త్యాగం కోరే చదువులు  (Author: సి. యస్. జి. కృష్ణమాచార్యులు)

మహాత్మాగాంధీ వైద్య కళాశాల ఆడపిల్లల హాస్టల్ ప్రాంగణం, క్రొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్ధినులు, వారి తల్లిదండ్రులతో, సందడిగా వుంది. కొందరు విద్యార్ధినుల తల్లులు, తిండి, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెబుతున్నారు. కొందరి తల్లులు, ప్రేమా, దోమా అని వేషాలేస్తే, కాళ్ళు విరగ్గొట్టి పెళ్ళి చేస్తా, బాగా చదివి మెడల్స్ తీసుకురా అని హెచ్చరిస్తున్నారు. కొందరి తల్లులు భధ్రత పట్ల అలసత్వం వద్దని, క్రమ శిక్షణతో మెలిగి డిగ్రీ తెచ్చుకోమని, హితవు చెప్తున్నారు.

ఈ సందడికి కొద్ది దూరంలో నిలబడి, రామకృష్ణ, కూతురు సుజాకి మంచీ చెడు చెబుతున్నాడు.

“జీవితం సవాళ్ల చెలిమితో సాగే యాత్ర. ఇప్పుడు నీవున్న దశలో, చదువుకు, ప్రేమకు మధ్య ఒక సంఘర్షణ వాతారణం వుంటుంది. ఆ క్లిష్ట సమయంలో, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ భావి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే నువ్వు ఎంతో విజ్ణత తో వ్యవహరించాలి.”

"నువ్వెలా చెప్తే అలా చేస్తా నాన్నా, నువ్వుండగా నాకు బెంగ యెందుకు?"

"అలా కాదు. ఇంత కాలం నిన్నడిగి, నేను నిర్ణయాలు చేసాను. ఇక ముందు, నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి.”

“"ఎందుకు నాన్నా? నేనేం తప్పు చేసాను?"

"లేదు తల్లీ, నువ్వేం తప్పు చెయ్యలేదు. నువ్వున్న వయసులో యువతీయువకులు స్వేచ్చను కోరుకుంటారు. అది సహజమే. అందుకే, నిన్ను స్వేచ్చగా జీవించడం నేర్చుకోమంటున్నాను."

"అంటే, నువ్వేమీ పట్టించుకోవా?"

“అదేం లేదు. అరమరికలు లేకుండా నీ విషయాలన్నీ నాకు చెబుతూ వుండు. నీ స్వేఛ్చకు అడ్డురాని విధంగా సలహాలిస్తూంటాను. నీకు వివాహమయ్యే వరకు నీ మొదటి స్నేహితుడిని నేనే" అంటూ రామకృష్ణ, కూతురు సుజా తల నిమిరి, నుదుట ముద్దు పెట్టాడు.

సుజాకి ఎంతో సంతోషంగా ఉంది. ఆమె చిననాటి కల డాక్టరవ్వడం. హాస్టల్లొ చేర్చి నాన్న బయలుదేరుతున్నారు. నాన్నని వదిలి వుండాలంటే యేడుపు వస్తోంది. కాని తప్పదు. నాన్న చెప్పిన మాటలు అర్ధమయ్యాయి. బరువెక్కిన హృదయంతో ఆమె యిలా అనుకుంది.

“ఇన్నాళ్ళూ ఆయన నీడలో ఎదిగిన నన్ను, ఈ విశాలవిశ్వంలో ఒంటరిగా వదలలేక, వేదన చెందుతూ ఆయన చెప్తున్న మాటలివి. ఆయన మాటలే నాకు శిలాక్షరాలని, చదువే నా ప్రపంచమని నిరూపించాలి. నాన్నని ధైర్యంగా పంపించాలి.”

అలా అనుకున్న సుజా, తండ్రి ముఖంలోకి చూస్తూ,"భయం లేదు నాన్నా! నీ మాటలే నన్ను బాగా చదివించి, నాకు మెడల్స్ తెచ్చిపెడతాయి. రోజూ ఫోన్ చెయ్యి. నిన్ను వదిలి వుండాలంటేనే బెంగగా వుంది"

రామకృష్ణకి కూతురు మనోద్వేగం అర్థమయ్యింది.

