెళ్ళచ్చినట్టుంది. కాళ్ళు, చేతులు తడిగా ఉన్నాయ్. నాకు ఆవిణ్ణి చూడగానే చిరాకొచ్చింది. ఈ చిరాక్కి కారణం ఆవిడ వాష్‌రూమ్‌నించి రాటమేకాదు ఆవిడ ముస్లీం కాటం కూడా! ఈ హిందూదేశంలో హిందువులే ఉండాలి అన్న సిద్దాంతాల్ని అణువణువున నింపుకున్న నాకు ఆవిడ మీద అలా చిరాకురాటం పెద్ద విషేషమేం కాదు. ఆవిడ నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. నాకు చిరాకు సర్ సర్‌మని పైకెక్కింది. కొద్దిసేపుటికి ఆవిడ కేరేజ్ తీసి కోడిమాసంతో మసాలాలు బాగా దట్టించిన బిరియాని తింటంటే ఆ వాసన నా ముక్కుపుటాలని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ నలభైరోజులు నీచు ముట్టటమే కాదు, నీచు మాంసాలని వాసన చూడ్డమే మైల అనుకున్న నేను దీక్ష చివరిరోజుల్లో రెండడుగుల దూరంలో ఓ మనిషి తింటంటే చూడాల్సచ్చింది. అది చూసి నాకోపం చిటారు కొమ్మెక్కి కూచుంది. అయ్యప్పా ఏంటి నాకీపరీక్ష రెండడుగుల దూరంలో నాకిష్టంలేని మనిషి, చూడకూడదనుకున్న దృశ్యం, పీల్చకూడదనుకున్న వాసన ఆవిడితో ఎలాగైనా గొడవెట్టుకుని తిట్టేయ్యాలని నా మనసు కోరుకుంటంది. ఎందుకో సీట్లకి కట్టీ పరదాల్లేవు మా సీట్లుకి. అందుకే మరుగులేదు. మిగిలినోళ్ళైతే దీన్ని పెద్దగా పట్టించుకోరేమో కానీ నాకు మనసులో ఏదో జరగరానిది జరిగిపోయినట్టనిపిత్తంది. మా కేబిన్‌లో నేను ఆవిడ తప్ప ఇంకెవరూ లేరు. నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయ్. మరి ఆళ్ళు ఎక్కడ ఎక్కుతారో, ఎలాంటోళ్ళు ఎక్కుతారో అని ఆలోచన. రైలు విజయవాడ వొచ్చీసరికి నేను సెల్ చార్జింగ్ పెట్టి ఇయర్‌ఫోన్ పెట్టుకుని ఇంటా కళ్ళు మూసుకున్నాను. ఆ స్టేషన్‌లో ఎక్కువసేపు ఆగింది. ఆవిడ కిందకి దిగి ఎక్కడికో ఎళ్ళినట్టుంది. స్వామి వారికోసం బాలూగారు పాడిన పాటలింటన్నాను. కునుకుపట్టేసింది. ఈలోగా ఒకడితో బుర్ఖా ఆవిడ గొడవ పడతంది. ఆ అరుపులకి మెలకువొచ్చీసింది. ఆవిడ నేను కళ్ళు తెరటం చూసి ‘‘సాబ్ ఈయబ్బి మీ సెల్ చోరీ చెయ్యబోతంటే నేను పకడా నైతో మీ ఫోన్ చోరీ కియా హోతా’’ అంటా హిందీ, ఉర్దూ, తెలుగు కలిపిన ఏదోలాంటి భాషలో అంటంటే అర్ధం చూసుకోటానికి నాకు కొంచుం సమయం పట్టింది. ‘‘నేను మీకు పిలుత్తున్నాను, మీకి సునాయినైదియా?’’ అంటంటే అర్ధమై దొంగనిపట్టుకుని చెడామడాతిట్టి ఆణ్ణి పట్టుకుని రైల్వే పోలీసులకి అప్పగిద్దామనుకునీ సరికి ఆడు పారిపోయాడు. ఈ గందరగోళంలో కిందపడ్డ సెల్ తీసి ఇచ్చిందావిడ. అప్పుటిదాకా ఆవిణ్ణి చూత్తేనే
