తెలుగు సౌరభం
తెలుగు సౌరభం (Author: నూతక్కి పూర్ణ ప్రజ్ఞా చారి)
సీ. లలితా విభూషి తాలతి పద యాకృత
శ్రావ్యతా సౌరభసరళి తెలుగు
గంగా తరంగ యభంగ మృదంగని
క్వణక్వణ నినదంపు చలిత తెలుగు
మకరంద మాధుర్య మార్దవ కులదీప
యలి వేణి వెల రాణి యలఘు తెలుగు
అంబరూ వన కాంత యార్ఘార్హ వర కాంత
సూనృత కళ కళ సదము తెలుగు!
ఆ.వె. మధుర మోహ నాక్షరముల నిలయ వాణి
తరిగిపోని సాహితీ త్రివేణి
పుష్ప గర్భ గంధ పరిమళ దామిని
అవని తెలుగు అనిన అధర మధుర!
సీ. కలదె ఎందైనను కమ్మని మన తెల్గు
భాషకు యున్నట్టి బరుసు ఇలను
కలదె ఎందైనను కమనీయ తల జిందు
తెలుగు రుచిని ఇచ్చు తీపి తనము
కలదె ఎందైనను కావ్య రాజము లందు
తెలుగు రచన సాటి తెల్పు టకును
కలదె ఎందైనను కలదు తెలుగు కన్న
మిన్న యైనది యున్న దనెడి వాక్కు!
ఆ.వె. కమ్మ దనము నిచ్చి గౌరవమును పొంది
తీయ దనము కల్గి తేజరిల్లి
కావ్య, కళల యందు కడు గొప్ప ఖ్యాతిని
పంచి ఇచ్చినట్టి పడతి తెలుగు!