 "చూడు తల్లీ. ఇది నీ కలల ప్రపంచం. నీ జీవిత సాఫల్యానికి పునాదులు వేసే ప్రాంగణం. నీ భవిష్యత్తుని బంగారుమయం చేసే క్షేత్రం. ఉత్సాహంగా చదువుకో. నేనూ, అమ్మా రోజూ ఫొను చేస్తాము. నీకు యెప్పుడు బెంగనిపిస్తే అప్పుడు వస్తాము. సరేనా." అని బుజ్జగించాడు.

@@@

రెండు రోజులు గడిచాక సుజాలో మార్పు వచ్చింది. జంకు తొలగిపోయింది. కాలేజి, హాస్టలు, లైబ్రరీలను, తన సొంత ప్రదేశాలుగా భావించడం మొదలుపెట్టింది. బోధనకు, ఆచరణాత్మక ప్రయోగాలు జత కావడం, సుజాకి నచ్చింది. ఆప్రాన్ ధరించి అటూ ఇటూ తిరుగడం మరింత నచ్చింది. అనాటమి, ఫిజియాలజి లాంటి సబ్జెక్ట్సు ఆమెకు తాను కలలుగన్న జ్ణాన సౌధానికి సోపానాల్లా అగుపించాయి. ప్రతిరోజు ఫోను ద్వారా తన సంగతులను, కాస్త గర్వంగా, బోలెడంత ప్రేమగా, తల్లిదండ్రులకి తెలియచేయడం ఆమె నిత్యకృత్యమైంది,

@@@

కాలం పరుగులు తీసింది. రెండు గోల్డ్ మెడల్స్ సాధించి సుజా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తగిన ప్రోత్సాహం లభించడం వల్ల సుజా దృష్టి సంపూర్ణంగా చదువుపైన కేంద్రీకృతమైంది. ఏకాగ్రతని పరీక్షించడం దేవుడి హాబీ కాబోలు. ఒకప్పుడు రంభా ఊర్వశులను పంపించి, ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునులను, పరీక్షించేవాడు. అలాంటిదే సుజా విషయంలో జరిగింది. ఒకరోజు ఆస్పత్రిలొ ఒక సీనియర్ డాక్టర్,"ఐ లవ్ యూ" చెప్పాడు. సుజా కంగారుపడింది. ఏం చెప్పాలో తెలియలేదు. ధైర్యం కూడగట్టుకుని "సారీ" చెప్పేసింది. "కంగారులేదు. ఆలోచించుకో"అని అతడు వెళ్ళిపోయాడు.

ఈ విషయం విన్న ఆమె ఫ్రెండ్స్ పక పకా నవ్వారు.

"మాకు అడ్మిషన్స్ రోజే, ఫ్లర్టింగ్ (సరసమాడడం) మొదలయింది. నీవు చిన్నపిల్లలా వుంటావు కాబట్టి లేటైంది. ఇప్పుడు నువ్వు గోల్డ్ మెడలిస్టువి కావడంతో, ఒక్కసారిగా నీవెవరో నలుగురికీ తెలిసింది. నీ పట్ల ఆకర్షణ పెరిగింది.” అని అన్నారు.  ఒక స్నేహితురాలు,"ప్రేమ అంటే సుజాకి పెళ్ళి గుర్తుకొస్తుందేమో, కాదని చెప్పండే" అంది పరిహాసంగా.

“నిజమే, ఇక్కడ లవ్ యూ అంటే డేటింగుకు ఆహ్వానం” అని ఒక స్నేహితురాలు,“నీకిష్టమైతే రిసార్టులో రొమాన్సుకి” అని మరో స్నేహితురాలు, సుజా బుగ్గ గిల్లి మరీ చెప్పారు. అప్పుడే ఇంకో ప్రపంచం, సుజా యెదుట సాక్షత్కారమైంది. అందులో స్వేచ్చ, వాంఛాపూరిత ప్రేమ, ప్రధాన పాత్రలు వహిస్తున్నాయి. ఆమె ఫోన్ చేసి తండ్రికి చెప్పింది.

"ఇక్కడ స్వేచ్చ పేరిట అమ్మాయిలు, తోటి విద్యార్ధులతోను, సీనియర్లతోను, ప్రేమా, డేటింగ్ అంటూ తిరుగుతున్నారు. నిన్న నాకొకడు లవ్యూ చెప్పాడు"

 సుజా చెప్పిందంతా విని రామకృష్ణ యిలా చెప్పాడు.