మైల ఎలా అవుద్ది. నేనేమైనా ఆవిణ్ణి ముట్టుకున్నానా అనుకున్నాను. ఇప్పుడదీ జరిగిపోయింది. స్వామీ అయ్యప్పా ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏంటి నాకీ పరీక్ష అనుకున్నాను. ఇంతలో సమోసాలతనొత్తే ఆవిడమిరపకాయ నంజుకుని తింది. ఆ తర్వాత చికిన్ నూడిల్స్ కొనుక్కుని తింది. తర్వాత కాఫీ తాగింది. ఆవిడ తిండి పద్దతి నాకు అసహ్యమేసింది వొచ్చినియ్యల్లా కొనుక్కుని తింటంటే. నేను మాత్రం ఊర్నుంచి తెచ్చుకున్న లేత కొబ్బరిలౌజు, కమలాలు తిని కొబ్బరినీళ్ళు తాగాను. రాత్రి పదకొండు గంటల సమయంలో నా ఫోన్ రింగవుతంటే నేను నిద్రలో ఉండి ఎత్తకపోయీసరికి ఆవిడే ‘‘సామి ఆప్ కా ఫోన్ రింగవుతంది’’ అంటా నన్ను లేపింది. ఫోనెత్తినప్పుడికి అవతలినించి మా చెల్లెలు చదూతున్న హాస్టల్ వార్డెన్ చేసి చెప్తుంది. ‘‘సార్ మీ చెల్లికి ఓ గంట నించి కడుపులో నొప్పి అంటా బాధ పడతంటే దగ్గిరిలో ఉన్న ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఆయన పరీక్షించి ఇరవై నాలుగ్గంటల నెప్పి అని చెప్పాడు. ఎంటనే కే.జి.హెచ్.కి కానీ, స్టీల్ సిటీ హాస్పిటల్‌కి కానీ తీసుకెళ్ళమన్నారు. కే.జి.హెచ్. కళ్ళినా అర్ధరాత్రికాడ ఆపరేషన్ చేసీ డాక్టర్లుండరంట మాయాయనగారు చెప్పారు. మీరు ఎంటనే ఎవరినైనా ఈ ఊళ్ళో వోళ్ళని పురమాయించి ప్రైవేట్ ఆస్పిటల్‌కి పంపిత్తేకానీ ప్రమాదం తప్పదు. పిల్ల నొప్పితో మెలికలు తిరిగిపోతంది. ఓసారి మాటాడండి’’ అని మా చెల్లికిచ్చింది. పిల్లసలు మాటాడలేక పోతంది. ఒకేమాటమాటాడిరది. ‘‘అన్నయ్యా నెప్పి భరించలాపోతన్నాను’’ అని. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక రక్తబంధం నాచెల్లి. అమ్మా, నాన్న ఐదేళ్ళకితమే కాలం చేసారు.
నాకింకా పెళ్ళికాలేదు. చెల్లిని చదివించి ఓ అయ్యచేతిలో పెట్టాక కానీ నేనెవరి మెడలోనూ తాళి కట్టకూడదని నిర్ణయించుకుని, ముప్పైయ్యొచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. చెల్లి విశాఖపట్టణంలో ఆంధ్రా యూనివర్శిటీలో పెట్రోలియం టెక్నాలజీ చదువుతా హాస్టల్లో సీటు దొరక్క బయట హాస్టల్లో ఉంటంది. వైజాగ్ ఆ చుట్టుపక్కల ఎంటనే కాకపోయినా, తెల్లారీసరికి ఎళ్ళగలిగినంత దూరంలో ఎవరూలేరు. పోనీ డబ్బులు పంపించి చేయిద్దామంటే అప్పటికి ఫోన్‌పేలు, గూగుల్‌పేలు లేని రోజులయ్యి. ఎవరికన్నా డబ్బులు పంపాలంటే బ్యాంకుకెళ్ళే పంపాలి. ఉంకో మార్గం లేదు. ఏంచెయ్యాలో తెలవట్లేదు.