"ప్రేమించడానికి మనిషిలోమూడు ఆకర్షణలు వున్నాయి. అవి మేధస్సు, మనస్సు, మరియు శరీరం. నీ మేధస్సుని ఇష్టపడిన వాడు నీకు సహచరుడుగాను, నీ మనసుని ప్రేమించిన వాడు నీ జీవిత భాగస్వామిగాను కాగలరు. వీరి సాన్నిహిత్యం నీ జీవిత లక్ష్యానికి తోడవుతుంది. నీ శరీరన్ని పొగిడే వాడు కాముకుడు. వాడిది కామవాంఛ మాత్రమే. అది రోగం లాంటిది. అది నీ మనోబలాన్ని హరిస్తుంది, నీ యేకాగ్రతని భంగపరుస్తుంది. నా సలహా, నీ మేధస్సుకి, నీ మనస్సుకి గౌరవ మిచ్చే, వాడికోసం యెదురు చూడు. నిరీక్షణలో అందముంది."

“నా లక్ష్యం డాక్టరవడం. అంటే కేవలం సర్టిఫికెట్ తెచ్చుకోవడం కాదు. బాగా చదివి అన్ని విషయాలు నేర్చుకోవడం. నన్ను నా పేషంట్స్ దేవతలా చూడాలి."

“చాలా సంతోషం. నీకు నీ లక్ష్యం పట్ల అవగాహన వుంది. కావల్సిన నిబద్ధత కూడా వుంది. ఏదయితే నీ లక్ష్యానికి ఆటంకం అవుతుందో దాన్ని దూరం పెట్టెయ్యి. సరేనా, హాయిగా తిను, చదువుకో."

తండ్రితో మాట్లాడాక సుజా మనసు కుదుట బడింది.

@@@

“నా బాయ్ ఫ్రెండుతో లంచ్ కి పోతున్నా, నా అటెండెన్స్ మేనేజ్ చెయ్యి,” అని ఒకరు,“నా బాయ్ ఫ్రెండుతో టూర్ పోతున్నా, నా రికార్దు కాస్త వ్రాయవా” అని ఇంకొకరు,“ చుట్టాలింటికి వెడుతున్నానని అబద్ధం చెప్పి ఒన్ నైట్ స్టాండుకి వెళ్ళే వారింకొకరు. సుజాకి వాళ్ళ భాష, వైఖరి అన్నీ వింతగా వున్నాయి. తన ప్రపంచంలోని వింతలను తెలుసుకుంటున్న సుజా, ఒక రోజు అనుకోని షాకుకి గురయ్యింది. ఎంతో సన్నిహితంగా వుంటున్న ఒక స్నేహితురాలు, "సుజా! నేను హాస్టలు వదిలేస్తున్నా"అంది.

"బయట యెక్కడ వుంటావు. మీ అమ్మగారు వస్తున్నారా" అని సుజా అమాయకంగా అడిగింది.

"లేదు. నా బాయ్ ఫ్రెండుతో సహజీవనం (లివ్ -ఇన్) లో వుంటా"

"మీ అమ్మా నాన్నలకు తెలుసా"

"లేదు. తెలిస్తే చంపేస్తారు"

"మరి. యెందుకిలా"

"నీకర్థం కాదులే. నువ్వింకా చిన్నపిల్లవే"

స్నేహితురాలు వెళ్లిపోయింది. బాగా చదివే అమ్మాయి, తనకి తోడుగా వుంటున్న వ్యక్తి అలా వెళ్ళిపోవడం సుజాని కలచివేసింది. ఎక్కడ చూసిన రెండే మాటలు- ప్రేమ, కమిట్మెంట్. చాలా గ్రూపుల్లో తను ఇమడలేక పోతోంది. మనసు, తెలియని ఆందోళనకు గురవుతోంది. ఉండబట్టలేక, తండ్రికి ఫోను చేసి తను చూస్తున్నది, వింటున్నది పూసగుచ్చినట్లు చెప్పింది. రామకృష్ణ ఆమెకు తన అభిప్రాయాన్నిలా చెప్పాడు.