స్వామిని పదేపదే తలుచుకుంటన్నాను. స్వామి ఏదొక మార్గం చూపించు, అనుకుంటా వార్డెన్‌కి ఫోన్‌చేసి ‘‘మాతా నేను అయ్యప్పమాలలో ఉన్నాను. శబరిమల ఎల్తాఉన్నాను. ఉప్పుడికిప్పుడు రావాలన్నా వొచ్చీవోళ్ళెవరూలేరు. నేను రాకూడదు. మీరు దయంచి ఆస్పటల్‌కి తీసికెళ్ళి ఆపరేషన్ చేపిత్తారా రాగానే మీడబ్బు పంపెత్తాను’’ అని బతిమాలాను. దానికావిడ ‘‘చూడండి స్వామి ఇది హాస్టల్. వేలకి వేలుఖర్చుపెట్టి తీసికెళ్ళి వైజ్యం చేయించేంత డబ్బులు మాదగ్గరెక్కడుంటాయ్? మీరే ఎవర్నైనా పురమాయించండి’’ అంది. ఏమి చేయ్యాలో పాలు పోట్లేదు. బుర్ర తిరిగిపోతంది. ఎంత ఆలోచించినా నా చుట్టాలేకాదు తెలిసినోళ్ళ చుట్టాల్లో కూడా ఈ రకమైన సాయించెయ్యిగలిగినోళ్ళు ఎవరున్నారా అనిమా స్వాములందరికీ, నా జతగాళ్ళందరికీ ఫోన్ చేసినా లాభం లేకపోయింది. నాకు తెల్సిన భక్తబృందంవోళ్ళనీ మొన్నామజ్జ షిరిడి ఎళ్ళటానికి టూర్ పేకేజిలిత్తామంటా వొచ్చినభక్తబృందంవోళ్ళనీ కూడా అడిగాను. సాయంచేత్తాం కానీ డబ్బులు సర్దలేమని చెప్పారు. ఇంక అన్ని దార్లు మూసుకుపోయాయని అర్ధమైంది. ఏమైతే అదేఐంది నేను వొచ్చీ స్టేషన్‌లో దిగిపోయి ఎనక్కి ఎళ్ళిఏదోలా ఇంటికెళ్ళి రేపు బ్యాంకు తెరగానే డబ్బులు తీసుకుని విశాఖపట్టణం ఎళ్ళాలని నిర్ణయించుకున్నాను. శబరి ఎల్తాన్నామని పెసిరెంట్ ఈరెంకట్రావ్‌గారూ, ఆరి తమ్ముడుగారూ, బామ్మర్దిగారూ ఇలా ఊళ్ళో అయ్యప్ప భక్తులు శబరి హుండీలో ఎయ్యమని ఇచ్చిన డబ్బులున్నాయ్. అయ్యి ఎవరితోనైనా పంపిద్దామా అనికూడా అనిపించింది ఒక్కక్షణం. కానీ ఇయ్యన్నీ చేసీసరికి అక్కడ మా చెల్లి పరిస్థితి ఎలా వుంటదో అని భయం. ఇదే సంగతి వార్డెన్‌కి ఫోన్‌చేసి చెబితే ఆవిడ ‘‘స్వామీ అంత టైముండీలా ఉంటే కె. జి. హెచ్. కే తీసుకెళ్తాం కదా!
అయినా ఇలాంటియ్యి మనకి భయంగా ఉంటాయికానీ గవర్నమెంట్ హాస్పిటలోల్లుకి ఇంతకంటే తొరగా చెయ్యాల్సినియ్యో, రికమండేషన్ కేసులో ఉంటే మనల్ని పట్టించుకోరు. కాబట్టి తెలిసినోళ్ళెవరినైనా తెల్లారీసరికి డబ్బట్టుకుని వొచ్చీలాగ పంపితే కానీ కుదరదు. పిల్ల అప్పుటిదాకా నెప్పితట్టుకోగలదో లేదో కూడా చెప్పలేమన్నాడు డాట్రు’’ అంది. నా పరిస్థితి ముందు నుయ్యి ఎనక గొయ్యిలాగుంది, ఈ సమయంలో మరోసారి స్వామిని తలుచుకుని పార్ధించాను గండం గట్టెక్కించమని. రైలు పెద్ద శబ్దం చేసుకుంటా ఈగలాగ పరిగెడతంది. నా బుర్ర ఆలోచన్లతో ఏడెక్కిపోతంది.
ఇదంతా పక్క బెర్త్‌మీద కూచ్చుని ఇంటన్న ఆ బుర్ఖా ఆవిడ అంతా అర్ధం చేసుకున్నట్టుంది. నేను రైలెక్కగానే చూసిన చిరాకు చూపులు కూడా అర్ధం చేసుకుంది. అందుకే ఉప్పుటిదాకా నాకెందుకులే అన్నట్టున్నా ఇంక ఆగలేక నాతో ‘‘సాబ్ మా చాచా ఆళ్ళది వైజాగే నేనేమైనా మదత్ కర్ సక్తుంవో లేదో చూత్తానుండండి’’ అంటా ఆళ్ళ చిన్నాన్నకి ఫోన్ చేసి ఆళ్ళ భాషలో నాగురించి చెల్లికి చెయ్యాల్సిన సాయం గురించి చెప్పింది ఫోన్‌లో అవతలాయన మాటలు నాకు ఇనిపిత్తన్నాయ్, ఆయనకి ఈవిడ నేను కాలేజి స్నేహితుడినని చాలా ఏళ్ళకి రైలులో కలిసానని సాయం చెయ్యమని చెప్పింది. ఆయన ఆపరేషన్ అంటే ఉప్పుటికిప్పుడు యాభైవేలదాకా అవుతాయి. మరతన్ని నమ్మొచ్చా బేటీ తిరిగి ఇత్తాడా అనడిగాడు అనుమానంగా, దానికావిడ ‘‘చాచూ ఆయన చేలా ఇమాందార్ ఉప్పుడు స్వామి మాలమే హై దీక్ష కరరహాహై తబ్ కైసే బేమాన్ కరేగా?’’ అంటంటే నాకు అర్ధమైంది నేను ఖచ్చితమైనోడినని ఉప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నానని అలాంటప్పుడు ఎలా మోసం చేత్తానని ఆళ్ళ చిన్నాన్నకి చెప్తుంటే నాకు సిగ్గేసింది. ఆవిడ బుర్ఖా నాకు ఆవిడపట్ల అసహ్యాన్ని కలిగిత్తే నేనేసుకున్న దీక్ష బట్టలు నామీద ఆవిడకి నమ్మకాన్ని గౌరవాన్ని కలిగించాయి. నేనిప్పుటిదాకా మతోన్మాదంతో పెంచుకున్న దురహంకారం పటాపంచలైంది. పతి మతం మనిషికి మంచే నేర్పిత్తాదని మనిషికి మతం కంటే మానవత్వం గొప్పదని ఆవిడ మాటల్లో అర్ధమైంది. నాకిప్పటిదాకా ఆవిడ బట్టల్లోనూ గుండెల్లోనూ చీకటి కనిపించింది. ఆవిడకి మాత్రం నా బట్టల్లోనూ, గుండెల్లోనూ వెలుతురు కనిపించింది. నిజానికి నాగుండెల్లో అలుముకున్న అంధకారం ఆవిడికి కనిపించలేదు. ఆవిడ చేస్తున్న సాయంతో నా గుండెల్లో చీకటి పటాపంచలైంది. ఆవిడ ఆళ్ళ బాబాయితో మాటాడి ఒప్పించింది. నన్ను మాచెల్లి హాస్టల్ వివరాలుఅడిగి తెల్సుకుని ఎంటనే ఆళ్ళ బాబాయిని ఎళ్ళి మా చెల్లికి స్టీల్‌సిటీ ఆస్పిటల్ లో ఎంతైతే అంత డబ్బుకట్టి బాగయ్యీదాకా దగ్గరుండి చూసుకోమని ఈవిడ ఎల్లుండి సాయంత్రానికొచ్చి మా చెల్లిని చూసుకుంటానని ఆళ్ళబాబాయ్ కట్టిన డబ్బుకూడా ఎల్లుండి ఇచ్చెత్తానని చెప్పింది. అంతా చూత్తన్న
నాకిది కలో నిజమో అర్ధం కాట్లేదు.
ఎందుకంటే నాకు మా ఊళ్ళో బోళ్ళంతమంది చుట్టాలున్నారు. ఎవరూ ఇలాంటి పరిస్థితిలో ఇలావేలకి వేలు అప్పడికప్పుడు సాయం చేసీవోళ్ళుకానీ అవసరంలో దగ్గరుండీవోళ్ళుకానీ లేరు. నాకు మతం పేరుతో దేశంకోసం ధర్మంకోసం అంటా మతోన్మాదాన్ని ఎక్కించి నాలో మనిషితత్వాన్ని చంపేసి మతోన్మాదిని పెంచి పోషిత్తన్న అతివాదుల గుంపులో కూడా ఎవరూ ఇప్పుడు సాయానికి ముందుకు రాలేదు. ఆళ్ళు దేశంకోసం, ధర్మంకోసమే మాటాడతారు. మనిషికోసం పట్టించుకోరు. ముందు మనం మనుషులం ఆతర్వాత మిగిలినయ్యన్నీ. మనిషిలోని మానవత్వాన్ని బతికించనిది ఏదైనా మనకక్కర్లేదు. అన్ని మతాలు మనిషికి మంచే చెబుతాయ్. మతం మనిషికి బలం కావాలి మత్తుమందు కాకూడదు.