“ఈ పోకడకు కారణాలు రెండు. మొదటిది సమానత్వం పేర, మహిళలు తెస్తున్న మార్పు. నేను పురుషాధీనను కాను, ‘నా జీవితం, నా శరీరం, నా ఇష్టం’ అనే వారి స్వేచ్చా నినాదం. రెండవది, మానసిక వినోదం. మీ వైద్య విద్యార్ధులకు నిద్రాహారాలు తక్కువ, పని ఒత్తిడి ఎక్కువ. కొందరికి ఈ రొమాంటిక్ సంబంధాలు, రొటీన్ నుంచి పలాయనానికి, పునరుజ్జీవనానికి తోడ్పడుతాయి.”

"తల్లిదండ్రులకి తెలియకుండా ఈ పనులు చేయడం, వారిని మోసగించినట్లు కాదా?"

“నిజమేనమ్మా! రహస్య జీవనం పిరికితనానికి, అవినీతికి సంకేతం. విదేశీ విలాసాలను మన యువతీయువకులు అనుకరిస్తున్నారు గాని, వాటికి అనుబంధంగా వుండే సంస్కారాలను నేర్చుకోవడం లేదు. అక్కడ పిల్లల డేటింగ్, పేరెంట్స్ పర్యవేక్షణలోనే జరుగుతుంది."

“నాన్నా? నేను డేటింగుకి వెడతానంటే నువ్వు ఒప్పుకుంటావా?"

"తప్పకుండా. నేనూ అమ్మా వచ్చి ఆ అబ్బాయితో మాట్లాడుతాము. అతడు నీ భద్రత విషయంలో తీసుకునే జాగ్రత్తలు తెలుసుకుంటాము. ప్రస్తుతానికి ఒక్క సలహా. నీ డేటింగ్ నిర్ణయాలు, నీ మనో వికాసానికి దోహదం చేసేలా వుండాలి. అవి, యెంతమాత్రం, నీ లక్ష్యసాధనకి అవరోధం కాకూడదు.."

"ఒక వేళ మంచి అబ్బాయి దొరికితే, నీకు చెప్తాను. ప్రస్తుతం నా గురి, అబ్బాయి మీద కాదు, చదువు పైన, డాక్టరవ్వడం పైన వుంది.”

"అదే మంచిది. ఎందుకంటే, ఇప్పుడే సముద్రంలోకి ప్రవేశించిన నావలా, నువ్వు వైద్య విద్యాభ్యాసం తొలి దశలో వున్నావు. ఇంకా పిజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) కోర్సు కూడా చెయ్యాలి."

కాలక్రమేణా సుజాకి ఒకటి బోధ పడింది. చదువులో వున్న ఒత్తిడి, ప్రొఫెసర్ల మితం లేని దుర్భాషలు, తిండీనిద్ర లేని డ్యూటీలు ఒక ప్రక్క, స్వేచ్చగా లభిస్తున్న శారీరక సుఖమింకొక ప్రక్క, ఈ రెండూ కలిసి, ఇలాంటి వినూత్న ప్రవర్తనలకు దారితీసాయి.

అలా తన చుట్టూ వున్న ప్రపంచంలోని విభిన్న పోకడలను అర్ధంచేసుకుంటున్న సుజా వ్యక్తిత్వం మరింత వికసించింది. ఆమెలో సహనం, క్షమా గుణం బలపడ్డాయి. అదే సమయంలో ఆమె తనని తాను అర్ధం చేసుకుని ఇలా అనుకుంది.

“నేను వాళ్ళకి భిన్నమైన వ్యక్తిని కాను. కానీ నా పంధా వేరు. నేను జ్ణాన మందిర పూజారిని. పూజకి యేకాగ్రత వుండాలి. నా లక్ష్యానికి తగిన మార్గ మిది. ఇలాగే నేను సాగిపోతాను.”

@@@

విజయవంతంగా, సుజా ఎంబీబియస్ డిగ్రీ అందుకుంది. ఆమె గమ్యం చేరే లోపు, ఎన్నో ముళ్ళకంపలను దాటింది. తండ్రి ప్రోత్సాహపరిచినా, ఆమె ఎవ్వరితోనూ డేటింగుకి వెళ్ళలేదు. మేధా సంపత్తి గల యువతి కావడం వల్ల, ఆమె సాధారణ యువతులను రంజింప చేసే ప్రేమ కబుర్లనుగాని, చేష్టలను గాని యిష్టపడలేక పోయింది. ప్రేమ కబుర్లతో వెంటబడ్డ వారు, మోకాళ్ళమీద మోకరిల్లి ప్రపోజ్ చేసిన వారు, నీవు లేకుంటే నాకు చావే శరణం అనే వారు…. ఇలా వేధించిన ప్రేమికులని సహనంతో, సమాధాన పర్చి, స్నేహితులను చేసుకుంది. మొత్తానికి ఆమె వైద్య విద్యాభ్యాసంలో తొలి ప్రయాణం, మంచి జ్ణాపకాలతో ముగిసింది.

ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన తల్లిదండ్రులను, చూసి ఆమె కళ్ళు చమరించాయి. కూతురు బంగారు పతకాలతో డిగ్రీ తెచ్చుకుందన్న గర్వంతో ఒక ప్రక్క, ఇన్నాళ్ళూ సరైన తిండీ నిద్రా లేకుండా కష్టపడిందన్న సానుభూతితో ఇంకొక ప్రక్క, ఆమె తల్లి తలమునకలవుతూ, కూతురి బుగ్గలు నిమిరి, తలను ముద్దాడింది. ఇంటికి వెళ్ళే ద్రోవలో సుజా ఇలా ఆలోచించింది.

“దాదాపు ఆరేళ్ళ కఠిన శ్రమ తర్వాత కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోబోతున్నాను. కానీ ఈ విశ్రాంతి తాత్కాలికమే. ముందున్నది ముసళ్ళ పండుగ అంటూ, నీట్ (NEET) కట్టెదుట తారాడుతోంది. ఒకప్పుడు ఎంబిబియస్ డాక్టరంటే గొప్ప. ఆ తర్వాత పిజి, నేడు సూపర్ స్పెషియాలిటీ, అవసరమయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీట్ ఒక భాగంగా, ఒక అడ్డుకట్టగా అవతరించింది. ఆ పరీక్షా నిర్వహణ ఎప్పుడూ గందరగోళమే. అభ్యర్ధులు యెక్కువ, సీట్లు తక్కువ, కావడంతో పోటీ గట్టిగా వుంటుంది. ఈ పోటీలో కోరిన స్పెషలైజేషన్, కోరిన కళాశాలలో తెచ్చుకోవడం ఒక విషమ పరీక్షే.”

భవిష్యత్తుని తలచుకుని సుజా చింతా క్రాంతురాలైంది. ఆమె ఇలా అనుకుంది.

“పెళ్ళిచేసుకుని సంసారం చేసే వయసులో చదువు కొనసాగించాలా లేక చదివింది చాలని సంసారిని కావాలా? మెడిసిన్ ఎంచుకుని తప్పు చేసానా? ఇదే ఇంజినీరింగ్ అయితే, ఒక సాఫ్టువేర్ డిజైనరుగా లక్షల్లో ఆదాయం పొందుతూ, విదేశీ విహారాలతో కాలక్షేపం చేసేది. తెలీక, ఈ వూబిలో చిక్కుకున్నానయ్యో! అని బాధపడడం, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వుంటుంది.”

అలా అనుకున్న మరుక్షణం, సుజా, మనసు ఎదురుతిరిగింది. వాస్తవాన్ని, కలలతో జోడించి ఇలా హితబోధ చేసింది

“చిన్ననాటి కలని తక్కువ చేసి నిన్ను నీవు అవమానించుకోకు. ఒక గొప్ప డాక్టరు కావడానికి ఎంత అదృష్టం వుండాలి? గుండె నిండా వూపిరి పీల్చుకో! విద్యార్ధినిగా మెడల్స్ సాధించావు. ఇంటర్న్ గా పేషంట్స్ అభిమానాన్ని చూరగొన్నావు. సరిహద్దులో దేశ రక్షణకు సైనికుడు యెలాగో, దేశంలో ప్రజల ఆరోగ్య రక్షణకు నువ్వలాగ. ఈ వృత్తిలో వయసుకు తగ్గ ముచ్చట్లు వుండకపోవచ్చు. కానీ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించే ఆస్కారముంది. నిన్ను చూసి గర్వపడు. ముందుకు సాగిపో. నీ మార్గంలో వుండే ఎత్తు పల్లాలు, నీవు దాటలేనివి కావు. మరొక్క సారి దీక్ష తీసుకో.”