ఇలా ఆలోచిత్తంటే ఆవిడ ‘‘సాబ్ మీ బెహన్‌జీకి ఆపరేషన్‌కి మా చాచూ అన్ని ఏర్పాట్లు చేత్తారు. నేను రేపు ఎళ్ళి మీరొచ్చీదాకా ఉంటాను.’’ అని చెప్తుంటే ఆవిడకి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలీలేదు.
మనుషుల్లో ఇంత మంచోళ్ళుంటారా అనిపిత్తంది. ఆవిడికి చెమ్మగిల్లిన కళ్ళతో చేతులు జోడించి ‘‘థేంక్సండి మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. వొచ్చీ స్టేషన్‌లో దిగిపోయి డబ్బులట్టుకుని రేపు మీ బాబాయ్‌గారికి ఇచ్చేత్తాను’’ అన్నాను. దానికావిడ ‘‘నక్కో సాబ్ మీరు మొక్కు తీర్చుకోండి శబరిమల ఎళ్ళండి అన్నీ అయ్యాకే రండి జల్దీ నహీ, ఖుదా ఆప్‌కా బెహన్‌కో భలా కరేగా’’ అంటా మీ చెల్లికి దేవుడంతా మంచే చేత్తాడు. మీరు శబరి ఎళ్ళిరండి అంటంటే ఆవిడ బుర్ఖా ఏసుకున్న సాయిబులావిడలాగ కాకండా మా అయ్యిప్ప పంపిన దూతలాగ అన్పించింది. అవును ఈవిణ్ణి మా అయ్యిప్పే నాకు సాయం చెయ్యిటానికి పంపాడు. అనుకుంటా మళ్ళీ చేతులెత్తి దణ్ణం పెడతంటే ‘‘నక్కో సాబ్ ఇదేమంత పెద్దసాయం కాదు మనం మనుషులం కదా ఆమాత్రం సాయం చేసుకోపోతే ఎలా’’ అంది. ఆవిడ నాకు వరాలిచ్చే వరలక్ష్మిదేవిలా కనిపిచ్చింది. ఆవిడి ఊరు, పేరు, సెల్‌నెంబర్ అన్నీతీసుకున్నాను. నాయీ కూడా ఇచ్చాను ఈ ప్రయాణం నాలో చేలా మార్పు తెచ్చింది. అయ్యిప్ప దగ్గిర ఈవిడ గురించి కూడా పార్ధించాలి అని నిర్ణయించుకున్నాను.
ఆవిడా నేను చెన్నై సెంట్రల్‌లో రైలు దిగాం. రైలెక్కినపుడు స్వామి అయ్యిప్ప భక్తుడిగా నేను, సాయిబులావిడిగా ఆవిడఎక్కిన మేము ఇద్దరు మనుషులుగా రైలుదిగాం. మంచి మనుషులయ్యాం మంచి స్నేహితులయ్యాం ఈస్నేహం ఆయుష్షు జీవితకాలం.
ఇకముందు నేను నాభక్తి, నాపూజగదికి మాత్రమే పరిమితం చేయాలని అన్ని మతాలోళ్ళని సమానంగా ప్రేమించాలనినిర్ణయించుకున్నాను. కుదిరితే నేనే కాదు నాచెల్లికి కూడా మాకులంలోనే కాదు వేరే మతంవోళ్ళనిచ్చి పెళ్ళి చేయాలని నాబలమైన కోరిక. అలా జరిగితే జీన్ పూలింగ్ జరిగి శ్రేష్టమైన లక్షణాలున్న పిల్లలు పుడతారని అది కులమతాల నిర్మూలనకి ఓ ముందడుగుఅవ్వుద్దని నా ఆశ. అది నెరవేరాలని నాకు రైలులో దొరికిన స్నేహం సొంతం కావాలని మీరూ కోరుకోండి. నేనూ కోరుకుంటాను మా అయ్యప్పని.