కర్తవ్యం బోధ పడడంతో సుజా మనసు తేలిక పడింది. మదిలో గందరగోళం తొలగిపోయి దాని స్థానే, ఒక ధృఢ నిశ్చయం రూపు దిద్దుకుంది.

@@@

 

ఒక వారం రోజులు పాటు సుజా తల్లిదండ్రులతో, స్నేహితులతో, సంతోషంగా గడిపింది. ఆ తర్వాత నీట్ పరీక్షా ప్రకటన రాగానే, యుద్ధవార్త విని తుపాకీ చేత దాల్చిన సైనికునిలా, పుస్తకాలను చేత బట్టింది. అది గమనించిన, రామకృష్ణ తన భార్య వసుంధరని. కూతురిని పిలిచి, ఒక సమావేశం యేర్పాటు చేసాడు. కూతురిని వుద్దేశించి ఆయన ఇలా అన్నాడు.

"చిన్నీ! నువ్వు ఎంబీబియస్ చదివేటప్పుడు ఎంతో ఒత్తిడిని యెదుర్కొన్నావు. నువ్వు పిజీ చదివేటప్పుడు ఓపీ ఒత్తిడి, ఆపరేషన్ల ఒత్తిడి, ప్రెజెంటేషన్ల ఒత్తిడి, ప్రొఫెసర్ల తిట్ల ఒత్తిడి ఇవన్నీ భరిస్తూ చదవగలవా? నిద్రలేక, తిండిలేక, మనశ్శాంతి లేక డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు పిజీ చేసేవారిలో ఎక్కువే. వాళ్ళలా కాకుండా నిబ్బరంగా చదువు పూర్తి చేయగలవా?”

“చేస్తాను నాన్నా! ఇవన్నీ మాకు క్రొత్తగాదు. నాకున్నదల్లా ఒకే ఒక సమస్య. అమ్మ కోరిన విధగా వెంటనే పెళ్ళి చేసుకోలేను. కనీసం, ఇంకొక్క నాలుగేళ్ళు పెళ్ళి గురించి ఆలోచించలేను."

 "నువ్వలా అనకు. నాకు తెలిసిన కొందరు పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని, చదువుకుంటున్నారు. నీ కూతురికి పెళ్ళి చెయ్యవా అని అందరూ అడిగే ప్రశ్నలతో చస్తున్నాను. చదివింది చాలు." అంది వసుంధర విసుగ్గా ముఖంపెట్టి.

"నువ్వు చెప్పింది బాగుంది కానీ, ఒక్క మాట, చిన్నప్పుడు ఆటలు చాలు, చదువుకో అన్నావు. కాస్త పెద్దయ్యాక ప్రేమలొద్దు, చదువుకో అన్నావు. మరిప్పుడు చదువు వద్దు, పెళ్ళి చేసుకో అంటున్నావేమిటమ్మా? ఇది నీకు న్యాయం కాదు.”

“బ్రతుకు తెరువుకి చదువు కావాలి కాబట్టి చదువుకో అన్నాను. నీ చదువుకి ఉద్యోగాలొస్తాయి కాబట్టి చాలు అంటున్నాను. పైగా ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలి. ఈ వయసులో జరగాల్సింది పెళ్ళి"

"నా వరకు సర్జన్ కావాలన్నది ఒక కల. అందుకోసం నేను పిజి, ఆ తర్వాత ఎం. సి. హెచ్. చేయాలి. ఆ కారణంగా పెళ్ళికి నేను వ్యతిరేకం. మాకు తిండీ నిద్రకే టైముండదు. అలాంటిది, భర్తా సంసారమంటే, ఎక్కడ కుదురుతుంది? పెళ్ళీ చేసుకున్న వాళ్ళు పడే కష్టాలు చూడు, నీకే తెలుస్తుంది, యేది మంచిదో?”

“పెళ్ళి ఆలస్యమైతే కాన్పులు కష్టమవుతాయి. ఇప్పుడు నీకు ఇరవైమూడు, పిజి నీట్ స్కోర్ కోసం ఒక యేడాది పోతుందా, ఆ తర్వాత పిజి మూడేళ్ళు. ఎం. సి. హెచ్. మరో మూడేళ్ళు. అంటే చదువు పూర్తయ్యే నాటికి ముప్ఫై దాటిపోతాయి. ఆరోగ్యవంతులైన బిడ్డలను కనే వయసు దాటిపోతుంది. ఆ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగడం, సరోగేసీ (surogacy) అంటూ వెర్రి వేషాలు వేయడం, అవసరమా నీకు?" అంది వసుంధర కొంచెం కటువుగా.

"మప్ఫై యేండ్ల లోపు మంచిదేనమ్మా! నాకింకా సమయముంది. నీ కూతురు గొప్ప సర్జన్ కావడం, మంచి విషయం కాదా? పెళ్ళి లేక పోతే, జీవితం వేస్టేనా? దయ చేసి కనీసం, ఇంకో మూడేళ్లు, నాకు టైమియ్యమ్మా!"."

కూతురి గొంతులో ధ్వనించిన నిస్సహాయత గానీ, వినయపూర్వక ప్రార్ధన గానీ, వసుంధర వైఖరిని మార్చలేక పోయాయి. ఆమె నిరసన వ్యక్తం చేస్తూ ఇలా అంది.

"ఒకప్పుడు రజస్వల అయిన వెంటనే పెళ్ళి చేసే వారు. అది అతివృష్టి. ఇప్పుడు ముసలితనం మొదటి దశలో చేసుకుంటున్నారు. ఇది అనావృష్టి. మీరు చదువు, వుద్యోగం పేరిట, సంసార జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నారు. పెళ్ళి సెక్స్ కోసమో, పిల్లలకోసమో కాదు. ఒక జీవిత భాగస్వామి కోసం. కడదాక తోడు నిలిచే ప్రాణ స్నేహితుడికోసం. జీవిత భాగస్వామితో బలీయమైన అవగాహన యేర్పర్చుకోవడానికి లేత వయసు అవసరం. ఆలస్యంగా అయిన పెళ్ళిళ్ళు రసహీనంగా, నీరసంగా మారిపోతున్నాయి. నేటి యువతీ యువకులు అది అర్ధం చేసుకోవడం లేదు. ఉద్యోగాభివృద్ధికి, మధుర సంసార జీవితానికి మధ్య, సమతుల్యం సాధించలేక పోతే, మిగిలేది కప్పల తక్కెడ సంసారమే.”

"విన్నావుగా నా మాట, అమ్మ మాట.! ఇప్పుడు నిర్ణయం నీది. ఏ నిర్ణయానికైనా మా మద్దతు నీకుంటుంది." అంటూ సుజా భుజం తట్టాడు రామకృష్ణ.

సుజా తల్లి దగ్గరకు వెళ్ళి, ఆమె రెండు చేతులు పట్టుకుని, "అమ్మా, మెడిసిన్ చదువు యెంచుకున్న వారు కొంత కాలం పెళ్ళికి దూరంగా వుండాల్సిందే. పోనీ, పిజీ మూడో సంవత్సరంలో పెళ్ళి చేసుకుంటాను. అంత దాకా పర్మిషన్ ఇవ్వు" అని వేడుకుంది.

కూతురి మాట కాదనలేని ఆమె, అయిష్టంగానే తన అంగీకారాన్ని తెలియచేసింది.“ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిసుంటే, ఈ చదువు చదివించే దాన్ని కాదు” అని తనలో అనుకుంది.

తల్లి అనుమతి సాధించిన సుజా, తండ్రి ప్రక్కన కూర్చుని, "నాన్నా, నీవు నాకండగా వుంటే నేనేదైనా సాధించగలను" అని అంటూ ఆయన భుజం మీద తల వాల్చింది. ఆయన మృదువుగా ఆమె తలనిమురుతూ మంద్ర స్వరంలో ఇలా అన్నాడు."

“చదువు ఒక సమస్యగా మారడం బహుశా మీ వైద్య రంగంలోనే అనుకుంటా. సరదాలను, సంతోషాలను, వివాహ జీవితాన్ని త్యాగం చేయమని కోరే చదువుల్లో మీ వైద్య విద్య ఒకటి. ఇది గ్రహించిన వారు, నీ లాంటి వైద్య విద్యార్ధులను అభినందించకుండా వుండలేరు. నీ ఆశయ సాధనకు నా ఆశీస్సులు"

Kommentare hinzufügen